Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 3

 

    "శేఖర్ ! నీకు లేటరోయ్." అప్పుడే స్నానం చేసి వచ్చిన శేఖర్ తో అన్నాడు కేశవ రెడ్డి.
    "కొంపదీసి లవ్ లెటరా?' అన్నాడు ఏదో పుస్తకం కావలసి ఆ గదిలోకి వచ్చిన మరో స్నేహితుడు రాజగోపాల్ , నవ్వుతూ.
    శేఖర్ నవ్వుతూనే సీరియస్ గా -- "మనం వచ్చింది చదవటానికా? లేక లవ్ లెటర్లు తీరికగా వ్రాసి, జవాబులు తెప్పించుకోవటానికా?"అన్నాడు.
    "నాయనా! ఋష్యశృంగా! మన కాలేజీ లో , ఆ మాట కొస్తే ఈనాటి కాలేజీ లలో చదువుల కోసం వచ్చే వెధవ లేవరయ్యా? కాలేజీ అంటే ఏమిటనుకున్నావ్? లైఫ్! ఎక్సైట్ మెంట్! అబ్బాయిలకు అమ్మాయిల దగ్గర తప్ప మరెక్కడా నోట్సు చిక్కదు. అట్లాగే అమ్మాయిలకు మన దగ్గర తప్ప మరెక్కడా ఏమీ చిక్కవు. సరే, ఇక కొంతమంది లెక్చరర్ల గట్రా కధలు రామాయణం లో పిడకల వేటలే! పిల్లలే అనుకొంటే పెద్దల బుద్దులూ పెడదారి పట్టుతున్నాయి. మన కెమిస్ట్రీ 'డెమాన్' నాయుడు గారి కధ లోక విదితమేగా! అందుకని మరీ బొత్తిగా పాపాయి లాగా మాట్లాడకు!" అన్నాడు రాజగోపాల్, గంభీరంగా ఫోజు పెట్టి.
    శేఖర్ నవ్వుతూ జాబు చించి చదివాడు.
    "చిరంజీవి బాలేందు శేఖర శాస్త్రి కి-- మీ తండ్రి దీవించి వ్రాయునది. ఇక్కడ అంతా క్షేమం. నీ క్షేమం తరుచు తెలుపవలెను. పాప బాగా చదువు కొంటున్నది. సెలవు లిచ్చిన వెంటనే ఇంటికి రావలెను. మీ అమ్మా, నాయనమ్మా పాపా నీకోసం కలవరిస్తున్నారు.
    ముఖ్యంగా వ్రాయడమేమనగా , పాప మామగారు జాబు వ్రాశారు. నీ దగ్గరికి వస్తే నీవు కుర్రతనంగా మాట్లాడావట. బావ నీతో స్నేహంగా ఉండాలన్నా నీవేమో దూరంగా ఉంటున్నావని వ్రాశారు. పాప కోసమన్నా మనం వాళ్ళతో కలివిడిగా ఉండాలి. పెళ్ళిలో మీ బావగారి వ్యవహారం నువ్వూ చూసిందేగా? పెళ్ళయి ఇంతకాల మైనా , మీ బావ మన గడప తొక్కలేదు. మనం కూడా మరీ బెట్టు గా వ్యవహరిస్తే , మధ్యన పాప సంగతి అధ్వాన్న మవుతుంది. కాబట్టి మీ బావ గారితో స్నేహంగా ఉండు. మేము పండుటాకులం . ఏ నిమిషాన రాలిపోతామో చెప్పలేము. అప్పుడు పాపకు అండ నువ్వే. అందుచేత , లేనిపోని కక్షలకు పోక, బావగారితో కలిసిమెలిసి ఉండు. సంగతులు వివరంగా వ్రాస్తూ ఉండు. ముఖ్యంగా చదువు జాగ్రత్త .

                                                                                   మీ తండ్రి,

                                                                                --శేష ఫణి శాస్త్రి."
    "ఏమిటోయ్ , శేఖర్! ముఖం అట్లా దుమధుమ లాడి పోతున్నది! గుప్పెడు వడ్లు చల్లితే బుట్టెడు పేలాలు వేగేటట్లుంది నీ ఫోజు!"
    స్నేహితుడు కేశవరెడ్డి మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు శేఖర్.
    "కేశవ్! ఒక్క మాట . నేను నిన్ను పలకరించకుండా తప్పుకు తిరుగుతా ననుకో, నిన్ను చూస్తూనే ముఖం మాడ్చా ననుకో, ఇట్లాగే నా వెంటపడి మాట్లాడిస్తావా? నా స్నేహం కోసం పాకులడుతావా? ఏం చేస్తావో చెప్పు!"
    కేశవ్ చిన్నగా నవ్వి , "నువ్వు పలకరించకపోతే నీ వెంట పడ్డానికి నాకేం ఖర్మోయ్! మన కసలే టెక్కు జాస్తి. నువ్వు పలక్క పొతే కొంప లంటుకు పోయాయేమిటి? నీ బోటి వాళ్ళు సవాలక్ష మంది. శతకోటి లింగాలలో నువ్వో లింగానివి -- అంతే!" అన్నాడు.
    "నేనొక వేళ నీ బావమరిది ననుకో! నీ చెల్లెలిని నా కిచ్చి పెండ్లి చేశారనుకో. నా ముఖాన బోలెడు కట్నం తగలేశా వనుకో. నేను నీతో పలకడానికి ఇష్టపడను. నువ్వంటే చులకనగా ఉంటాను. పలకరించను. నువ్వు కనపడ్డప్పుడల్లా ముఖం ముటముటలాడిస్తాను . అప్పుడు నువ్వేం చేస్తావు? నీచేల్లెలిని నా కిచ్చి నందుకు నేనెంత దులుపుకు పోతున్నా నా వెంట పడి ప్రాధేయపడతా నంటావా?"

                                   
    "గరిట కాలేసి వాత పెడతాను. నీ ముఖాన డబ్బు కొట్టింది చాలక, నువ్వు ఫోజులు గోడితే నీ వెంట నేనెందుకు తిరుగుతాను? మళ్ళీ మాట్లాడితే, మక్కే లిరగదన్ని , నీ బతుకేమిటో తేలుస్తాను. సరే కాని, ఏమిటిదంతా? కొంప దీసి నవల గాని వ్రాయడం లేదు గదా? లేకపోతె నాకు నిజంగా బావ మరిది నవుదామని ఉందా? నాయనా! నాకు చెల్లెళ్ళు లేరు. ఒక్క తమ్ముడున్నాడు. వాడిని నీకిచ్చి పెళ్ళి చెయ్యమంటే రెడీ! ఆ తరువాత నీ పెళ్ళి వాడు చేస్తాడు." నవ్వుతూ అన్నాడు కేశవరెడ్డి.
    "అయ్యా! నాకు వర్ణ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. నేను చాందసుడిని . కులాంతర వివాహాలు. మతాంతర వివాహాలు చేసుకునేటంత ఉదార భావం నా దగ్గర లేదు. నేనేదో ఉబుసు పోక అడిగానులే! నువ్విచ్చిన సమాధానం సరిగానే ఉంది" అన్నాడు శేఖర్.
    ముఖం మళ్ళీ ప్రసన్నంగా తయారయింది.
    "శేఖర్! ప్రసన్న వదనం ధ్యాయేత్! ప్రసన్నుడవయ్యావు కనక ఒక ముఖ్యమైన సంగతి చెబుతున్నాను, విను. నీకు కూడా తెలిసిందే అనుకో. ఇందాక వర్ణ వ్యవస్థ అంటూ ఏదో లెక్చరిచ్చావుగా! మన కాలేజీ వ్యవహారం గురించి ఓ పట్టు పట్టాలని మన వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. కాస్త వక్తవని పేరు పడ్డావుగా? ఈ వ్యవహారానికి నాయకత్వం నీకు కట్టి పెడదామని చూస్తున్నారు. నన్ను రాయభారం పంపారు. ఎట్లా నిర్వహిస్తావో చూడాలి మరి!" అన్నాడు కేశవ రెడ్డి.
    "సుకన్య వ్యవహారమేనా?"
    "అక్షరాలా! మొన్న ఉడిపి హోటల్ లో ఇద్దరినీ చూశారుట. ప్రతిరోజూ పార్క్ లో మన నాయుడు గారూ, సుకన్య కలుసుకోని సాయంత్రం లేదుట, ఇక సరేసరి! కెమిస్ట్రీ లాబ్ లో నుండి ఆ పిల్ల కదలదు! ఆ అమ్మాయిని చూస్తూ మన ప్రహ్లాద నాయుడు గారు కదలరు. వాళ్ళిద్దరినీ చూస్తూ మన వాళ్ళు కదలరు. ఈ కధకు ముగింపు ఎప్పుడు? కాస్త నువ్వు వేలు దూరిస్తే ఈ వ్యవహారం ఒక కోలుక్కి రావచ్చని మా ఆశ!" అన్నాడు కేశవరెడ్డి.
    "ఒకవేళ బెడిసి కొడితే!" అనుమానంగా అడిగాడు శేఖర్.
    "ఓయబ్బో! ఇదేం మన ఇంటి వ్యవహారమా! "లోకోపకారార్ధం వెధవ శరీరం!' అన్నారు పెద్దలు. అందుకని నడుం కడుతున్నాము. మన ప్రయత్నాలు ఫలించాయా, సంతోషం! లేదూ, వాళ్ళ చావు వాళ్ళని చావనిద్దాము!"
    "సరే! మనం చేసేది మంచి పనే అని నా నమ్మకం. ఇందులో జోక్యం చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు" అన్నాడు శేఖర్.
    "అయితే, ముందు సుకన్య తండ్రిని కలుసుకుని మాట్లాడితే? విషయమంతా భోధపరిచి, అమ్మాయిని కాస్త మందలించమని చెబితే బాగుంటుందేమో!" ఆలోచిస్తూ అన్నాడు కేశవ రెడ్డి.
    "వద్దు, వద్దు . ఆ పని మాత్రం వద్దు. పెద్దవాళ్ళ దాకా ఈ సంగతిని ఇప్పుడే పోనీయవలసిన పనేముంది? ముందు ప్రహ్లాద నాయుడుగారితో , సుకన్య గారితో మాట్లాడి మన అభిప్రాయాలు చెపుదాము. విన్నారా, సరే! లేదా వాళ్ళ సంగతి వాళ్ళది. ఇట్లాంటి విషయాల్లో సుకన్య తల్లితండ్రులేట్లా ఉంటారో మనకు తెలియదు. మనం చెప్పిన తరువాత ఆ పిల్ల చదువు మానిపించవచ్చు. సుఖన్య ఇంట్లో ఏమన్నా గొడవలు జరిగితే, వాటి కన్నింటికి మనం బాధ్యులమవుతాము. అవన్నీ మన కెందుకు? ముందు వాళ్ళకు నచ్చ చెప్పుదాము. వింటారనే నా నమ్మకం. మీరు తొందరపడి ఈ విషయాన్ని పెద్ద వాళ్ళ దాకా పోనీయకండి. ఈ రోజు కాలేజీ లో నాయుడి గారితో కలిసి మాట్లాడుతాము. ఏం జరిగినా ఎవ్వరూ తొందర పడకూడదు."
    కేశవరెడ్డి తల ఊపాడు.

                          *    *    *    *
    "సార్! మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. దయచేసి కోపగించుకోకుండా వినాలి." అన్నాడు శేఖర్ అతి వినయంగా.
    మిత్ర బృందమంతా దూరంగా, గుంపుగా నిలబడి కుతూహలంగా వాళ్ళిద్దరి వేపూ చూస్తున్నారు.
    కెమిస్ట్రీ డెమాన్ స్ట్రేటర్ నాయుడు గారు ఆశ్చర్యంగా -- "నాతొ మాట్లాడవలసిన విషయా లేముంటాయి?" అన్నారు.
    "క్షమించాలి. మీరు సుకన్య తో ప్రవర్తించే తీరు మా విద్యార్ధుల కంతగా నచ్చటం లేదు...."
    శేఖర్ మాటలు పూర్తీ కాకుండానే -- "షటప్! నా స్వవిషయం లో జోక్యం కలుగ జేసుకోవడానికి ఎంత ధైర్యం? ఏదో కాస్త బాగా చదువుతున్నావని నీకు ఒళ్ళు తెలియకుండా ఉన్నట్లుంది. నీ హద్దు మీరి మాట్లాడకు." అని కోపంగా అన్నాడు నాయుడు. కోపం -- ఎర్రగా మారిన కళ్ళల్లో కొట్ట వచ్చినట్లు కనిపించింది.
    "క్షమించండి , సార్! కోపం వద్దు. ఒక కాలేజీ లో జరిగే వ్యవహారం మీ స్వంత వ్యవహారం క్రిందికి రాదేమో! విద్యార్ధులం కూడా కొన్ని మార్లు హద్దులు మీరవలసే వస్తుంది! గురువుగా రంటే తండ్రితో సమానులు. పిల్లలం -- తప్పులు చేస్తే మందలించి సరిదిద్దవలసిన బాధ్యత మీది. అటువంటి మీరే తప్పు చేస్తే! సుకన్య గారితో మీరు తిరగటం మంచిది కాదు. విద్యార్ధులకు మీరు నైతిక విలువలు బోధించడం లేదు. మీ చెల్లెలు లాగా, మీ కూతురి లాగా చూసుకోవలసిన వాళ్ళతో ప్రేమకలాపాలు జరపటం అసహ్యం! మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేమంతా కూడా ఆడపిల్లల వెంట పడితే! విద్యాలయాలన్నీ ప్రేమాలయాలు గా మారుతాయి. సార్! మీరు మాకు గురువులు మా కన్నిటా ఆదర్శంగా నిలబడాలి. కనక ఈ వ్యవహారాన్ని అపుజేయ్యమని ప్రార్ధిస్తున్నాను." శేఖర్ ఎంతో వినయంగా చెప్పాడు.
    "అధిక ప్రసంగం చెయ్యకు. ఇందాకే చెప్పాను, అదంతా నా వ్యక్గిగత విషయమని! మీరు చదువుకోవటానికి వస్తున్నారా? లేక మా మీద సి.ఐ.డి లాగా పని చెయ్యటానికి వస్తున్నారా?" నాయుడు కోపంతో వణికి పోయాడు.
    "అదే ప్రశ్న మిమ్మల్ని తిప్పి అడిగితె? మీరు మీ విద్యార్ధులకు పాఠాలు చెప్పటానికి వస్తున్నారా? లేక ఆడపిల్లల వెంటపడి ప్రేమ పాఠాలు చెప్పడానికా? మే మింకా హద్దు మీరలేదు. మిమ్మల్ని వెంటపడి అల్లరి చేస్తే ఏం చేస్తారు? సుకన్య గారి వెంటపడి అరిస్తే ఏం చేస్తారు? మీరు గురువువని, మరిచి , శిష్యురాలుతో ప్రేమ కలాపం జరపటం మాకు బాధనిపించింది కాబట్టి...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS