"గురువుగారి భార్య ఏమన్నారో విన్నావుగా?....."
పరవశంతో కన్నులు సగం మూశాడు ప్రభాకరం. "ఆవిడ నిండైన మనస్సుతో దీవించేరు... నువ్వు దాన్ని వృధా చెయ్యకూడదు సుమా!" లీల చేతిని మృదువుగా నొక్కాడతను.
"అబ్బ-ఉండండి" అని సున్నితంగా వారించింది లీల.
"అది కాదు, లీలా నా కేమనిపిస్తుందంటే, వాళ్ళు భగవత్స్వరూపులు. వాళ్ళు అన్నది వృథా పోదు. ఏడాది లోపుగా మన ఇంట్లో ఓ బాబు పుడతాడు, నిజం!....వాళ్ళ దీవనా, నా కోరికా ఒక్కటే, లీలా.... నీ పోలికలూ, నా ఆరోగ్యంతో అందంగా ఉండబోయే పాపల్ని నువ్వు నాకు ప్రెజెంట్ చెయ్యాలి, లీలా?"
లీల పకపకా నవ్వింది. "మీ పోలికా, నా ఆరోగ్యం వస్తేనో!?"
అతను నవ్వలేదు.
లీలకి అతని వింత ధోరణి ఆశ్చర్యకరంగా కనిపించ సాగింది. సాధారణంగా ఆడవాళ్ళకి ఉంటుందంటారు ఈ పిచ్చి. ఇది ఇతని కెలా పట్టింది? ఇలాంటి మనిషితో జయప్రద మాటలు చెప్పాలంటే మాటలా!
"అది కాదు, లీలా.... నే ననే దేమిటంటే..." లీల సిగ్గుపడినదానిలా నవ్వుకుని, బండిలో ముందుకి జరిగి బయటికి చూడడం ప్రారంభించింది.
ప్రభాకరం మాటల కోసం తడుముకోసాగాడు. "అది కాదు.....నే చెప్పేది ఏమిటంటే..... పిల్లలు..."
"అదేం చేనండీ?" బయటికి చూస్తున్న లీల అతని వేపయినా చూడకుండా ఎటో చూపిస్తూ ప్రశ్నించింది.
ప్రభాకరం తన ధోరణిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కాని ఆమెని నిరుత్సాహపరచకుండానే తన మాటలు చెప్పాలి. "అదా....జొన్నచేను.""మొక్కజొన్నకండెలు వస్తాయి-ఆ చేలోంచేనా?" "అదికాదు. ఇవి అన్నం వండే జొన్నలు....అంటే, వ్యవసాయకూలీలు వాళ్ళు తింటారు ఆ అన్నం."
తన అభిప్రాయాలామెకి చెప్పడానికి తగినంత చనువు వాళ్ళిద్దరి మధ్య కలగలేదని హఠాత్తుగా అతనికి గుర్తు వచ్చింది. తనకి మాత్రం ఆమె ఎన్నాళ్ళ నుంచో, ఎన్నేళ్ళనుంచో తెలిసినట్టుంటుంది. ఈమె తన కోసమే సృజింపబడ్డట్టు మొదటిసారిగా ఆమెను చూసినప్పట్నుంచీ తనకు అనిపిస్తూంది. అలా లీలకి తనని గూర్చి అనిపించదా? ఏమో!
లీలని మొదటిసారి చూసినవాడు-ఆ రోజు తనకి బాగా గుర్తు -ఈమెని ఎక్కడ చూసేనా అని తలలో ప్రశ్న. ఎక్కడో అడ్ వర్ టైజ్ మెంట్ లో బొమ్మలో చూసినట్లు అస్పష్టమైన జ్ఞాపకం. అది స్మరణీయ మైన అనుభవం.
అక్కయ్యగారి ఊరు వెళ్ళి, వాళ్ళింటికి నడుస్తున్నాడు తను. ఆమడ దూరానికే బాబు ఆరున్నొక్క రాగాన్ని విన్న ప్రభాకరం, ప్రాణం గిజగిజలాడుతూ ఉండగా పరిగెడుతున్నంత వేగంగా ఇల్లు చేరాడు.
బాబు సాధ్యమైనంత స్థాయి పెంచి ముఖం ఎర్రన చేసుకొని అరుస్తున్నాడు. వాడి రెండు చేతులూ తన బలమైన ఒక్క చేతితో పట్టుకొని చెంపలు వాయగొడుతూంది కమల.
"అక్కా.....ఏమిటిది?"
"పెంకితనం పెరిగిపోయి, వద్దన్న పని తప్ప మరొకటి చేయ డీ వెధవ!" అని వాడిని వదిలి, "అది సరిలే.....ఎప్పుడు బయల్దేరావ్? ఉత్తరం ముక్కయినా రాయలేదు వస్తున్నట్లు?" అంటూ మామూలు ధోరణిలో పడిపోయిందామె. కానీ.....ప్రభాకరానికి మాత్రం ఆమెమీద కోపం తగ్గలేదు.
"ఊఁహూఁపసివాడిని పట్టుకుని ఎందుకలా చెంపలు వాచేలా కొడుతున్నావ్? బావ లేనట్టున్నాడు. అందుకే అంత ధైర్యంగా కొడుతున్నావ్. అయినా ఏమిటే అది....చెంపలు చూడు, ఎలా వాచాయో?"
హఠాత్తుగా వచ్చిన మామయ్యను ఆశ్చర్యంగా చూస్తూ చేస్తున్న రాగాలాపనని మరిచిపోయినవాడు, సానుభూతి మాటలు వినవెడ్డం, ప్రభాకరం చేయి ఆదరంగా వాడి భుజం చుట్టూ తిరగడంతో మామూలు శ్రుతి పెంచేశాడు.
"కొట్టడమా....వెధవని తలుచుకొంటే ఒళ్ళు మండుకొస్తూంది.....నోర్ముయ్!" అని వాడిని ఒక్క కసురు కసిరి ప్రభాకరంవైపు తిరిగి, "పాపం....ఆ అమ్మాయి కొత్త బట్టలు కట్టుకొచ్చిందా-దానిమీద కాఫీ పోస్తానంటూ ఒకటే దడిపింపు. ఒళ్ళు మండి 'పొయ్యి చూస్తా'నంటే 'చూ'డంటూ గ్లాసుడూ ఒంపేశాడు, వీణ్ణి కొట్టాలా, ఇంకేమన్నా చేయాలా?" అంది.
'ఆ అమ్మాయి' అంటూ అక్క వేలు చూపించిన దిశకి చూస్తూ ఉండిపోయాడు ప్రభాకరం.
సన్నగా, తీగలాగా అతి నాజూగ్గా, పసిమి ఛాయతో, బెదిరే కళ్ళతో వారివంకా, కాఫీతో తడిసిన తన తెల్లని పావడా వంకా బెదురు బెదురుగా చూస్తున్నదల్లా ప్రభాకరం దృష్టి తనమీద నిలవడంతో "వెళతానండీ" అంటూ వెనక్కి తిరిగి మెరుపుతీగలా పెరటిగుమ్మంలోంచి మాయమయింది.
చాలాసేపటివరకూ పరిసరాల్ని గమనించలేకపోయాడు ప్రభాకరం. మాయమైన ఆమె నీడలు తన కళ్ళలో కదులుతూ ఉండగా అలాగే నిలుచుండిపోయాడు. ప్రపంచంలో అంత అందం, సౌకుమార్యం ఉంటాయని అతని కా రోజు వరకూ తెలియదు.
మర్నాడు రేడియోలో వార్తలు వస్తూండగా బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకొంటూ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్న ప్రభాకరంలో ఒక్క సారిగా మత్తు అంతా వదిలి చైతన్యం వచ్చింది. లీల పూలసజ్జలోకి పూలు కోస్తూంది -అక్క బాబుతో కబుర్లు చెపుతూ! ఒక్కొక్క పువ్వూ జాగ్రత్తగా కోసి సజ్జలో వేస్తూ, మళ్ళీ కళ్ళు పైకి ఎత్తుతూ, దించుతూ, అరమూస్తూ అత్యద్బుతంగా, మనోహరంగా, చక్కటి చిత్రకారుడు గీసిన అందమైన బొమ్మలాగా, అందంగా మలచబడ్డ పాలరాతి బొమ్మలాగా ఉన్నదామె.
ఇంకా చూడాలనిపించినా, సభ్యతా సంస్కారాలు అడ్డువచ్చి బలవంతంగా దృష్టిని మరల్చుకొన్నాడు.
మళ్ళీ సాయంత్రం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకొంటూండగా వచ్చిం దా అమ్మాయి-"ఈ తాళాలు మా నాన్నగారు వస్తే ఇవ్వండి" అంటూ.
"ఎక్కడికైనా వెళుతున్నారా?" అడిగింది అక్క.
"అవునండీ....మా బంధువులింట్లో పేరంటం ఉంది. ఇంతవరకూ నాన్నగారు రాలేదు. అందుకని...వస్తానండి, అమ్మ పిలుస్తున్నట్టుంది" అంటూ వెళ్ళిపోయింది.
"హుఁ.... ఇంత చక్కటి పిల్ల...వాళ్ళమ్మా నాన్నలకి సమస్య అయిపోయింది..."మెల్లగా తనలో తాను అనుకొంటున్నా ప్రభాకరం చెవుల్ని దాటిపోలేక పోయా యా మాటలు.
"చదువుకొంటున్నట్టుందిగా?" అన్నాడు.
"ఏం చదువు! పెళ్ళి చేయలేక చదివిస్తున్నాడు."
"అదేం?"
"అదేం ఏమిట్రా? తగినంత కట్నం లేకుండా కాస్త తిండి పెట్టగలిగేవాడు రావద్దూ?"
"కట్నం ఎందుకే-ఆ అమ్మాయి సన్నజాజిలాగా ఉంటేనూ!"
"మనం అనుకొంటే సరా- ఆ చేసుకొనేవాడు అనుకోనా లది! గుమ్మడిగింజలాంటి పిల్ల-బంగార బ్బొమ్మ! నాకే కొడుకు ఈడైనవాడు ఉంటే ఏ నాడో ఎగరేసుకుపోదును."
"వయసు తేడా అయితేనేం-బుద్దులు పెద్దవేగా ఈ అల్లరి వెధవ కిచ్చి చేసేయ్" అంటూ పైకి నవ్వేసినా, అక్క నిట్టూర్పులూ, మాటలూ ప్రభాకరం మెదడులో కొత్త కొత్త ఆలోచనలని రేకెత్తించాయి.
ఆలోచించి ఆలోచించి, గంట పోయాక, "పోనీ, అక్కా.... నీకు కొడుకు లేకపోతే ఏం నేనూ ఒక కొడుకు నంటావుగా?" అన్నాడు.
అందులోని అర్ధం వెంటనే స్ఫురించకపోయినా, గ్రహించిన వెంటనే మాత్రం గబగబా దగ్గరికి జరిగింది-"ఏమిట్రా-స్పష్టంగా చెప్పు" అంటూ.
"స్పష్టంగా ... ఇంతకంటే ఏం చెప్పను?" నీకు కొడుకు ల్లేరని బాధపడ్డం ఎందుకు? నేనే నీ కొడుకు వనుకొంటే సరిపోదూ?" చిలిపిగా నవ్వాడు.
ఆ భావం స్పష్టంగా అర్ధం చేసుకొన్న కమల-"నువ్వు చేసుకొంటాననాలే కానీ....అంతకంటే కావలసిందేముందిరా" అంది. ఆ తరవాత ఇన్నాళ్ళకు అతనికి వచ్చిన ఆలోచనని తెగపొగిడి, "అన్నీ చూసే పూచీ నాది. నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు" అంటూ అభయమిచ్చి రంగంలోకి దూకింది.
తరవాత గట్టిగా ఆరు నెలలు గడవక మునుపే లీలతో తన వివాహం అయింది. అసలు.... లీలలో తనను ఎక్కువగా ఆకర్షించిన దేమిటి... ఏమీ తెలియనట్టు చూసే ఆ చూపులు.... విశాలంగా ఉండి మిలమిల్లాడే ఆమె కళ్ళు.....అవే కళ్ళు రావాలి తమ సంతానానికి. లీల రంగు బంగారు ఛాయ. అదీ ఛాయ రావాలి. తనలాగా బలంగా, లీలలాగా అందంగా, బొద్దుగా, ముద్దుగా, ఆనందంగా కళకళలాడుతూ ఆడిస్తూ తమ పాపలు ఇంట్లో తిరుగాడు తుంటే...ఇంక ఊహించడం అతనికి రావడం లేదు. ఇవన్నీ లేలకి చెప్పాలి. ఎలా? ఎప్పుడు? తొందరపడుతూందతని హృదయం. కానీ... చెప్పలేకపోతున్నాడు. కారణం?
బహుశా తమ ఇద్దరికీ ఉన్న కొద్దిపాటి పరిచయమే నేమో? ఏమయినా లీల తన భావాల్ని అర్ధం చేసుకోవాలి..... గౌరవించాలి!
* * *
పెళ్ళయిన పది రోజులకే లీలతో ప్రయాణం అవుతున్న ప్రభాకరాన్ని చూసి ముక్కుమీద వేలేసు కొన్నారు ముసలివాళ్ళు.
"మా కాలంలో ఇలా ఉండేదా? కాపరం పెట్టించా లంటే మళ్ళీ పెళ్ళంత ఆర్భాటం" అందొక పూర్వసువాసిని, తన రోజుల్ని తలుచుకొంటూ.
"ఈ కాలం కుర్రకారు ఆగుతారటమ్మా? ఇలా పెళ్ళి చేసుకోవడం.... అలా పెళ్ళాన్ని వెంటేసుకు పోవడం..." ఈ మాటలని వింటున్న ప్రభాకరం విసుక్కొన్నాడు.
"అక్కా, వెళతాం." పక్కగదిలో పని చేసుకొంటున్న అక్క దగ్గరికి వెళ్ళాడు లీలతోసహా.
"ఇంత తొందరగా వెళ్ళడం బావులేదు కానీ, పని ముఖ్యం కదా? ఉత్తరాలు రాస్తూండండి..."
"తప్పనిసరి. వెళ్ళకపోతే నష్టంకూడా వస్తుంది" అని గంభీరంగా ముఖం పెట్టి, "నువ్వు చేసిన మేలును మాత్రం ఎప్పుడూ లీలా, నేనూ మరిచిపోలేం. అమ్మలేనందుకు అమ్మని మించి చేశావు. నువ్వూ, బావా మా ఇంటికి వస్తూంటేనే మాకు సంతోషం. అదివరకెప్పుడు రమ్మన్నా 'ఒంటిగాడిని. పెళ్ళాన్ని తెచ్చుకో, వస్తా, ననేదానివి. ఇప్పుడా వంకకూడా లేదు" అంటూ లీలతోబాటు ఆమె కాళ్ళకి నమస్కరించాడు.
"లేరా....ఏమిటిది.....ఎన్నిసార్లు? రాసిపెట్టి ఉంది. జరిగింది. నేను చేసిందేముంది చెప్పు? అయినా కోరి చేసుకొన్నందుకు ఆ పిల్లని అర్ధం చేసుకొని మసలుకొంటూ, ఇద్దరూ అన్యోన్యంగా ఉంటేనే మాకూ సంతోషం. లీలా, ఉత్తరం రాస్తూండు. నా కూతురు కాపరానికి వెళుతున్నంత బాధగా ఉంది."
"నాకూ మిమ్మల్ని విడవాలంటే అలాగే అనిపిస్తూందండీ..." అంది లీల.
"అవును, మరి..... మా ఇంట్లో పిల్లలా తిరిగావు, పరిచయం అయినప్పటినుంచీ. మా ఇంట్లోకే వచ్చేశావు. కానీ దూరం వెళుతున్నావు. ఈ ఇంట్లో ఇంక హడావుడే ఉండదు" అంటూ ఆమెను దగ్గరగా తీసుకొని ప్రేమగా తల నిమిరి, వాళ్ళు వెళ్ళిపోతూంటే బెంగగా చూస్తూ గుమ్మంలోనే నిలబడిపోయింది.
క్రమంగా రిక్షాలు దూరమయిపోయాయి.
* * *
