Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 3


                                    3
    సుదూరాన బంగారు పంటతో శృంగార మొలికించుతూ ఉన్న పచ్చని చేలు. పక్కనే ఒంపులు తిరిగి ఒయ్యారాలోలికించుతూ మంద మందంగా సాగిపోతున్న సెలయేరు. మెల్ల మెల్లన మేను సోకే మంద మలయానిలపు  చక్కిలి గింతలు. మనసును పరవశింప జేసే, ఆహ్లాద పరిచే మధుర వాతావరణం.

 

                                     
    ఆ వాతావరణం లో పూల మొక్కలున్న ఆవరణ లో పచార్లు చేస్తున్న ధర్మారావు మనస్సాగరం లో అనేక ఆలోచనల అలల కదలిక ప్రారంభ మయింది. 'శరణాలయం ;లోని అనాధ బాలుడేక్కడ, జైలు సూపరింటెండెంట్ ఎక్కడ? భగవన్మాయ ఎంత చిత్రాతిచిత్రమైనది! దాతల దయా ధర్మాల పై పెరిగి పెద్ద వాడైన దిక్కులేని దీనుడు -- నేడు మరొక రకమైన వేలాది దీనుల పై అధికారి!'
    ఆనతి దూరం లో అస్పష్టంగా ఖైదీలు ఏదో అలజడి చేయడంతో, ఆలోచనలు అంతం చేసిన ధర్మారావు దృష్టి అటు తిరిగింది. పలురకాల పనులతో పగలంతా శ్రమపడి ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నారు, కఠిన శిక్ష ననుభవిస్తున్న ఖైదీలు . కొందరు నిర్విచారంగా కబుర్లు చెప్పుకొంటున్నారు. వారి శరీరాల లాగే మనసులు కూడా బండబారి , నిర్విచారం అలవడి నట్లుంది. మరికొందరు కక్షగా ఎవరెవరినో ఉద్దేశించి బండ తిట్లు తిట్టుతున్నారు. ఇంక కొందరు విచారంగా తమలో తామే ఏమేమో తలపోసుకుంటూ పరధ్యానంగా కూర్చున్నారు. వారందరికీ దూరంగా, ఒంటరిగా, మౌనంగా కూర్చుని తన వైపే పరీక్షగా చూస్తున్న ఒక ఖైదీ ధర్మారావు దృష్టి నాకర్షించాడు. ఠీవిగా ఉన్న విగ్రహం, హుందాగా ఉన్న చూపులు, రాజసం ఉట్టి పడుతున్న వ్యక్తిత్వం , సుమారు నలభై అయిదేళ్ళ దగ్గరలో వయసు ఉండవచ్చు. ఒకప్పుడు బలమైన మనిషి, దర్జాగా బ్రతికిన వ్యక్తీ అనిపించింది ధర్మారావు కు అతడిని చూడగానే.
    ధర్మారావు నే పరీక్షగా తిలకిస్తు ఉన్న ఆ వ్యక్తీ ధర్మారావు చూపులు తన పైకి ప్రసరించగానే ఖంగారు పడి దృష్టి మరల్చు కున్నాడు.
    కూర్చున్న చోటు నుండి లేచి, మందగమనంతో వారి దగ్గరగా వెళ్ళాడు ధర్మారావు. ఖైదీలు కొందరు లేచి నిలుచున్నారు; నమస్కారాలు చేశారు. మరికొందరు నిర్లక్ష్యంగా కూర్చున్నారు, బలవంతంగా మనస్సులో అక్కసు అణుచుకుంటూ . ఒకడు పరుగెత్తి పోయి ఒక కుర్చీ తెచ్చి వేశాడు. కాని ధర్మారావు కూర్చో లేదు. చేతులు వెనక్కు కట్టుకొని పచార్లు చేస్తూ వారితో మాటలలోకి దిగాడు.
    "ఏమిటి? ఎలా ఉంది?' అన్నాడు.
    "ఎలా ఉంటది, చెరసాలలో?" కక్షగా అరిచాడు ఒక ఖైదీ.
    పచార్లు ఆపి అటు చూచాడు ధర్మారావు. 'బాగా అన్నా'డన్నట్టు కొందరి ముఖాలలో గర్వం గంతులు వేస్తున్నది. మరికొందరు , ఆ అవిధేయత కు కొత్త సూపరింటెండెంట్ ఎవరి కేటువంటి శిక్ష విధిస్తాడో నన్నట్టు భయవిహ్వలులై తిలకించసాగారు.
    ధర్మారావు ఆగ్రహం ప్రదర్శించలేదు. జాలితో కూడిన చిరునవ్వు ఉద్భవించింది పెదవుల పై.
    "ఆవేశ పడకండయ్యా, మీ కష్టాలనూ, మనసులనూ నేను అర్ధం చేసుకో గలను" అంటున్న ధర్మారావు కంఠం ఆర్ద్రత తో నిండి పోయింది. "మీలో కొందరు నిజంగా నేరాలే చేసి ఉంటారు. కొందరు బుద్ది పూర్వకంగా చెయ్యక పోయినా, ఏ పాడు సమయం లోనో, పరిస్తితుల ప్రోద్భలం వల్ల చేస్తారు. కొందరు ఏ పాపమూ ఎరుగని వారైనా , ఇతరుల నేరాలు తమ పై రుద్దబడి నిస్సహాయులై నేర ముద్రతో ఇక్కడికి వస్తారు. మొత్తం మీద నేరస్తులైనా, కాకపోయినా ఇక్కడ ఉన్న అందరూ శిక్ష అనుభవించక తప్పదు. నేరస్తులు గానే పరిగణింప బడతారు. కష్టాలకు ఓర్చుకోవాలి."
    మంద గంబీర స్వరం కొద్ది సేపు ఆగింది.
    "నిజం చెప్పారు , బాబూ! వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లండి" అన్నారు కొందరు చేతులెత్తి నమస్కరిస్తూ. ఆ క్షణం లోనే అక్కడ ఉన్న ఖైదీ లందరికీ ధర్మారావు పై అపారమైన గౌరవం ఏర్పడింది. ఇంతకూ ముందు సరకు చేయకుండా నిర్లక్ష్యంగా కూర్చున్న ఖైదీలు కూడ పశ్చాత్తాప పడుతున్నట్లు లేచి నిల్చున్నారు. అతడికి దగ్గరగా వచ్చి చేతులు కట్టుకుని వినసాగారు. ఇంకా ఏమేమి చెప్తాడో అన్నట్లు.
    "ఈ ప్రపంచమే ఒక పెద్ద బందిఖానా. భూమిపై పడిన దగ్గర నుండీ ఎదురయ్యే కష్ట సుఖాలన్నీటినీ మౌనంగా అనుభవించడమే కాని, 'మనము ఏం చేసి ఇలా అనుభవిస్తున్నాము' అని ప్రశ్నించు కుంటే ఎవరికీ జవాబు దొరకదు. కాని అందువల్ల మనసు పాడు చేసుకొని రాటు దేలిపోయి, కక్షా , క్రౌర్యాలతో రాక్షసత్వం అలవరచు కోకుండా , మనం ఎంతవరకు మన విధి నిర్వహణ చేస్తున్నాము, ధర్మ మార్గాన నడుస్తున్నాము ? అని ఆలోచించుకొని , ముందు వెనకల యోచనతో ప్రవర్తించడం లో మనకూ, మన చుట్టూ పట్ల వారికీ కూడా సుఖం ఉంటుంది."    
    "నిజం చెప్పారు , బాబూ!" అంటూ ప్రత్యేకంగా కనిపిస్తున్న ఆ ఖైదీ కనులు ఒత్తుకున్నాడు. ఎందుకో ఆ ఖైదీ ని చూచిన దగ్గర నుండీ ధర్మారావు మనస్సులో అభిమానం అధికం కాజొచ్చింది.
    "మీ పేరేమిటి?' అని ప్రశ్నించాడు.
    "గౌతమ్!"అని సమాధానం వచ్చింది.
    "ఆ! ఈ బుద్దుడు మెచ్చుకోవడాని కేం లే!" ఒక ఖైదీ విసుగ్గా అన్నాడు.
    "ఈ సదువుకున్నోళ్ళు గాలి పోగు సేసిన కబుర్లు ఎన్నైనా సెబుతారు. కబుర్ల కేం -- కట్టాలు పడేది మేము. పోయిన సూపర్నెంట్ ఏమిటి సేసీవోడు? మా కటిన శిచ్చ అనుభయించడమే గాక అతగాడింటో బండ శాకిరీ కూడ సేయించుకునీ వోడు . తన ఇంట్లో తోటపని , వంట పని, దాసీ పని, పిల్లల్నాడించడం , మంగలి పని-- అన్నీ ఖైదీల సేతనే సేయించు కోవడం. అలాగని ఎక్కడైనా రూలుందా? మా తిండికి, నిలవ సరుకు, చవక బారు సరుకు సాలీ సాలకుండా పడేసి డబ్బు మిగుల్చు కుని, తన పెళ్ళానికీ, పిల్లలకీ సొమ్ములు సేయించుకునీ వోడు . ఇయన్నీ సయించి ఎవడూరుకోగలడు? గవర్నమెంటోరు ఖైదీ లకు వయిద్దె సౌకర్యాలు సేయించినా, యిరాళ్ళు మాత్రం మా ఆతీ గతీ కనుక్కోరు. జబ్బు సమయం లో రొట్టె, పాలు యివ్వరు -- ఇచ్చినా కుక్కలు కూడా ముట్టనివి. ఈ నిర్లక్ష్యం వోల్ల ఎవరైనా ఖైదీ సచ్చిపోయినా ఏదో గుడ్డి కారణం సెబుతారు. ఎదురు తిరిగితే సావు దెబ్బలు, ఎక్కువ శిచ్చలు. ఈ అన్నాయాలన్నీ ఎవరికి తెలుస్తాయి?అటు ప్రజలా, ఇటు అఫీసర్లా? ఎవరి క్కావాలి మా గోడు?" అన్నాడు ఒక ఖైదీ.
    జాలిగా వింటున్న ధర్మారావు కొద్ది  సేపటి వరకూ మాట్లాడలేక పోయాడు. కడకేలాగో తనను తాను సంబాళించుకుని అన్నాడు : "అవన్నీ నాకు తెలుసయ్యా. కోపం తెచ్చుకోకు. కాని అందరు అధికారులూ అలాగే ఉండరు. కొందరు అమృత మూర్తులు --సాక్షాత్తూ దైవతుల్యులు ఉంటారు. అయితే, నేనంతటి వాణ్ణి కాకపోయినా మీ కష్ట సుఖాలను అర్ధం చేసుకో గలను. పద్ధతులకు హాని కలుగ కుండా ,అణకువతో మీరు ప్రవర్తించాలి. మిమ్మల్నీ, మీ సౌకర్యాలనూ చూడడానికి మాత్రమే నేను అధికారిని. మిమ్మల్ని నే నేవిధంగా నూ బాధించను. నేనూ మీలో ఒకడి నని ముందు ముందు మీరే తెలుసుకోగలుగుతారు. నేను మీకు హితుడిని, స్నేహితుడిని."
    ఖైదీలందరూ ఆనంద పారవశ్యంతో తిలకించుతూ ఉండగా హుందాగా వెళ్ళిపోయాడు ధర్మారావు.

                                         4
    "ఎలా ఉంది బాబూ ఉద్యోగం?' భోజనా నంతరం చదువుకుంటున్న ధర్మారావు కు పక్క వేస్తూ అడిగింది దయామయి.
    "చాలా బాగున్నదమ్మా " అన్నాడు ధర్మారావు తల ఎత్తి.
    దయామయి మరి మాట్లాడలేదు.
    "మాట్లాడవేమిటి? నీ కిష్టం లేదా, అమ్మా?" అని అడిగాడు కొంతసేపు పోయాక.
    దయామయి అప్పటికీ మాట్లాడలేదు.
    "మన ఆశ్రమం , నీ తక్కిన పిల్లలూ జ్ఞాపకం వచ్చారేమిటి?' అన్నాడు నవ్వి.
    "మరిచి పోవడమంటూ జరిగితే కదా, ప్రత్యేకంగా జ్ఞాప్తి కి రావడం ? కాని ఆ విషయమైన చింత నాకేమీ లేదు. నా దిగులంతా నీ విషయం లోనే."
    "నా విషయమా? ఎందుకమ్మా?" ఆశ్చర్యంగా దిగ్గున లేచాడు ధర్మారావు.
    "ప్రయత్నిస్తే మరో ఉద్యోగమే దొరకదా నీకు?"
    "ఏమిటీ!" తన చెవులను తానె నమ్మలేనట్లు అడిగాడు.
    "దొంగలు చాలా నిర్దయగా, క్రూరంగా మోటుగా ఉంటారట. వాళ్ళ మధ్యనే నీకు ఉద్యోగం."
    పకపకా నవ్వేశాడు ధర్మారావు. "నువ్వే ఇంత కంటికి రెప్పలా కాచుకున్తున్నావు నన్ను. ఇక అసలు తల్లే ఉంటె ఇంకా నన్నెంత ప్రేమలో బంధించి వేసేదో!"
    దయమాయి నేత్రాలు భాష్ప పూరితమై పోయాయు. "అవును , ఈ దురదృష్ట వంతురాలు నిన్నెంత ఆదరణ గా చూచినా , ఆప్యాయంగా చేరదీసినా, కన్నతల్లె అని ఒప్పించ లేకపోతున్నది . ఔనా?"
    ధర్మారావు విలవిల లాడాడు. "ఆ ఉద్దేశంతో నేను అనలేదమ్మా. నిజానికి ప్రేమాతిశయానికి ముగ్ధుడినయ్యే అన్నాను. నువ్వు నిచ్చుకుంటా వనుకోలేదు. ఏ కన్న తల్లి అయినా బిడ్డను నీలా వెయ్యి కళ్ళతో కాచు కోనగలదా?"
    "చాల్లే. అసలు సంగతి మరిపించాలని చూస్తున్నావు. ఈ ఉద్యోగం నా కిష్టం లేదు " ఖండితంగా అన్నది దయామయి.
    "మరి, ఈ ఉద్యోగం ఇంకెవరూ చేయడం లేదంటావా?"
    అలా మాటలు జరుగుతూ ఉండగానే ఖైదీల గదులలో పెద్ద గగ్గోలు వినిపించడం, మరు క్షణం లోనే ధర్మారావు బయటకు పరుగెత్తడం జరిగాయి.
    అప్పటికే జైలు వార్దరు మొదలైన వారందరూ అక్కడ చేరి ఉన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS