Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 3

 

    "మాచెల్లెమ్మ కి నచ్చితే నాకు నచ్చినట్టే, నేను వేరే చూసుకోనక్కర్లేడు' అన్నావుటగా? పిల్లేమో నాకు నచ్చింది. వాళ్ళ నింకా ఏడిపించట మెందుకని తొందర్లోనే ముహూర్తం పెట్టించండని చెప్పి వచ్చేశాము. పెళ్ళి కూతురు పిల్లి కూతురు లాంటిది! తెల్లటి తెలుపే గాని చిరు మీసం ఉన్నట్లు అనుమానం. నిజం చెప్పాలంటే ఆ మీసకట్టు ముందు ఆ ఫేసు కట్టే తీసి కట్టనుకో."
    కళ్ళలోకి నీళ్ళు వచ్చేలా నవ్వేడు అన్నయ్య. నాన్న దెబ్బలాడేరు.
    'ఏమిటి మంజూ మంచి చెడ్డా లేకుండా మరీ అంత మోటు హాస్యం. నువ్వేం నమ్మకోరే. పిల్ల దీపంలా ఉంటుందనుకో."
    "దీపమయితే అక్కడే ఉండనియ్యండి , మనిల్లు అంటుకోగలదు" అన్నాడు అన్నయ్య. ఈసారి నాతొ పాటు నాన్నగారు కూడా నవ్వేరు.
    నిజానికి వదిన ఒంటి రంగెంత తెల్లగా ఉంటుందో ఆ బుద్ది అంత తెలుపు. ఆ మొహ  మెంత నున్నగా ఉంటుందో ఆ నడత అంత నునుపు ఆ మనిషెంత నిండుగా ఉంటుందో ఆ మనసంత నిండు.
    'మధ్య నా కేదో పెళ్ళి చేసి ఉద్దరిద్దామని , నా కట్నం కోపమని నీ ఇష్టానికి విరుద్దంగా , నువ్వు పెళ్ళి చేసుకోడమేమిటి, నీకు అన్ని విధాలా అనుకూల మైనది జత పడి పోవడ మేమిటి? ఇదేం బాగులేదురా అన్నా నాకేమిచ్చుకుని నా కోపం తీర్పు కుంటావో " అనే దాన్ని అన్నయ్యతో.
    'అంత తొందర పడకే-- ఆరోజు రాకపోదులేవే' అనేవాడు.
    'ఏమయ్యోయ్ వెర్రిబాగుల పిల్లా ఏమిటో అనుకుంటున్నట్టున్నావ్ మీ వదిన కాపురాని కొచ్చినట్టుంది. జాగర్త ఇల్లంతా ఆక్రమించెను! అని ముందుగానే హెచ్చరించింది అప్పు కొచ్చిన అప్తురాలోకతె. ఆవిడ చెప్పింది కొంత వరకూ నిజమే. వదిన వంటిల్లు మాత్రం వదలలేదు. కుందేలులా తల్లగా ఉంటుంది కాబట్టి "వంటింటి కుందేలు' అన్నా తప్పు లేదు. ఆ మాట పైకన్నా ఆమెకు కోపం కూడా రాదు.! కాపురానికి వచ్చిన రెండో రోజు నుంచీ రాత్రి పూట తను వండుతానని కూచుంది మరో వారం రోజులకి పొద్దుటి పూట చార్జి కూడా తనే తీసుకుంది. ఇంకో నెల్లాళ్ళకాఫీ కలపడం కూడా నేను మరిచి పోయేటట్టు చేసింది! నేను మంచినీళ్ళు తాగుదామని అ వంటింటి గడప దగ్గరికి వచ్చినా సరే ఒక్క కేకేసేది.
    ఈసారి వదిన అందుకుంది. మా ఇంటి కొచ్చి మాటా పలుకూ నేర్చిన మైనగోరి అది. మా దగ్గిర నేర్చి మమ్మల్నిమించిన మాటల మరాటీ అది.
    'పరాయి ఆడదాన్ని ఒళ్ళూ వయీ తెలీకుండా చూడ్డానికి అతగాడెం అంత పోకిరి మనిషి కాడు ఒకవేళ చూసినా ఆ తప్పు అతని కళ్ళది గాని అతనిది కాదు. ఇంతటి చక్కదనం చూస్తె ఏ రెప్పవాలుతుంది.!'
    నేను వదిన్ని వెక్కిరించాను. ఆమె మళ్ళీ వెక్కిరిచింది    
    "మీ ఇద్దరి మధ్యా నేనున్నాను. ఇద్దరూ కలిసి గుంభనంగా నన్ను వెక్కిరించడం కాదు గదా ఇది?' అన్నాడు అన్నయ్య నవ్వుతూ. మళ్ళీ తనే మొదలు పెట్టేడు.
    'ఇలాంటి మనిషి కోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికేడు. నా సెలక్షను మంచిదో కాదో ఇక కాలమే నిర్ణయించాలి. తల్లీ తండ్రీ మశూచికం వచ్చి ఒక్కరోజు తేడాలో పోయారుట. 'ఇద్దరూ కలిసి రాలేదు గాని కలసి ప్రయాణం చేశారు. కలసి వెళ్ళిపోయారు. ఎంత అదృష్ట వంతులు!' అంటాడు. అంతేగాని కన్నీరు కార్చాడు. ఉన్న పొలం కాస్తా తండ్రి పెట్టిన తనఖా కింద తీరిపోయిందిట. 'సొంత భూమి దున్నుకు సుఖపడ్డ వాడేవాడు?' అంటాడు. చేతిలో రేఖ ఉండాలి. రెక్కలో సత్తు ఉండాలి. బుర్రలో బుద్ది ఉండాలి. ఇవుంటే మనకేం లోటు?' అంటాడు. అప్పుడే బుక్ స్టాల్ లోకి వచ్చిన కొత్త ఇంగ్లీషు నవల కొనుక్కుని చేతిలో పట్టుకుని లాంబ్రెట్టా ఎక్కి అలా తిరుగుతూ ఉంటాడు. చూసి సరదా పడవలసిన మనిషి. అంతేకాదు చెయ్యేత్తు మనిషి. చెయ్యెత్తి దండం పెట్టవలసిన మనిషి. ముఖ్యంగా నీలాంటి దానితో చెయ్యి కలపవలసిన మనిషి. అతని లాంబ్రెట్టా లో ఇంకా వెనక సీటు ఖాళీగా ఉండడం మన అదృష్టం. నాకు అన్ని విధాల నచ్చిన సంబంధమిది. నీకు నచ్చేడని నీ మొహం చూడగానే....'
    అన్నయ్య ఇంకా ఏమోమో చెప్పుకు పోతున్నాడు. చెప్పలేని సిగ్గు తెరలు నన్ను ముంచుకు వచ్చాయి. నన్ను పరీక్ష చేస్తున్న తెల్లని మొహమూ ఎత్తైనా బుగ్గలూ, చిన్న కళ్ళూ , ఉంగరాల జుట్టూ స్మృతి పధం లోకి వచ్చి మరక్కడ ఉండలేక గది లోకి పోయి తలుపేసుకున్నాను. వదిన వచ్చి తలుపు కొట్టింది. కిటికీ దగ్గిరకు వచ్చింది. నేను ఆ తలుపులూ మూసేశాను.
    'కిటికీ తలుపులు కూడా బిడాయించుకోవలసిన రోజులు ముందున్నాయి గాని నాకు లోపల కొంచెం పనుంది తలుపు తియ్యి.'
    వదిన తలుపులు విరగబదినా నేను తియ్యలేదు.
    'తలుపు గడియ పెట్టగలవు గానీ నా నోటికి గడియ పెట్టలేవుగా? నే నన్నమాటలు నీ చెవిలో పడకుండా వుండవుగా? నోటికి కళ్ళకీ మూతలు పెట్టిన బ్రహ్మ తన కేలాగా నాలుగు తలల వలన కొంతవరకు చెవి మూత పడిందని మానవుల్ని కరుణించి చెవులకి మూత పెట్టలేదని నీకు తెలుసుగా?' నేను రెండు చేవుల్లోనూ వేళ్ళు పెట్టుకున్నాను. వదిన తలుపు సందుల్లోంచి చూసింది.
    "వేళ్ళు పెట్టుకున్నా లాభం లేదు, నేనన్న మాటలు వినపడక మానవు. ఒకప్పుడు ఒకరికి చిరుమీసం ఉందని అన్నగారిని బెదర గొట్టిన అమ్మాయి గారూ? ఇప్పుడు నీ వంతు వచ్చిందండి. అబ్బాయి గారి స్వరూపం చూసి ఇదయి పోయినట్టున్నారు, అతనికి తగుమాత్రం మూగ అని తమకి తెలియదు గాబోలు! అయినా శుభమా అని పెళ్ళి చేసుకోబోతున్న తమరిని వేళాకోళం పట్టిస్తే నాకేం కలిసొచ్చే గాని ఉన్నమాట చెప్పకుండా దాచి పెట్టడం భావ్యం కాదు. చూడండి.... పెళ్ళి కుమారుడి గొంతుకుంది చిత్తగించారూ, అడ మేకపిల్ల గొంతుక కూడా ఆగదు. అదేం పెద్ద లోటని కాదు గాని ....' వదిన మ్యేహెహె అని మేకలా అరిచింది. నేను ఒళ్ళు మండి భళ్ళున తలుపు తీశాను.
    "నీకేమైనా మతి పోయిందా ఏమిటి. వదినా ఇవాళ? ఏ డ్యాన్సు చేసే అట బొమ్మ కైనా 'కీ' ఇంత సేపని ఉంటుంది. నీకు మా అన్నయ్య బతికున్నన్నాళ్ళకీ సరిపడే కీ ఇచ్చి వదిలి పెట్టేశాడా ఏమిటమ్మా?"
    'నాక్కాదు మతి పోయిందేవరికో వోసారి అద్దంలో చూసుకుంటే సరి.....ఆ ఎరుపెక్కిన ఒళ్ళు, ఆ మెరుపెక్కిన కళ్ళూ....'
    నేను మళ్ళీ తలుపేసేశాను. అయిదు నిముషాలు ఆగినట్టు ఆగి వదిన తలుపు దడదడ కొట్టింది.
    "మంజూ, మంజూ , త్వరగా తలుపు తియ్యాలి. మీ అన్నయ్యా అతనూ మళ్ళీ ఇలా వస్తున్నారు.'
    నేను హడావుడిగా తలుపు తీసి వంటింటి వేపు పరిగెత్తేను. మొహం రుద్దుకుని పెరట్లోంచి వస్తున్న అన్నయ్యకు డీ కొన్నాను. వదిన నవ్వింది.
    "చూడన్నయ్యా వదిన నన్నివాళ ఎలా ఫూల్ ని చేస్తోందో."
    'పైకలా ఉంది గాని ఆమె ఉత్సాహానికి కారణం వేరులే. ఇలారా చెప్తాను.'
    వదిన మొహం ఒక్కసారి వెలిగినటైనది.
    'వద్దొద్దు, చెప్పొద్దు - నామీద ఒట్టే' అని వదిన అంటూనే ఉంది. అన్నయ్య ఎడం చేత్తో పొట్ట చూపించి కుడి చేత్తో మూడు వేళ్ళు చూపించాడు.
    "అమ్మ!ఎంత గడుగ్గాయివి! ఎంత గడుస్తాయివి! పరమేశ్వరా, మా వదిన సుకుమారి. మళ్ళీ మళ్ళీ కనలేదు. నీ దయ వల్ల ఒక్కసారే ఇద్దరు గాని ముగ్గురు గాని....'
    'అలాగే నువ్వు కందువు గాని...'
    'నీ తిక్క కుదరాలంటే అదేమందు. ఏరా అన్నా సినిమా పార్టీ ఏదిరా మరి?'
    'అలాగే ఇవాళే వెడదాం' వదిన అందుకుంది ,  'మేక పిల్లని కూడా తీసి కెళ్దామా , గుసగుస లాడుతూ కూడా వస్తుంది.'
    "ఏమండోయ్ , ఇదిగో మీ మంజు చూడండి. వద్దంటుంటే ఎలా జోరపడుతుందో ' మా అన్నయ్య వచ్చి నా చెవి పట్టుకునేవాడు.
    "ఏమే, ఎన్నిసార్లు చెప్పేది నీకీ చాయలకి రావద్దనీ , పోతావా, పోవా?'
    "ఏం? నేనేం కులాసాగా ఉండడం మీ కిష్టం లేదా? ఎంతసేపూ చేత్తో పుస్తకం పట్టుకుని ఆ పడక్కుర్చీలో దొర్లుతుంటే తిన్నది నాకెలా అరుగుతుందనుకున్నారు? ఇప్పుడు మీరిలా పిడచ చేసి నా నోటికి అందిస్తుంటే అడ కూతుర్ని గదా ఎల్లకాలం నాకెలా జరుగుతుందనుకున్నారు? ఏమయినా సరే నేనివాళ వంటింట్లో నుండి కదలను' అని కత్తిపీట ముందేసుకుని కూచున్నాను.
    ఒకనాడు ఉల్లిపాయలు ముందేసుకుని 'ఓహో అంతవరకూ వచ్చిందే ఉండు నీ పని ఇలా కాదు , మంగళా,నీ చెయ్యి కడుక్కుని ముందిలారా.'
    వదిన పమిటతో చేతులు తుడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది.
    'పట్టు, పట్టు ,దీన్ని సాయం పట్టు.'
    ఇద్దరూ బలవంతాన నన్ను ఎత్తుకున్నంత పని చేసి వీధి గదిలో కులేశారు. అన్నయ్య గది తలుపు గొళ్ళెం వేస్తూ అన్నాడు.
    'వంటయ్యాక తలుపు తీస్తుందిలే మీ వదిన, దుఖపడకు.'
    ప్రపంచంలో దేనికయినా విలువ కట్టవచ్చు. ఎలాంటి దైనా కొలవవచ్చు. అభిమానం కొలమానం మరి కాదు.
    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా కిటికీ వూచలు పట్టుకుని వీధి వైపు చూస్తూ కూచున్నాను. అవతలి నుండి కిటికీ లోంచి అదే పరిస్థితుల్లో ఆరేళ్ళ బాబు కనిపించాడు.
    'అక్కయ్య గారూ, అల్లరి చేశానని మా అమ్మ నన్ను గదిలో పెట్టేసిందండి, కొంచెం అలా వచ్చి గొళ్ళెం తియ్యరూ?'
    మరింత పులకరించి పోయింది నా మనసు.
    అమ్మ ఫోటో చూసి నాన్నగారు అనుకునే వారేమో!
    'వెంకట్రావణ , నీ కొడుక్కి అన్ని విధాలా తగిన కోడల్ని తెచ్చెను. నీ కూతురి కోసం సొమ్ము కూడా సిద్దం చేశాను. నీ ఆశీర్వాదం వల్ల దానికీ కూడా మంచి మొగుణ్ణి తేగలిగితే....'
    'మీరు తెచ్చేదేమిటి, వాళ్ళు చేసుకునే దేమిటి మీ వెర్రి గాని! అంతా మీ చేతుల్లోనే ఉన్నట్లు చెబుతారేం? చాలీ పాటికి ఇవతలికి రండి' అన్నదేమో అమ్మ మరి. నాకు తగిన సంబంధం తీసుకు వద్దామని నాన్న కాలికి బలపం కట్టుకుని తిరిగినన్నాళ్ళు పట్టలేదు.
    అయిదు వేల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి గదా అని గుండె మీద చెయ్యి వేసుకుని నిబ్బరంగా నిద్రపోయినన్నాళ్ళు పట్టలేదు. తను నాలుగు గంటలకి లేస్తే మూడు న్నరకి అలారం పెట్టుకుని లేచి, పూజా సామాగ్రిని సిద్దం చేసే కోడల్ని చూసుకుని మురిసి పోయినన్నాళ్ళు పట్టలేదు. మరి ఆరు నెలలకి హాలులో గోడ మీది ఫోటో ప్రక్కన నాన్న ఫోటో వెలసింది.
    
                                      2
    ఇంటర్ పరీక్ష ప్రైవేటు గా కట్టి ప్యాసవడం తప్ప నా జీవితంలో ఆ తరువాత చెప్పుకో తగ్గ పెద్ద మార్పు లేవీ లేవు. అన్నయ్య అదివరకే బీ.కాం ప్యాసై బాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిద్దరి ఆదరాభిమానాలతో నా జీవితం తెలుసుకోలేనంత వేగంతో గాలి పడగలా, పూల పడవలా గడిచి పోయింది.
    అన్నయ్య ఒకనాడు ఎవరో ఒకాయన్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. అయన బియ్యే ప్యాసయ్యాడట. ఏదో కంపెనీలో పనిట. పరిచయ వాక్యాలలోనే పూర్తీ భోగట్టాలు చెప్పి ' మీరు కూచుని మాటాడుకుంటూ ఉండండి, నేను బట్టలు మార్చుకు వస్తాను' అని లోపలికి వెళ్ళేడు. ఆయన నా కుర్చీకి ఎదురుగా కూచుని నన్ను పరీక్షించడం ప్రారంభించాడు. నాకు ఒళ్ళు మండింది. అయన మీద కాదు, అన్నయ్య మీద.
    'ఇల్లు చూద్దురు గాని రండి. ఫరవాలేదు అలా బూట్లతో రావచ్చు' అని ఆయన్ని లోపలికి తీసి కెళ్ళారు. అలా అన్ని గదులూ తిప్పి అన్నయ్య గదిలోకి తీసికెళ్ళి కూచో పెట్టెను.
    'ఇదిగో మా అన్నయ్య గది. ఈ పేపరు చదువు కుంటూ ఉండండి. అన్నయ్య వస్తాడు, మాట్లాడవచ్చు. పాపం మీరు వాడి కోసమేగా వస్తా? నాక్కొంచెం పనుంది, అలా వెళ్ళొస్తా. మరేం అనుకోరుగా?' అంటూ అయన తెల తెలబోతుంటే నేను ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఇవతలి కొచ్చేశాను. ఆయన్ని వెళ్ళనిచ్చి వదినతో అన్నయ్యంటాడు.
    "చూశావా మంగళా, ఇది ఆ పెద్ద మనిషికి చేసిన మర్యాదా?"
    "ఓ! ఒడ్డూ పొడుగూ చాలా పెద్ద మనిషి. నువ్వెంత పెద్ద మనిషో.... ముక్కూ మొగం తెలియని వాణ్ణి ముందు కూచోపెట్టి మాట్లాడుతూ ఉండండని నీ మటుకు నువ్వు జారుకోడమే కాదూ మర్యాద! దానికి తగిన మర్యాదే నేనూ చేశాను. అయినా పరాయి ఆడదాన్ని, అలా రెప్ప వాల్చకుండా చూస్తూ కూచోడానికి అతని కెంత సిగ్గు లేకపోయిందో!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS