Previous Page Next Page 
సాఫల్యం -1 పేజి 3

                                         

    నీళ్ళచెంబు కిందపెట్టి, లైటార్పేసి, చిన్న బల్బు వేసింది తులసి.
    "ఇప్పటి దాకా ఏం పనే?" అన్నాడు సీతాపతి తులసి వైపు తిరిగి. అతడి గొంతులోని ఆ సానుభూతి తులసి ఒళ్ళు జలదరింపచేసింది.
    "పనేమీ లేదు, ఊరికేనే కూర్చున్నాను" అంది వెటకారంగా.
    "ఎందుకే అంతకోపం" అన్నాడు సీతాపతి మంచం మీద కూర్చున్న తులసి చుట్టూ చేయి వేస్తూ.
    "ఇంత అనునయం వద్దులెండి. మీ అర్ధరాత్రి ప్రేమకు అర్ధం నాకు తెలుసు" అంది తులసి భర్త చేతిని తొలగించడానికి కించిత్ ప్రయత్నిస్తూ.
    "ఎందుకూ, తులసీ, విసుగ్గా ఉందా? సినిమాకు వెళ్ళక చాలా రోజులైంది కదూ?.... ఏవీ, నీ జడలో పువ్వులు ఎంత సువాసన వేస్తున్నాయే....ఎల్లుండి అమ్మకు ఆపరేషన్ ట, తెలుసు కదూ" అన్నాడు లేచి కూర్చుని తులసికి ఇంకా దగ్గిర జరుగుతూ.
    "తెలుసు..... అలా తొలగండి బాబూ. నిద్దరొస్తోంది. పడుకోనివ్వండి. ఈ కాసేపైనా కన్ను మూయనివ్వండి" అంది తులసి. తనకు దుఃఖం పొర్లు కొస్తూంది. కాని తను ఏడవకూడదు. ఏడిస్తే తన పంతంలోని బిగువు తగ్గిపోతుంది.
    "అంత కోపంగా ఉన్నావేం, ఎవరిమీద?" అన్నాడు భర్త భుజం మీద చెయ్యి బిగిస్తూ.
    "నా కెవరిమీద కోపం, అందరికీ నా మీదకాని! పనితో చచ్చిపోతున్నాను. ఒక్కదానికీ తెమలటం లేదు. పనిమనిషిని కూడా వద్దంటుందాయె అత్తగారు. మా పాపను రప్పించుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కొద్ది రోజులు ఉండిపోతుంది. నే నెట్లాగూ మా ఇంటి కెళ్ళనేలేను. కనీసం అద్దై నా వస్తుంది. దాన్ని చూడక ఎన్నాళ్ళైందో" అంది తులసి.
    "ఇప్పటికే ఇక్కడ మనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం గదా" అన్నాడు సీతాపతి.
    "ఊఁ. రేపు ఆపరేషన్ జరిగితే చూసిపోవటానికి మీ అన్నయ్యా వాళ్ళ సంసారం కూడా వస్తుందేమో, మరి వాళ్ళెక్కడుంటారు?" అంది తులసి.
    "వాళ్ళంటే ఏదో ఒకటి రెండు రోజులకోసం వస్తారాయె. అయినా ఏమిటంత పంతం? ఇప్పటికే ఇన్ని ఖర్చులు....మరో ఆడపిల్ల ఉండటమంటే మాటలా. నాకు ఏమీ అభ్యంతరం లేదు కాని..." అన్నాడు సీతాపతి.
    "ఔనులెండి. మీవాళ్ళకోసం మీరెన్ని ఖర్చులైనా భరిస్తారు. మా పాప వస్తుందంటేనే మీ ఖర్చు మించిపోతుంది. నేను మీకు కేవలం పనిమనిషి కిందే జమ. మీకూ, మీవాళ్ళకూ పనిచెయ్యటానికి తప్ప మరెందుకూ నే నెక్కర్లేదు. మా వాళ్ళెప్పుడూ ఈ ఇంటి చాయలకైనా రాలేదు సంవత్సరంగా" అంది తులసి.
    "నేనేం వద్దనలేదు. నీ యిష్టం. ఇంక వాగక. అయినా నీకీ మధ్య పంతాలు పెరిగిపోతున్నాయి. అదేమీ మంచికి కాదులే" అన్నాడు సీతాపతి.
    "ఔను మరి. స్వార్ధం పెరిగితే ఒకరి మంచి మరొక రికి చెడుగానే కనిపిస్తుంది. దేనికైనా ఓ హద్డుంటుంది. ఒక్కనాడైనా నేనింత చాకిరీ ఎలా ముక్కుమూసుకుని, నోరు నొక్కుకుని చేయగలుగుతున్నానో అని పలకరించిన పాపాన పోలేదు. పొద్దున్న ఎనిమిదిన్నర దాకా ముసుగెట్టి పడుకుంటే నే నెప్పుడో నాలుగు న్నరకే లేచి ఈ నరకంలో పడి కొట్టుకుంటున్న సంగతేం తెలుస్తుంది! తెలిసినా మనుషుల మీద ప్రేమా, సానుభూతి ఉంటేగా పట్టించుకోటానికి? తమ తమ అవసరాలు తీరితే చాలు. ఎవరెలా పోతేనేం? ఎలా కష్టపడితేనేం! పొద్దుందాకా టైపుచేసి చేతులు పోతాయి. ఇంటికి రాగానే సేవ. మోక్షం వస్తుంది, నేను చస్తే. అనండి ఆ మాటకూడా."
    "సరే. ఇంక నోర్మూసుకో రేప్పొద్దున్నే అమ్మనూ నాన్ననూ పంపించేస్తాను తెల్లారనీ" అన్నాడు సీతాపతి.
    ఉండగా చుట్టిన కొంగును నోట్లో కుక్కుకుని ఏడుస్తూ పక్కమీదికి ఒరిగింది తులసి.

                                 3

    చివరికి ఏడుపులు, నిష్ఠూరాలే మిగిలాయి తులసికి. అలారం మోగగానే లేచి అంట్లు ముందేసుకుంది. పక్కవాటాలో రాఘవరావూ, అతని భార్య కమలా ఇంకా పడుకునే ఉన్నారు. భర్త అలారం చప్పుడుకు లేవనన్నా లేదు. చలి విపరీతంగా ఉంది. వెధవది, ఓ స్వెటరన్నా కొనుక్కోలేదు తను. అప్పుడే తెరిచిన కళ్ళకు లైటు జిగేల్మంటున్నది. రెండు మూడుసార్లు అవలించింది. ఈ చలికాలం-పెళ్ళైన కొత్తలో ఎంత మధురంగా -ఆ జ్ఞాపకాలను వెనక్కు నెట్టింది. ఇది జ్ఞాపకాలకు కాదు సమయం. ఇది అంట్లు తోమే సమయం. ఇది తనను తాను అసహ్యించుకునే సమయం. పక్కవాటాలో చప్పుడు. గాజుల చప్పుడు. మంచం కిర్రుమంటున్నది. అణుచుకున్నా అణగని నిట్టూర్పులు. పక్కగుడ్డల సవరింపు. వాళ్ళు కిటికీ పై రెక్కలు కూడా పెట్టేశారు. తులసి కొళాయి తిప్పింది. నీళ్ళు జివ్వుమన్నాయి. భర్త పొర్లి మళ్ళీ పడుకున్నాడు.
    తులసి కుంపట్లో బొగ్గులు వేసింది. లైటు తీసేసి మొహం కడుక్కుని వచ్చింది. మామగారు లేచారు. ఇతడు నయం. వృద్దుడైనా ఐదున్నరకే లేస్తాడు. స్నానం, సంధ్యా ముగించుకుంటాడు. ఎలా పంపేస్తాడు వాళ్ళను తన భర్త? అంతా అబద్ధం. తనను బెదిరించటానికి, తన కోపం, విసుగు ప్రకటించ టానికే అన్నాడు కాని వాళ్ళను పంపించడు.
    రోజుకన్నా పెందరాళే లేచాడు సీతాపతి. తల్లి హాస్పిటల్ లో ఉంది. ఆమెకు తిండి తీసుకెళ్ళాలి. మొగుణ్ణి చూడకపోతే ఆవిడకు ముద్ద దిగదు. కొడుకును చూడకపోతే కడుపు నిండదు. కోడల్ని చూస్తే కాని ప్రాణం నిమ్మళించదు (అలా అంటుంది ఆవిడ) హాస్పిటల్లో వాళ్ళిచ్చేదేదో తినద్డూ, ఇంటి నించి తీసికెళ్ళట మెందుకో. అది మాలకూడట. భర్తా, మామగారూ హాస్పిటల్ కి వెళ్ళగానే మిగిలిన కొంచెం ఉప్మా తను తినేసి వంట ప్రారంభించింది.
    రాఘవరావు కాఫీకప్పులు కడుక్కు వస్తున్నాడు.
    'అలా ఉండాలి' అనుకుంది తులసి.
    రాఘవరావుకు నాలుగు వందల యాభై రూపాయల జీతమట. సంవత్సరానికి నెల బోనస్ వస్తుందట. బ్యాంకువాళ్ళే ఉద్యోగులకు ఇళ్ళు కట్టించి ఇస్తున్నారట. ఇంకో ఆర్నెల్లలో అక్కడికి మారతారట. కమల పన్నెండువేల కట్నం తెచ్చిందిట. వాళ్ళిద్దరూ రోజూ షికారుకి వెడతారు. తోచినప్పుడల్లా సినిమాకి వెళతారు. వచ్చేటప్పుడు చాలాసార్లు అక్కడే ఏదో హోటల్లో భోజనం చేసివస్తారు. కమల ఏ ఉద్యోగమూ చెయ్యవలసిన అవసరం లేదు. భర్త వెళ్ళగానే ఏ పత్రికో, పుస్తకమో ముందరేసుకుంటుంది. లేదా రేడియో ట్యూన్ చేస్తూంటుంది. లేదా హిమాయత్ నగర్ లో వాళ్ళ బంధువులు ఉన్నారట. అక్కడికి వెళుతుంది. అసలు వీళ్ళనిక్కడినించి మార్పించెయ్యాలి. తన భర్త రోజూ రాత్రి పదింటికి ఇంటికి వస్తాడు. సాయంకళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నాడు. గత నెలరోజులుగా తను షార్ట్ హాండ్ తరగతులకు వెళ్ళటమే లేదు, కష్టపడి షార్ట్ హాండ్ హయ్యర్ ముగిస్తే మరేదైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. భగవంతుడి దయవల్ల భర్తకు కూడా గ్రాడ్యుయేషన్ అవగానే మరో ఉద్యోగం దొరికితే... తనకో మూడు వందలు, భర్తకో నాలుగు వందలు... ఎంత హాయిగా ఉంటుంది! అప్పుడు తమకీ ఆర్ధికసమస్యలే ఉండవింక. తనూ సాయంకళాశాలలో చేరితే? కాని భర్త పడనిస్తాడా ఐనా తన కెందుకు బి. ఎ? మెట్రిక్యులేషన్ లో చదువుకున్న దెప్పుడో మరిచిపోయింది.
    టైం తొమ్మిదవుతూంది. తులసి లేచి గబగబా జడ వేసుకోవటం ప్రారంభించింది. ఓ అరగంటలో తయారై, భోజనం చేసి ఈవలి కొచ్చి మామూలు ప్రకారం తాళం చెవులు కమలకిచ్చింది. అప్పటిదాకా తనలోని కలల ప్రభావమేమో కమల తన శత్రువుగా కనిపించింది. కమల ఎప్పుడూ నవ్వుతుంటుంది. కమల ఎప్పుడూ ఎందుకు నవ్వుతుంది?

                           *    *    *

    ఆఫీసవగానే, అటునించి ఆస్పత్రికి వెళ్ళింది తులసి. అక్కడ మామగారూ, భర్తా ఉన్నారు.
    తనను చూడగానే పలకరించి, "ఏమమ్మా, తులసీ, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానుగదా? ఏం చెయ్యనమ్మా..." అంటున్న అత్తను మధ్యలోనే ఆపి, "అదేమి టత్తగారూ, అలాగంటారు! ఇందులో నేను పెద్ద కష్టపడుతున్న దేమున్నది? మీ రలా బెంగ పెట్టుకోకండీ" అంది తులసి. ఆ క్షణం అత్తను చూస్తే జాలేసిందామెకు. పాపం, ఆపరేషన్ అంటే చాలా భయపడుతూంది. హాలునిండా వరసగా పేషెంట్లు ఆ రెండురోజులు ఏమీ తిండి పెట్టరు. కేవలం పాలుమాత్రమిస్తారట. ఐనా, ఆమె ఎందుకిలా అంది? రాత్రి జరిగిన విషయం భర్త ఆమెకు చేరవేశాడా ఏమిటి? నున్నగా, శుభ్రంగా ఉన్న రాతిగోడలు తెల్లగా ఎదురుగా బయలుప్రదేశంలో చెట్లు, సూర్యుడు అస్తమించిన తర్వాతి చివరి వెలుగు. మంచం మీద అత్త. ఆమెకు చెరోవైపు భర్తా, మామగారూ. తను స్టూలుమీద ఆరౌతూంది. గంట మోగింది. విజిటర్లందరూ వెళ్ళిపోవాలి.
    "వస్తాం, కామేశ్వరీ. బెంగపెట్టుకోకు. బుధవారం నాడు గదా ఆపరేషన్ సీతాపతి డాక్టరుతో మాట్లాడేడు. డాక్టరుకూడా మంచివాడు. ఏమీ ప్రమాదం లేదని చెప్పాడు. వస్తాం మరి" అంటూ లేచాడు మామగారు.
    "వస్తానమ్మా" అన్నాడు సీతాపతి.
    "సీతా, ఒరేయ్ నాన్నా, రేపొద్దున్న వొస్తావుగదూ మళ్ళీ. నాకు నిద్ర పట్టటం లేదురా. ఈ గండం ఎలా గడుస్తుందో నాకేం నమ్మకం లేదు. గోపాలాని కుత్తరం రాశావు గదూ."
    "ఆఁ. అప్పుడే రాశాను" అన్నాడు సీతాపతి.
    "మరి వాడింకా రాలేదేం? వాడికీ అంత అశ్రద్ధ ఐపోయిందా! ఏం చేస్తాను. పోనీ చెల్లెలి కన్నా కబురు పంపరా, అది వస్తుంది. తప్పకుండా వస్తుంది" అంది అత్తగారు.
    "అబ్బ! ఇప్పుడేం మునిగిపోయిందని అలా గొడవ పడుతున్నావు. అందరూ ఎందుకు ఇప్పుడు? ఇది చాలా మైనర్ కేసని చెప్పాడు డాక్టరు." సీతాపతి విసుగ్గా అన్నాడు.
    "ఏమో, నాకేం తెలుసు. నా భయం నాకుంది. ఏదో అందర్నీ ఒక్కసారి కళ్ళారా చూస్తాను. ఈ ఆపరేషన్ తో ఉన్న కళ్ళుకూడా పోతే, అప్పుడెలా? ఒక్కసారి కళ్ళారా అందర్నీ చూన్నీరా" అంది.
    "అబ్బబ్బ, ఏం మాటలవి! ఆ కంట్లోని పువ్వు తీసెయ్యటానికే ఆపరేషన్ చేస్తున్నారాయె, కళ్ళు పోతాయంటావేం. ఆపరేషన్ చేస్తే కళ్ళు పోవు. పోయిందనుకుంటున్న ఆ ఎడంకన్నుకూడా కనిపిస్తుంది, తెలుసా" అన్నాడు సీతాపతి.
    "సరేరా, నీ ఇష్టంవచ్చినట్టు మాట్లాడు. నీ దయాధర్మాల మీద ఉన్నాను. వాళ్ళకు కబురంపినా, లేకపోయినా నీ ఇష్టం. వెళ్ళు" అంది అత్తగారు కన్నీళ్లతో.
    "నేనేం చెయ్యనే మరి, ఉత్తరాలు రాశాను. వాళ్ళు రాకపోతే నేనేం చేసేది మరీ!" అన్నాడు సీతాపతి.
    "అవునులే, నువ్వెం చేస్తావు మరి."
    సీతాపతి వచ్చేస్తూ 'ఛీ! ఛీ!' అనుకున్నాడు మెల్లిగా.
    "వస్తానత్తయ్యా" అంది తులసి.
    ఆవిడ "ఊఁ!" అంటూ అటు తిరిగి పడుకుంది.
    ఆ క్షణాన అతణ్ణి కౌగలించుకుని, బాధాగ్రస్తమైన అతని మొహంలోకి చూస్తూ "మనం దురదృష్టవంతులం" అని ఏడవాలనిపించింది తులసికి.
    బస్సు స్టాండ్ కు రాగానే తులసితో, "నేను కాలేజీదాకా వెళ్లొస్తాను. నాన్న ఇంటికి వెడతాడు. నువ్వు మామూలుగా నీ క్లాసెస్ కు వెళ్ళివచ్చేయ్. తొందరేం లేదు" అన్నాడు సీతాపతి.
    ఇంకా కోపం పోలేదన్నమాట!
    "ఇప్పుడెందుకులెండి షార్ట్ హాండ్ సంగతి" అంది తను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS