3
"ఏ మసృణ రాగ మధుర సంధ్యా మనోజ్ఞ
మైన నిమునము నందు నీ ప్రణయమూర్తి
ప్రధమ దర్శన భాగ్యమ్ముబడిపినానో.
వాడె నీయాలయము చేరినాను దేవి'
అని తనలో తాను గానము చేసుకున్నాడు రాజశేఖర మూర్తి.
రాజశేఖర మూర్తి రసజ్నుడూ, భావుకుడు అయిన పద్దెనిమిదేళ్ళ లేబ్రాయపు యువకుడు. అతని రసిక హృదయం సౌందర్యానికి స్పందిస్తుంది; సంగీతానికి ప్రతిధ్వనిస్తుంది. సాహిత్యం లో కరిగి పోతుంది. నవ్య సాహిత్యమన్నా, లలిత సంగీతమన్నా అతని కెంతో ప్రీతి. స్వయంగా కమ్మని కవిత్వం చెప్పగలడు; తియ్యగా పాటలు పాడగలడు. ఇందుమతి ని చూసిన నాటి నుండి అతని భావుక హృదయం లో కవితావేశం పాలపొంగు లాగ ఉద్భవించింది. ఆనాటి నుండి ఇందుమతి తన హృదయధీదేవత , తన ఊర్వశి, తన శశి బాల.
గుంటూరు లో ఇంటర్ మీడియట్ చదువుకునే రోజుల్లో ఆ ప్రాయపు యువకు లందరికీ వచ్చినట్లే అతనికి అనేకమైన పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. ఆ వయస్సు లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏమాత్రమూ లేనప్పటికీ పెద్దల బలవంతాన రెండు మూడు సంబంధాలు చూశాడు కూడాను. కాని, వాటిలో ఏ ఒక్కటీ తన మనస్సు కు నచ్చలేదు. వారిలో ఏ ఒక్కరూ తన హృదయాన్ని సూటిగా స్పృశించ లేకపోయారు. అతని మనస్సు మరెవ్వరి మీదైనా లగ్న మైనదా అంటే అదీ లేదు. తన కాలేజీ లో తన క్లాసు లోనే చదువుకునే ఆడపిల్లలు చాలా మంది ఉండేవారు. అందరూ కాకపోయినా వారిలో ఏ ఇద్దరు ముగ్గురైనా చక్కని వారి కిందే లెక్క. మోకాలి వంపుల వరకూ ఒయ్యారంగా సాగిపోయే నల్లటి పొడుగాటి జడలలో చారెడు చారెడు పూల చెండ్లు తురుముకుని , బరువైన పుస్తకాల దొంతరలతో తాయంచ లలాగా కాలేజీ వరండా లో తిరుగుతూ ఉండే తన సహధ్యాలునులను చూస్తుంటే అతనికీ ముచ్చటగా ఉండేది. అంతే.
ప్రధమ శ్రేణి మార్కులతో స్కూలు ఫైనలు పాసయి కాలేజీ లో చేరిన రాజశేఖర మూర్తి తన ముఖ్య ద్యేయమైన చదువు మీదనే మనస్సంతా లగ్నం చేసి తన క్లాసు వారిలో అగ్ర గణ్యుడుగా , తన అధ్యాపకులకు ప్రీతి పాత్రుడుగా మెలుగుతూ ఉండేవాడు. ప్రతి క్లాసు పరీక్ష లోనూ బాగా హెచ్చు మార్కులు తెచ్చుకుంటూ ఉన్న రాజశేఖర మూర్తి ని చూస్తె తోటి విద్యార్ధులకు గౌరవం. ఏ నోట్సు కావలసినా అతని దగ్గరే తీసుకునే వారు. అర్ధం కాని విషయాలు అతనితో చర్చించి తెలుసు కుంటుండేవారు. రాజశేఖర మూర్తి గణిత శాస్త్రం లో దిట్ట. అందులో అతని సహాయం ఏదో విధంగా పొందని సపాధ్యాయులు అరుదు. విద్యార్ధినులలో కూడా అతని గ్రూపు కు సంబంధించిన ఒకరిద్దరు వారంతట వారే అతనిని పలకరించి, పరిచయం చేసుకుని వారికి కావలసిన సహాయం పొండుతుండేవారు. ఆవిధంగా పరిచయమైన తన సహాధ్యాయునులపై సాదారమైన గౌరవమే కాని మరొక భావానికి ఆస్కారమే లేకపోయింది.
అటువంటి రాజశేఖర మూర్తి కి ఇందుమతి ని చూచిన మరుక్షణం లోనే అనిపించింది ఆమెను భార్యగా పొందాలని. ఏమిటో ఆమెలో ఉన్న ఆకర్షణ? ఏ కొలబద్ద తో కొలిచినా ఏమిటో ఆమెలో ఉన్న ఆధిక్యం? సౌందర్యమా? సామాన్యమైన చామన చాయ అంతకన్న సౌందర్య వతులను, కర్పూరం వంటి తెల్లని చేయ వారికీ , బంగారం వంటి పచ్చని వన్నె వారిని, గులాబి పువ్వు వంటి సౌందర్యం కలవారిని అనేకులను చూశాడు . అలంకారాలా? మెడలో ఒంటి పేట గొలుసు, చేతులకు రెండు జతల గాజులు తప్ప వేరేమీ లేవు. పట్నవాసపు పై మెరుగులయినా ఎరగదు. ఆమె కను ముక్కు తీరు చక్కనిది. నిజమే. కాని, అంత చక్కని వారు ఇంకెవరూ లేరా? వారందరూ తన మనస్సు ఇలా ఆకర్షించి ఆకట్టుకున్నారా? ఇందుమతి సౌందర్యం లో ఉన్న ఆకర్షణ కు నిర్వచన మేమిటి? ఆమెను చూచిన క్షణ మాహత్యమే అటువంటిదా? లేక ఇదేమైనా పూర్వ జన్మ సంపర్కమా? అటువంటి జననాంతర సౌహృదాలు సాధ్యాలా?
"అనంతవరం నించి ఉత్తరం వచ్చింది. ఏం వ్రాయమంటావు నాయనా?' అని అడిగారు వెంకటా చలపతి గారు.
"నాకిష్టమే నాన్నా" అని మొదటిసారిగా సంతోషంతో జవాబు చెప్పాడు రాజశేఖర మూర్తి.
తను హృదయ పూర్వకంగా కోరుకున్న ఇందుమతితో వివాహం నిశ్చయమయింది. వెంటనే ముహూర్తం పెట్టించారు. అనంత కృష్ణ శర్మ గారు. వైశాఖ మాసం లో పెళ్లి.
4
రాజశేఖర మూర్తి చిన్నతనం నించీ కష్టాలతో , పేదరికం లో పెరిగి పెద్దవాడైనాడు. తండ్రి వెంకటా చలపతి గారు రెండు దశాబ్దాల కిందట నాన్ కో ఆపరేషన్ రోజుల్లో స్కూలు ఫైనల్ పాసయి కూడా విదేశీ ప్రభుత్వం కింద ఉద్యోగం చెయ్యటానికి ఇష్టం లేక కొంతకాలం నిరుద్యోగి గానే ఉంటూ వచ్చారు. అయితే తన తాతగారి ద్వారా సంక్రమించిన యావదాస్తీ తన తండ్రి గారు మన్ను చేసి మధ్య వయస్సు లోనే మరణించటంతో తనకూ, తనని కని పెంచిన తల్లికి వేరే జీవనోపాధి లేకపోయింది. ఇంతలో కలకత్తా ప్రాంతాల్లో రైల్వే ఉద్యోగం చేస్తూ , ఆరు నెలలు జబ్బు పడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, స్వస్థానానికి తిరిగి వచ్చిన దుర్గాప్రసాదరావు తమ ఏకైక పుత్రిక శ్రీదేవికి వరుడి కోసం అన్వేషిస్తూ అందగాడూ, యువకుడూ , విద్యావంతుడూ అయిన వెంకటా చలపతి గారిని ఇరువురికీ కావలసిన ఒక దూరపు బంధువు ద్వారా కలుసుకోవటం,ఆస్తి పాస్తుల విషయాలేమీ పట్టించుకోకుండా పిల్లనిచ్చి పెళ్లి చెయ్యటం వరసగా జరిగిపోయాయి. తదనంతరం మామగారి సహకారం తో వెంకటా చలపతి గారు స్వంతంగా గుంటూరు లో వ్యాపారం పెట్టటానికి నిశ్చయించారు. శ్రీదేవిని చేపట్టిన వేళా విశేషమో కాని, చిన్న ర=తరహ లో ప్రారంభించిన వ్యాపారం 'ఇంతింతై వటువింతయై అన్నట్టు నానాటికీ వృద్ది పొందసాగింది.
పెండ్లి అయిన కొద్ది రోజులకే పునస్పంధానం , ఆ తరవాత సంవత్సరం తిరక్కుండానే రాజశేఖర మూర్తి జననం జరిగిపోయాయి. ఆ తరవాత రెండు సంవత్సరాలు వెంకటా చలపతి గారి జీవితం లో పరమోత్కృష్ట మైనవి. వ్యాపారం బాగా వృద్ది పొందింది. ధన ధాన్యాలకు లోటు లేదు. "కర్యేషుదాసీ, కరణేషు మంత్రీ' అన్నట్టు అన్ని విధాల ఆదర్శ కుల ధర్మ పత్నిగా వ్యవహరిస్తూ వచ్చిన శ్రీదేవి సాహచర్యం లో చిలకా గోరింకల వంటి కొడుకూ కోడళ్ళ కూ, వారి గర్భ సూక్తి ముక్తా ఫలమైన రాజశేఖరుడ్నీ చూసుకుని తనకీ జన్మలో ఇంక కావలసినదేమీ లేదనుకున్నది. శ్రీదేవి తల్లిదండ్రులైన మాణిక్యమ్మ గారూ, దుర్గా ప్రసాద రావు గారూ తమకు, కూతురూ, అల్లుడు, మనుమడూ తప్ప వేరెవ్వరూ స్వజనం లేనందున వారిని చూసుకుంటూ వారి వద్దనే ఉండిపోయారు. మామ్మ, తాతయ్య, అమ్మమ్మ గార్ల గారాబం లో రాజుకు రాజుకు అడుగు కింద పెట్ట వలసిన అవసరమే లేకపోయింది. అతడాడినది అట, పాడినది పాటగా జరిగిపోయింది.
కాని, విధి ఆ ఆదర్శ సుఖ సంసారాన్ని ఎక్కువ కాలం అలా గడప నివ్వలేదు. రాజు మూడవ ఏట తల్లి శ్రీదేవి ఒక ఆడపిల్లను ప్రసవించి పురిటి లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె చనిపోయిన మరునాడే ఆ పిల్లా పోయింది. మొదలంటా నరికిన మహా వృక్షం లాగా కూలిపోయారు వెంకటా చలపతి గారు. అయన మెత్తని మనస్సు కు తన సర్వస్వమైన ప్రియసతీ వియోగం భరించ రానిదే అయింది. తమ ఏకైక పుత్రిక తమని ఈ విధంగా నట్టేట ముంచి వెళ్ళిపోవటం తో దుర్గాప్రసాదరావు గారు ఈ లౌకిక ధోరణే త్యజించి తపో నిమగ్నులై పోయారు. ఆనాడు మొదలు పన్నెండు రోజులు ఎండనక, వాననక రాత్రి అనక, పగలనక ఆరు బయట డాబా మీద పద్మాసనాసీనులై, ఊర్ధ్య ముఖులై , నిరాహారు లై గడిపారు. ఫలితంగా రెండు కళ్ళూ కాయలు కాచిపోయి, పదమూడో నాటికి ఆ మహర్షి దృష్టి హీనులై పోయారు. ఇక మాణిక్యమ్మ గారు అటు అర్ధాంతరంగా పోయిన ఏకైక పుత్రిక కోసమే నెత్తి మొత్తుకుంటుందా? ఇటు విధి మీద పగబూని ఆత్మార్పణ నికి సిద్దపడుతున్న భర్త కోసమే బాధపడుతుందా? లేక వేరొక పక్క తల్లిని కోల్పోయి అర్ధం కాని ఆవేదనతో సతమత మవుతున్న శిశువు రాజునే కనిపెడుతుందా? ఆమె బాధ అనుభవైకయోగ్యం. కలలన్నీ కరిగిపోగా, తన ఏకైక పుత్రుడ్నీ సంసారాన్నీ ఈ విధంగా చిన్నా భిన్నం చేసిన విధిని వేనోళ్ళ దూరుతూ, గుండె రాయి చేసుకుని కర్తవ్య నిర్వహణకు నడుము కట్టింది సీతమ్మ గారు. వెంకటాచలపతి గారి పెడ తండ్రి కుమారుడు సుబ్బారావు గారు, అయన భార్య సుభద్రమ్మ గారు స్వగ్రామమైన వీరన్న పేట నుండి కబురు అందటమే ఆలస్యంగా వచ్చి వాలారు. ఆ పదమూడు రోజులూ సుబ్బారావు గారూ తమ్ముడి వెన్ను వీడలేదు.
యధావిధిగా కర్మకాండ జరిగిపోయింది. భవిష్యత్తు ను గురించి సమాలోచనలు ప్రారంభమయ్యాయి. రాజును పెంచి పెద్దవాణ్ణి చెయ్యవలసిన బాధ్యత మాణిక్యమ్మ గారి మీద పడ్డది. వెంకటాచలపతి గారిని మళ్ళీ ఒక ఇంటి వారిని చెయ్యవలసిన బాధ్యత సీతమ్మ గారు స్వీకరించింది. దుర్గాప్రసాదరావు దంపతులు కుర్రవాడ్ని తీసుకుని వేరే కాపరం పెడతామన్నారు. కాని వెంకటా చలపతి గారు, సుబ్బారావు గారు, సీతమ్మ గారు , సుభద్రమ్మ గారు ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదన వ్యతిరేకించటం తో యధాపూర్వాకంగా కుర్ర వాడితో పాటు వెంకటా చలపతి గారి దగ్గిరనే ఉండటానికి నిశ్చయించుకున్నారా వృద్ద దంపతులు.
కాలక్రమేణా రాజు తల్లిని మరిచి పోసాగాడు. అమ్మమ్మనే 'అమ్మా' అని పిలవసాగాడు. ఒక సంవత్సరం గడిచింది.
వెంకటా చలపతి గారికి రెండో వివాహం స్థిర పడింది. మూడేళ్ళ రాజుకు పినతల్లి రాజేశ్వరి దేవీ తండ్రితో తన ఇంటికి వచ్చే వరకూ ఆ విషయమేమీ తెలియదు. రాజేశ్వరీ దేవి తో బాటు ఆమె తల్లి వెంకాయమ్మ గారు , ఇద్దరు సహోదరులు కూడా వచ్చారు. మాణిక్యమ్మ గారు నూత్న వధూవరులను మంగళ హరతులిచ్చి వధువు బంధువులందరినీ ఆహ్వానించి లోపలికి తీసుకు వెళ్లారు. మంగళ హరతు లిస్తున్నప్పుడు ఆమె కళ్ళలో కదిలిన నీటి బిందువులు, స్వాగతం చెబుతున్నప్పటి ఆమె స్వరం లోని గద్గదిక వెంకాయమ్మ గారు గమనించక పోలేదు. మాణిక్యమ్మ గారి హృదయం లోని బాధ అణుచుకో లేనిది. లోపలికి వెళ్ళగానే చురుక్కుని
ఒక్కటి అంటించింది వెంకాయమ్మ గారు.
