2
ఆరోజు కమల ఇల్లు సర్దటం మొదలు పెట్టింది. ఇన్ని సంవత్సరాలుగా పేర్చుకున్న చెత్తని చూస్తె ఇంత ఎట్లా పోగైండా అనుకుంటూ , వున్న రెండు మూడు కుర్చీలు, బల్ల విలువైన సామాను ముందు గదిలో వేసింది వంట సామానుతో పాటు. గోడల మీద నించి ఫోటోలు తీస్తుంటే మనసు బాధ పడ్డది. తన తండ్రి, తల్లి తను మామయ్య క్రిష్ణ , తనూ చిన్నప్పుడు తీయించుకున్న రెండు ఫోటోలు మాత్రం తనతో తీసుకెళ్లటానికి వేరే పెట్టింది. మిగతావి చెక్కే పెట్టెలో సర్ది ముందు గదిలో పెట్టింది. తన బట్టలన్నీ ఉన్నంత లో శుభ్రంగా వున్న ట్రంకు లో సర్దుకుంది. ఎక్కువ సామాను లేకపోవటంతో సర్దుకోటానికి అట్టే సేపు పట్టలేదు. ఇదీ ఒకందుకు బాగానే వున్నదనుకుంది కమల.
మర్నాడు లేవటం తోనే కమల కారోజు తానూ చెయ్యాల్సిన పనులు చాలా వున్నట్లు గుర్తు కొచ్చింది. గబగబా స్నానం చేసి కాఫీ తాగి వంట చేసుకుని ఇంటికి తాళం పెట్టి లైబ్రరీ కి వెళ్ళింది.
'ఏమ్మా' అంటూ వొచ్చిన నరసయ్య ను కూర్చో పెట్టుకుని అంతా చెప్పింది.
నరసయ్య తన మామయ్య బాంక్ లోనే ఎటెండర్ గా పనిచేసేవాడు. ఇద్దరూ ఎంతో చనువుగా ఉండేవాళ్ళు. కష్టానికి సుఖానికి వీళ్ళని ఆదుకునేవాడు. తన మేనమామ జబ్బుతో వున్నప్పుడు ఇంటికొచ్చి సాయంగా వుండేవాడు.
అంతా విని వుద్యోగం దొరికినందుకు సంతోషించినా , వంటరిగా ఆడపిల్ల అక్కడకు పోయి ఉండాలే అని నరసయ్య మధన పడ్డాడు. కాని కమల 'ఇష్టం లేకపోతె వచ్చేస్తాగా నరసయ్య' అనటంతో కుదుటపడి 'బాగా లేకపోతె వొచ్చేయ్యండమ్మా' అని మరీ చెప్పాడు.
'అన్నట్టు' నరసయ్యా ఆయిల్లు అద్దె కియ్యాలి. నేనోగది అట్టి పెట్టుకున్నాను. మిగతా ఇల్లు ఈనెలాఖరు కి ఎవరి కన్నా మంచి వాళ్ళకి చూసి అద్దె కిచ్చెయ్ . నా కక్కడ నచ్చకపోతే ఈలోగానే వొచ్చేస్తాను! సాయంత్రం వీలైతే ఒకసారి రా, మిగిలిపోయిన సరుకులు తాళం చెవి తీసుకుందువు గాని.'
'సరేనమ్మా' అన్న నరసయ్య చేతిలో తన దగ్గర వున్న దాంట్లోనే వో ఐదు రూపాయలు పెట్టింది. వోద్దంటున్నా వినకుండా. నాకు వుద్యోగం వస్తే నిన్ని మర్చిపోతానా నరసయ్యా అంటూ.
లైబ్రరీ నించి అనూరాధ గారింటికి వెళ్ళింది. చెప్పి రావటానికి. అక్కడ బాగా లేకపోతె తిరిగి వస్తానని కమల అనటంతో అనూరాధ సమాధాన పడ్డది. అవసరమైతే తనకి తెలియజెయ్యమని తల్లి పిల్లకి చెప్పినట్లు జాగ్రత్తలు చెప్పి , ఆ పూట తనతో పాటే భోజనం పెట్టింది. వెళ్ళేటప్పుడు తన బల్ల మీద పెట్టుకునే రాదా కృష్ణుల దంతపు బొమ్మ చేతిలో పెట్టి పంపించింది. అనూరాధని వదలటానికి కమల బాధపడ్డది.
వీళ్ళిద్దరిదీ చాలా వింతైన అనుబంధం, గురు శిష్యులుగా మొదలైంది.ఆవిడ సంగీతం లెక్చెరర్ . కమల గ్రూపు అదే కావటంతో పరిచయమైంది. కమల గొంతు చాలా బాగుండేది. ఏ రాగమైనా, అలాపనైనా , సంగతైనా సరే, అన్ని స్థాయిల్లోనూ ఇట్టే పట్టేసింది. కమ్మగా పాడేది.ఏదైనా తెలియకపోతే వచ్చి అడిగి నేర్చుకునేది. ఇంతేగాక కమల కి ఫిడేలంటే ఇష్టం. ఆమెకి తీరికున్న వేళలో వెళ్ళి చెప్పించుకునేది. కేవలం కాలేజీ లో పనిచెయ్యటం జీతం తీసుకోటానికి కనుకోకుండా తనవిద్య ఎవరి కన్నా చెప్పటం లో ఆనందపడే అనూరాధ కి కమల నచ్చింది. కమల బెరుకు పోగొట్టి చనువిచ్చింది.
కమల కి ఫిడేలంటే ఇష్టమని నేర్పటమే కాక, ఎవరో అమ్ముతుంటే పాత ఫిడేలు అరవై రూపాయలకి కమల కి కొనిచ్చింది. కమల ఆడబ్బు తను వాయిదాల పద్దతిలో తీర్చనిస్తేనే తీసుకుంటా నన్నది అనూరాధ వద్దంటూన్నా.
కమలకి స్కాలర్ షిప్ వొచ్చేదే కాని ఇంట్లో మామయ్య ఆరోగ్యం బాగుండక దాన్ని మించిన ఖర్చే ఉండేది. ఏం చెయ్యటమా అని అలోచించి కమల అనూరాధ కి ఆమె పిల్లలకి బట్టలు కుట్టివ్వటానికి నిశ్చయించుకుంది. ఈ పని అనూరాధకి ఇష్టం లేకపోయినా కమల పట్టుదల చూసి వూరుకుంది. కమల కుడుతుందని తెలియ చెయ్యకుండానే తన తోటి లెక్చరర్ల దగ్గరి పనులు కూడా తెచ్చిచ్చేది అనురాధ కమలకి. వీటన్నిటికి డబ్బు లెక్కగట్టి వో పుస్తకం లో వేసేది. కమలకి లేసులల్లటం వచ్చని తెలుసుకుని కమల చేత లేసులు అల్లించి స్నేహితురాళ్ళ కి అమ్మేది. కమల కి సాయం చేస్తూ కనిపెట్టి వుండేది. నా అన్న ఆడవాళ్ళ ఆదరణ ఎరగని కమల ఈ అభిమానానికి ఆనంద పడేది. అందుకే ఈనాడు ఆవిడని విడిచి వెళ్ళటానికి ఇష్టపడ్డది.
కమల ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుని లేచేటప్పటికి నరసయ్య వచ్చాడు. నరసయ్య కిచ్చేవి నరసయ్య కిచ్చేసి డూప్లికేట్ తాళం చెవి ఒకటిచ్చి తాను మర్నాడు ఆరు గంటలకి వెళ్తున్నానని చెప్పి వీలైతే ఒకసారి రమ్మంది.
నరసయ్య వెళ్ళినాక ఇంట్లో ఏమీ తోచలేదు. పొద్దుటి వంట అలాగే మిగిలిపోయింది . వంట పని కూడా లేదు. దాంతో అక్కడికి వెళ్ళినాక వెతుక్కోకుండా సబ్బులు, పౌడరు, దువ్వెన, నూనె సీసా కొని, పాప జ్ఞాపకం రావటం తో ఒక బిస్కెట్ పెట్టె నాలుగు ఆపిల్స్ కొనుక్కుని ఇంటికొచ్చింది.
మర్నాడు పొద్దున్నే లేస్తూనే కమలకి ఏదో దిగులుగా బెరుగ్గా వుంది. ఆరోజు సాయంత్రాని కల్లా తను కనీ వినీ ఎరగని చోట పోయి వుండాలే అన్న భావం భయపెడుతున్నది. తిండి సయించలేదు. కూర్చున్న చోట , కూర్చోటానికి గాని నుంచున్న చోట నుంచోటానికి బుద్ది పుట్టటం లేదు. కాలు కాలిన పిల్లిలాగ తిరగటం మొదలెట్టింది.
ఇంటిముందు కారాగిన అలికిడికి బైటికొచ్చింది కమల. అందులోంచి ఖాదర్ దిగివచ్చి సలాం చేసి సాయంత్రం ఆరు గంటలకి అమ్మగారు బైట పోయేది వుందంట. మీకు ఇప్పుడే పట్కురమ్మన్నార్" అని చెప్పాడు-
ఆహా! శ్రీమంతులైన యజమాన్ల అధికారం ఇప్పటి నుంచే మొదలైందనుకుని అంతా రెడీగానే వుంటాం తో తన సామాన్లు కార్లో పెట్టమని ఖాదర్ తో చెప్పింది. ఇంటికి తాళం వేసి ఒక నిట్టుర్పు విడిచి కారెక్కింది. చెప్పలేనన్ని అనుమానాలతో.
ఆలోచనల నుండి తేరుకోకముందే కారు ఇంటి ముందుకు రావటం , గూర్కా తెరిచి పట్టుకున్న గేటులోంచి లోపలికి దూసుకు పోయి పోర్టికో లో ఆగటం జరిగింది. కమల దిగింది. బిక్షాలు , ఖాదర్ తన సామాన్లు దింపుతున్నారు.
అక్కడే తనకోసం ఎదురు చూస్తున్న మధురి 'మామ్మా, మామ్మా కమలీ వొచ్చింది.' అంటూ లోపలికి పరిగెత్తి వొచ్చింది.' అంటూ లోపలికి పరిగెత్తి అరిచి, మళ్ళీ బైటికొచ్చి తటపటాయిస్తూ నుంచున్న కమల దగ్గరికి పరిగెత్తుకొచ్చి' వోచ్చావా కమలీ లోపలికి రా' అని చెయ్యి పట్టుకుని తీసి కెళ్ళింది.

'ఉండు మాధురీ నీకు ఆపిల్స్ బిస్కెట్లు తెచ్చానంటూ తీసిచ్చింది కమల.
'నాకు ఆపిల్స్ అంటే ఇష్టమని నీకు తెల్సా కమలీ,' అంటూ కళ్ళు పెద్దవి చేసుకు చూసింది పాప.
కమల 'వోస్ నాకు తెలియదా' అంటూ చెయ్యి పట్టుకుని నడవటం మొదలు పెట్టింది. పాప వుంగరాల జుట్టు ఎగురేసుకుంటూ వుషారుగా నడుస్తున్నది పక్కన.
అప్పటికే వరండా లో కొచ్చిన రాజేశ్వరి దేవి వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డది. బిక్క ముఖంతో తనవంక చూస్తున్న కమలని చూసి 'రామ్మారా ఏం భయం లేదు.' నా దగ్గరేం బెరుకు పెట్టుకోకు. నీకిక్కడ ఏమీ తక్కువ చెయ్యం. మా ఇంట్లో పిల్లల్లె చూసుకుంటాం సరేనా" అంటూ భుజం మీద చెయ్యి వేసి సాదరంగా లోపలికి తీసుకెళ్ళింది.
