Previous Page Next Page 
మారిన విలువలు పేజి 3

                                

    రమణయ్య గారి ఇంట జానకి పెళ్ళిలో జరిగిన అలజడి ఇంకా సద్దుమణగక ముందే మూడు మాసాలు మెల్లగా ముఖం చూపించేయి. శ్రావణ మాసారంభం నుంచి, వారి ఇంట ప్రతి రోజు అత్రంగానే గడుస్తున్నది. జానకితో పెళ్ళయిన ఆడపిల్లలందరికి అత్తవారి నుండి నోములకు పిలుపులు వచ్చేయి. సుందరమ్మ ఉదాయాస్తమాలతో వియ్యాల వారి పిలుపు కోసం చూస్తుండగానే శ్రావణ మాసం పూర్తయింది.
    అప్పటివరకు కోన ఆశతో అదిమి పట్టుకొన్న దుఃఖాన్ని సాధింపుల రూపంలో భర్త మీదికి వదల సాగింది సుందరమ్మ. "మీ పట్టు పంతాలే చూసుకొన్నారు కాని, ఆడపిల్ల బ్రతుకేమవుతుందనే ధ్యాస మీకు లేకపోయింది. ఆ వెయ్యి రూపాయలు వాళ్ళ ముఖాన కొట్టి రండి బాబూ అని చిలక్కి చెప్పినట్లు చెప్తే విన్నారు కారు. అసలు నామాట మీ రెప్పుడు విన్నారు లెండి? చదువు సంధ్యలు లేని ఈ పల్లెటూరి సంబంధం వద్దంటే విన్నారా? చదువు లేకపోయినా పరువూ మర్యాదా ఉన్నవాళ్ళు మూడు తరాల దాకా పడి తినే ఆస్తి ఉంది పిల్ల సుఖపడుతుంది-- అన్నారు.
    "ఇప్పుడు చూస్తున్నాంగా ఈ డబ్బున్న వాళ్ళకున్నంత కాపీనాలు ఇంకెవరి కైనా ఉంటాయా? ఏదోమాటా మాటా అనుకొన్నంత మాత్రాన పిల్ల నునుపుకే నీళ్ళు పోస్తారా? వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరూ? నా పిల్లని ఉసురు పెడితే వాళ్ళు చల్లగా సంసారాలు చేసుకోవద్దూ?
    "ఇంతకీ ఎవర్నో అనుకోవలసిన పనేముంది లెండి. శని మన నోట్లో తాండవించి మనచేత అలా పెలించింది. ఆడపిల్ల నిచ్చుకున్న వాళ్ళం కాస్త అణకువగా ఉంటె ఏం పోయింది?' సుందరమ్మ ధోరణి రోజుల తరబడి సాగిపోతూనే ఉంది.
    మూడు నెలలపాటుగా రమణయ్య గారు తెచ్చి పెట్టుకొన్న గంభీర్యం సుందరమ్మ మాటలతో ఎగిరి పోయింది. జానకి బ్రతుకే,మవుతుందో అన్న బెంగ అతనికి నిద్రాహారాలు ;లేకుండా చేసింది. పైకి పెంకె మాటలు చెపుతున్నా పెళ్ళివారు గడప దాటిన క్షణం నుండీ అతనికి మనశ్శాంతి లేదు. సుందరమ్మ కు తెలియకుండా వియ్యాలవారిని క్షమాభిక్ష కోరుతూ రెండు మూడు ఉత్తరాలు వ్రాసేడు. తెలిసిన మనుష్యుల ద్వారా రాయబారాలు పంపేడు. ఏవీ ఫలించ లేదు. తమ పిల్లాడికి పెళ్ళి కాలేదన్నారు. తమకు వియ్యాలవారు లేరన్నారు. కోర్టుల కేక్కితే ఈ మాటలు చెల్లవు. కాని అందువల్ల జరిగే పరిష్కారం కూడా లేదు.
    వారు కోరిన వెయ్యి రూపాయలు వారి చేతిలో పడితే కాని జానకి కాపురం సానుకూల పడదని రమణయ్య గారు తెలుసుకున్నారు. అంత ఆస్తీ పరహస్తగతం కాగా మిగిలిన ఒక్క పెంకిటిల్లు అయివేజు ఇచ్చి పదిహేను వందల రూపాయలు అప్పూ తెచ్చేరు. దసరా పండుగకు అల్లుణ్ణి తీసుకు రావలసిందని, వారు కోరిన లాంచనాలు వారికి సక్రమంగా జరుపుకుంటామని వినయ పూర్వకంగా ఉత్తరం వ్రాసి పెద్ద కొడుకు సూర్యం చేత పండుగ పిలుపు కి పంపేడు.
    అల్లుడి ముడుపు వెయ్యి రూపాయలు అలా ఉంచి  మిగిలిన సొమ్ముతో వియ్యాల వారికీ , ఇంట్లో వాళ్ళకు బట్టలు కొన్నాడు. సుందరమ్మ పండుగ రెండు రోజులు ఉన్నాదనగానే లడ్డూలు, జంతికెలు, చక్కిలాలు, మినపసున్ని వంటి నిలవ ఉండే పిండి వంటలు చేసి సిద్ద పరించింది. అంత పని రద్దీలో కూడా తమ వియ్యాల వారు పండుగ కు వస్తున్నారన్న విషయాన్ని ఇరుగు పొరుగులకు తెలియబరచకుండా ఉండలేక పోయింది ఆమె. ఈ పదిహేను వందల రూపాయల అప్పుతో నైనా జానకి కాపురం కుదుట పడుతున్నందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉంది.
    అనుకొన్న రోజుకు రెండు జట్కా బళ్ళు తీసుకొని స్టేషను కు వెళ్ళేరు రమణయ్య గారు. తండ్రితో పాటు ప్రకాశం కూడా బావగారిని ఎదురు కొందుకు  బయలుదేరేడు. వాకిట్లో సంధ్య దీపం వెలిగిస్తూ , "భగవంతుడా, ఈ నాలుగు రోజులు చల్లగా గడిచి పోయేలా చెయ్యి తండ్రీ!" అని దండం పెట్టుకొంది సుందరమ్మ.
    తండ్రి వారు కోరిన వెయ్యి రూపాయలు అల్లుడికి లంచం పెట్టి తీసుకు వస్తున్నాడని జానక్కి తెలియదు. కావాలనే ఆ వార్త ఆమెకు తెలీయనీయ లేదు. తల్లిదండ్రులు. జానకి నోరుజారి పరుషంగా ఏ మాటన్నా వియ్యాల వారు కోపగించుకోని తిరిగి వెళ్ళిపోతారేమో అని వారి బెంగ.
    పెళ్ళినాటి రాత్రి రాజారావుతో అన్న మాటలు తలపుకి తెచ్చుకొని విచారించింది జానకి. అతని మనస్సు ఎలాటిదో తెలుసుకోకుండా తను అన్ని మాటలు అనక పోవలసింది. అన్నిటిలోకి మా నాన్నకే డబ్బుంటే మీకన్న మంచివాణ్ణి చేసుకొని ఉందును-- అన్న మాట ఆమెకు తప్పుగా తోచింది. ఏ మగాడి కైనా నొప్పి కలిగించే మాట అది. ఏమో , తనంత పరుషంగా మాట్లాడ బట్టి ఆపాటి మంచి చెడ్డలు ఆలోచించే బుద్ది అతనిలో కలిగిందేమో? అనుకుంది. అలాగయితే అది మంచికే జరిగిందనుకోవచ్చు కదా? అని సమాధాన పడింది.
    చిట్టి మరదలు శాంత తన కొత్త పరికిణీ, జాకెట్టు వేసుకొని బావగారి రాకకోసం వీధిలో కాచింది. ఆరోజు ఇంట్లో అందరి ఆలోచనల్లోనూ తారట్లాడుతున్న కొత్త అల్లుడు మాత్రం ఇంకా రాలేదు. కనుచీకటి పడుతుంటే ఇంటి ముందాగిన బండి లోంచి నెమ్మదిగా దిగేడు ప్రకాశం.
    "బావా వాళ్ళూ వచ్చేర్రా , అన్నయ్యా?' శాంత ఆత్రంగా ప్రశ్నించింది.
    "రాలేదు" ప్రకాశం నెమ్మదిగా జవాబు చెప్పేడు.
    "నన్నగారేరి?" ప్రకాశం మాట విని వీధి గుమ్మం లోకి వచ్చిన జానకి ప్రశ్నించింది.
    "నాన్నగారు బండిలో ఉన్నారమ్మా. అన్నయ్య గారుంటే ఓపాలి పిలుచుకు రండి. అయ్యగారు స్టేషను లో ముకం తిరిగి పడి పోనారు. ఇప్పుడు కూంత నయమే అనుకోండి....' బండి వాడి మాటలు సాంతం ఎవరూ వినలేదు. అంతా గాభరాగా బండి చుట్టూ మూగేరు.
    రమణయ్య గారు అందరి వైపు ఒక్కసారి చూసేరు. జానకి దృష్టి లోకి వచ్చేసరికి అతని కళ్ళలో నీళ్ళు తిరిగేయి. సన్నగా, పొడుగ్గా విరబూచిన లతలా ఉంది జానకి. ఛాయా తక్కువైనా కళ గల ముఖం జానకిది. ప్రపంచంలో దేనికోసమో నలుమూలల గాలిస్తున్నట్లు చంచలంగా ఇటు అటు కదులాడే కళ్ళు; చిరునవ్వు అంచులను మాత్రమే పై వారికీ కనబరిచి, అనుభూతిని తమలోనే దాచుకొనే సన్నని యెర్రని పెదవులు; ఆనందంలో, ఆ పత్తులో సరిసమంగా తలను పైకెత్తి నిలపగలిగే దృడమైన మెడ -- అన్నీ కలిసి జానకి రూపును తీర్చి దిద్దేయి.
    ఆరోజు తెల్లని మల్లె పువ్వు లాంటి చీర కట్టింది జానకి. చీర అంచుకు సరిపోయే జాకెట్టు తొడిగింది. జడలో కనకాంబరాలు, మరువము మాల కట్టి పెట్టుకొంది. తల అంటుకున్న జుట్టు ముంగురులు నుదుటి పై నాట్యం చేస్తున్నాయి.
    రమణయ్య గారికి కూతురు ముఖంలో ఆనాడు ఏదో కొత్త అందం కనిపించింది. అంతలోనే మనసులో బాధ కలుక్కుమంది.
    "తల్లీ! నీ జీవితాన్ని చేజేతులా నాశనం చేసెనమ్మా" అన్నారు కంట తడి పెట్టుకుంటూ.
    "అవెం మాటలు, నాన్నా! వారి మూర్ఖత్వానికి మీరేం చేస్తారు?" అన్నది జానకి మెల్లగా.
    "అయినా ఇప్పుడొచ్చిన అపదెం ఉంది, నాన్నా ఈ రైలు తప్పి ఉంటారు. తెల్లవారి ఇంకోటున్నది కదా? దానిలో రావచ్చు" అన్నాడు పెద్ద కొడుకు సూర్యారావు.
    తండ్రిని ఓదార్చేందుకు అలా అన్నాడే కాని, వాళ్ళు వస్తారన్న నమ్మకం అతనికి లేదు. ఆరోజు పిలుపులకు వెళ్ళినప్పుడే వాళ్ళ మాటల్లో ఏదో మోసం ఉన్నట్లు అనిపించింది. తమ సొమ్ము ఖర్చయందుకు,తము నలుగురిలో మరోసారి అవమానం పాలయెందుకు ఈ పన్నాగం పన్నేరు అనుకొన్నాడు.
    రమణయ్య గారిని మెల్లగా బండి లోంచి లేవదీసి ఇంట్లోకి తీసుకు వెళ్ళేరు. గంట పూర్వం ఎంతో  సంతోషంగా ఉన్న ఇల్లు, ఒక్కసారిగా చిన్నబోయింది. అంతా దిగాలు పడి కూర్చున్నారు. వస్తారని ఎదురు చూసిన వియ్యాలవారు రాకపోవడం, పైగా రమణయ్య గారు అనారోగ్యం సుందరమ్మ కు మతిపోయేలా చేసేయి.
    వదిన పెట్టిన అన్నం తిని,శాంత, ప్రకాశం తమ పుస్తకాల ముందు కూర్చున్నారు. ఆరాత్రి మిగిలిన వారెవ్వరూ వంట ఇంటి ముఖం చూడలేదు. వండిన వంటల పై మూతలుపెట్టి , అందరికీ కాఫీలు పెట్టి తెచ్చింది కనకం. తను కాస్త తాగి వదిన చేతిలో గ్లాసు అందుకొని తండ్రి గదిలోకి వెళ్ళింది జానకి. రమణయ్య గారు గోడ వైపు తిరిగి పడుకొన్నారు.
    "నాన్నా, కాస్త కాఫీ తగుదురు గాని ఇటు తిరగండి." అన్నది తండ్రి పక్కలో కూర్చుంటూ జానకి.
    తన కన్నీరు కూతురు దృష్టిలో పడకుండా తుడుచుకుంటూ అటునుండి ఇటు అతికష్టం గా తిరిగేరు అతను. ఒకటి రెండు కన్నీటి బొట్లు ఇంకా బుగ్గల పై నిలిచిపోయేయి.
    "ఏమిటిది నాన్నా! మీకేమైనా పిచ్చా? ఇప్పుడేమయిందని ఈ కన్నీరు?' అన్నది ఆమె తన చీర కొంగుతో అతని కన్నీరు తుడుస్తూ.
    "వాళ్ళు ఉట్టి మూర్ఖులమ్మా. డబ్బు కోసం ఎంతటి పాపం వడి కట్టుకుంది కైనా వెనుదీయరు. వాళ్ళ గురించి సరిగ్గా తెలుసుకోకుండా నా చిట్టి తల్లిని వాళ్ళ చేతుల్లో పెట్టెను. అది చాలనట్లు, వాళ్ళు మూర్ఖులని తెలిసి కూడా వాళ్ళ కన్న మూర్ఖంగా ప్రవర్తించెను. అన్ని విధాలా నీకన్యాయం చేసేనమ్మా" అన్నారు జానకి తల నిమురుతూ.
    ఆరోజు తండ్రి ఎందుకంత దిగులుగా మాట్లాడుతున్నాడో జానకికి అర్ధం కాలేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దైర్యంగా నిలబడి, ముందు సంగతేమిటని ఆలోచించడం అతని తత్వం. బహుశా శరీరంలో అస్వస్థత మూలంగా అలా మాట్లాడుతున్నారనుకొంది.
    "పోనీలే నాన్నా! వాళ్ళు కోరినంత సొమ్ము మీరిచ్చి నన్ను అత్తింటికి అంపకం పెట్టినా అటువంటి వాళ్ళ మధ్య నేనేం సుఖపదతాను? మీరు దీని గురించి మరేం ఆలోచించకుండా నిద్రపోండి. తెల్లారేసరికి వాళ్ళు రావడమో, ఉత్తరం రావడమో జరుగుతే అప్పుడు ఆలోచిద్దాం" అని అతన్ని సమాదానపరిచి వెళ్ళిపోయింది జానకి.

                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS