Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 3


    'అన్నీ బాగానే వున్నాయి. మన ఆస్తీ మన పూర్వపు పలుకుబడి ఆ ఊరు అయితే మీరన్నదంతా సబబే. వీర్ని కాదు సరికదా, ఇలాంటి మరో పదింతల మందిని కూడా నిశ్చయంగా కాపాడ గలిగుండే వాళ్ళం. అయితే ప్రస్తుతం మనకుంటుంబానికే చాలీ చాలకుండా ఇబ్బంది పడుతూన్న ఈ కష్తపు రోజుల్లో.'
    'మనకి మరో ఇద్దరు పిల్లలుంటే అప్పుడేం చేసుండేవాళ్ళం పార్వతీ . అలాగే వీరినీ అనుకుని మనకున్నంత లో వార్ని కాపాడాలి. దైవం మన కనుగ్రహించిన వో సదవకాశం పార్వతీ ఇదీ. మన ఔదార్యానికి వొక అగ్నిపరీక్ష వంటిదన్న మాట. అందుకని ఎన్ని అవాంతరా లోచ్చినా భరించి మనిద్దరం ధైర్యంతో వాటిని వెదుర్కుంటూ , ధైర్యంతో ఈ పరీక్ష లో మనం నెగ్గి తీరాలి. మన పిల్లల మాటెలా వున్నా, నువ్వు మాత్రం పరిపూర్ణంగా ఈ విషయంలో నాతొ సహకరించి తీరాలి తెలిసిందా?'
    'భక్తీ శ్రద్దలతో మిళితమైన చూపుల్తో తన అంగీకారాన్ని తెలుపుతూ తలూగించిందావిడ. విధి కృతం కొద్దీ, ప్రస్తుతం ధనంలో దైవం పేదరికాన్నిచ్చినా, తన భర్త ఔదార్య భావాల్లో మాత్రం ఏ పేదరికం కల్గనందుకు ఆనందంతో ఆవిడ హృదయం నిండిపోయింది.
    'నాకు తెలుసు నువ్వు నా మాట కెన్నడూ ఎదురు చెప్పవని. ఏదో కాస్తా కూస్తాగా ఆ పోస్టాఫీసు లో కూడబెట్టించిన మొత్తంతో ముందు ఆ పిల్లకి మంచి డాక్టరు వద్ద మందిప్పించి, ఆ తరవాత మిగతా విషయాలా లోచించాలి.' తనలో తనే అనుకుంటూ లేచి నాయన పెట్టెలో వున్న కొద్ది పాటి సొమ్ము తీసి జేబులో పెట్టుకుని మళ్ళీ బజారు వేపు వెళ్లారు. అయన బజార్నుంచి తిరిగొచ్చే సరికీ వంట పనీ పూర్తీ చేసేసి పిల్లలకి భర్తకీ ఒడ్డించేశారావిడ....
    'ఇవుగో జానకీ, పాపకీ, రేపటికి బట్టలు . మన ఇబ్బందులన్నీ ఆ పిల్లతో చెప్పి మరింత బాధ కల్గించక. ఉత్సాహమిచ్చే సంగతులేమన్నా చెప్తూ వుండు. మనం ఉన్నంత వరకూ తనకీ తన పిల్లకీ ఏవిధమైన లోపమూ రానివ్వమని ధైర్యం చెప్పు తెలిసిందా.'
    అని భార్యని హెచ్చరిస్తూ భోజనం ముగించి లేచారాయన ....ఈలోగా పాప లేచి నందున జానకి సంచీ లో వున్న పాలబుడ్డి తెచ్చి, శుభ్రం చేసి, పాలు పోసి, తాగించడం కోసరం పాపని తన ఒళ్ళోకి తీసుకున్నారు పార్వతమ్మ గారు. ప్రేమతో తలా, ఒళ్ళూ నిమురుతున్నావిడ పాప కాళ్ళ మీదికి చెయ్యి వెళ్ళేసరికి అదిరిపడి చూసి, కెవ్వున కేకపెట్టేశారావిడ.
    'అయ్యో దీని కాళ్ళూ చూశారా?' చచ్చుకుపోయి పైకేత్తుకు పోయినట్టున్న పాప ఎడం కాలిని భర్తకి చూపిస్తూ అన్నారావిడ.
    'నేనప్పుడే చూశా పార్వతీ! కష్టాలొచ్చినా, సుఖాలోచ్చినా వరస పెట్టి వస్తుండడం భగవంతుడి లీలలో ఇదోకటి.' శూన్యంలోకి చూస్తూ అన్నారాయన.
    'అయ్యో ఇదెక్కడి ఖర్మ తగిలిన వేలికే మళ్ళీ మళ్ళీ దెబ్బ తగల్చాలా ఆ మాయదారి దేవుడూ.'
    'హూ అప్పుడేగా ఎంతవరకూ అనుభవించవలసుందో' ఆ నేరస్తుడంత తీవ్రంగానూ బాధలనుభవించడం జరగడం .' ప్రజల్ని అదుపులో పెట్టేందుకేర్పడ్డ , నిదర్శనాలు ఇటువంటివన్నీనీ. పాపం చేసిన వారికి కష్టాలూ, పుణ్యం చేసిన వారికి అదృష్టవూ లాభిస్తాయనడం లో యదార్ధం ఏ పాటుందో అది మనకేవరికి తెలియకపోయినా, ఆ ఝుడింపులు మాత్రం అంతరీకంగానూ, బహిరంగం గానో , ప్రతివార్నీ కొంతవరకూ లొంగతీస్తున్నాయన్న మాట మాత్రం యదార్ధం. ఆ భావ ఫలమే పైకి కాదని దబాయించేస్తూన్నా అంతరీయంగా 'నువ్వు తప్పు చేశావ్' అంటూ మనసు మనల్ని దండిస్తూనే వుంటుంది. ఆయినా ఇందులో తమాషా ఏవిటంటే ఇన్ని అనుభవాలూ, చూస్తూ, స్వయంగా అనుభవిస్తూ వున్నా కూడా మళ్ళీ మనసంతా, అల్ప విషయాల్లో కూడా అజ్ఞానంలో పడి కాని పన్లు చేస్తుండడమే. పరిక్ష పేపర్ల ని కూర్చిన వారే, పరీక్ష లో తప్పు రాసినట్టు, ఈ ప్రవర్తన్లు గమ్మత్తుగా తోచడం లేదూ' అన్నారు విరక్తిగా నవ్వుతూ.
    మనసుకి గాయం పడ్డప్పుడే వైరాగ్యం యదార్ధ వైరాగ్యంగా పట్టుపడుతుందనడం లో ఎంతవరకూ నిజం వుందో తెలియదు గానీ శర్మ గారిచ్చిన ఈ పిల్ల ప్రసంగం విన్నాక పార్వతమ్మ గారికి మాత్రం. 'సరి. ఏదెలా జరిగినా అనుభవించడం తప్ప మనం చేయగల్గిందెం వుందిలే ?' అన్నటువంటి వో గొప్ప వైరాగ్యం , నిబ్బరం కల్గజేసింది.
    పాపను గురించే ఏకతాపత్రయ పడుతున్న రఘు 'పాపేం చేస్తుందో' అనుకుంటూ లోపలి కొచ్చి చూసి నిద్ర పోతూన్న పాపకి కప్పబోయాడు.
    'ఒద్దు బాబూ, అసలే ఇక్కడ ఉక్కగా వుంది....' అన్నారు చెంగుతో పాపకి విసురుతూ పార్వతమ్మ గారు.
    'పోనీ కాళ్ళ మీద మాత్రానన్నా కప్పమ్మా , లేకపోతె అందరికీ తెల్సి పోతుంది. ' అన్నాడు అక్కడిదేదో మహా రహశ్యంగా దాచుతున్నట్టు నోరూ, కళ్ళూ గుడ్రంగా పెట్టి, గొంతు తగ్గిస్తూ.
    'మనం మూత పెట్టినంత మాత్రాన్న దాగే సంగతా బాబూ ఇదీ' అన్నట్లుగా వైరాగ్యంగా నవ్వారావిడ.
    'వేణుతో కూడా చెప్పమ్మా ఎవ్వరికీ చెప్పొద్దనీ, లేకపోతె , అంతా తన్ని చూసి నవ్వుతూన్నందుకు అపాప పెద్డైయ్యాక ఎడవదూ పాపం?' అన్నాడు. ప్రేమతో పాప ఉంగరాల జుట్టుని సవరిస్తూ రఘు . అతని అభిమానం చూస్తె, ముచ్చటేసిందావిడకి.
    జానకి చూలింతగా వున్నట్టు తెలిసి ఒక వర్తకుల ద్వారా జానకికి పంపించేందుగ్గాను ఫలహారాలేవో చేస్తున్నారావిడ. ఒంట్లో కొంచెం అస్వస్తతగా వున్న రఘు, ఆవిడ పని చేసుకోనివ్వ కుండా అల్లరి పెట్టసాగాడు. చివరకావిడ ,మరి నువ్విలా అల్లరి పెట్టావంటే , మావయ్య కి పుట్టబోయే పాపని నీకిచ్చి పెళ్ళి చేయ్యర్లె' అంది, దాంతో మరింక పేచీ పెట్టలేదు రఘు.
    ఆ సంగతి గుర్తు రాగానే ఆ పాప కొచ్చిన లోపాన్ని తల్చి ఎంతో నొచ్చు కుందావిడ మనసు.
    'మీరింకా భోజనం చెయ్యలేదూ' అన్న శర్మ గారి హెచ్చరింపుతో ' దిగ్గున లేచి వెళ్ళి జానకిని లేపి ఇద్దరికీ ఒడ్డించారావిడ.
    'అబ్బా అప్పుడే ఎనిమిదయిందా? నిశ్చింతగా ఇలా నిద్రపోయి సంవత్సరం దాటి పోయిందోదినా?' అంటూ వెళ్లి కాళ్ళూ మొహం కడుక్కువొచ్చి విస్తరి ముందు కూర్చుంది జానకి. ఆ తరవాత ఏదో ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ పాప పక్కనే తనూ పడుకుని నిద్రపోయారు పార్వతమ్మ గారు...కష్టాల్లో మునిగి తేలుతూ ప్రాణం విసుగెత్తి పోయున్న కారణంగా నైతేనేం . చిన్నప్పట్నుంచీ బర్లాలో పెరిగి పెద్దదైన కారణం వల్ల నైతేనేం తలంటి పోసుకుందుకూ కొత్త బట్టలు కట్టుకుందుకూ పై పై లాంచనంగా అందరి చేత బతిమాలిడించు కోవడం, మురిపించుకోవడం ఇటువంటి వేషాలేవీ ఎరగని జానకి మర్నాటి ఉగాది పండుగ నాడు అందరితో పాటు తనూ మాములుగానే మసులుకుంది. అదీగాక స్వతహాగా ఒకర్ని నొప్పించడం అన్నది ఇష్టం లేని జానకి , తనలో చెలరేగుతుండే బాధని, ఎలాగో తనకి తనే లోలోపల ఉపశమనం చేసుకోవడమే తప్ప, తన బాధని అస్తమానం పైకి వెళ్ళబోసి అందర్నీ బాధించడం ఎప్పుడూ అలవాట్లేదు.
    అదీగాక శర్మ గారూహించినట్టు గానే బలహీనత ఒంటబట్టి క్షయ ప్రారంభమయ్యే సూచనగా కాక తగుల్తూన్నందువల్ల అదురుగుండే బెదురు గుండె అన్నట్టుగా ఇన్నాళ్ళ బట్టీ ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని కాలం గడుపుకొచ్చినందువల్లా, తన వాళ్ళంటూ ఒక ఆశ్రయం దొరికే సరికీ అంతతో తన బాధలన్నీ తీరిపోయాయన్నట్టుగా ఒక విధమైన స్థిమితం మనసు కేర్పడ్డం వల్ల తన ముఖ్య వసరాలకు పోను మిగతా కాలమంతా వో మూల పడుకునే వుండేది జానకి.

               

                               2
    
    రోజులూ , వారాలూ నెలలూ నడుస్తున్నాయి. శర్మ దంపతుల ధర్మాన మంచి  డాక్టర్ని ఏర్పాటు చేసి మందు లిప్పిస్తూన్నందునా కావలసినంత విశ్రాంతి దొరుకుతూన్నందునా అన్నింటి కన్నా ఆ కుటుంబమంతా తన యందు చూపు తూన్న అదరాభిమానాల వల్లా, క్రమేణా జానకి ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది. అయితే మానసికంగా ఆమెను బాధిస్తున్న మనోవ్యధ కారణంగా శరీరం మాత్రం బక్కచిక్కి అలాగే వుంది.
    అయితే చిన్నారి సుధ మాత్రం చక్కగా కోలుకుంటూ తన అట మాటల్తో అందర్నీ ఆనందింప జేస్తుండడమే గాకుండా చక్కగా పాడ్డం కూడా నేర్చుకోవడం అందరికి ఎంతో ఆశ్చర్యంగా వుంటూన్నా , కాలు సరిలేదన్న ఆ బెంగ అందర్నీ ఆ ఆనందాన్ని పూర్తిగా -- అనుభవించకుండా చేస్తుండేది.
    ఈ విషయంలో ఏ డాక్టర్ల నడిగినా ఆ అవిటి తనం పుట్టుకలోనే వుందో, లేక తరవాత సంక్రమించిందో తెల్సుకుంటేనే తప్ప ఏమీ చెప్పలేం' అనేవారు. పోనీ ఆ వివరాలు జానకి నడుగుదాం , అంటే ఈ కారణంగా ఆ గాధంతా కదలి అందు ఫలితంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జానకి ఆరోగ్యం మళ్ళీ దెబ్బ తింటుందేమో నన్న భయం కొద్దీ అందుకూ వెనక తగ్గుతూ వుండేవారు శర్మగారు.
    'అలా అని ఊర్కుంటే ఆలశ్యమైన కొద్ది సుధ భవిష్యత్తు కది ఎటువంటి తీర్చలేని సమస్యగా పరిణమిస్తుందో నన్న భయం పార్వతమ్మ గారికి. ఇలా ముందు కొస్తే నుయ్యీ, వెనక్కేళీతే గోయ్యీ అన్న సామ్యంలా బాధిస్తుండేది సమస్య. ఇలా యాంత్రికంగా జరిగిపోతున్నాయి పనులు.
    తన భర్త హెచ్చరిక నుద్దేశించి పార్వతమ్మ గారెంత జాగ్రత్తగా పైకి మసలు కుంటూ వున్నా తన తమ్ముడే అపాయానికి గురయ్యాడో ? వారి సిరంతా ఎలా మాయమైపోయిందో? మొదలైన వివరాలన్నీ తేల్చుకోవాలని ఆవిడ మనసు ఎంతైనా ఆరాట పడుతూనే ఉండేది. ఇక అనుదినం ఈ గుండెల్లో గుద్దులాటని భరించలేక , ఎలా ఈ ప్రస్తావన జానకి వద్ద తేవడమా అనుకుంటున్న పార్వతమ్మ గారు ఆరోజు మధ్యాహ్నం ఇద్దరూ 'చుక్కవంటి పిల్ల దీనికి లోటు ఎలా వచ్చిందో గానీ' అన్నారు ఒళ్లో కూర్చునున్న సుధ కాలు నిమురుతూ.
    'ఆ వివరం తెల్సుకోలేక పోయినందుకే వొదినా, నేనీ బాధ పడుతున్నదీని? అయితే 'అడవిలో అమ్మాలంటే' అన్న సామెత లాగ 'ఎక్కడి కెళ్ళి అడగాలో! ఎవరు దీనికి సమాధానం చెప్పగల్రో! అంతూ, పంతూ తెలిస్తేగా?' అంది. 'ఎప్పుడు తన బాధలన్నీ వారితో చెప్పుకుని ఈ గుండె బరువోదిలించుకోవడమా?' అని కనిపెట్టుకున్న జానకి .
    'నీ కూతురి సంగతి నువ్వెరక్కపోవడవేమిటి?' అన్నట్లుగా ఆశ్చర్యంగా చూశారు పార్వతమ్మ గారు.
    'అవునోదినా మరి అందరి లాగా పురుడు పోసుకోవడం అయితేగా ఆ సంగతులేవన్నా నాకు తెలిసోచ్చెందుకూ' అంది ఆవిడ చూపుల్లోని భావాన్ని గ్రహించిన జానకి శూన్యం లోకి చూస్తూ.
    'అదేవిటమ్మా?' అసలేం జరిగిందేమిటి?' అన్నారు ఆప్యాయంగా.
    ఆ నరక యాతన్లన్నీ మీతో చెప్పుకుని కాస్త స్థిమిత పడాలని ఎన్ని మార్లో ప్రయత్నించి మళ్ళీ మిమ్మల్ని బాధపెట్టిన దాన్నవుతానేమో నని మానేస్తున్నా వొదినా' అంది ఎటో చూస్తూ.
    'అదుత్త పిచ్చితనం జానకీ. కూడా పుట్టిన ఒక్కగానొక్క తమ్ముడు. వాణ్ణి గురించిన బాధ నా గుండెల్లో స్థిరంగా గూడు కట్టుకుని ఉండనే వుంటే నువ్వింక బాధ పెట్టడమంటూ ఏమిటి చెప్పు, చెప్పేస్తే నీకూ నాకూ కూడా కొంత తాపం తగ్గుతుందేమో' అన్నారు, నిద్రపోయిన సుధని పక్క మీద పడుకోపెడుతూ. తరువాత ఎవరి ఆలోచనల్లో వారు కొంతసేపు మౌనంగా వుండిపోయారు.
    'ఏదో అప్పుడన్నా, నీకా సుస్తి చెయ్యడం, అదే సమయానికి మా బావగారు అనవసరపు అల్లర్లతో మమ్మల్ని బాధించడం, అందువల్ల , 'పోనీ నీకూ మార్పూ, వాళ్ళకీ ధైర్యం ఓసారి ఆ దేశం చూసోచ్చినట్టూ వుంటుంది , వెళ్లిరా'మ్మంటూ మీ అన్నగారు బలవంతం చేసి పంపబట్టే ఆ విధంగా రావడం వాణ్ణి చూడ్డం జరిగింది. నాలుగు రోజులకి తిరిగి బయల్దేరుతా నన్నప్పట్నుండీ నా వెంటే తిరుగుతూ పసిపిల్లాడికి మల్లె బెంగ పడ్డాడు. తీరా ఓడ కదిలే ముందు 'వెళ్ళొస్తాన్రా. బాబూ' అనేసరికే ఎన్నడూ లేంది కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. నాకూ కడుపులో కలియ బెట్టి నట్టేదో బాధ.... ఏదో దూరా భారం లో వుండడం వల్ల అలా అనిపిస్తుందనుకున్నానే గానీ, అదే కడసారి చూపని అనుకోలేదు.' దుఃఖంతో ఆవిడ కంఠం పూడుకు పోయింది.'
    'అప్పుడే నాతో పాటు వచ్చేమన్నా, ఈ ముప్పు తప్పుండేదేమో ,' కళ్ళు ఒత్తుకుంటూ అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS