Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 3


    డియరెస్ట్ లలితా,
    నిన్న నా ప్రవర్తనకి నోచ్చుకున్నావా? నా మనస్సు బాగా లేదు. ఏదో పని నా మనస్సుని పట్టి పీడించింది. అంచేత అలా అయిపోయాను. ఏం అనుకోవు కదూ. ఇప్పుడిక అసలు విషయం వ్రాస్తాను.... నిన్ను ఏ ముహూర్తం లో చూశానో ఆ క్షణం నుంచీ ప్రేమించాను. కాని నేను దురదృష్టవంతుణ్ణి ధనం లేనివాణ్ణి. నిన్ను పెళ్లి చేసుకున్నా సుఖ పెట్టలేని వాణ్ణి. కనీసం నీకైనా నాకైనా కొంచెం ఆస్థి ఉంటె ఎంత బాగుండును? అదే అనుకున్నాను. కాని మీ అత్తయ్య వారసుడు వేరని నీకు ఆమె ఆస్తిలో కించత్తయిన రాదని చెప్పేశావు. నా ఆశలన్నీ నిరశలై పోయాయి. నీ ఆస్థి కోసం కాదు సుమ నా ఆశ. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే. ఏ మాత్రం రాబడి లేకుంటే రేపటి భోజనం ఎక్కణ్ణించి వస్తుంది? అన్న ఆలోచనతో ఈరోజు కూడా పాడు చేసుకోవడం -- నేను ఊహించ లేను. నాకీ బ్రతుకు భారంగా తోచే సమయంలో నువ్వూ నామీద ఆధారపడి ఉంటావు. అది మంచిది కాదు లలితా. ఇది ముందే తెలుసుకోవడం నీకూ నాకూ కూడా మంచిదయింది. రేపో చక్కని సంబంధం చూసి నీకు మీ అత్తయ్య వివాహం చేస్తుంది -- కనీసం నువ్వేనా సుఖపదతావు? ప్రేమకి ఫలితం కష్టాలూ నిందలూ కావు లలితా. సుఖించడం. అది సాధ్యపడని చోట ప్రేమ క్షీణించి పోతుంది. మనిద్దరి మధ్యా చిన్న మెత్తు ఆస్థి లేదు. నేనీ జీవితంలో నిలదొక్కుకునేసరికి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేను. జీవితం నుంచి తప్పించుకు పారిపోలెం. దాన్ని ఎదుర్కొడమే మంచిది కదా. మన స్నేహం తీయని కలగా ఊహించుకుని నన్ను మరిచిపో. నేను కర్కోటకుడిననీ, ఆస్థి కోసం నన్ను ప్రేమించాననీ దూషించడంలో నీకు ఉపశాంతి లభ్యం అయితే -- అలాగే చేయి లలితా -- నేను నీ తిట్లని సంతోషంగా భరిస్తాను. అప్పుడేనా నన్ను మరిచిపోవడం నీకు సులభం అవుతుంది. ఏదో ఒక రోజు చక్కని సంసారంలో పడతావు. సుఖపదతావు. అదే నీ పట్ల నా కోరిక. నన్ను మరిచి పోడానికి ప్రయత్నించు లలితా---- నేనో వారం రోజులు ఊరు వదిలి వెడుతున్నాను--- నీ మోహన్.
    ఒకటికి పదిసార్లు ఉత్తరం చదివింది లలిత.
    అక్కడక్కడ చదివింది మళ్ళీ చదివింది. ఎంతసేపు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చదివినా లలితకి దుఃఖం రాలేదు. హృదయం ఒకవిధంగా తేలికై పోయింది. మళ్ళీ ఉత్తరాన్ని అతి జాగ్రత్తగా మదిచింది -- నాలుగు మదతలూ సమానంగా లేకపోతె ప్రమాదమన్నంత జాగ్రత్తగా మడతలు పెట్టింది.
    అదన్నమాట అసలు సమస్య! అనుకుంది.
    హటాత్తుగా పజిల్ లో సద్దుకున్న ముక్కలలాగా అంతా స్పష్టంగా కనిపించింది లలితకి. అత్తయ్య ఆస్తికి తను వారసురాలిని అవుతుందని భ్రమించాడు. నిజం తేలిపోవడంతో చెర్లో చేపలాగా బయట పడిపోయాడు. 'అందుకున్న మాట తానా మాటా చెప్పినప్పుడు కొద్దిగా అతని ముఖం నల్లబడింది.' ఆ క్షణం లో అతని ముఖం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేక పోయింది. అతని కంఠస్వరంలో సంగీతం లోపించడం , అతని అతి మృదుత్వం లో కనీ కనిపించని మొరటు తనం ప్రవేశించడం , తన చుట్టూ తిరిగే అతని ఆలోచనలు దూరానికి ప్రయాణం కావడం అన్నీ .......ఒకదాని వెనక ఒకటి జ్ఞాపకానికి వచ్చాయి లలితకి.
    నవ్వుకుంది లలిత. నిశ్చింతగా ఉన్న నవ్వు తన చెవులకే వింతగా తోచింది లలితకి. స్టుపిడ్! ఇది రొమాన్సు. మేలుకో. అని తట్టి లేపినట్టు అనిపించింది. ఏడ్వాలా? ఏడ్పు రాలేదే....లేదు చిన్నపిల్లలు ఏడుస్తారు. మోసపోయిన వాళ్ళు ఏడుస్తారు....తను పెరిగింది. ఈరోజు ఈ దెబ్బతో తన హృదయం పెరిగింది ----అనుకుంది లలిత. అందుకే ఏడవలేదు లలిత. బాధ భరింప రానిదే అయినా దుఃఖం ముంచుకు రాలేదు. కళ్ళకి ముందున్న పొరలు తొలగిపోయినట్టయింది లలితకి. 'జీవితంలో ఏమాత్రం అనుభవం ఉన్నా మోహాన్ ధోరణి పసిగట్ట గలిగేదాన్ని! ఇంట్లో వాళ్ళు ఏ మాత్రం పెరిగే అవకాశం ఇవ్వకపోవడం వల్ల కదా ఇలా జరిగింది......అనుకుంది. ఏమైతేనేం.. మోహన్ తో తన స్నేహం ముగిసింది. ఇక తిరిగి ప్రారంభం అవడం కూడా అసంభవం. అంచేత ఈ విషయాలు మనస్సులో పెట్టుకుని మళ్లిబాధపడకూదనుకుంది. ఇదొక గుణ పాఠం అనుకుంది. అత్తయ్యతో ఇకపై అబద్దాలు చెప్పడం, అత్తయ్య ని మోసగించవలసి రావడం లాంటివిక పై ఉండనందుకు స్వేచ్చగా నిట్టూర్చింది. ఇన్నాళ్ళూ అబద్దపు తెరలు అల్లుకుంటూ మోహన్ తో తన స్నేహం సంగతి బయటపడ నివ్వలేదు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్న తరువాత అత్తయ్య తో చెప్పి మొండి కేసి పెళ్లి చేసుకుందా మనుకుంది. కాని తోలి అధ్యాయం లోనే కధ అడ్డం తిరిగింది.

                                      2
    తెల్లవార్లూ నిద్రపట్టలేదు లలితకి. మోహన్ తో తన అనుభవం ఎంత వద్దనుకున్నా జ్ఞాపకానికి వస్తూనే ఉంది. మోహన్ తనని మోసం చేసినా అతనో రకం స్వేచ్చా పిపాసకి తనలో జీవం పోశాడు. రెక్కలిచ్చాడు. తోలి ప్రయత్నం ప్రమాదం తో ముగిసినా, స్వేచ్చగా ఉండాలన్న కోరిక మటుకు పోలేదు లలితకి. ఇకపై అత్తయ్యతో కూడా భయపడకుండా మసలకలను అనుకుంది. అవీ ఇవీ ఆలోచిస్తుండగానే హల్లో గడియారం అయిదు గంటలు కొట్టింది. తెలతెలవారుతుంది. అక్కడా అక్కడా ఒకటీ అరా కాకులు కూస్తున్నాయి. ఎవరో పదేపదే తలుపు తట్టుతున్నారు. హల్లో అవ్వగారు గాడ నిద్రలో ఉన్నట్టుంది. ఆ చప్పుడికి కూడా తెలివి తాలేదు. లలితే లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా టెలిగ్రాం బంట్రోతు . 'అత్తయ్య వచ్చేస్తుందన్నమాట' అనుకుంటూ సంతకం పెట్టి టెలిగ్రాం తీసుకుంది లలిత. అది మోసుకు వచ్చే వార్తా ఏమిటో ఊహించ కల్గడం తో నెమ్మదిగా మంచం మీద కూర్చుని తెరచింది. తను చదువుతున్న దేమిటో తనకే అర్ధం కాలేదు లలితకి. ఏమిటి> ఏమిటి వ్రాసి ఉంది? కళ్ళు నులుపుకుని మళ్లీ చదివింది.
    "సుబ్బమ్మ డైడ్ ఆఫ్ హార్ట్ ఎటాక్. మీట్ లాయర్ వెంకట్రామయ్యర్ ' అని ఉంది.
    క్షణం పాటు మ్రాన్పడి కూర్చుండి పోయింది లలిత. 'అవ్వగారూ' గట్టిగా కేక వేసింది.
    "ఎమ్మా ఏమైంది? ఏమైంది' అంటూ హడావిడి పడ్డారు.
    "అత్తయ్య చనిపోయింది అవ్వగారూ , చచ్చిపోయింది.' ముఖం చేతులలో కప్పుకుని భోరున ఏడ్చేసింది లలిత. లలితకి తెలుసు -- అత్తయ్య పోవడంతో తను ఏకాకినని. మన కాధారభూతమైన వాళ్ళు ఆరళ్ళు పెట్టినా కట్టడి చేసినా సరే చచ్చిపోయారని తెలిసినప్పుడు 'అయ్యో మనమే కొంచెం అభిమానం ఎక్కువగా చూపించి ఉండవలసింది. కొంచెం ఆదరంగా ఉండవలసింది.' అనిపించడం సహజం. అత్తయ్యని నమ్మించి మోసం చేశానే అన్న బాధవిపరీతంగా బాధిస్తున్న సమయంలో ఏదో విధంగా ఆవిడని దగ్గిరకి తెచ్చుకుని తను చేసిన దానికి పశ్చాత్తాపం ప్రకటించాలని తలపోస్తున్న అదనుతో ఆ వ్యక్తే లేకుండా పోయిందన్న వార్త పిడుగుపాటులాగా అయింది లలితకి. "ఏమైందమ్మా చెప్పు' టెలిగ్రాం లో వివరాలుండవని తెలియని అవ్వగారు తెగ అడుగుతున్నారు.
    "గుండె ఆగి చనిపోయిందిట . లాయరు గారిని కలవమని వైరు ఇచ్చారు' బెక్కుతూ చెప్పింది లలిత.
    "అయ్యో తల్లీ ఎంతట్లో ఎంత ముంచు కొచ్చిందే.' వాపోయారు అవ్వగారు. బాగా తెల్లవారినా కూడా ఆ కబురు ఈ కబురూ చెప్తూ లలిత పక్కనే కూర్చుని ఓదార్చారు. ఈ సమయంలో కనీసం ఈవిడేనా లేకుంటే ఏమై పోయేదాన్నో అనుకుంది లలిత.    
    'ఎనిమిది కావస్తుంది. లాయరు గారిని పిలుద్దామమ్మాయి, వారికీ వార్త అందే ఉంటుంది. ఏం చేస్తాం చెప్పు. గుండె ధైర్యం ఇలాంటి సమయాల్లోనే చిక్కపట్టుకోవాలమ్మా. ఒంటరిదాన్ని చేసి మహాతల్లి వెళ్లి పోయింది' దుఃఖంతో అవ్వగారి కంఠం కూడా వణికింది.
    ముఖం కడుక్కుని లాయరు గారికి ఫోను చేసింది లలిత. అత్తయ్య వస్తుందన్న ఆశ వల్ల కాబోలు అప్పటిదాకా ఇల్లు బోసి పోలేదు. కాని ఇక రాదని తెలిశాక ఇంటిలో నిశ్శబ్దం ఆవరించి నట్టనిపించింది లలితకి. ఇక మీదట ఎలాగ జరుగుతుందో అన్న బెంగ ఒక పక్క కృంగ తీస్తుంది.
    ఎంతోసేపు మ్రోగాక గాని లాయరు గారి ఫోను ఎవరూ ఎత్తలేదు. నెమ్మదిగా వివరాలు చెప్పింది లలిత.
    "నేనూ నీకు ఫోను చేద్దామను కుంటున్నా నమ్మాయి. పాపం. అనారోగ్యంగా నైనా ఎప్పుడూ కనిపించని ఆవిడగారు ఎంతలో కన్ను మూసింది. నీకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పది గంటలకి కాగితాలూ అవీ పట్టుకుని వస్తానమ్మా. నువ్వేం బెంగ పడిపోకు. మేమంతా ఉన్నాంగా' అని ఎంతో దయగా మాట్లాడారు లాయరు గారు. అయన చూపిన అనునయానికి మరింత దుఃఖం పొంగు కొచ్చింది లలితకి. అలాగే అని చెప్పి ఫోను పెట్టేసి -- వచ్చి మంచం మీద బోర్లా పడుకుని చిన్న పిల్లలాగా ఏడ్చేసింది.
    తనకి జ్ఞానం వచ్చిన దగ్గిర నుంచి అత్తయ్య తప్పించి ఎవరినీ తెలియదు. ఒక మేనమామ అప్పుడప్పుడు వచ్చి చూసి వెడుతూ ఉండేవాడు. ఆ మామయ్య కూడా తనకి వయసు వచ్చాక రాలేదు. తను మళ్లీ ఆయనని చూడనే లేదు. 'ఒంటరి గాడు ఏదో వ్యాపారం లో బాగా సంపాదించాడు. తెరికైనప్పుడు వస్తాడు' అనేది అత్తయ్య. అలాంటి మామయ్యా ఓ రోజు పోయాడని అత్తయ్య చెప్పేదాకా తెలియలేదు లలితకి. ఇప్పుడీ పెంచి పెద్ద చేసిన అత్తయ్య కూడా కనుచాటై పోయింది. తనెంత ఏకాకిగా బ్రతకాలో ఊహించుకున్న కొద్ది దుఃఖం ఎక్కువైంది లలితకి----

                               
    పది గంటలు ఇట్టే అయింది. అవ్వగారు లాయరు గారిని హల్లో కూచోబెట్టి లలితని పిలిచారు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచి పోయాయి. చెదిరిన జుట్టుతో శోక మూర్తి లాగా ఉంది లలిత. 'తల్లీ నీకు వచ్చిన కష్టం నేను ఊహించు కోగలనమ్మా' అంటూ లలిత రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకుని కుర్చీలో కూర్చో పెట్టారు లాయరుగారు.
    'అత్తయ్య ఎంత మోసం చేసి వెళ్లి పోయిందండీ' ఏడుస్తూనే అంది లలిత.
    "చావు చెప్పి వస్తుందా పిచ్చిదానా. ప్రియబంధువుల కోసం బాధ పడడం అన్నది తప్పదు. కాని బ్రతికి ఉన్నందుకు మనకి కర్తవ్యం అంటూ ఒకటి ఉంటుందిగా. అది మరిచి పోకూడదు. అంటూనే బ్రీఫ్ కేసు లోంచి కాగితాలు బయటికి తీశారు వెంకట్రామయ్యర్. 'చూడు లలితా మీ అత్తయ్య చాలా ఇంగితం కల వ్యక్తీ. అటువంటి దూరదృష్టి కల ఆడవాళ్ళు చాలా అరుదమ్మా. ఆమెగారు నీతో కించత్తయినా చెప్పకుండా దాచిన విషయాలు చాలా ఉన్నాయి.' అన్నారు వెంకట్రామయ్యర్.
    "నాకు తెలుసండీ అత్తయ్య అప్పుడప్పుడు చెప్తూ వుండేది. ఒకవేళ తనకేదైనా జరిగితే వెయ్యి రూపాయల దాకా కర్చుకి మీ దగ్గిర వాడుకోమనేది....నిజంగానే ఇలా జరుగుతుందని ఊహించలేక పోయాను.' లలిత కంఠం ఎడ్పుతో పూడుకుపోయింది. 'పిచ్చితల్లీ నే చెప్పబోయిన విషయం  అదికాదు. ఆవిడ ఈవిధంగా పోవడం చాలా విచారకరం అనుకో. కాని ఇలాంటి విషయాలు ఎంత విషాదం లో ముంచినా బ్రతికి ఉన్నవాళ్ళ పట్ల మనం శ్రద్ధ తీసుకోక తప్పదు కదా. నీ విషయమే చూడు....'
    లలిత అయన ముఖంలోకి విప్పారిన కళ్ళతో చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS