'అబ్బ! ఎంత బాగుంది ప్రకాశం! మీ ఊరు టౌనుకు యింత దగ్గర లోనే ఉన్నా పల్లెల సహజ సౌందర్యం మాత్రం పోలేదు" అన్నాడు సారధి.
ఎవరూ జవాబుచేప్పలేదు.
"మీ రచయిత లున్నారు చూడండీ, ఎప్పుడూ యింతే! సౌందర్యమో అని గుండె బాడుకుంటారు-- ముఖ్య సమస్యల్ని వదిలేసి!" చివరి ముక్కకు పదును పెట్టి వదిలాడు ఉమాపతి.
ఆ మాట సారధి గుండెలో ఈటేలా గుచ్చుకుంది.
"ముఖ్య సమస్యలంటే యేవంటారు?' ప్రశ్నించాడు సారధి.
"ఒకటా రెండా -- వేలు . ఉదాహరణ స్త్రీ సమస్య...."
'స్త్రీ సమస్య చాలా ముఖ్యమైందా?"
"కాదా?"
"కాదు."
"ఎలా గేమిటి? మగాడుగా పుట్టిన ప్రతి వెధవా ఒక ఆడదాన్ని పెళ్ళి చేసుకుని ఆవిడపైన తన అధికారం చలయిస్తున్నాడు. ఆ మగాడు స్త్రీని మనిషిగా చూట్టమే లేదు. వాడు మాత్రం భార్య చస్రే టింగురంగా అని రెండో పెళ్ళి చేసుకుంటున్నాడు. మొగుడు చస్తే ఆడది మాత్రం మళ్ళీ పెళ్ళిచేసుకో కూడదట. ఎవరు చెప్పారండి యీ న్యాయం?"
"చూశారూ, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ పందొమ్మిదో శతాబ్దం సమస్యలు. స్త్రీ సమస్యకు ఇప్పటి సమస్యల మధ్యలో స్థానం లేదు. తిండీ, గుడ్డా, కొంపా లేక ప్రజలు మాడి చస్తుంటే స్త్రీ సమస్యలు వివాహ సమస్యలు అంత ముఖ్యం కావు" అన్నాడు సారధి.
ఉమాపతి అగ్గి రాముడై పోయాడు.
"మీరంటున్న దేమిటి?"
"ఇప్పటి సమాజంలో ఆర్ధిక సమస్యల కున్న ప్రాధాన్యం సాంఘిక సమస్యలకు లేదు."
"అంతే! ఇలగా వాటినీ, వీటిని చూసి అసలు వాటిని దాటేస్తుండండి."
వాతావరణం ఉద్రిక్తమైందని అర్ధం చేసుకొన్న ప్రకాశం నవ్వుతూ ప్రశ్నించాడు-
'అలాగైతే సరి! నువ్వు చెప్పిన సమస్యకు నీ పరిష్కార మార్గమేమిటి?"
"ఈ వివాహమనే వ్యవస్థనే నాశనం చేసేయాలి."
"తర్వాత?"
"స్త్రీలకు , పురుషులకు సెక్సు స్వాతంత్యం ఉండాలి."
"అప్పుడు సంఘంలో క్రమశిక్షణా, నీతీ...." ప్రకాశం మాటను ఉమాపతి పూర్తీ కానివ్వలేదు.
"ఇలాంటి గారడీ మాటల్తోనే యిన్నిదినాలు మాయజేశారు.'
"ఇందులో మాయచేయటం , మంత్రం వేయడం యేమీ లేవు ఉమాపతీ. సమాజంలో నీతీ, సభ్యతా, క్రమశిక్షణా లేకపోతె సాగదు. సమాజంలో శాంతి ఉండాలంటే నీతి ముఖ్యం. విధవా వివాహాలిందుకు చాలా సాయపడతాయి. స్త్రీ ఇంజనీరు కాకున్నా, పైలట్ కాకున్నా దేశానికి జరిగే ప్రమాదం లేదు. కానీ ఆవిడ ఉత్తమ గృహిణి కాకుంటే మాత్రం సమాజ విచ్చేధం తప్పదు."
'అందుకే ముందుగానే చెప్పాను, నువ్వు అభివృద్ధి నిరోధకుడివని."
"స్త్రీ పురుషులకు సెక్సు స్వాతంత్ర్యం ఉండాలనడం అభ్యుదయం కాదు" అన్నాడు ప్రకాశం.
"మరింకేది అభ్యుదయం?"
"అందరికీ కూడూ, గుడ్డా, కొంపా ఉండాలనటం " అన్నాడు సారధి.
"ఎప్పుడూ కూడు, కూడు కూడు-- అన్ని సమస్యలకు మూల కారణం 'సెక్సు' అని ఫ్రాయిడ్ అంతటి వాడు చెబితే!"
"కాదు. అన్ని సమస్యలకు మూల కారణం డబ్బు అన్నాడు మరొక మేధావి ."
" ఆ మేధావిని తీసికెళ్ళి పచ్చి పిడకల్లో పెట్టండి."
"ఆ ఫ్రాయిడ్ ను తీసుకెళ్ళి పచ్చి కట్టేల్లో పెట్టండి."
కత్తులు కట్టిన కోళ్ళలా ఉమాపతీ, సారదీ పోట్లాడుకుంటుంటే మధ్యలో నలిగిపోయాడు ప్రకాశం. ఎలాగైనా మాట మార్చాలనుకుని అన్నాడు--
'ఉమాపతీ ఈ వారం ఒక ప్రముఖ ఇంగ్లీషు వీక్లీ లో తెలుగు కధ వచ్చింది, చూశావా?"
"ఇది అన్నిటికంటే ముఖ్యమైన సాంఘిక....."
ఎదురుగా వస్తున్న శారదను చూసి ఆగిపోయాడు ఉమాపతి. చంకలో ఉన్న గుల్లనిండా అనపకాయలను కోసుకుని శారద వస్తుంది. ఎందుకు ముఖం కందిపోయింది. గాలికి జడ రేగిపోయింది.
"ఓ! కాస్త పనుంది. నేను తిరిగి వెళ్ళాలి" అన్నాడు ఉమాపతి.
ప్రకాశం ఒప్పుకోలేదు. విధి లేక ముందుకు నడిచాడు ఉమాపతి. ఎదురుగా వస్తున్న శారద వీళ్ళను చూసి కొంగు బాగా కప్పుకుని తలవంచుకొని ముందుకు నడిచిపోయింది.
"ఏమిటోయ్, అత్తా కూతురు చాలా ఒదిగి నడుస్తుంది!" అన్నాడు ప్రకాశం.
"అడజాతి బానిస లక్షణం" అన్నాడు ఉమాపతి.
2

ఉమాపతి రెండవ రోజు మద్రాసుకు వెళ్ళిపోయాడు. అతడు బయల్దేరడానికి ముందు రత్నమ్మ చాలాసేపు అతనితో ఏకాంతంగా మాట్లాడింది. అప్పటి నుంచీ రత్నమ్మ మంచి హుషారుగా ఉంది. ఇన్ని దినాలు బెరుకు బెరుగ్గా ఉన్న ఆవిడ మనస్సు ఇప్పుడు కుదుట పడింది. ఉమాపతి శారదను పెండ్లి చేసుకుంటాడు. శారద ఈ యింటి కోడలవుతుంది. ఇక ఈ యింటి మీద తనదే పెత్తనం! రత్నమ్మ ఆరోజు రాత్రి హాయిగా నిద్రపోయింది.
విశ్వనాధయ్య గారు సజ్జ కుప్పల వద్దకు కావలి పడుకోవడానికి వెళ్ళారు. విశ్వనాధయ్యగారు సాధారణంగా కావలి పడుకోవడానికి వెళ్ళరు. కానీ పది దోల్లల సజ్జ కంకి బండమీద పోసి ఇంట్లో పడుకుంటే వారికి నిద్ర రాలేదు. లేచి టార్చి లైటు తీసుకుని బయలుదేరారు.
ఒకటే చీకటి. కన్ను పొడుచుకున్న కనబడని చీకటి. పాపం లాంటి చీకటి పక్క బండను అవరించుకుంది. విశ్వనాధయ్యగారు వెళ్ళేసరికి పాలేరు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.
"ఏయ్! లేవరా గాడిదా! లెయ్!"
పాలేరు నాగయ్య లేచి కూర్చున్నాడు. వాడిదింకా బాగా బాధ్యత తెలీని యిరవై ఏళ్ళ వయస్సు. ఏనుగంత శరీరం, ఎలకంత మెదడు.
"అయ్యో! సాములగోరా! రాండి,రాండి" అన్నాడు తెప్పరిల్లి.
ఈ అలికిడి విని పక్కనే తన కుప్పల వద్ద కావలి ఉన్న ప్రకాశం లేచి వచ్చాడు.
'అదేమిటండి , మీరే వచ్చేశారు?"అన్నాడు విశ్వనాధయ్యగారిని చూచి.
"ఏందో ప్రకాశం -- ఆరునెల్ల శ్రమ బండ మీద పోసి ఇంట్లో పడుకుంటే కునుకు రాలేదు."
ప్రకాశం నవ్వాడు.
'అవును గదండీ, ఈనగాచి నక్కల పాలన్నట్లు" అన్నాడు.
"బాగున్నావా, ప్రకాశం , కనబడటమే మానేశావ్?"
ప్రకాశం భుజం మీద చెయ్యి వేసి, ఆప్యాయతతో అర్ద్రమైన కంఠం తోఅడిగారు విశ్వనాధయ్య గారు.
"ఏదో అలా ఉన్నాను" అన్నాడు ప్రకాశం.
"మీ అమ్మా ఆరోగ్యం ఎలా ఉంది? ఊ.... ఒకసారి మీ యింటి వైపు రావాలనే అనుకుంటున్నాను,ప్రతిరోజూ . కానీ కుదరడం లేదు."
ప్రకాశం నవ్వి ఊరుకున్నాడు. అందరి తోనూ గలగలా మాట్లాడినా విశ్వనాధయ్య గారి వద్ద ప్రకాశానికి నోరేలేదు. అందుకు కారణం ప్రకాశానికి విశ్వనాధయ్య పట్ల ఉన్నగౌరవం.
"అబ్బ....చాలా చలిగా ఉంది" అన్నాడు ప్రకాశం చివరికి.
"అవును."
"చలిమంట వేస్తాను." లేచాడు ప్రకాశం.
కొంచెం సజ్జ చొప్ప తీసి బండ మీద వేసి గుడిసె లో నుంచి నిప్పు పెట్టి తెచ్చి వెలిగించి విశ్వనాధయ్య గారిని పిలిచాడు.
"మీరూ రండి, చలి కాచుకుందురు గాని. అబ్బ! పాడు చలి! పక్కల్లో నొప్పిపుడుతోంది."
విశ్వనాధయ్య గారు వెళ్ళి మంట వద్ద కూర్చున్నారు. కాస్సేపు ఎవరూ మాట్లాడ లేదు.
"ప్రకాశం! నిన్నొక మాటడుగుతాను. ఏమీ అనుకోవు గదా?' సంకోచిస్తూనే అడిగారు విశ్వనాధయ్య గారు.
తలవంచుకుని కూర్చున్న ప్రకాశం తలెత్తి చూశాడు.
"అడగండి" అన్నాడు.
"నీకేమైనా పెళ్ళి సంబంధాలు వస్తున్నాయా?"
"ఏదో ఒకటి రెండు వచ్చాయి."
తరువాత ఏమీ మాట్లాడాలో విశ్వనాధయ్యగారికి తోచలేదు. కాస్సేపు అలోచించి టక్కున తెగించి అడిగేశారు. పాపం! విశ్వనాధయ్యగారు లౌక్యులు కారు.
"మా శారదను పెండ్లి చేసుకోకూడదూ?"
ప్రకాశం మనస్సు ఒక్క క్షణం పున్నమినాటి సముద్రమై పోయింది. అనేక భావాలు ఉత్తుంగ తరంగాలై ఒకటితో మరొకటి డీ కొన్నాయి. అవి కాస్త శాంతించిన తర్వాత అన్నాడు.
"శారదకు పెళ్ళికొడుకు ఇంట్లోనే ఉన్నాడుగా?"
"వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఎడముఖం పెడ ముఖంగానే ఉంటారు ప్రకాశం. అంతేకాకుండా మరో విషయం. మా చెల్లెలు రత్నమ్మ అంత మంచిది కాదు. ఎలాగైనా తన కూతుర్ని ఉమాపటికి కట్టపెట్టి అ యింటిని ఏలాలని ఆవిడ కోరిక. ఈ విషయం నా భార్యకు పూర్తిగా ఇష్టం లేదు. అలోచించి చూస్తె నాకూ సుందర మాటే న్యాయమనిపిస్తుంది. అందువల్ల నేను నిన్ను అడిగాను. నిజం చెబుతున్నాను. నువ్వంటే నాకు చాలా యిష్టం. నీ నిజాయితీ, నీ పులి గుండె నాకు చాలా యిష్టం." " విశ్వనాధయ్య గారి కంఠం గద్గదమైంది. కానీ అందులో ఆవేశం ఎక్కడో గుడగుడ లాడింది.
"సరేనండి. శారదను పెళ్ళి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు ప్రకాశం తలవంచుకునే.
విశ్వనాధయ్య గారు తన జీవితంలో మొట్ట మొదటి సారిగా అత్యనందాన్ని అనుభవించారు. సంతోషం పట్టలేక ప్రకాశాన్ని కౌగలించుకున్నారు.
"రేపు మీ అమ్మతో ఒకసారి మాట్లాడతాను. ప్రకాశం నువ్వు....నువ్వంటే అందుకేనయ్యా నాకు అంత యిష్టం...." ఆనందజ్యోతై వెలిగిపోతున్న ముఖంతో అన్నారు.
మరి కాస్సేపటికి విశ్వనాధయ్య గారు తన గుడిసె లోకి వెళ్ళి తృప్తిగా నిద్రపోయారు.
