2
ఏమైనా మర్నాడు ట్యూషను మొదలుపెట్టి తీరాలనే నిశ్చయంతో లేవగానే గది శుభ్రం చేసుకుని జంపకానా గది మధ్యలో వేశాడు. పావని కూడా ఉదయాన్నే లేచి నూతి దగ్గర ముఖం కడుక్కోవడం చూశాడు. తర్వాత కాఫీ గ్లాసు టేబిల్ మీద పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళింది పావని.
రఘుపతి గారు ఎక్కడికో ప్రయానమైనట్లున్నారు. చలవ బట్టలు కట్టుకుని, జరీ ఉత్తరీయం కప్పుకుని బయటకు వస్తూ "ఏం బాబూ మొదలు పెట్టావా అమ్మాయికి ట్యూషను?" అన్నారు. అయన వెనకాతలే బయటకు నడుస్తూ ''నిన్న ద్వాదశండీ -- ఇవాళ నుంచి మొదలు పెడుతున్నా' అన్నాడు స్వామి.
తృప్తిగా చల్లటి చిరునవ్వు రఘుపతి గారి పెదవుల మీద మెదిలింది పల్చగా.
'వసతీ అది బాగుందా ? ఏమన్నా కావాలంటే యింట్లో అడిగి పుచ్చుకో. మొహమాట పడబోకు. నువ్వు పరాయి వాడివనుకోవడం లేదు మేము. ఏముంది నాయనా జీవితంలో కట్టుకు పోయేది? ఈ వెధవ శరీరాలు శాశ్వతమా? మిగిలేది అనంతమంచితనం. ఇదంతా ఒక లిటిగేషన్ ఊరు. రవ్వంత జాగ్రత్తగా మసులుకో. అలా వెళ్ళొస్తా. బ్యాంకు మీటింగుంది.' అంటూ వెళ్తున్న రఘుపతి గారిని కొంత దూరం సవినయంగా సాగనంపి తిరిగి వచ్చాడు స్వామి.
పరిచయం గల మనుష్యులతోగూడా యింత మంచితనం చూడటం అంతకు ముందెప్పుడూ స్వామికి అలవాటు లేదు. ముసిముసి నవ్వులతో ముందుకు సాగిపోతున్న రఘుపతి గారి ముఖమే గుర్తుకు వచ్చింది చాలాసేపు. బడి టైం దగ్గర పడుతుంది. పావని జాడ కనిపించలేదు. 'మళ్ళీ రేపు చరుర్ధశి - మంచిది కాదు గూడా' అనుకున్నాడు. మరొక అరగంట ఎదురు చూశాడు.
'టైం ఎంతయిందో ?' అనుకుంటూ చేతి గడియారం కోసం టేబిల్ దగ్గరకు వెళ్ళాడు.
నెత్తిన పిడుగు బడినట్లయింది.
'టేబిల్ మీద తన చేతి గడియారం కనిపించలేదు.
కంగారుపడుతూ గది నాలుగు మూలాలూ వెతికాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ గడియారం తన అదృష్టానికి గుర్తు. కాకపొతే - పావలా కట్టినంతమాత్రాన అన్ని వందల మందిలో తనకే ఎందుకు రావాలి లాటరీ? తను మాత్రం వస్తుందనుకొని కట్టాడా? అసలు ఆ కిళ్ళీ కొట్టు సాయిబు 'కట్టండి పంతులూ అదృష్టం మీదే' అంటూ ఆవీదిన వెళ్ళినప్పుడల్లా ఆ మెరుస్తున్న కొత్త గడియారాన్ని చూపెట్టి ఊరించేవాడు. సాయిబ్బు ఎంత మెళుకువగా పొగడినా , అతగాడి మాటలకి తణుకు నమ్మకం కుదరకపోయింది. అ దోవన పోతున్న ప్రతి మనిషికీ , ఆ సాయిబు గ్రాం ఫోను ప్లేటులా అదేమాటలు వల్లే వేస్తున్నాడని నాకు తెలుసు. పావలా కాసు ఎంత విలువైనదో కూడా అనుభవం మీద పెందరాళే తెలుసుకున్నాను. రెండు గీరల సబ్బు ముక్క కొనుక్కుంటే -- పదిహేను రోజులు బట్టలు ఉతుక్కుంటానికి సరిపోతుంది. నాలుగు రోజులకు సరిపడ ఆకూ కూరలు కొనుక్కోవచ్చు.
'ఈ లాటరీ ఎలాగూ రాదు. ఎందుకు దండగమారి ఆశలు?' అనుకుని వూరుకున్నాడు. సాయిబ్బు సహనం నీరసించి కోపం తెచ్చుకున్నా చివరికి ఆనందం బలవంతం మీద కట్టాడు లాటరీ.
షికారుకు కొండమీద కూర్చున్నప్పుడు ఆనాడు -- ఆనందం చెప్పినమాట నా చెవుల్లో ఇంకా మ్రోగుతూనే వుంటుంది.
"ఏ పుట్టలో ఏ పాముందో ఏమో ఏం చెప్పగలం స్వాములూ? ఎవరి జాతకం ఎలా నడుస్తుందో ఎవరికి తెలుస్తుంది. నీకే వస్తుందేమో లాటరీ ఎవరు చెప్పొచ్చారు? యాభై రూపాయల గడియారం అన్నాడు ఆనందం ప్రోత్సాహంగా.
అంతమాత్రాన ఆనందం మాటలకు తాను ఉబ్బిపోయి గానీ లొంగిపోయి కానీ లాటరీ కట్టలేదు. ఆనందం కోసం కట్టాను.

ఔను౧ అక్షరాలా అతని మాట కాదనలేక కట్టాను.
ట్రయినింగ్ చదవడానికి తాను గుణదల వచ్చిన రోజుల్లో.... అమ్మ మీద బెంగ కొద్దీ తనకు జ్వరం వచ్చింది. ఆ చిన్న సంఘటన ఆనందాన్ని తనను అంతటి అత్మీయుడ్ని చేసింది. నూట నాలుగు డిగ్రీల వేడిని నాలుగు రోజులు భరించి, నీరసించి సొమ్మసిల్లి పడుకున్నాడు తన గదిలో. మందు మాత్ర కొనుక్కుంటానికి 'బేడా' లేకపోయింది చేతిలో. కాఫీ త్రాగాలనిపించి గత్యంతరం లేక కూజాలో నీళ్ళు త్రాగి పడుకున్నాడు. అయిదు రూపాయలు పంపవలసిందని మేనమామకు ఉత్తరం రాశాడు. 'నీ చదువుకు నేను సహాయం చేసే స్థితిలో లేను' అంటూ అయన తిరుగుటపాలో జవాబు వ్రాశాడు.
'మంచినీళ్ళ మాదిరి ఆస్తి అంతా కరగపెట్టిన ఆ దుర్మార్ద్గుడి కడుపున పుట్టి నందుకు - అనుభవించాలి' అంటూ సలహా చెప్పాడు. చదువుకు సహాయం చెయ్యమని వ్రాయలేదు తను. మొదటిసారి నోరు తెరచిఅదిగిన సహాయం కేవలం అయిదు రూపాయలు!' ఇంక జన్మలో ఎవరినీ సహాయం అడగ కూడదనుకున్నాడు. తనకు - ఏ సహాయమూ చేయలేని తల్లి గాక- ఈ ప్రపంచంలో తనకేవ్వరూ లేరనుకున్నాడు. దుప్పటి ముసుగు దన్ని పడుకున్నాడు.
అటువంటి పరిస్థితిలో తానా దుప్పటి తొలగింది. మండుతున్న కణతల మీద చల్లటి చెయ్యి తగిలింది. నీరసించి నిస్తేజమైన కళ్ళు తన వంక జాలిగా చూస్తూ నిలబడ్డ ఆనందాన్ని చూశాయి. తన క్లాసులో చదువుకుంటున్నఅంతకు ముందు అతనీతో 'స్నేహం లేదు తనకు. నవ్వాడు ఆనందాన్ని చూసి ఆపేక్షగా.
'ఈ పళ్ళ రసం త్రాగండి.'
మారు మాట్లాడకుండా త్రాగాడు. తన డబ్బుతో మాత్రలు కొని తీసుకొచ్చాడు. చేతితో తీసినట్టు తలనొప్పి తగ్గింది. సాయంత్రానికి చెమటలు పట్టి జ్వరం జారింది. రాత్రి తన గదిలోనే ప్రక్కన చాప పరుచుకు పడుకున్నాడు ఆనందం. చాలా రోజుల తర్వాత పీడకలలు రాకుండా ప్రశాంతంగా పడుకున్నాడు. రాత్రి సమయంలో అదే చల్లటి చెయ్యి తన కణతల్ని రుద్దినట్లు అనిపించింది. అమృతాంజనం పరిమళం లా గుండెల్లోకి ఎగబ్రాకింది. తెల్లవారేసరికి వెచ్చటి కాఫీ యిచ్చాడు ఆనందం. ఆ క్షణంలో అమ్మ గుర్తుకు వచ్చింది. ఆనందం! అంత వరకూ అతని ముక్కూ మొహం తనకు తెలియదు. ఒకొక్కళ్ళను చూస్తె ఏదో జన్మాంతర బంధమున్నట్లు అత్కీయత కదిలి అపేక్ష పుట్టుకొస్తుంది!
అవధాని గారింట్లో వంటలు చేసి రవ్వంత కూర చిన్నకప్పులో చెంగు కింద పెట్టుకు తెచ్చి తనకు వడ్డించి, తింటున్నప్పుడు తృప్తిగా ' ఎదగ వలసిన వయస్సు రా తండ్రీ నీది. మరింత కలుపుకో" అంటున్న అమ్మ గుర్తుకు వచ్చింది.
"నాలుగు రోజులకే ఎంత తీసిపోయారండి" అన్నాడు ఆనందం.
తన కడుపు తడిమి ఎప్పుడు నిండుతాయిరా తండ్రీ నీ పేగులు?' అన్న అమ్మగొంతు వినిపించింది ఆనందం మాటల్లో.
స్వామి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంత మంది తనతో చదువుకుంటున్నారు. ఆపదలో తనకు రవ్వంత సాయం చేసింది ఆనందం ఒక్కడే! ఎలా నిర్వచిండడం ఈ ఆపేక్షను?
'తల నొప్పిగా వుందా?' అన్నాడు ఆనందం.
'కాదండీ ! ఎలా తీర్చుకోగలను మీ బుణం?' అన్నాడు. బరువుగా కళ్ళు తుడుచుకుంటూ.
'యింత మాత్రానికే? ఏమిటండీ ఆ పిచ్చి మాటలు? పడుకోండి కాసేపు ఏసు ప్రభువును తలుచుకుంటూ.'
ఇప్పుడు తన గదిలో వ్రేలాడుతున్న ఏసు ప్రభువు ఫోటో ఆనందం యిచ్చినదే. ఆ సంఘటన తర్వాత ఆనందాన్ని ఎన్నడూ మరిచిపోలేదు స్వామి. అందుకనే అతని మాట కాదనలేక లాటరీ టిక్కెట్టు కొన్నాడు. కొందరిమాట వలన అటు వంటిదేమో ఆనందం అన్నట్లు. తనకే వచ్చింది.
లాటరీ చీట్లు కలుపుతున్నప్పుడు తాను వెళ్ళనే లేదు. ఆనందం పరుగు పరుగున వచ్చి కౌగలించుకుని ' నే చెప్పాలా' అన్నాడు, ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఆ మెరుస్తున్న గడియారాన్ని తన చేతులకు పెడుతూ. ఆనందానికి రాసిన ఉత్తరం యింకా పోస్టు చేయనే లేదు.
ఆ గడియారం చూసినప్పుడల్లా ఆనందం గుర్తుకు వచ్చేవాడు. ఈనాడు అది పోయినప్పుడు గూడా అతనే గుర్తుకు వచ్చాడు. పని లేనప్పుడల్లా గడియారాన్ని సుకుమాటంగా తుండు గుడ్డ కోసతో తుడిచి మెరుగుపెట్టి - దానితో పాటుగా మెరుస్తున్న కళ్ళతో -- ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లు నివ్వెరపోయి చూస్తూ తన అదృష్టానికి మురుసిపోయేవాడు. పాపం! ఆనందం తనలాగా ట్రయినింగు పూర్తీ చేసి ఈపాటికి ఉద్యోగంలో చేరవలసినవాడు. అతనికి ఆ అదృష్టం లేకపోయింది.
'రేపు మొదలుపెద్దాం సార్' ట్యూషను'
తలెత్తి చూశాడు.
పౌడరు పరిమళం - సంపెంగల సువాసన - గాజుల కిలకిలలతో శ్రుతి కలిపిన సంగీతం లాంటి నవ్వు.
పావని!
రెండు జాడల్లో ఒకటి కరవబోతున్న పాములా ముందుకు దూకింది ఆమె వచ్చిన విదిలింపుకు.
"మీరలా కొయ్యబారిపోతారేం మాష్టారూ నేను వచ్చీ రాగానే!
జారుతున్న నైలాన్ పమిటకు యింకా పట్టుంది. 'మరియమ్మ తిరునాళ్ళకు వెళ్తున్నాం లెండి మా అమ్మన్నట్లు మా కోతి మూకంతా కలిసి' అంటూ గంతులు వేస్తూ లేడిపిల్లలా అదృశ్యమై పోయింది పావని. ఈగోడవలో బడికి ఆలస్యంగా వెళ్ళాడు.
