Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 3


    "చక్కగా నవ్వుతూ ప్రేమగా, గౌరవంగా సిగ్గుగా మాట్లాడాలి. నీ చూపుల్లో వెకిలితనం రాకూడదు. మన పక్కింటి రాజ్యలక్ష్మీ చూడు ఎట్లా ఉందొ, అట్లా ఉండటం నేర్చుకో.
    మర్నాడు మధ్యాహ్నం భోజనాలయాయి. బావ ఆఫీసు కు వెళ్ళారు. అమ్మ కాస్త నడుం వాల్చింది. అక్కయ్య పక్కింటి రాజ్యలక్ష్మీ గారింటికి వెళ్ళింది అక్కయ్య. మనస్తత్వం ఆవిడకూ అంతు పట్టలేదు. అందుకని ఏ అభిప్రాయానికి ఆవిడ రాలేదు.
    "మీవారు మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నవారే కదూ" అన్నది అక్కయ్య. ఆవిడ కోపం తార స్థాయికి వెళ్ళినా తమాయించు కుని
    "అవును" అన్నది.
    "వారంటే ప్రేమగా, నవ్వుతూ, సిగ్గుగా గౌరవంగా వుంటారా."
    "ఆ"
    "భర్తని అట్లా చూడాలంటే ఏం చెయ్యాలి."
    "ఏమీ చెయ్యక్కర్లేదు. మన మనస్సులో మెదిలే భావాలే మన చేత ఏ సమయంలో ఏం చెయ్యాలో అట్లా చేయిస్తాయి. నువ్వట్లా చెయ్యటం లేదా' నవ్వుతూ అడిగిందావిడ.
    "నాకు మనసులో భావాలెం మెదలటం లేదే' చనువుగా ఉంటాం కదా ఎవరి మీదో గౌరవం ఎందుకూ ఆయనేం పాఠాలు చెప్పే మాస్టారా. నమస్కారం అనేందుకు. ఎప్పుడు పడితే అప్పుడు కావలించుకోరాదెం.
    సునంద పెద్ద పిల్లని ఆవిడకూ అర్ధమైంది. పైకి నవ్వినా లోపల సానుభూతి లేకపోలేదు.
    "లేదమ్మా ప్రతి పనికీ సమయా సమయా లుంటాయి. ఆకలయిందనగానే, స్నానం చేస్తూ అన్నం తింటావా. ఏం చేసినా కాస్త అలోచించి చెయ్యాలి.'
    "భలేవారే , భర్తంటే నాకు గౌరవం లేక పోలేదు. రోజూ కాళ్ళకు దణ్ణం పెట్టి మంగళ సూత్రం కళ్ళకద్దుకుంటాను. మీరూ అట్లా చేస్తారా."
    లేదమ్మా, కాని అట్లా చెయ్యటం మంచిదే.
    "మంచిదయితే ఎందుకు చెయ్యరు. మీరు పతివ్రత కాదన్న మాట. నేను పతివ్రతా ని, పూర్వం పతివ్రతలు అట్లా చేసేవాళ్ళట.    
    ఆవిడ ఏం చెప్పాలో అర్ధం కాక నవ్వింది.
    "అట్లా చేస్తే పెళ్ళాడిన భర్త దృష్టి లో మనం తేలికయి పోతాం. మనల్ని వాళ్ళు లెక్క చెయ్యక ఆడిస్తారు. మనం కూడా వ్యక్తిత్వాల్ని కాపాడుకోవాలి. పాతివ్రత్యం ప్రవర్తన లో ఉండాలి. పర పురుషుడ్ని వాంచించకూడదు  ప్రేమాను రాగాలు నిత్య జీవితంలో దానంతట అది మనం మసులుకునే తీరులోనే ఉంటుంది కాని కాళ్ళకు దణ్ణం పెట్టి వెకిలిగా నవ్వి నంత మాత్రం చేత రాదు.'
    'బాగుంది, బాగుంది. ఇవాళ నుంచీ దణ్ణం పెట్టడం మానేస్తాను. ప్రేమగా మసులు కుంటాను."
    అని వచ్చేసింది రెండు రోజులు గడిచాయి అక్కయ్య బావ పాదాలకు దణ్ణం పెట్టటం మానేసింది. బావ అడిగాడు.
    "నేనూ తేలికయి పోతాను, అందుకని దణ్ణం పెట్టటం మానేశాను. ప్రేమగా మసలుకుంటాను."
    'అట్లా అని ఎవరు చెప్పారు."
    "పక్కింటావిడ"
    అమ్మ రోజూ దగ్గరుండి చెప్పి వంట చేయించేది. ఎంత దగ్గిరుండి చేయించినా వంటలో ఏదో లోపం జరిగేది.
    "సునంద కు వంట చెయ్యడం కూడా చేత  కాకుండా పెంచారేం అత్తయ్యా."
    "దానిచేతే చేయిస్తున్నాను. పదార్ధాల్లో ఏమైనా తక్కువైందా బాబూ.'
    "అవును, ఇన్నాళ్ళ నుంచీ మా నాన్నగారు లేరు. అయన మా ఊరెళ్ళి నెలయింది. రేపే వస్తానని ఉత్తరం వచ్చింది. ఆయనకు విసుగుదల జాస్తి. సునంద కు అన్ని పన్లూ జాగ్రత్తగా నేర్పండి. ఆ వెకిలితనం పోవాలి.'
    'అట్లాగే బాబూ' అన్నది అమ్మ. ఈ మాటలన్నీ అక్కయ్య విన్నది.
    "మీతో ప్రేమగా ఉండాలనీ ఎట్లా మసలు కోవాలా అనే ఆలోచిస్తున్నా. కూర లో రెండు సార్లు ఉప్పు పడ్డది. ఆ వ్యక్తిత్వం అంటే ఏమిటబ్బా."
    బావకు పట్టారాని కోపం వచ్చి "నీ బొంద , నా శ్రార్ధం" అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.
    ఆ మర్నాడు ఉదయమే అక్కయ్య మావగారు ఉమాపతి గారొచ్చారు. అయన పల్లెటూరి వ్యవహర్త. ప్రయివేట్లు చేస్తూ ఉంటాడు. పెళ్ళయిన నాలుగో రోజునే అయన వాళ్ళ ఊరెళ్ళి పోయాడు. కోడలు పరిస్థితి ఆయనకు తెలీదు.
    "పెళ్ళయిన నాలుగో రోజునే వెళ్లి పోయానమ్మా. ఏమిటో పల్లెటూరి వ్యవహారాలు. సరే, కాపురానికి వచ్చిన తరువాత ఇదే నిన్ను చూట్టం . ఈ పూలు పళ్ళూ తీసుకోమ్మా' అని బుట్టెడు పళ్ళూ, పెద్ద పూల పొట్లాం అక్కయ్య చేతిలో ఉంచాడాయన. "నమస్కారం , నమస్కారం. అత్తయ్య గారు పాపం పోయారటగా. ఆవిడ గారుంటే ఎంతో ప్రేమగా మిమ్మల్ని చూసుకునేది. భార్య లేని మావగారు మీరు.' అన్నది అక్కయ్య.
    అయన నిర్ఘాంత పోయి అక్కయ్య వైపు కళ్ళార్పకుండా చూసి, కొడుకు వైపు చూచి మాట్లాడ లేదుట.
    "నువ్వు నోరుమూసుకుని అవతలకు నడు" కోపంతో అన్నాడు బావ.
    "కాళ్ళకు దణ్ణం పెట్టడం మానేసినా నన్ను తక్కువగానే చూస్తున్నారు." అని వంటింట్లో కి వెళ్ళిపోయింది. అమ్మ నెత్తీ నోరు బాదుకుంది.
    అయన ఆరోజున ఆ ఇంట్లో కాఫీ కూడా తాగలేదు.
    "కోడలు ఇట్లా మాట్లాడుతోందేమీరా అబ్బీ.'
    "నా కర్మ. అందం చూసి మోసపోయాను. అది కోతి బుద్ది. మెదడూ ఉన్న అందాల రాశి. అమాయకురాలు . వెకిలి . మంచి చెడ్డలు తెలీవు." నెత్తి బాదుకుంటూ చెప్పాడు బావ.
    కొడుకు ముఖం చూసేసరికి ఆయనకూ కళ్ళ నీళ్ళ పర్యంతమైంది.
    "మోసపోయామా."
    'అవును అనుభవించక తప్పదు."
    సరే, నేను తిరిగి మన ఊరు వెళ్లి పోతాను. నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. అంతేకాదు మీ అత్తగార్ని కూడా పంపెయ్యి. నువ్వు రెండు మాసాలు సెలవు పెట్టు. ఆ పిల్లను నువ్వే కాపాడి మనిషిగా చెయ్యి. అప్పటికీ మారకపోతే ఇంకొంచెం ముందుకు వెళదాం." అని సలహా యిచ్చాడాయన.
    ఆ మర్నాడే అమ్మ వెళ్లి పోయింది. బావ సెలవు పెట్టారు. ముందు పదిహేను రోజులే సెలవు పెట్టారు.
    మరో ఆర్నెల్లు గడిచాయి. నేను టెన్త్ హయ్యరు ప్యాసయ్యాను, వయస్సు కూడా పద్దెనిమిది పడింది.
    ఒకరోజున ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది.
    ఆరోజున మా ఇంటికి ఒక స్కూల్ మేష్టారు వచ్చారు. ఆయనా సెకండరీ గ్రేడ్ టీచరు. మాకు తెలియక పోయినా మా నాన్నగారికి బాగా పరిచయస్తులు. మా అక్కయ్య పెళ్ళికి కూడా అయన వచ్చాడు, వచ్చాక వాళ్ళ టీచర్ల సమస్యలూ, జీతాల సంగతే మాట్లాడుకుని "ఒకసారి మీ రెండో అమ్మాయిని పిలవండి' అన్నాడు. నాన్న నన్ను పిలిచారు. భయపడుతూనే ఎందుకోనని వెళ్లాను.
    "నీ పేరేమిటమ్మా ' అన్నాడు. చెప్పాను.
    మా తమ్ముడు జనార్ధనరావు. వాడూ బి.ఎ, బి.ఇడి టీచరు. నువ్వు వాడికి యెట్లా తెలుసో నాకు తెలీదు. నిన్ను ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటాట్ట. అందుకనే వచ్చాను" అన్నాడు.
    నాకు మతి పోయింది. నాన్న విభ్రాంతి తో చూశాడు. అంతేకాదు ఆ అబ్బాయితో నాకెట్లా పరిచయం అని ఆలోచించాను. ధైర్యం తెచ్చుకున్నాను.
    "ఆ జనార్ధనరావు గారెవరో నాకు తెలీదండి. నేను ఆయనకు యెట్లా తెలుసో అదీ తెలీదు, నేను టైప్ ఇన్ స్టిట్యూట్ కు వెళ్లుతున్నప్పుడు మీ రోడ్ సైడ్ రోమియో గారు చూసి అంత ఘాటుగా నన్ను ప్రేమించారేమో తెలీదు. క్షమించండి." అని అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాను.
    అయన మనసుకు కష్టం కలిగిందేమో నాకు తెలీదు. ఆ ప్రస్తావన చాలించి కాసేపు నాన్నతో మాట్లాడి వెళ్ళిపోయారు. అయన వెళ్ళాక నాన్న నా దగ్గరకు వచ్చారు. అమ్మా, అక్కయ్యా అక్కడే ఉన్నారు.
    "ఏమ్మా అట్లా మాట్లాడావ్. అక్కయ్య ను చూస్తుంటే ఆ దిగులుతో నాకు నీ పెళ్లి మాటే గుర్తు రాలేదు. నాకూ పెళ్లీడు కొచ్చిన రెండో ఆడపిల్ల ఉన్నది. దానికి పెళ్ళి చెయ్యాలి అనే భావమే ఇంతవరకూ కలగలేదు. ఇవాళే ఈ సందర్భంగా గుర్తొచ్చింది. సరే, ఆ జనార్ధనరావు నీకు తెలుసా" అన్నాడు నాన్న.
    నా విషయం లో నాన్న కూడా ఇట్లా అంటున్నారేమా. అనుమాన పడుతున్నారేమా అని మనస్సు లో బాధపడ్డాను.
    దైవసాక్షి గా అతనెవరో నాకు తెలీదు నాన్నా. అసలా ఉద్దేశ్యమే నాకు లేదు. నాకున్న ఉద్దేశ్యం ఉద్యోగం చెయ్యటం ఒక్కటే. అదే నా ధ్యేయం. నిన్నటి పేపర్లో క్లర్కు పోస్టులకీ, టైపిస్ట్ పోస్టుల కీ సర్వీస్ కమిషన్ పరీక్షల నోటిఫికేషన్ వేశారు. పది రూపాయల ఫీజు కడితే టైపిస్ట్ సెలక్షన్ పరీక్ష కు వెళతాను. దైవం చల్లగా చూస్తె సెలక్టు కాగలననే నా నమ్మకం.' అన్నాను.
    నాన్న ముఖంలో వెల్లి విరిసిన ఆ ఆనందం నాకిప్పటికి కళ్ళకు కట్టినట్లే ఉన్నది. సంతోషంతో కళ్ళు తుడుచుకుంటూ "సరేనమ్మా నీ ఇష్టం" అన్నారు. "అదేం వీల్లేదు . సుధా కి పెళ్లి చేయాల్సిందే. మొగుడు ఎలుకోక పొతే ఏం నువ్వు ఇక్కడే ఉందువు గాని , పెళ్ళయితే చక్కగా కొత్త చీరలు, పట్టు చీరెలు, మంగళ సూత్రాలూ , నల్ల పూసలు , మట్టెలు, చంద్ర హారం అన్నీ వస్తయ్యి. నా మెడ చూడు ఎంత నిండుగా ఉందొ" అన్నది అక్కయ్య. నుదురు తుడుచుకుంటూ వెళ్ళారు నాన్న.
    సర్వీస్ కమీషన్ పరీక్ష కు ఫీజు కట్టాను. జనరల్ నాలెడ్జి పుస్తకాలు కొని చదివేదాన్ని. ఏమిటో ఆరాటం , ఏదో దిగులు , ఏదో సంతోషం.
    పరీక్ష కు వెళ్లి వచ్చాను. పాసయినట్లే అనిపించింది. మరో ఆర్నెల్లు గడిచాయి. ఒకరోజున నా పేర రిజిస్టర్ పోస్టు లో కవరు , గుండెలు దడదడ లాడాయి. సంతకం పెట్టి కవరు తీసుకుని మనస్సు లోనే ఆ కళ్యాణ చక్రవర్తి కి నమస్కరించి కవరు చించి కాగితం తీసి చదివాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS