Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 3


    'యేముంటుంది ? మంచి మల్లె వూపులేమో'
    'వుహూ'
    'అయితే దానిమ్మ పండు'
    'కాదు.'
    'మరి'
    'చెప్పుకోవాలి.'
    'నాకు తెలీదు నువ్వే చెప్పు బాబూ.'
    'యిలారా మరి నాతొ'
    శ్రీనివాస్ పొట్లం విప్పి చీరలు ముందు పడేయగానే సరస్వతి నవ్వేసింది : 'పిన్నీ యిలారా పిన్నీ.'
    శ్రీనివాస్ ఆశ్చర్య పోయాడు. చీరాల బాగోగుల గురించి చెప్పకుండానే సరస్వతి ఆవిడని పిలిచేయడం అసలు నచ్చలేదు అతనికి. సుభద్ర వచ్చేసింది సుడిగాలి లా.
    "పిన్నీ నీకూ నాకూ తీసుకు వచ్చాడు అన్నయ్య. నిన్ను యేరుకొన్నాకే నన్ను తీసుకో మంటున్నాడు. చూడు వాడికి నిన్ను చూడక ముందే యెంత అభిమానమో!
    ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు శ్రీనివాస్.
    "అలాగా నిజమేనా శ్రీనివాస్, సుభద్ర అడగడం అతనికే మాత్రం నచ్చలేదు. తను ముచ్చటగా ముద్దుగా చెల్లెల్ని ఒక్కదాన్నే వూహించుకుని తీసుకుని వచ్చాడు. తీరా యిలా తారుమారు అయిపోతుందని అనుకొనే లేదు.
    "అన్నీ వట్టి కబుర్లే. మీ అన్నయ్య కి నీమీద వుంటుంది గానీ, నన్ను దేనికి గుర్తుంచు కుంటాడు?"
    "లేదు పిన్నీ! సిగ్గు పడుతున్నాడు వాడు.'
    'నేనేమీ సిగ్గు పడడటం లేదు. అసలు నేను మా యింట్లో మరో కొత్త మనిషిని వూహించు కొనే లేదు, శ్రీనివాస్ మాటలు గొంతు లోంచి ఊడి పడలేదు.
    'నిజమే కదురా అన్నయ్యా.'
    'అవునమ్మా' అప్రయత్నంగానే అనేశాడు సుభద్ర చీర పట్టుకుని భర్త వున్న గదిలోకి వెళ్ళిపోయింది. గోపాలం నిజంగా సిగ్గు పడ్డాడు కొడుకు యెదుట తను మళ్ళీ యీ విధంగా చేయడం ఏదో అపరాధం చేసినట్లుగా వుంది అతనికి.
    శ్రీనివాస్ మాట్లాడకుండా గదిలో వాలు కుర్చీలో కూర్చుండి పోయాడు.
    రాత్రి అవుతుందనగా సరస్వతి వచ్చి అంది. "భోజనానికి లే అన్నయ్యా.'
    శ్రీనివాస్ కి మంటగా వుంది. కడుపులో యెవరో కోరలతో గోకుతున్నంత తపన:
    'మాట్లాడవేం అన్నయ్యా కోపం వచ్చిందా?'
    'నన్ను విసిగించకు సరస్వతీ ! నాకు ఆకలిగా లేదు.'
    'వాహ్ ! అన్నీ అబద్దాలే. మూడు పూటలూ యెక్కుసంగా తినే దొరగారు వొక పూట మానేయడం పడమట సూర్యుడు వుదయించినట్టే."
    'వేళాకోళం కాదు సరస్వతీ. నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళు ఆవిడ నీకోసం యెదురు చూస్తూ వుంటుంది.'
    'నాకు తెలుసు నీ కోపం. నీకు తెలీదు ఎలా నడుచు కోవాలో. వొకే యింట్లో యిరవై నాలుగు గంటలూ వుండే యిద్దరి స్త్రీల మధ్య యెప్పుడూ అంత పొత్తు వుండదు. అందులో సవతి తల్లి అనే పదానికి చాలామందికి పెట్టింది పేరు. నువ్వు అలిగితే నేనేమీ చేయలేను. కాని పిన్నిని మంచి చేసుకునే అవసరం నాకు యెంతైనా వుంది.'
    'రాత్రిం బవళ్ళు నేను వున్నాను అనే ధ్యాసే లేకుండా యెక్కడి కో వెళ్ళిపోయి యిన్నాళ్ళ కి వచ్చావు. చీరలు కావు అన్నయ్యా సంతోష పెట్టేవి రెండు మంచి మాటలు అవే కరువై పోయాయి. పిన్ని యీ యింట అడుగు పెట్టింది. కొత్తో లేక చిన్నదనో తను యెక్కువగా యే విషయం పట్టించు కోదు నా పని రెట్టింపు పెరిగింది. అందుకు బాధేమీ లేదు. మనకు లేని మాట నిజమే. వున్నంత లో నాకు కడుపు నిండక పొతే ఆ బాధ యెవరికి చెప్పుకోను? అందుకే  ఆవిడ అడుగులకి మడుగులు వోత్తుతాను. వీలైతే ఆవిడ దూకమన్ననూతిలో దూకుతాను.'
    'సరస్వతీ!'
    'ఎండుకన్నయ్యా బాధ. నువ్వు ఎల్లకాలం నన్ను కనిపెట్టుకు ఉండలేవు నాన్న స్థితి ఏవిటో అయన నాకు చూపించే దారి ఏవిటో అంతా తెలుసు.నేనూ, నా పీరూ యీ ప్రపంచం లో మట్టి కొట్టుకు పోకుండా వుండాలంటే నువ్వు యెక్కడికి వెళ్లొద్దు' పద్నాలుగు దాటిన సరస్వతి మెల్లమెల్లగా అన్నగారితో బాధని చెప్పేసింది.
    ఎవరు యేమనుకుంటే ఏం? జరిగింది  జరిగి పోయింది గనుక. సుభద్రా గోపాలం సినిమాకి వెళ్ళడం లో సరస్వతి కి వీలు చిక్కింది.
    'ఆవిడ నిన్ను యేమైనా అన్నదా?" శ్రీనివాస్ చెల్లెల్ని హృదయం లోకి తీసుకున్నాడు.
    "నన్ను యెవరూ యేవీ అనరు. అమ్మ వుండగా నీ దగ్గరే వుండేదాన్ని. అమ్మ దగ్గర నాకు భయం అనిపించేది కాదు. ఈ కటిక చీకట్లో ఒంటరిగా యీ పదిహేను రోజులూ యెంత భయ పడ్డాననీ.'
    'చెప్పన్నయ్యా యిన్నాళ్ళూ యెక్కడికి వెళ్ళావు?"
    నిట్టూర్చాడు శ్రీనివాస్. 'చాలా చోట్లకి వెళ్లాను. యెక్కడా ఉద్యోగం లాంటిది దొరకలేదు.'
    'అంటే వుద్యోగం దొరుకుతే నువ్వు వెళ్లి పోతావా అన్నయ్యా!'
    అతను యిరుకున పడ్డాడు. 'లేదు వెళ్ళను. నిన్ను విడిచి యెక్కడికి వెళ్ళను' చెల్లెలితో మనస్పూర్తిగా అన్నాడు.
    శ్రీనివాస్ ముమ్మూర్తులా గోపాలాన్నే పోలాడు. బలంగా, ఠీవి గా అందంగా వున్న అతన్ని యింట్లో ఉపవాసాలు అట్టే శ్రమ పెట్టేవి కావు. రాత్రిళ్ళు ప్రైవేటుగా చదువుతూ స్వభావం లో తల్లినే గుర్తుకు తెస్తుంటాడు.
    చెల్లెలితో చదువు విషయాలు చెబుతూ చెబుతూనే అలసిపోయిన శరీరాన్ని నిద్రాదేవి వొళ్లోకి దూర్చేశాడు.
                
                                  2

    గుండ్రంగా తిరిగేస్తోంది కాలచక్రం పరుగులు పెట్టేస్తూ.
    అప్పుడే గోపాలం పెళ్లి అయిపోయి యేడాది దాటిపోయింది.
    శ్రీనివాస్ మెట్రిక్ పరీక్ష కూడా పాసయ్యాడు.
    "ఎప్పుడు చదివావురా!" గోపాలానికి ఆశ్చర్యంవేసింది.
    శ్రీనివాస్ సిగ్గుపడ్డాడు. యేడాది కాలంలో గోపాలం లో రావలసిన మార్పే వచ్చింది. చెంపల పక్కగా నెరిసిన జుట్టు అతని పెద్దతనాన్ని సూటిగా చూపిస్తోంది. కొడుకుని అతను మరీ మరీ చూస్తున్నాడు. తనంతటి వాడై పోయిన కొడుకుని చూస్తుంటే అతను కొత్తగా రకరకాల మానసిక వేదనకి గురి అయిపోతున్నాడు. 'అరె! చేయను, చేయను' అంటూనే తను ఎంతపని చేశాడు? తెలివి తక్కువగా ముక్కు పచ్చలారని ఆడపిల్ల గొంతు సునాయాసంగా మరీ అడ్డంగా ఎలా కోయ గల్గాడు? తనకీ జన్మ కి నిష్కృతి వుంటుందా? జానకి ని, ప్రేమించి చేసుకుని యేడుపుతో దొర్లించిన ఆవిడ బ్రతుకుని అందులోనే శిధిలం చేశాడు. ఆ రోజుల్లో లాగే యిప్పుడూ జానకి పోయిన తరువాత గడిపి వుంటే యెంత బాగుండి పోయేది? అతనిలో పశ్చాత్తాపం మింటికి ఎగసి పడుతోంది. కనుకోలుకుల్లో నిలిచినా బొట్టు కొడుక్కి కనుపించ నీయలేదు.
    'నాన్నగారూ! నేను పై చదువులు చదవాలను కుంటున్నాను. కనీసం బియ్యే అయినా బ్రతుక్కి వొక అర్ధం వుంటుందేమో అని ఆశ.'
    చిత్రంగా నవ్వాడు గోపాలం! 'చూడు శ్రీనివాస్ నేను బియ్యే చదివి యెంత పరమార్ధం సాధించానంటావు?'
    'అంటే? శ్రీనివాస్ గుండెల్లో రాయి పడింది. అతనికి కొడి గట్టని దీపం లాంటి ఆశ వుంది పై చదువు మీద. కానీ తండ్రి యిలా నిరుత్సాహ పరుస్తుంటే యిక పైన ఆలోచించలేక పోయాడు.
    'మెట్రిక్ పాసయ్యావు. నిజంగా సంతోషంగా వుంది నాకు ఈ చదువు నువ్వు యెలా చదివావో నాకు తెలీదు. యేదైనా గవర్నమెంటు వుద్యోగం చూసుకో --'
    శ్రీనివాస్ తల వాల్చేశాడు : 'రాజమండ్రి వెళ్లి అక్కడ ట్రైనింగ్ అవుతాను నాన్నగారూ .'
    'నీ యిష్టం నీ అంతటి వాడివి నువ్వు అయ్యావు. ఇక నిన్ను ఆపేందుకు నాకే యెలాగో వుంది.' గోపాలం వాలు కుర్చీలో వెనక్కు చేరగిల బడి కళ్ళు మూసుకున్నాడు.
    రాత్రి పది దాటాక చీకట్లో మంచం మీద పడుకుని ఆకాశం లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు శ్రీనివాస్. తను ఈ ట్రైనింగ్ పూర్తీ చేసి ఏదో సంపాదన లోకి దిగి మంచి మనిషిని వెతికి సరస్వతి పెళ్లి చేసే  వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.
    కాళ్ళ దగ్గర కూర్చుని సరస్వతి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ శబ్దానికి త్రుళ్ళి పడ్డాడు. ఇంత రాత్రి సరస్వతి యెందుకు ఏడవవలసి వచ్చిందో అర్ధం కాలేదు. చెల్లెలి భుజాలు పట్టుకుని దగ్గరగా తీసుకుని బుజ్జగిస్తూ అడిగాడు : "ఏం జరిగింది సరస్వతీ? యిప్పుడు నిన్ను ఎవరేమన్నారు?"
    సరస్వతి యేడుపు అంతకంత కు అధికం అయిపొయింది. చాలా సేపటికి గొంతు విప్పింది : 'నువ్వు యిలా మోసం చేస్తావను కోలేదన్నయ్యా . నాకు మాట ఇచ్చావు యెక్కడికి నన్ను విడిచి వెళ్ళను అని. అప్పుడే అన్నీ మరిచి పోయావు. ఛ! పక్కన పుట్టిన నువ్వే యిలా చేస్తే నేను యెవరికి చెప్పుకోను?'
    శ్రీనివాస్ అన్నాడు : 'సరస్వతి నువ్వు అర్ధం చేసుకుంటే అంతే చాలు. యిన్నాళ్ళు యెలా గడిపానో జీవితాన్ని నీకు  తెలీదు. ఆ కష్టాన్ని భరించలేక యీ చదువు పూర్తీ చేశాను ఎలాగో?
    'రెండేళ్ళు వోపిక పడితే ట్రైనింగ్ అయిపోతుంది. నా గురించి అలోచించెందుకు గానీ, నన్ను పట్టించు కునేందుకు గానీ యెవరూ లేరు. కష్టపడి చదివితే నెలసరి జీతంతో మనం సుఖంగా బ్రతకగలం.
    సరస్వతి అతని వైపు చూస్తూ ఆ మాటల్లో నిజాన్ని అర్ధం చేసుకోవాలని అనుకుంటోంది. 'చూడన్నయ్యా నువ్వు యీ యేడాది లో పిన్నితో అసలు మాట్లాడ లేదేం? పిన్ని యెంత బాధపడుతుందో నీకు తెలుసా?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS