Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 3


    'ఎవ్వరూ మీ మాట వినరు సరికదా యింకేం చేస్తారో చెప్పలేం బాబూ?'
    'సరే చూస్తాను.'
    'అంతపట్టు పట్టకండి బాబూ-- ఈ సరికి యిలా నడుస్తున్నారు. రేపు పరుపు నించి దిగలేరేమో ? అప్పుడు తమకి యీ మాటలు రావు. మామూ పిల్లలుగలోలం -- గవర్నమెంటు యిచ్చింది బియ్యం గింజలకే రావు. ముందుగా తీసుకోక పొతే యేయిదాన యేలి పోయినా రాబెట్టు కోలెం మేం బతకడానికి మీలాంటి కష్టాలు పడినోల దగ్గరే గుంజుకోవాల. సూడండి మరి. సుఖంగా వున్నన్నాళ్ళూ ఆ శెట్టి గారు యెంగిలి సేత్తో కాక్కి పెట్టలేదు. కష్టం రాగానే యేలు యిరజిమ్ముతున్నాడు. ఆడే సరుకులు సవగ్గా యిచ్చుంటే యిప్పుడింత గుంజేవాళ్లమా? మేం లంచం అడగే అడగం. మీలాగ జీతాలు పెంచండి. మీ పెళ్ళాం పిల్లలంతైనా వద్దు. అందులో సగం ఖర్చు మా కివ్వండి. ఒక్క పైసాకి సెయ్యి సాపితే వొట్టు.'
    ఇంత పెద్ద ఉపన్యాసం లో నిజానిజాలు ఆలోచించు కుంటూనే సూర్యం 'రేప్రోద్దున్న కనపడు ' అన్నాడు.
    'అలాగే బాబూ! కష్టం తెలిసిన బాబూలా వున్నావు.'
    సూర్యం వెళ్ళిపోతున్నవాడ్ని పిలిచి 'నువ్వు సేవ చేస్తున్నందుకు యివ్వలేదు. మీ కడుపు విషయం బాధ పెట్టిన వాడిలో నేనొక్కడ్నని యిస్తున్నాను.'
    'ఎలాగో ఒకలాగ యియ్యి బాబూ' అంటూ వెళ్ళిపోయాడు.
    వీడు వీళ్ళ లీడరు లా వున్నాడనుకున్నాడు, సూర్యం , అనుబంధాల గురించే మళ్ళీ ఆలోచించు కున్నాడు. ఈ సంఘం ఒక మెడ అనుకుంటే కలవారంతా ఆ యింటి కప్పు వంటివారు. గోడల్లో యిటికల్లా ప్రతి మనిషి అవసరం ఏడో ఒకటి వుంటుంది. ఏ యిటిక రాలినా కప్పు కూలే అవకాశం వుంది. అంతస్తులున్న మేడకు పునాదులు వీళ్ళే. అది గమనించని నాడు పునాదులు బలహీనమౌతాయి. మేడ కూలిపోయే అవకశం వుంది. నిద్దర పట్టక పోవటం వలన సూర్యం యేవేవో ఆలోచించు కున్నాడు. ఇంతలో యెవరో కెవ్వున కేకవేసారు. తరవాత వర్శదారలా యెపుడు వినిపించింది. లేచి ఓ క్షణం శ్రీనివాస్ దగ్గర వున్నాడు. శ్రీనివాస్ తెలివి లేకుండా పడి వున్నాడు. ప్రక్క గదిలో డ్యూటీ డాక్టర్ , నర్సు ఏదో మాటాడు కుంటున్నారు. కాస్సేపయ్యాక వరండా లో నుంచి ఒక శవం మోసుకు పోతున్నారు. శెట్టి గారికి తెలివి వున్నా రెండో వేపు తిరిగిపోయాడు. ఎదురుగా మంచం వివిధమైన ఆకారాలతో అగుపించింది. వాని పై యెవరో కూర్చున్నట్లు అనిపించింది. నిదర పోడానికి ప్రయత్నించాలని తన మంచం మీదకు వచ్చేసాడు. ఒళ్ళంతా కప్పుకుని ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఈ పరుపు మీదా యెందరు చచ్చి వుంటారో, ఒక్కొక్కడి జీవితం ఒక గ్రంధం కాగలదన్న వూహ రాగానే మనసులో కాస్త పిరికి ఆవరించింది. కడుపులో కొద్దిగా నొప్పిగా వుంది. జబ్బులు చెప్పి రావు ఒకోసారి చిన్న జబ్బే సడన్ గా వచ్చి ప్రాణం బలి గొంటుంది. మనిషి యే అవయవాలను నమ్ము కుంటాడో, యేవి తన స్వంతం అని విర్ర వీగుతాడో అవే చెప్పినట్లు వినవు. అలాంటప్పుడు తన క్రింద ఉద్యోగులు, పైనున్న వాళ్ళు, చుట్టూ వున్న సంఘీయులు తను చెప్పినట్లే వినాలనటం చాలా హెచ్చు కాంక్షించటమే అవుతుంది.
    ఇలా జీవితంలో తను యెన్నెన్నో యెదుటి వారి దగ్గిరి నించి కాంక్షించాడు. పిరికి నించి మనసు మళ్ళించడానికి మంచి మంచి విషయాలు ఆలోచించడానికి ప్రయత్నించాడు. మనసు ఎంతో సంతోషంతో నిండడానికి స్వచ్చమైన పాలలాంటి చిన్ననాటి జీవితం, పానకం లాంటి ప్రేమతో వుప్పొంగిన యౌవ్వనం లోని ఘట్టాలు తలచుకోడానికి ప్రయత్నించాడు. పాలులో ఓ మజ్జిగ చుక్క పడి విరిగిన రోజులు, పానకం లో పుడకలు బయలుదేరిన దినాలున్నాయ్. ఐనా తలచుకోకుండా ఉండ లేకపోయాడు.
    సూర్యం తన తండ్రి తరవాత ఆ కుటుంబం లో తోలి మొగ బిడ్డ. అతని పుట్టుక ఆనందాన్ని వెదజల్లింది. ఆశలను రేకెత్తించింది. అతనిని వంశోద్దారకుడన్నారు. పితృలకు పిండాలు పెట్టి ఋణం తీరుస్తాడన్నారు. అంత జరుగు బాటున్న యిల్లు కాకపోయినా, నిజాయితీ కి పేరు పడ్డ కొంప. ఆ చుట్టూ పట్ల చదువుకు గుత్త కొన్న యిల్లు. ఎవరికే సలహా కావాలన్నా, యే సందేహం తీర్చుకోవాలన్నా , మంతనాలాడాలన్నా , కార్యాలు చెయ్యాలన్నా సూర్యం తాత దగ్గరకు రావలసిందే. సూర్యం బాలునిగా చాలా ముద్దుగా తాత చేతిలో పెరిగాడు. తల్లి కన్నా మిన్నగా చూసాడు. ఒకో రాత్రి పాలు చాలక ఏడుస్తుంటే రాత్రి మీద యే దొడ్లో దూడనైనా విప్పి పాలు పితికి మరీ తెచ్చేవాడు. ఆ మరుచటి రోజు ఉదయం 'మా మనమడి కోసం యిలా చేసాను రా' అని కబురు పెట్టేవాడు. అతని వలన ఆర్ధికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా వుపకారం పొందిన వాళ్ళ వటం వలన యెవరూ యేమీ సంకోచించే వారు కాదు.                                    

         

                                    2
    సూర్యం కు తాతయ్య తో గడిపిన రోజులు కొద్ది కొద్దిగా జ్ఞాపకం వున్నాయ్. అతను యెలుగెత్తి శ్రావ్యంగా పద్యాలు వల్లించటం, తన చేత కూడా బలికించటం , బొమ్మలాట లో రావణాసురుడ్నీ అతని ఒడిలో కూర్చొని చూడటం, గంగిరెద్దులు వస్తే ఆ యెద్దు మీద కూర్చుంటానని మారాం చెయ్యటం, విమానం యెగిరి పోతుంటే వింతగా ప్రజలు విరగబడి చూస్తుంటే అది కావాలని ఏడవటం , యేటి వేపు పరుగెత్తి దూక పోతుంటే యెవరో అడ్డు కుంటే వాళ్ల చెయ్యి కరవటం! తాత ప్రక్కన పడుకోవటం తాతయ్య తనను నిద్ర పుచ్చడానికి కమ్మగా జోల పాటలు పాడటం-- రామాయణ , భారత గాధలు చెప్పడం -- ఇలా యెన్నో జ్ఞాపకం వున్నాయ్. అంతా తాతయ్యే తనకు. తాతయ్య నిత్యం, సత్యం లా ఆ చిన్ని మనసులో హత్తుకు పోయాడు. ఇంకా యెన్నెన్నో తాతయ్య నేర్పుతాడు. ఆచరిస్తాడు. అంతా తన కోసమే బ్రతుకుతున్నట్లు , అంతా తనదే ననట్లు సూర్యం లేత హృదయం ఉరకలు వేసింది.
    ఆ చిన్ని హృదయం ఒకరోజు ఉదయమే చివుక్కు మన్నది. సృష్టించు కున్న బొమ్మల ప్రపంచం చిందర వందరైంది. ఆశల ఆకాశం కూలిపోయింది. ఆనందం ముద్దంతా కరిగి కన్నీరైంది. తను తింటున్న తిండి వేపు , నడుస్తున్న నేల వేపు , చుట్టూ వున్న ప్రకృతి వేపు, తన బంధవులు , ఆత్మీయుల వేపు, తోటి ప్రాణుల వేపు , చివరకు తన వేపు తనే సంశయంతో చూడ సాగెడు. వెన్న ముద్దలాంటి తన మనసులో తాతయ్య చావు చేదు కలిపింది.
    శరీరంలో యే భాగానికి దెబ్బ తగిలినా మళ్లీ అటుక్కున్నట్లు మానసు కూడా అతుక్కొడానికి ప్రయత్నిస్తుంది. కాలం మరుపు మందుతో గాయపడిన మనసులను కుడురుస్తుంది. కొత్త అనుభూతుల ఆహారంతో మనసును పోషించి కోలుకోనిస్తుంది. మనసు కడుపు లాంటిదే. ఆహారం కోసం కడుపులా, ఆలోచనల కోసం మనసు యెదురు చూస్తుంది. వయసు పెరుగుతున్న కొద్ది సూర్యం లో ఆలోచనలూ పెరిగాయ్. బంగారం ముద్ద కరిగి  ఆభరణం తయారు చేస్తున్నట్లు, చదువు తన మేధస్సును పొంగించి తనకో ఆకారం యిస్తోంది. ఇది యీ వస్తువు అన్నట్లు సూర్యం సుజనుడు అనే పేరుతొ పిలవాలన్న భావం అతనిలో ప్రాకింది.
    తాతయ్య చిన్ననాట చెప్పిన గాధలు పద్యాలూ అన్నీ జ్ఞాపకం లేవు. జ్ఞాపకం వున్నవాటిలో తలచుకుని అనుసరించాలని ప్రయత్నించడం ఒక విషయంలో జరిగింది. 'బంతిలా సుజనుడు క్రిందపడి మరల మీదికి లేస్తాడు --' తను మట్టి పిండం కాకుండా బంతిలా త్రుళ్ళాలని కోరిక చిన్ననాటే కలిగింది. బయట అతను బంతిలా గెంతే కుర్రాడు కాదు. అతని మనసులోనే త్రుళ్ళాడు. స్వతహాగా సిగ్గు, నలుగురు మధ్యలో మౌనం, మూకకు దూరంగా వుండటం , ఒంటిగా కూర్చుని ఆలోచనల బంతిని మనస్సులో తన్నుకుంటూ గడపటం సరదా హాయినిచ్చేది.
    తన గ్రామంలో నిత్యం నూతనంగా కనిపించేది యేరు. చిన్నారి కళ్ళతో అది బొబ్బలు పెట్టుకుంటూ పోయే పరుగూ, ఆ ప్రవాహపు టత్తేజం చూసాడు. ఆ చెవులతో నదీమ తల్లి పరవళ్లు త్రొక్కుతూ చేసిన ఘీంకారం విన్నాడు. ఆమె వేసవి వెన్నెల్లో మెల్లగా గజ్జలు కదుపుకుంటూ సంగీతం అలాపిస్తూ పోతుంటే తిలకించాడు. పచ్చని పైరు పొలాలు బంగారం పండించి బరువుతో తలలు వాల్చగా నిర్దాక్షిణ్యంగా కరుకు కొడవళ్ళ తో కొయ్యటం చూసాడు. బాల్యంలో యేనేన్నో చూసాడు. ఎన్నో మరిచిపోయాడు. కొన్నే జ్ఞాపకం వున్నాయ్. అలా మరిచిపోవడం వలెనే కామోసు బాల్యం బాధ్యతలు లేనిదై పోయింది. ఇప్పుడు బాల్యం లో చూసిన యేరు , ప్రకృతి , పచ్చని పంట పొలాలు, ఆకాశం, ,మేఘాలు , వర్షం, యెండా, నీడా మళ్లీ చూడగానే మరిచిపోలేని అనుభూతుల నిస్తున్నాయ్. ఇదివరకు కళ్ళు వీటి బాహ్యాన్నే చూసేవి, మరిచి పోయేవి ఇప్పటి కళ్ళు వీటి హృదయాలతో తన హృదయానికి తీగలు వేస్తున్నాయ్.

 

                               
    ఆహారంతో శరీరం పెరుగుతూ ఆలోచనలతో అతని మనసూ పెరగజోచ్చింది. తృష్ణ వెలిగి నాలుగు ప్రక్కలా కాంతిని వెదజల్లింది. ఇదివరకు ఈ మొక్కకు వున్న కంచే యిప్పుడు మొక్క పెరగ్గానే అవసరం లేకపోయింది. వయసు వచ్చిన చెట్టు చిన్ననాటి ఆకులను రాల్చకుండా వుండదు. ఆకులూ రాల్చి కొత్త చిగుళ్ళ ను మొలి పించడం తో సరిపోదు! యౌవ్వనం పూలను సృష్టిస్తుంది. వాసనలను వెదజల్లు తుంది. పూలు కాయలౌతాయ్, కాయలు పళ్ళై రాలుతాయి. రాలిన పండు సాంధుడికి తృప్తి నిచ్చి సంతతిని వృద్ది చేస్తాయ్! తను యౌవ్వనం తో మొగ్గలు దొడిగిన చెట్టులా నున్నాడు. అతని చదువులో కూడా గుబాళింపు కనిపోస్తోంది. ఒంటిగా యేటి ఒడ్డున కూర్చున్న తనకు గజ్జెల రవళులు వినిపించలేదు. ఏటి గతం జ్ఞప్తి కి తెచ్చుకుంటున్నాడు. దానినో యమునా నదీ తీరం అనుకున్నాడు. వేలాది ఏళ్ళ వెనుకకు తన వూహలు పోయాయ్. తనో శంతన మహారాజులా వూహించుకున్నాడు. 'సత్యవతి వేపు రెప్ప వెయ్యకుండా చూస్తూ నుంచున్నాడు, మహారాజు. సుగంధమే సుగంధం. దాన్ని మించినట్టుంది అందం. పదారో వన్నె బంగారం పనికి రాదంటున్నది శరీర కాంతి. పూల తీగలా నవనవలాడుతోంది దేహం. బెదిరిన లేడి పిల్ల కళ్ళలా వున్నాయి నేత్రాలు. చిరునవ్వుతో వెన్నెల కాస్తోంది మోహం. మతిపోయినట్టు అయింది మహారాజుకి.'
    ఇలాంటి ఆలోచనలతో సూర్యం కు మతి పోయేది. అంత అందగత్తె ను పొందాలన్న కోరిక వెనుక అంత బాగా ఆడదాన్ని వర్ణించగల వూహకూడా కావాలన్న కోర్కె కలిగింది. ఊహల్లో యెన్నో అందాలు తోణికిసలాడేవి. ముసుగు దీసి చూస్తె చందమామ ఒక కాంతలా, గడ్డి పూచ ఒక యౌవ్వని లా, నీటి బిందువు ఒక స్త్రీలా కూడా కనపడేవి. ఓ ఆధునిక కవి అలాపనను మననం చేసుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS