Previous Page Next Page 
వంశాంకురం పేజి 3

 

    "ఏం చెప్పింది?" ఆత్రంగా చూచాడు.
    "మీరు మొన్నటి వరకు మద్రాసు లోనే ఉన్నారని, పది రోజుల క్రితమే ఈ గది ఖాళీ చేశారని." ఆమె నవ్వే ముఖము లోకి మరోసారి చూచాడు. అతని ముఖములోని రంగులు మారాయి. ఆమెకేం అర్ధం కాలేదు. నెమ్మదిగా ఆమె తలను దిండు పైకి చేర్చి బాల్కనీ లోకి వెళ్ళిపోయాడు. అసలు సంగతి కనుక్కోవాలని లేచింది. వెంటనే వివేకము మేల్కొంది. అతన్ని ఎమడగాలి? తనూహించలేదా? అందమైన రేయి . నూతన దాంపత్యము. అతని కెన్నో కోర్కేలుంటాయి. అతనలా ఉద్రిక్తుడగుటలో సందేహము లేదు. అలాగే వెనక్కు వాలింది. కడుపులో సన్నగా సలుపుతూనే వుంది. చాలా సేపటికి సిగారేటు వాసన గుప్పుమంది. దానిని బట్టి అతను వరుసగా సిగరెట్టు వెలిగించాడని తెలిసింది. తను మేల్కొన్నట్టు తెలిస్తే కసురు కుంటారని కళ్ళు మూసుకుంది. అతను నిట్టూర్చడం వినిపించింది.
    మరో వారం రోజులు ఆనందంగా గడిపింది. బెంగుళూరు లో నాలుగురోజులు ఉండి వద్దామని ఆనంద్ ప్రస్తావించాడు. ఆమెకు అయిష్టంగా ఉన్నా అంగీకరించింది. అన్నీ సిద్దమయ్యాయి. సాయంత్రం బండి ఉంది. నాల్గుగంటలకు సన్నగా ప్రారంభమైన కడుపు నొప్పి , రాను రాను విపరీతంగా మారిపోయింది. ఈసారి డాక్టరు ను పిలువవలసి వచ్చింది. అతని పేరు వింటూనే ఆమె వణికి పోయింది. అతను వచ్చాడు. ప్రశ్నించే విధానము చూచి చలించి పోయింది. అవును, కాదు అని జవాబు చెప్పలేక పోయింది. అతను కొన్ని మందులు వ్రాసి యిచ్చి, ఆనంద్ ను అవతలికి పిలుచుకొని వెళ్ళిపోయాడు. తన జీవిత భాండము పగిలిపోయే సమయ మాసన్నమయిందని గడగడ వణికి పోయింది. దగ్గరగా నిల్చున్న అత్తగారి చేయి పట్టుకుని విలపించింది.
    "ఊర్కో తల్లీ, చక్కగా ఆరోగ్యంగా ఉన్న నీకు ఇదేం కర్మ!" ఆమె ఓదార్చింది. చాలాసేపటి కి గంబీర వదనుడై ఆనంద్ తిరిగి వచ్చాడు. అతడిని చూడలేక కళ్ళు మూసుకుంది.
    "అబ్బాయ్! మీ మామగారికి టెలిగ్రామివ్వరా , తరువాత మాకు చెప్పలేదని నిష్టూరం వేస్తారు." సరస్వతమ్మ చెప్పింది.
    "అంత గాభరా దేనికి? వారికి తెలుసు." అన్నాడు. ఆమె హృదయం కంపించసాగింది. అత్తా, మామా గది వదిలాక కూడా కళ్ళు విప్పలేక పోయింది.
    "ఏడుగంటలకి మాత్రలు వేసుకోమ్మన్నారు డాక్టరు లే." అతను లేపాడు. కళ్ళు వాల్చి, మాత్రలు అందుకుంది.
    "అన్నం తెప్పించనా, పాలా?"
    "నాకిప్పుడెం వద్దు. మీరు భోజనము చేయండి." అతనేం జవాబు చెప్పలేదు. ఆలోచిస్తూ పై కప్పు కేసి చూడసాగాడు. సిగరెట్టు వెలిగించాడు. అతను రాత్రంతా అలా పడక కుర్చీ లో గడపటము చూచి బాధపడింది. సాహసించి ఒక్క మాట మాట్లాడలేక పోయింది. నాల్గురోజులు అతి మందంగా గడిచాయి. అతను, ఆరోజు డ్యూటీ లో చేరాలని తయారవుతుండగా సరస్వతమ్మ వచ్చింది.
    "అబ్బాయ్! డాక్టర్ అనే మాట విన్నవురా!" ఆమె గొంతు వణికింది.
    "ఏమన్నారు?"
    "అరుణకి నొప్పి వ్యక్తురాలయిన దగ్గర నుండి ఉందంటాడు. ఫోటో తీయించాలని అంటున్నాడురా."
    "అతను అబద్దము దేనికి చెప్తాడు!" అతని మాటలు విని ఆమె వంకకు తిరిగింది , నేరస్తురాలి వలె తల వంచుకుంది.
    'అరుణా నీకీ నొప్పి మొదటి నుండి ఉందా?'
    "ఊ..." అతి ప్రయాస పై అనగలిగింది. ఆమె ముఖము ఎర్రబడింది. కోడలి వంక తీక్షణంగా చూచింది. ఆ చూపులు భరించలేక తల దిండులో దూర్చింది.
    "అయితే మాకెందుకు చెప్పలేదు" నాకు ఒక్క కొడుకు. వాడిని గూర్చి యెన్నో కలలు కన్నాను. చెప్పు మా కెందుకు చెప్పలేదు. మా జీవితాలతో ఆటలాడే హక్కు మీకెవరిచ్చారు?' సరస్వతమ్మ , కోపముతో , ఆవేశముతో వణికి పోయింది.
    "ఊర్కో , ఆ పిల్లకేం తెలుసు. పెద్దవారు మోసము చేశారు" రంగారావు గొంతు అది.
    "ఎవరూ మోసము చెయ్యలేదు నాన్నా, మన దురాశ . మనలాంటి మామూలు కుటుంబీకులే లక్ష రూపాయల కట్నము ఇస్తున్నారంటే, ఏదో ఉందని ఆలోచించలేక పోయాము." ఆనంద్ గొంతు , పదముల సవ్వడిని బట్టి వారంతా గది వదిలి వెళ్లిపోయారని తెలిసింది. ఒంటరిగా ఎంతసేపు ఏడ్చిందో!
    ఆఫీసు నుండి వచ్చి ఆనంద్ మామూలుగా పలుకరించి బయటికి వెళ్ళిపోయాడు. మేడ మీదికే అన్నీ మోయించుకోవటము సమంజసముగా తోచలేదు. నెమ్మదిగా మేడ దిగింది. సరస్వతమ్మ వంటపనిలో లీనమయింది. హల్లో వస్తువులు ఎక్కడవక్కడ పడి వున్నాయి. దాన్ని బట్టే తెలుసుకోవచ్చు సరస్వతమ్మ యెంత విచారించిందో. అవన్నీ నెమ్మదిగా సర్దిపెట్టి అత్తగారి దగ్గరకు వచ్చింది. పోపుల డబ్బా మూత తీయాలని ప్రయాస పడుతున్న ఆవిడ కోడలు వంక రెండు క్షణాలు చూచింది.
    "మేడ యెందుకు దిగావు? నొప్పి తగ్గిందా?"
    "తగ్గింది....మేడపై ఒంటరిగా భయము వేసింది. ఎంత సహజంగా చెప్పబోయినా గొంతులో ఏడుపు జీర వినిపించింది. ఆమె డబ్బా క్రింద పెట్టి వచ్చింది. కోడలిని హృదయానికి హత్తుకుంది.
    "అరుణా! నన్ను క్షమించు తల్లీ. ఆవేశం లో నీ మనస్థితి గ్రహించలేదు. పసిదానివి నీ తప్పేం లేదు, ఊర్కో కళ్ళు ఎలా వాచాయో." ఆమె అలా ఊరడిస్తుంటే కన్నీరు కాల్వలయి పారింది.
    "ఊర్కో మరి" చాలా సేపటికి తేరుకుంది. ఆవిడ వంట ముగించి వచ్చాక కోడలికి జడ వేసింది. విరగబూచిన సన్నజాజులు మాల కట్టి పెట్టింది. ఆమె కోర్కె పై కాసేపు, వచన భాగవతం చదివి వినిపించింది.
    'అమ్మా! త్వరగా వడ్డించు, సెకెండ్ షో సినిమా ప్రోగ్రాం వేశారు. రాజు కారు తీసుకుని వస్తాడు, బయట నుండే అరుస్తూ వచ్చాడు ఆనంద రావు. భార్య నక్కడ చూచి ఆశ్చర్యపోయాడు. అరుణ పుస్తకము మూసి వేసింది.
    "నువ్వెళ్ళి వడ్డించమ్మా" అత్తగారు కళ్ళజోడు సవరించుకుని తెలుగు పేపరు తీసుకుంది. వెళ్ళి పీట వాల్చి అన్నీ పెట్టింది. అతను కూర్చున్నాక వడ్డించబోతుంటే చేతులు వణికాయి.
    "అరుణా! అంత భయం దేనికి? నేను రాక్షసుడినా!" అతని మాటలకు తల ఎత్తాలని ఉన్నా తన కన్నీరు బయట పడరాదని , పెరుగు తెచ్చే నెపంతో లోపలికి వెళ్ళింది.
    "అది వంటరిగా అర్ధరాత్రి వరకు ఆలోచనలతో గడుపుతుంది. తీసుకెళ్లరాదూ! అత్తగారి మాటలు వినిపించాయి. పెరుగు తెచ్చి అక్కడ పెట్టింది.
    "త్వరగా తయారవు. ముస్తాబు అంటూ మూడు గంటలు కూచోకు. మొదట అన్నం తిను" ఎలాగో రెండు ముద్దలు తిని తయారయి రాగానే బయట కారు హార్న్ వినిపించింది. ఇద్దరూ బయటికి వచ్చారు. రాజు నవ్వుతూ దంపతులను వేళాకోళము చేశాడు. సినిమా హాలు దగ్గర చాలా మంది కలిశారు. సందడిగా గడిచిపోయింది. వచ్చేటప్పుడు రాజు మరో దంపతులను తీసుకు వెళ్ళాడు. ఆవిడ గర్బవతి అందుకే ఆనంద్ టాక్సీ తీసుకున్నాడు.
    "ఏమిటరుణా అంత మౌనంగా వున్నావు?
    "మీరు కారు కొనకూడదండీ? అన్నది అతని భుజము పై తల వాలుస్తూ.
    "మంచిది రేపే నాన్నగారితో ప్రస్తావిస్తాను." అన్నాడు. ఏక్షణము;లో నన్నెందుకు మోసము చేశావని అతడు అడుగుతాడోనని భయపడింది. అలాంటి ప్రస్తావనే తేలేదు. అందమైన ఆరేయి అతనితో మధురానందాన్ని పంచుకుంది. అలాంటి ఆనందము అరుదై పోయింది.
    ఆనంద్ కారు కొన్నాడు. అత్తమామలు వచ్చి, కన్నీటితో క్షమార్పణ వేడుకున్నారు. అతను మౌనం వహించాడు. కాలము మందంగా గడుస్తుంది. ఆనాడు క్రూరమైన రాత్రి . తనను, భర్త నుండి వేరు చేసిన దినము. పదకొండు గంటలు దాటాక, మెలుకువ వచ్చింది. ఆనంద్ పడక పై లేడు, లేచి బాల్కని లోకి వెళ్ళింది. అతని ముందు  సిగరెట్టు పీకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కుర్చీలో చేరగిలబడి నీలాకాశము కేసి చూస్తున్నాడు.
    "ఏమండీ?" ప్రేమగా అతని జుట్టు నిమిరింది .
    "నువ్వు పడుకోలేదా అరుణా?"
    "మీరు ఇలా మేల్కొని ఉంటె నాకు నిదురేలా వస్తుంది?"
    "బావుంది." అతను నవ్వాడు. ఆ నవ్వులో జీవము లేదు.
    "ఏమాలోచిస్తున్నారు? ఈ మోసకారి భార్య నెలా వదిలించుకోవాలనా?"
    ";లేదు. జీవితంలో ఒకరిని మోసము చేసిన వ్యక్తీ యెప్పుడో అప్పుడు మోసగించబడుతాడనే సత్యము తెలుసుకున్నాను."
    "మీ మాటలు అర్ధం కావటము లేదు." అన్నది.
    "అర్ధం కావు కూడాను. అర్ధం చేసి చెప్పే అంత అర్హత లేదు." అతని కనుకొలకులో నీళ్ళు చూచి చలించిపోయింది. తనను గూర్చి అతనంత బాధ పడతాడని యెప్పుడూ ఊహించలేదు. నెమ్మదిగా అతని పాదాల పై తల పెట్టింది.
    "నన్ను క్షమించండి. దురుద్దేశ్యముతో మీ జీవితం లో ప్రవేశించ లేదు. విధి ఇంత ప్రతికూలిస్తుందనుకోలేదు." అన్నది.
    "ఇదేం పని లే" అతను లేచి వడిలోకి లాక్కున్నాడు. 'అరుణా! తప్పు నీది కాదు. మాటమాటకు ఆ విషయము ఎత్తకు. నీ పెద్ద కళ్ళు కాటుక పెడితే మరింత పెద్దవిగా కనిపిస్తాయి. రేపు ఆదివారం అలా కొండపల్లి వైపు వెళ్దాము." అతని వడిలో పడుకొని , స్వర్గాలు చూచింది. కబుర్లు తెగటము లేదు. అలా ఆనందపు నీడలో నిదురలోకి తూలింది. తెల్లవారుతుండగా విపరీతమైన మూల్గుతో లేచింది, అందరూ పరుగెత్తుకొచ్చారు. ఆనంద్ డాక్టర్ దగ్గరకు పరుగెత్తారు. డాక్టరు వచ్చాడు. ఈసారి సరస్వతమ్మ ను దూరంగా తీసుకెళ్ళి మాట్లాడాడు. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రము ఆమె అరుణ పడక క్రింద గదిలోకి మార్చింది. మందు తినని రోజు లేదు. నాల్గురోజులు బాగుంటుంది. ఆశతో , ఆనందంగా తిరిగేసరికి తిరిగి నొప్పి వస్తుంది. మూడు సంవత్సరాలు దాటింది. అలాగే గడుస్తోంది. ఆలోచనలు కట్టి పెట్టి నిదురబోయింది. ఇంచుమించూ రోజు తలుచుకునే విషయాలివే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS