Previous Page Next Page 

 

    'ట్యూషను బాగా అలస్యమైనట్లుందే యివాల?' అంటూ పరాంకుశం గారు నవ్వాడు. స్వామి స్టాఫ్ రూం లో అడుగు పెట్టగానే . స్వామికి సమాధానం దొరకలేదు. 'ఏమైనా నీ లోట్టే విరిగి నేతిలో పడిందిలే తమ్ముడూ. నిన్ను హెడ్ మాష్టారు పిలుస్తున్నారు. అక్షింతలు జల్లి ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా. పైకి రావలసిన వాడివి.' అదే నవ్వు మళ్ళీ.
    'ఆలస్యంగా వచ్చినందుకు మందలిస్తారు గామల్సు' అనుకుంటూనే భయపడుతూ హెడ్ మాష్టారు వెంకటరత్నం గారి గదిలో ప్రవేశించాడు స్వామి. తన కేసి చూసి గూడా పలకరించలేదు మాష్టారు. అలాగే నిలబడ్డాడు రెండు నిమిషాలు. 'డి.ఇ.ఓ . కు రిపోర్టు చేస్తారేమో' - తర్వాత తీగల కళ్ళజోడు చెవికి చుట్టుకుని ఎదుటనున్న వ్యక్తిని చూసి 'నువ్వటోయ్ ! కళ్ళజోడు లేకపోతె నాకు కళ్ళు లేనట్లే సుమా! కూర్చో ౦ కూర్చో' అన్నాడు ఆప్యాయంగా.
    పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లని పించింది స్వామికి.
    కూర్చున్నాడు యధాప్రకారం కుర్చీలో ఒక మూలకు ఒదిగి.
    "అబ్బాయ్! నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని పిలిచానోయ్. నువ్వు యింకా కుర్రవాడివి. ప్రపంచానుభవం లేనివాడివి. నేనంటావా డక్కా ముక్కాలు తిన్నవాడిని. ఇంచుమించు నీ వయస్సంత సర్వీసున్నవాడిని .'
    'ఇంకెప్పుడూ స్కూలుకు ఆలస్యంగా రాను మాష్టారూ.'
    ఈ మాట అనలేదు స్వామి. అందామనుకున్నాడు. కాని మాష్టారి చేత ఉద్యోగంలో చేరిన రెండు రోజుల్లోనే చివాట్లు తినవలసి వచ్చిందే నన్న బాధతో గొంతుక పెగిలింది కాదు. కాని నిజానికి స్వామి అనుకుంటున్నది వేరు. హెడ్ మాష్టారు అనబోతున్నది వేరు.
    'నాకు నిన్నరాత్రి తెలిసిందబ్బాయ్ ! మన పరాంకుశం చెప్పాడు నువ్వు రఘుపతిగారింట్లో చేరావని- వాళ్ళమ్మాయికి అప్పుడే ట్యూషను గూడ కుదుర్చుకున్నావని....'
    "ఔనండి'
    'నిన్ననే తెలుసుంటే- వెళ్ళనిచ్చే వాణ్ణి కాను సుమా.'
    'ఎందుకండి?'
    రక రకాల ఆలోచనలు గిర్రున తిరిగాయి స్వామి బుర్రలో.
    "ఎందుకంటె ఏం చెప్పనబ్బాయ్ . పూర్వజన్మలో అనేవారు. ఆడదాని బ్రతుకు అరిటాకు వంటిది- అని, ముల్లు అరిటాకు మీదపడ్డా, అరిటాకు ముళ్ళు మీద పడ్డా చినిగి పోయేది అరిటాకే సుమా!- అంటూ ప్రతి తల్లీ నా చిన్నతనాల్లో ప్రతి కూతురుకూ పాఠం చెప్పేది.  
    ఇప్పుడుంది చూశావ్? రోజులు తలక్రిందు లయ్యాయి. బడి పంతుళ్ళు మగ జన్మ ఎత్తినా - ఏమిటి చూస్తున్నాగా -- మన బతుకులలా తయారయ్యాయి. ఊరి మొత్తం మీద స్థాన బలం, అర్ధ బలం , అంగ బలం రవంత లేని అర్భకుడేవరయ్యా ? అంటే యింకా నీకా అనుమానమెందుకూ బడి పంతులే. ఆ రోజుల్లో డబ్బు లేక - బ్రతకలేక బదిపంతులూ ఆమె పేరొచ్చినా -- గౌరవముండేది. యిప్పుడంటావా? అది పోయింది."
    ఒక్క ముక్క అర్ధం కావడంలేదు ' స్వామికి.
    'లేకపోతె పదిమంది ముందు పళ్లన్నీ ఊడేటట్లు మన పరాంకుశాన్ని అట్లా కొత్తగలడూ ఆ రఘుపతి? నువ్వా ఈ వూరికి కొత్తవాడివి. విషయాలు తెలియవు. ఆ రఘుపతి పేరు చెబితే ఈ పరగణాలో పక్షులు నీళ్ళు త్రాగవు. భయపెట్టి పరిపాలిస్తున్నాడు ప్తపంచాన్ని. అలనాటి రావణాసురుడు చచ్చి ఈనాడు రఘుపతిగా పుట్టాడని అందరూ చెప్పుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పరమ లిటిగేషన్ మనిషి. నీళ్ళు లేకపోతె చేపలు ఎలా బ్రతకలేవో , పార్టీలు కక్షలూ, కోర్టులూ లేకపోతె ఈయన గారి కలా ఊపిరాడదంటారు. మరొక రహస్యమేమిటంటే -- ఈ కోర్టు రఘుపతి ఉన్నాడే ---'
    ఒక్కసారిగా బండరాయి అడ్డం పడ్డట్టు ఆగిపోయాయి హెడ్ మాష్టారి మాటలు. వెనుక నుంచి నవ్వు వినిపించింది స్వామికి. తిరిగి చూశాడు రఘుపతి గారు! ఎదురు గుండా చిరుమందహంసతో నిలిచిన రఘుపతిగారు!
    హెడ్ మాస్టారి ప్రాణం, బాణం తాకిన పక్షి మాదిరి గిలగిల లాడిపోయింది. అంతలో తెప్పరిల్లడానికి ప్రయత్నిస్తూ 'రండి రండి రఘుపతి గారూ! తమరే వచ్చారా పాపం అంత శ్రమ తీసుకుని? కాకితో కబురు పంపితే మీ గుమ్మం ముందు వాలే వాణ్ణి కాదుటండీ! అమ్మమ్మ! ఎంతపని చేశారు రఘుపతి గారూ!' అంటూ వాపోయాడు. ఆశ్రయింపు నవ్వును బలవంతంగా బయటకు లాగి!
    రఘుపతిగారు ఆవలించకుండానే పేగులు లేక్కపెట్టగలిగిన మేధావి- అనే విషయం హెడ్ మాష్టారికి తెలియకపోలేదు. సాలెగూటితో యిరుక్కున్న అల్పప్రాణి అసంభవమని తెలసీ, బయట పడటానికి ప్రయత్నిస్తుంది. నిజానికి అరచేతి మందమున్న అద్దాల కళ్ళజోడు తీసి, ఒక చేత్తో పట్టుకొని, రెండవ చేత్తో కళ్ళు తుడుచుకుంటూ స్వామికి హితవు చెబుతున్న హెడ్ మాష్టారికి-- తన మాటలలో సగానికి పైగా రఘుపతి గారు విన్నారనే అనుమానం కలిగింది.
    అంతలోనే రఘుపతి గారు కుర్చీలో కూర్చుంటూ 'ఏమిటి మాష్టారూ! ఏదో నా విషయమే మాట్లాడుతున్నట్లున్నారు?" అన్నారు.
    "అబ్బే - మరండీ -- ఆ- స-లు'
    ;కోర్టు రఘుపతి - అంటుంటే నా విషయమే అనుకున్నా లెండి.'
    హెడ్ మాష్టారి ముఖం పాలిపోయింది.
    'అయ్యా!మరండి మన స్వామికి ఏం చెబుతున్నానంటేనండి , కోర్టు విషయాలలో మన రఘుపతిగారి ముందు పెద్ద పెద్ద హైకోర్టు వకీళ్ళు కూడా నిలవలేరు సుమా!' అంటూ హెడ్ మాస్టారు సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తున్న తీరు చూసి - జాలిపడ్డాడు స్వామి.
    "ఏం కోర్టులు లెద్దురూ! ఇన్ని దావాలను ఈదుకు వచ్చాక ఆమాత్రం అనుభవం రాదంటారా మనిషన్నాక?' అంటూ 'ఏమయ్యా! నీకూ ఏమన్నా కోర్టు గొడవలున్నాయా ఏమిటి? నా సహాయం విషయంలో ఏమిటి నువ్వు మొహమాట పడవలసింది లేదు సుమా! ఇదంతా మనకు కొట్టిన పిండి' అంటూ స్వామి భుజం మీద చేయి వేసి మరీ హామీ యిచ్చారు.
    'అబ్బే! నాకేమున్నాయండి కోర్టు గొడవలు' అంటూ నీళ్ళు నమిలాడు స్వామి.
    'ఇంతకూ తమరు వచ్చిన పని సెలవిస్తే' గుండెల్ని అదిమి పట్టుకుంటూనే అడిగారు హెడ్ మాష్టారు.
    'మనవి చేస్తా మేష్టారూ! తమకు తెలిసే వుంటుంది. తరతరాలుగా ఈ ఊరి వ్యవహారాలన్నీ మా కుటుంబం చేతుల మీదుగా నడిచేవా? అసలు మా పూర్వికులు కదుటండి ఈ జ్ఞానవరం గడ్డ మీద మొదట యిల్లు కట్టింది? ఇదుగో ఈ పాడు స్వాతంత్ర్యం అంటూ వచ్చి పడిందా ఒకటి - ప్రతి వెర్ర్రి నాగమ్మా -- పూటకు ఠికాణా వున్నా లేకపోయినా -- పెద్ద వీరుడై పోయాడు గిదుటండి- ఎవడికి వాడే నాయకుడు. ఒక్కొక్క వాజమ్మ చుట్టూ పదిమంది వెర్రి పీనుగులు -- ఉపనాయకులమంటూ  ఊరేగడం నెత్తిన రూపాయి కాసేట్టి ఈవేర్రి పీనుగుల్ని హైకోర్టులో వేలంపాట పెట్టండి. నయా పైసాకు పైసాలవుతుందేమో బేరం చూడండి. ఇంట్లో కట్టుకున్నదానికి సమాధానం చెప్పలేరు మళ్ళీ  బయట కొచ్చాక ఈ వీరావేశాలు చూడండి. కళ్ళ ముందే ఊరిలా తగలబడి పోతుంటే చూస్తూ వూరుకోవడం న్యాయమంటారా? కడుపు తరుక్కుపోతున్నది మాష్టారూ ఈ గ్రామం కోసం కదుటండీ నా ఆస్తి అంతా తగలబెట్టుకుంది?'
    నిగ్గదీసి ప్రశ్నించాడు రఘుపతిగారు. అయన ఆస్తి హరించుకు పోవడం గురించి హెడ్ మాష్టారు విన్న కధ వేరు. సగం వాజ్యాల్లోనూ, మిగిలింది పంచాయితీ  ఎలక్షన్లలోనూ తగలబడి పోయిందంటూ పరాంకుశం చెప్పగా విన్నాడు.
    'ఈ ఊరిని బాగు చేయాలంటే తమబోటి పెద్దల సహాయం కావాలి మేష్టారు-'అన్నారు సవినయంగా రఘుపతి గారు.
    'అమ్మమ్మ! బక్క ప్రాణులం. మా సహాయంతో ఏం జరుగుతాయండీ యింతింత పెద్ద పనులూ?'
    ఏదో క్రిమినలు కేసులో సాక్ష్యానికి యిరికిస్తున్నాడని హెడ్ మాష్టారి ప్రాణం బేజారెత్తి పోయింది.
    "మీ సహాయమే నండి ఈ గ్రామానికి కావలసింది.'
    "అయ్యా రఘుపతి గారూ! ఏదో జీవనోపాధి వెతుక్కుంటూ జీతం రాళ్ళ కోసం యింతదూరం వచ్చానూ -- అభం శుభం తెలియని కుర్రకుంకలకు కూడికలు, కాగుడింతాలు చెప్పగలం గానీ -- అమ్మమ్మ - గ్రామానికి సంబంధించిన యింతింత పెద్ద రాజకీయాల్లో అడుగు పెడితే క్షణం బ్రతకగలముటండీ?'
    'అదే అంటున్నా మేష్టారూ! ఇటు వంటి పార్టీలూ, రాజకీయాలూ కక్షలూ లేకుండా, కేవలం ప్రజా క్షేమం కోసం , ఒక గ్రామపునరుద్దరణ  సంఘాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాను. తమబోటి పెద్దల్ని పదిమందిని ఆహ్వానించి, రేపు మీటింగు ఒకటి మా యింట్లో ఏర్పాటు చేయాలని సంకల్పం. గౌరవ నీయులూ గ్రామ రాజకీయాలకూ, ముఠా తత్వాలకూ అతీతులు గనుక , తమరు విచ్చేసి ఆశీర్వదిస్తే -- నా ఉద్యమానికి ఒక స్థాయి గౌరవం కలుగుతాయని నా నమ్మకం. తమరు వచ్చి తీరాలి. కాదనకండి.
    రఘుపతిగారి ఆహ్వానాన్ని అంగీకరించలేక, తిరస్కరించలేక -- పచ్చి వెలగ మ్రింగినట్లు పొలమారింది హెడ్ మాస్టారి గొంతు.
    రఘుపతి గారు వెళ్ళిన పది నిమిషాల దాకా మాట రాలేదు అయన నోటి వెంట.
    'మాష్టారూ ' అంటూ మరొక మనిషి లోపలకు దూకుడుగా ప్రవేశించడంతో త్రుళ్ళిపడి , టేబిలు మీదున్న కళ్ళ జోడు తగిలించి, వచ్చిన వ్యక్తిని గుర్తుపట్టి 'తమరా కోనేటి రావుగారూ! కబురంపితే నేనే వచ్చేవాణ్ణి  కదుటండి . తమ తమ్ముడుగారినలా హోం వర్క్ చేయలేదని దండించినందుకు హిస్టరీ మష్టార్నీ గట్టిగా నిన్ననే మందలించా నండి. కొత్తగా ట్రయినింగ్ అయి వచ్చిన కుర్రాడు లెండి. యింకా తమ ఘనత అతగాడి చెవుల్లో పడినట్లు లేదు. జిల్లాబోర్డు ప్రసిడెంటుగారు తమకు షడ్రుకులనే విషయం కూడా అతగాడి చెవిలో వేశా. మాస్టర్లను మీ తమ్ముడి గారి జోలికి పోనిస్తానా చెప్పండి నా తల అడ్డం వేస్తా గాని, ' అన్నాడు హెడ్ మాష్టారు ఆజిల్లా బోర్డు ప్రెసిడెంటు షడ్రకుడూ, ఆ వూరి బాంకు ప్రెసిడెంట్ అయిన కోనేటి రావు ముందు భక్తీ శ్రద్దలతో నిలబడి.
    "ఆ రఘుపతి గారితో కలిసి మీరంతా నామీద పార్టీ పెడుతున్నారని, ఓ పంతులుకు తన యింట్లో గది అద్దె కిచ్చి అతన్ని పెట్టుకుని అడ్డం - కధ ప్రారంభించాట్ట రఘుపతి. పంచాయితీ ఎన్నికల్లో అరడజను వోట్లు పడాలా -- ఊళ్ళో పలికే జనం లేక మీ బడి పంతుళ్ళను అడ్డం పెడుతున్నాడన్న మాట.' గుడ్లు రిమాడు కోనేటిరావు.
    'రామ- రామ- ' అన్నారు మూలిగినట్లు హెడ్ మాష్టారు.
    'అంతకు తెగించారంటే మీ ఉద్యోగాలే కాదు - ప్రాణాలే దక్కవ్. జాగ్రత్త. అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటకు నడిచాడు కోనేటి రావు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS