ఈసారీ వదిన అందుకుంది. మా ఇంటికొచ్చి మాటా పలుకూ నేర్చిన మైన దొర అది. మా దగ్గిర నేర్చి మమ్మల్ని మించిన మాటల మరాటీ అది.
'పరాయి ఆడదాన్ని ఒళ్ళూ పయీ తెలీకుండా చూడ్డానికి అతగాడెం అంత పోకిరీ మనిషి కాడు ఒకవేళ చూసినా ఆ తప్పు అతని కళ్ళది గాని అతనిది కాదు. ఇంతటి చక్కదనంచూస్తె ఏ రెప్పవాలు తుంది!'
నేను వదిన్ని వెక్కిరించాను. ఆమె మళ్లీ వెక్కిరించింది.
"మీ ఇద్దరి మధ్యా నేనున్నాను. ఇద్దరూ కలిసి గుంభనగా నన్ను వెక్కిరించడం కాదు గద ఇది?" అన్నాడు అన్నయ్య నవ్వుతూ. మళ్లీ తనే మొదలు పెట్టేడు.
'ఇలాంటి మనిషి కోసం ఇన్నాల్లై వెతుకు తున్నాను. ఇప్పటికి దొరికేడు. నా సెలక్షను మంచిదో కాదో ఇక కాలమే నిర్ణయించాలి. తల్లీ తండ్రీ మశూచికం వచ్చి ఒక్క రోజు తేడాలో పోయారట. 'ఇద్దరూ కలిసి రాలేదు గాని కలసి ప్రయాణం చేశారు. కలసి వెళ్ళిపోయారు. ఎంత అదృష్టవంతులు!' అంటాడు. అంతేగాని కన్నీరు కార్చడు. ఉన్న పొలం కాస్తా తండ్రి పెట్టిన తనఖాల క్రింద తీరిపోయిందిట. 'సొంత భూమి దున్నుకు సుఖపడ్డ వాడేవడు?' అంటాడు. చేతిలో రేఖ ఉండాలి. రెక్కలో సత్తు వుండాలి. బుర్రలో బుద్ది ఉండాలి. ఇవుంటే మనకేం లోటు?' అంటాడు. అప్పుడే బుక్ స్టాల్ లోకి వచ్చిన కొత్త ఇంగ్లీషు నవల కొనుక్కొని చేతిలో పట్టుకుని లాంబ్రేట్టా ఎక్కి అలా తిరుగుతూ ఉంటాడు . సరదా మనిషి. చూసి సరదా పడవలసిన మనిషి. అంతేకాదు చెయ్యేత్తు మనిషి. చెయ్యెత్తి దండం పెట్టవలసిన మనిషి. ముఖ్యంగా నీలాంటి దానితో చెయ్యి కలపవలసిన మనిషి. అతని లాంబ్రేట్టా లో ఇంకా వెనక సీటు ఖాళీగా ఉండడం మన అదృష్టం . నాకు అన్ని విధాలా నచ్చిన సంబంధ మిది. నీకు నచ్చేడని నీ మొహం చూడగానే .........'
అన్నయ్య ఇంకా ఏమేమో చెప్పుకు పోతున్నాడు. చెప్పలేని సిగ్గు తెరలు నన్ను ముంచుకు వచ్చాయి. నన్ను పరీక్ష చేస్తున్న తెల్లని మొహమూ ఎత్తైన బుగ్గలూ, చిన్న కళ్ళూ , ఉంగరాల జుట్టూ స్మృతి పధం లోకి వచ్చి మరక్కడ ఉండలేక గదిలోకి పోయి తలుపేసుకున్నాను'. వదిన వచ్చి తలుపు కొట్టింది. కిటికీ దగ్గిరకు వచ్చింది. నేను ఆ తలుపులూ మూసేశాను.
'కిటికీ తలుపులు కూడా బిదాయించు కోవలసిన రోజులు ముందున్నాయి గాని నాకు లోపల కొంచెం పనుంది. తలుపు తియ్యి.'
వదిన తలుపులు విరగ బాదినా నేను తియ్యలేదు.
'తలుపు గడియ పెట్టగలవు గాని నా నోటికి గడియ పెట్టలేవుగా? నేనన్న మాటలు నీ చెవిలో పడకుండా ఉండవుగా? నోటికి కళ్ళకీ మూటలు పెట్టిన బ్రహ్మ తన కెలాగా నాలుగు తలల వలన కొంతవరకు చెవి మూత పడిందని మానవుల్ని కరుణించి చెవులకి మూత పెట్టలేదని నీకు తెలుసుగా?' నేను రెండు చేవుల్లోనూ వేళ్ళు పెట్టుకున్నాను. వదిన తలుపు సందుల్లోంచి చూసింది.
"వెళ్ళు పెట్టుకున్నా లాభం లేదు, నేనన్న మాటలు వినపడక మానవు. ఒకప్పుడు ఒకరికి చిరు మీసం ఉందని అన్నగారిని బెదర గొట్టిన అమ్మాయి గారూ? ఇప్పుడు మీ వంతు వచ్చిందండి . అబ్బాయి గారి స్వరూపం చూసి ఇదయి పోయినట్టున్నారు, అతనికి తగు మాత్రం మూగ అని తమకి తెలియదు కాబోలు! అయినా శుభమా అని పెళ్లి చేసుకోబోతున్న తమరిని వేళాకోళం పట్టిస్తే నాకేం కలిసొచ్చే గాని ఉన్నమాట చెప్పకుండా దాచిపెట్టడం భావ్యం కాదు చూడండి.......పెళ్లి కుమారుడి గొంతుకుంది చిత్తగించారూ, అడ మేకపిల్ల గొంతుక కూడా ఆగదు. అదేం పెద్ద లోటని కాదు గాని ........' వదిన మ్యోహేహే అని మేకలా అరిచింది. నేను ఒళ్ళు మండి భళ్ళున తలుపు తీశాను.
'నీకేమైనా మతి పోయిందా ఏమిటి వదినా ఇవాళ? ఏ డ్యాన్సు చేసే అట బొమ్మ కైనా 'కీ' ఇంత సేపని ఉంటుంది. నీకు మా అన్నయ్య బతికున్నన్నాళ్ళకీ సరిపడే కీ ఇచ్చి వదిలి పెట్టేశాడా ఏమిటమ్మా?"
'నాక్కాదు. మతి పోయిందేవరికో వోసారి అద్దంలో చూసుకుంటే సరీ.....ఆ ఎరుపెక్కిన ఒళ్ళూ, ఆ మేరుపెక్కిన కళ్ళూ.......'
నేను మళ్లీ తలుపెసేశాను. అయిదు నిముషాలు ఆగినట్టు ఆగి వదిన తలుపు దడదడ కొట్టింది.
"మంజూ , మంజూ , త్వరగా తలుపు తియ్యాలి. మీ అన్నయ్యా అతనూ మళ్లీ ఇలా వస్తున్నారు.'
నేను హడావిడి గా తలుపు తీసి వంటింటి వైపు పరిగెత్తేను. మొహం రుద్దుకుని పెరట్లోంచి వస్తున్న అన్నయ్య ను డీ కొన్నాను. వదిన నవ్వింది.
"చూడన్నయ్యా వదిన నన్నివాళ ఎలా ఫూల్ ని చేస్తోందో'
'పైకలా ఉంది గాని ఆమె ఉత్సాహానికి కారణం వేరులే. ఇలారా చెప్తాను.'
వదిన మొహం ఒక్కసారి వెలిగినట్లైంది.
'వద్దొద్దు, చెప్పొద్దు -- నామీద ఒట్టే' అని వదిన అంటూనే ఉంది. అన్నయ్య ఎడం చేత్తో పొట్ట చూపించి కుడి చేత్తో మూడు వేళ్ళు చూపించాడు.
"అమ్మ! ఎంత గడుగ్గాయివి! ఎంత గడుస్ధానివి! పరమేశ్వరా, మా వదిన సుకుమారి. మళ్లీ మళ్లీ కనలేదు. నీ దయ వల్ల ఒకసారే ఇద్దరు గాని ముగ్గురు గాని.....'
'అలాగే నువ్వు కందువు గాని.........'
'నీ తిక్క కుదరాలంటే అదేమందు, ఎరా అన్నా సినిమా పార్టీ ఏదిరా మరి?'
'అలాగే ఇవాళే వెడదాం ' వదిన అందుకుంది.
'మేకపిల్లని కూడా తీసి కెల్దామా, గుసగుస లాడుతూ కూడా వస్తుంది.'
'చూశావురా, ఇలా అయితే నే సినిమాకు రాను'
'మా చక్కా వస్తావు. వస్తానని చెప్పి నువ్వు వచ్చిందెప్పుడు గనక!' అన్నాడు అన్నయ్య. మేం నలుగురం బయలుదేరి వెళ్ళేసరికి ఆ సినిమా సగం వరకు అయిపొయింది. మేమిద్దరం వేరే వెళ్ళేసరికి ఆ సినిమాయే ఆ ఊళ్లోంచి వెళ్ళిపోయింది!
ఏ వస్తువా సరి అయిన ధరకు దొరకని ఈ రోజుల్లో పెళ్ళికొడుకు రేటు పెరిగిపోడం లో పెద్ద విశేష మేమీ లేదు. అక్కడికి ఆ పోవమ్మో కట్టుకుని పెళ్ళికి వచ్చిన వాళ్ళ కోసం పెళ్ళి తంతు సక్రమంగా జరగడం కోసం మరో ఇంత డబ్బు ఖర్చు పెట్టడం లో పిల్ల నిచ్చుకున్న వాళ్ళ పెళ్ళి ముందయిపోడం లో ఆశ్చర్యమూ లేదు. అన్నిటినీ మించి సాధాణంగా పెళ్ళిళ్ళ ముహూర్తాలు రాత్రి పన్నెండు దాటితే గాని పెట్టుకోరు. దొంగలు పెట్టుకునే మూహుర్తాలు కూడా ఆ దరిదాపుల్లోనే ఉంటాయి కాబట్టి శుభ ముహూర్తం అంటే అల్లుడు అత్త వారింట్లో కన్నం వేసే ముహూర్తం అనే నా నిర్వచనానికి అట్టే ఆక్షేపణ ఉండదనుకుంటాను.
.jpg)
ఇక అర్ధరాత్రి వేళ అందరూ 'ఆడంబరాలు' ధరించి జరీ నగలూ, రాళ్ళ నగలూ గుచ్చుకుంటుండగా , ఏడుస్తున్న పిల్లల్ని ఎగదోసుకుంటూ నూటికి తొంబై పాళ్ళు అక్షింతలు 'పురోహితుల' పై జల్లుతుండగా ఉక్కలో, పొగతో చెవులు చిల్లులు పడే మంత్రాల , బ్యాండు మేళాల, రికార్డుల త్రిధ్వని సంగమం లో మునుగుతూ తేలుతూ కళ్ళు జ్యోతుల్లా మండుతుండగా 'బాసిక' గోచావరి జన్మస్థానమని రుజువు చేస్తుండగా , కర్పూరపు దండల్లోనూ, పూలమాలికల్లోనూ విశువిహారం చేసే క్రిమి కీటకాల్ని ఏరుకుంటూ తోలుకుంటూ -- ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారో ఏడు కొండల వాడికే ఎరుక. వారు 'మమ' అని పై కంటున్నారో 'యమా' అని లోలోపల ద్విజుణ్ణి దీవిస్తున్నారో వారికే ఎరుక. ఎందుకంటె ఈ తంతు అంతా అన్నయ్య పెళ్ళిలో చూశాను. అంతకంటే యధావిధిగా జరిగిన మా ఫ్రెండు వసుంధర పెళ్ళి కూడా చూశాను. దాని కసలే పెళ్ళి ముందు నుంచీ కళ్ళ జబ్బు. పెళ్ళయిన తరువాత కొయ్య కండలు పెరిగేయి. వాటిలో ఆర్నెల్ల పాటు నరకం అనుభవించింది. ప్రస్తుతం అంగుళం దళసరి కళ్ళద్దాల సహాయంతో అరగజం దూరంలో ఉన్నది ఆడమనిషెనా , మగ మనిషా పోల్చి గులుగుతూందనుకొండి. అది వేరే విషయం.
కొండమీది చాలామంది దేవుళ్ళు వెలిశారు గాని కొండ మీద , మేడ మీద కాపురమున్నవారు అరుదు. అలాంటి అన్నవరం -- ఇది కూడా మా అన్నవరమే!- సత్యనారాయణ స్వామి సమక్షంలో ఒక చల్లటి సాయం సమయంలో బంధువులూ, స్నేహితులూ కలిసి పది హీను ఇరవై మంది పర్యవేక్షణ లో మా అ పెళ్ళి ఆధునిక ఆదర్శాలకు అనుగుణంగా క్లుప్తంగా హుందాగా ముగిసింది. ఇందులో ఇందుకు విరుద్దమైన వెలితి కలిగించే విషయం కూడా ఒకటుంది. అయన కట్నం పుచ్చుకోడం, మేం ఇవ్వడం ఏవిధంగా సమర్ధనీయమూ అని. నాకోసం నాన్నగారు ప్రత్యేకించిన సొమ్ము మరే విధంగానూ ఉపయోగించడం అన్నయ్య కిష్టం లేదు. అది గాక అయన చదువు కని బాగా అప్పు అయిందట. ప్రస్తుతానికి అది తీర్చి క్రమంగా ఏ నగలో చేయించి నా సొమ్ము నాకు ముట్ట చెబుదామని మా వారి ఉద్దేశం.
పెళ్ళికి మా వసుందరా దాని మొగుడూ వచ్చారు. వదిన తరపున వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారూ, అయన తోడల్లుడూ , మరో ముసిలావిడా ఒకావిడా,వచ్చారు. అయన తరపున వాళ్ళ మేనేజరు గారి కుటుంబమూ ఒకరిద్దరూ కోవర్కర్స్ వచ్చారు. మావారి బంధువులంటూ వచ్చింది వారి అక్క వరసలు కామేశ్వరి అని, ఆవిడ పినతల్లి కనకమహాలక్ష్మమ్మ గారూను. అన్నయ్య బ్యాంకు ఎజేంటూ, టైపిస్టు యోగ మాయాదేవి ఆవిడ అన్నయ్య వచ్చారు.
వీళ్ళందరికీ ఆ రాత్రి విందు ఏర్పాటు చేశాడు అన్నయ్య. ఆహూతులు తక్కువమంది అవడం చేత ఎక్కువ పదార్ధాలు రుచికరంగా చేయించడానికి వీలైంది. నలుగురైదుగురు - పెద్దవాళ్ళూ ఒకరిద్దరు పిల్లలూ తప్ప మిగిలిన వాళ్ళంతా ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం అవడం చేత విందు తమాషా కబుర్లతో చాలా సరదాగా గడిచింది. చుక్కల ఆకాశం చాందినీగా, వెన్నెల బార్ లైట్ కాంతిగా, విశాలమైన ఆరు బయట డైనింగు హాలుగా చల్లని పిల్లగాలి అనుభవం ఎయిర్ కండిషన్ గా ఆ వైశాఖ బహుళ దశమీ నాడు ఏ విధమైన హెచ్చు తగ్గులు లేకుండా పరస్పరం జోక్సు విసురుకుంటూ గడిపిన ఆ వివాహం నాటి విందు రాత్రి అనుభవం నేనెప్పుడూ మరచి పోలేనిది.
పెళ్ళికి నాకు చాలా రకాల బహుమతులు వచ్చాయి. కాని నేను కలకాలం జ్ఞాపకం ఉంచుకునేది అందులో ఒకటే ఒకటి. అది అన్నయ్య నా కిచ్చిన భాగవతం. అందులో ముందు పేజీలో ఇలా ఉంది .
ఇచ్చేడిది బాగమతమట
పుచ్చుకొనెడి ధన్య తోడపుట్టినదట నే
నిచ్చేడిది పెళ్ళి తోవట
ఇచ్చేద వేరొండు సొత్త మివ్వగనేలా?
ఎంత బాగా రాశాడు అన్నయ్య! ఎంత చక్కటి కానుక ఇచ్చాడు! భావాలు ఉంటె ఉండు గాక. వాటిని వ్యక్తీకరించి సందర్భానుసారంగా వాడుకొనే చాతుర్యం మాత్రం అందరికీ ఉండొద్దూ? అసలు బీదవాడని భావించే పోతన ఎంత గొప్పవాడని! రాముడికి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టినట్టు ప్రతిస్కంధం ముందూ ఒక పద్యంలో ప్రార్ధన సమర్పించి -- అంకితమిచ్చానని నాటక మాడి -- మిగిలిన అన్ని పుటలలో అన్ని రుచులనూ కృష్ణుడికే అర్పించిన పోతన ఎంత కొంటెవాడని! ఆ పుస్తకం నా హృదయానికి హత్తుకున్నాను. నా శిరస్సుకు తాకించాను. నేను చదువుకునే గదిలో నాకు అందుబాటులో ఎప్పుడూ ఆ పుస్తకం ఉంటుంది. రాత్రి పడుకోబోయేముందు అందులోనివి కనీసం ఒకటి రెండు పద్యాలైనా చదువుకుంటే గాని నాకు తృప్తి కలిగేది కాదు.
నన్ను అయన కాపురానికి తీసికెళ్ళే రోజునే అన్నయ్య వదినా స్టేషను కి వచ్చారు. దుఃఖంతో బొంగురు పోయిన కంఠం తో అన్నాను.
'వెలితి నిండి ఉన్న ప్రపంచంలో వేలకి విలువైన మనసులు మీవి! మీలాగే మమ్మల్నీ నిండుగా బ్రతకమని దీవించండి.'
ఇదేమిటేవ్, ఈ నీతులు ఎప్పట్నుంచి? నీతులు వల్లేవేస్తూ కూచుంటే చేతలు చెప్పు చేతల్లో ఉండవు జాగర్త.'
'ఒక అయ్య చేతిలో పెట్టెక ఇక చెప్పు చేతల్లో ఉండేదేమిటి? ఇంకో నెల పోయాక మీ చెల్లి మిమ్మల్ని ఇలా పలకరిస్తే అదే గొప్పమాట!' అంది వదిన.
అన్నయ్యా వదినా ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడానికి మనస్సుకి ఎంతగా శిక్షణ ఇచ్చుకున్నారో నాకు తెలీదు గాని నిముషాలు గడిచినా కొద్దీ జరుగబోయే ఎడబాటు వూహిస్తూ నా గుండె కొట్టుకోసాగింది. అసలా వేళ పోద్దుట్నుంది నా మనసు మనసులో లేదు. ఈ ప్రయాణానికి సిద్దమై ఎలా వచ్చానో నాకే తెలీదు. వెంటనే ఉత్తరం రాయమని గాని, ఇల్లు జాగర్త అని గాని ఇలాంటి ఒక్క ముక్క , వదిన మాట అటుంచి అన్నయ్య నోటి నుంచి అయినా రాలేదు, ఎందుకని? అబిమానం లేదా? ఆందోళన ఉండదా? పైకి ప్రకటించరేమని?
పైగా అన్నయ్య నవ్వుతూ ఒక కొత్త పేకా, ఒక కోవా బిళ్ళల పేకెట్టూ నాకు అందచేశాడు.
'చూడండి! హాయిగా ఈ బిళ్ళలు చప్పరిస్తూ ఈ పేక ఆడుతూ కూచోండి. ప్రయాణం చేసి నట్టే ఉండదు. కాలం గడిచినట్టే ఉండదు'
'ఎమామ్మోయ్ మంజూ.... అతని కివ్వకుండా బిళ్ళలన్నీ నువ్వే కాచేశావు గనక!.... గంటయింది మరి వస్తాం. టా....టా'
ఒక్క ఊపుతో రైలు కదిలింది. నా కళ్ళను కన్నీటి తెర కప్పేసింది. ఆ తెర తీస్తే జరిగిపోయిన చిన్న నాటిక నాకళ్ళ ముందు మెదిలింది. వాళ్ళ బాస్ గురించి అన్నయ్య చెబుతూ ఉండేవాడు. ఒకసారి క్యాజువల్ లీవు శాంక్షను చేయించుకోడానికి అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళేడుట.
భాస్కరరామయ్యగారిల్లు పెద్ద బంగళాట. అందులో డ్రాయింగు రూం అమర్చిన పద్దతీ, కర్టెన్లకీ తలగడా గలీబులకీ, గోడలకి , నేలకీ ఉపయోగించిన లేత రంగులూ, లతలూ చూస్తె కళంటే తెలిసిన మొహం కళకళలాడక మానదట. 'ఆ ప్రశాంతతా' నిశ్శబ్దతా చూస్తె అందమూ ఆనందమూ అనేవి వేరే ఎక్కడున్నాయి. ఇలాంటి చోటున తప్ప!' అని వీడు అనుకుంటుండగా వీళ్ళ బాస్ మొదలు పెట్టాడుట.
