Previous Page Next Page 
శరన్మేఘం పేజి 3


    తల తిప్పి రత్నం కేసి చూశాడేకాని, గోపాలం ఏం మాట్లాడలేదు. రత్నానికి ఏం పాలుపోలేదు. అలా చూశారేవిటి? ఏమయింది? మాట్లాడరేం? కంగారుగా అడిగింది దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యివేసి కుదుపుతూ. గోపాలం ఈ మాటూ మాట్లాడలేదు. రత్నానికి భయం వేసింది. "మిమ్మల్నే - నాకు చెప్పండి. ఏం జరిగింది? చెప్పరూ?" అంటూ అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. గోపాలం దీర్ఘంగా నిట్టూర్చి జేబులో ఉన్న కవరు తీసి రత్నానికి అందించాడు. అందులో ఏముందో దేవుడా అని భయపడుతూ వణికే చేతుల్తో అందుకుని చదవ నారంభించింది. చిరంజీవి గోపాలాన్ని.
    అన్న ఆశీర్వదించి వ్రాసేది. నువ్వూ చి! సౌ!! మరదలూ చంటిబాబూ కులాసాగా ఉన్నట్లు తలుస్తాను. నా వంట్లో పరిస్థితి రోజుకోలాగ ఉంటోంది. మళ్ళీ ఇవాళ ఓ డిగ్రీ టెంపరేచర్ పెరిగింది. చివరికి ఈ క్షయజబ్బు నన్ను చెద తిన్నట్లు తినేస్తుందేమో అనిపిస్తోంది. మీ వదిన మాత్రం నన్ను బతికించుకోవాలని తెగ శ్రమ పడుతోంది. ఉద్యోగంలో కూడా చేరింది. అమాయకురాలు కాని కొండమీంచి దొర్లే రాయిని ఆపగలదా? ఏదో - దాని నమ్మిక దానిది. కాని నమ్మకం వమ్ము అయేలోపుగా నిన్నోమారు చూడాలనిఉంది. చంటిబాబు ఎవరి పోలిక ? వాణ్ణి కూడా చూడాలని మనస్సు పీకుతోంది. కాని....
                                                                     ఆశీస్సులతో
                                                                        శివరాం.
    "ఊ..." అని దీర్ఘంగా నిట్టూర్చి కవరు పక్కనపెట్టి గోపాలం కళ్ళలోకి చూసింది రత్నం. గోపాలం కళ్ళలో నీటితెర కనిపించి కంగారుపడింది. దగ్గరగావెళ్ళి "అదేవిటి అలా బాధపడతారు? బావగారికి జబ్బు తప్పకుండా తగ్గుతుంది. మీరు మనస్సు పాడు చేసుకోకండి. శుభమా అని కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు" అంది అతని ముఖాన్ని తనవేపు తిప్పుకుంటూ గోపాలం ఆమెకేసి చూసి బేలగా "నీకు తెలియదు రత్నం. మా అన్నయ్య లోకంలో అందరి అన్నయ్యల లాంటివాడూ కాదు" అన్నాడు.
    నిజంగానే రత్నానికి తెలియదు శివరాం గోపాలాన్ని చిన్నప్పటినుంచీ ఎలా ప్రేమగా పెంచుకువచ్చాడో - గోపాలానికి ఏడాది వెళ్ళకుండానే వాళ్ళమ్మపోయింది. అయిదేళ్ళు నిండే టప్పటికి నాన్నపోయాడు. అప్పటికి శివరాం కి కూడా పట్టుమని పదేళ్ళు లేవు. అయినా ఆ అయిదేళ్ళ తమ్ముడ్నీ పెద్ద ఆరిందాలా చూసుకుంటూ పింతల్లిగారి పంచన పెరిగాడు. తమ్ముడు నాన్న కోసం, అమ్మకోసం బెంగపెట్టుకోకుండా అస్తమానూ మరిపిస్తూ, నవ్విస్తూ, ఒక్క క్షణం ఏమరకుండా రాత్రిళ్ళుకూడా ఓ చెయ్యి గోపాలం మీద వేసుకుని మరీ పడుకునేవాడు శివరాం. పింతల్లీ ఆమె భర్తా చనిపోయాక తమ్ముడి బాధ్యతా తన బాధ్యతా తనమీదే పడి తన చదువు సాగించుకోవడం చాలా కష్టంగా తయారైన రోజుల్లోకూడా శివరాం. తమ్ముడికి సమస్త సౌకర్యాలూ సమకూర్చేవాడు. తను బియ్యే పాసు అయ్యేటప్పటికి ఉన్న ఆస్తి కాస్తా హరించుకుపోగా. ఇంకా తను చదువు సాగిస్తే తమ్ముడి చుద్వు ఎక్కడ జరగదో అనే భయంతో తను చదువు మాని ఉద్యోగంలో చేరి, చదువుకుంటాను అన్నంతదాకా తమ్ముడికి చదువు చెప్పించాడు శివరాం. ఇచ్చటికి కూడా అయ్యో. నాకు అమ్మా నాన్నవల్ల చిన్నప్పుడు కొంత ముద్దు అయినా తీరింది. పాపం తమ్ముడికి ఏం తీరలేదే అన్న బెంగే శివరాం కి. ఇరవై ఏళ్లనుంచి ఇలా అన్నగారి దగ్గర గోపాలం. గుండెల నిండుగా రుచిచూసిన వాత్సల్యం తాలూకు మధురిమ. ఏడాది ఏన్నర్ధం క్రితం పెళ్ళయి కాపురానికి వచ్చిన రత్నానికి ఏం తెలుసు? అందుకే గోపాలం హృదయం లోని వేదనని గ్రహించలేకపోయింది రత్నం.
    "ఊ..... లేవండి బట్టలు మార్చుకోండి.....ఈ పాటికి న్యూస్ రీలు కూడా అయిపోతుంది" అంది గోపాలాన్ని తొందరచేత్శూ.
    "నా మనస్సు బాగోలేదు. ఈ పూట సినిమా వద్దు" అన్నాడు గోపాలం.
    "అయిందీ? ఇలాంటి అవాంతరం ఏదో వస్తుందని భయపడుతూనే ఉన్నాను. అనుకొన్న అయిదుగంటలకి మీరు రాకపోయేసరికి- అయినా సినిమాకు రావడం మనుకుని మీ రిక్కడ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ఆయన ఆరోగ్యం బాగుపడుతుందా. లేవండి. సరదాగా సినిమా చూసివద్దాం. ఆ తర్వాత సావకాశంగా ఆలోచిద్ధురుగాని అన్నగారి ఆరోగ్యం గురించి" అంది రత్నం వేళాకోళంగా నవ్వుతూ.
    "నన్ను విసిగించకు. కావలిస్తే నువ్వు వెళ్ళు" గోపాలం ఇలా చీదరించుకావడంతో రత్నం చిన్నబుచ్చుకొంది చాలా సేపటివరకూ మౌనంగా ఎవరి ఆలోచనల్ల్లో వాళ్ళు ఉండి పోయారు. ఆ తర్వాత తనలో తను అనుకున్నట్లుగా అంది "మొదటినుంచీ మీరు నాకు నా హద్దులేవో జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. నేనే అప్పుడప్పుడు వెర్రిపడి. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కాబోలని పొరబడుతూ ఉంటాను"-
    గోపాలం ఏం సమాధానం చెప్పలేదు. అధమం ఆమెవైపైనా చూడలేదు. శివరాం ఆరోగ్యం గురించి ఆందోళనతో ఆలోచిస్తూన్న గోపాలాన్ని చూస్తే రత్నానికి మరోలా అర్ద్జమైంది. "తను అన్నా, తన మాట అన్నా అంత నిర్లక్ష్యం ఏమిటి ఆయనకి? మామూలుగా సరదాగా ఉండే వ్యక్తి. ఉండి ఉండి ఇలా జాలిలేని కేఠిన శిలగా మారిపోతారేం? తన అందం తెలివీ, నేర్పరితనం ఇవేమీ ఆయన్ని కరిగించలేకపోతాయేం? ఇవన్నీ ఉండీ తన కేవిటి లాభం? ఆయన్ని తన వాడిగా చేసుకోలేక పోయాక? లోకంలో ఎంతమంది ఆడవాళ్ళు తమ తమ భర్తల్ని కనుసన్నల్లో నడ్పుకుంటారు. అటువంటిది తను ఆయన్ని ఎందుకు ఆకర్షించుకోలేకపోతోంది తనకి చదువు లేక పోవడమా? ఆయన పెద్ద చదువు చదువుకోవడమా?" ఇది తన లోపమా? ఆయన అహం కారమా!" ఆలోచించినకొద్దీ రత్నానికి తన అశక్తతా గోపాలం నిర్దాక్షిణ్య ప్రవర్తనా కొండంతలుగా కనిపించి, గుండెలు బాధతో మండిపోసాగాయి.
    ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయి బిగ్ బెన్ లో చిన్న ముల్లు ఎనిమిది అంకెని చేరుకోవడం చూడనేలేదు. ఆఖరికి రత్నమే నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ" ఊ..... చాలాబాగుంది మన సినిమా ప్రయాణం. బాబిగాడు నిద్రపోయాడు. ఇంక లేవండీ భోజనం చేద్ధ్రురుగాని" అంది దీర్ఘంగా నిట్టూర్చి గోపాలం లేచాడు.
    "అదేవిటి అంతా కింద పీట వాల్చుకుంటున్నారు?"
    "డైనింగ్ టేబిల్ మీద వద్దు. ఇలా వడ్డించు. ఇక్కడ కూచుంటా.
    కిందా? అవునులెండి! డైనింగ్ టేబుల్ బోజనమా ఆ దర్జా ఆ ఠీవీ రమ్మంటే వస్తాయా స్వతహాగా ఉండాలి కాని"
    "మరైతే ఎందుకు కొన్నావు ఈ టేబిలు. మీ ఆయన అనాగరికుడూ, దర్జాలేని వాడూ అని తెలిసికూడా?"
    ఆ మాటవిని దెబ్బతిన్నట్లు అతనికేసి చూసి. వెంటనే కోపంతో" లక్షసార్లు అన్నారు ఎందుకు కొన్నావు అని. మనకి అక్కర్లేకపోతే మా ఫ్రెండ్స్ కి ఎవరికేనా ఇచ్చేస్తాను లెండి డైనింగ్ టేబిల్ కొనుక్కోవాలని వాళ్ళు ఏక ఇదవుతున్నారు" అంది రత్నం అన్నం వడ్డిస్తూ.
    "అప్పుడు కంగారుపడి కొనడం ఎందుకు ఇప్పుడు పౌరుషపడి అమ్మడం ఎందుకు? ఈ ఆలోచన అంతా కొనబోయేముందు ఉండాలి ఈ వస్తువు మనకి ఉండాలా లేదా? పక్కింటివారు కొంటుంటే మోజుపడి కొంటున్నామా, నిజంగా అవసరమై కొంటున్నామా అని"
    "మీ సలహా ఇకనుంచి పాటిస్తాను లెండి. ముందు భోజనం చెయ్యండి."
    తలవంచుకుని భోజనం చేస్తూన్న గోపాలాన్ని చూసి చిరాకుగా" మాటా పలుకూలేని కాడికి. ఇక్కడ నేను కూర్చోవడం కూడాదేనికి? మీరు పెట్టుకొని తినండి. నేను వెళ్ళి పడుకొంటాను నిద్దరవస్తోంది" అంది రత్నం.
    "అయితే వెళ్ళు" అంటూ తను వడ్డించుకోబోయాద్ గోపాలం," అవునులెండి మీరు దేనికైనా సిద్ధమే! "అంటూ నిష్ఠూరంగా అని తను అతని చేతిలోంచి గరిటె లాక్కుని వడ్డించసాగింది రత్నం.
    "చీర ఎలా ఉంది? బాగుందా? అదేవిటి అలా ఆశ్చర్యంగా చూస్తారు? పోయిన నెలలో కొనుక్కున్న చీర ఇది"
    "పక్కింటి ఆవిడ దగ్గర అప్పు తీసుకుని... అవునా?" వ్యంగ్యంగా అన్నాడు గోపాలం. రత్నం చిన్నబుచ్చుకుంది.
    "బాకీ తీరిందా?"
    "వచ్చే నెలతో పూర్తిగా తీరుతుంది"    
    "ఈ లోపుగా ఇంకో కొత్త ఖర్చు తగలకుండా ఉంటే? అంతేనా? "రత్నం నేలకేసి చూస్తూ ఉండిపోయింది.
    "నే నిప్పుడే చెబుతున్నాను. నీ పద్ధతి మార్చుకోపోతే లాభంలేదు. ఆ ఆఫీసరు గారి భార్యకొంది. ఈ సినిమాస్టార్ కి ఉంది అంటూ వేలంవెర్రి ఎక్కి కొనడం మొదలెడితే మన లాంటి మధ్య తరగతివాళ్ళం మట్టిగొట్టుకు పోతాం. అయినా ఎవరికో ఉందని మనమతి పోగొట్టుకోవడం ఏమిటి? మన తాహతుకి తగినట్లు మనం ఉండాలి మహారాణీకి ఉందికదా అని నువ్వుకూడా ఓ కిరీటం తగిలించుకుని వీధుల్లో ఊరేగితే ఎలా ఉంటుంది?.... మతి లేకపోతే సరి అర్ధంలేని ఆలోచనలూ, బాధ్యత తెలియని ఖర్చులూ.....హుఁ! "అంటూ గోపాలం చెయ్యి కడుక్కుని లేచాడు.
    అతని పద్ధతేమీ అంతుపట్టడం లేదు రత్నానికి. డబ్బు ఖర్చు అవుతోంది అంటే, అలా ఇది అయిపోతారేమిటి? ఉన్న దాంట్లో కాస్త దర్జాగా బతకాలి కాని. ఈ పిసినారి బతుకేవిటి? దమ్మిడీ దమ్మిడీ లెక్క చూసుకుంటూ? ఇట్లా ఇంట్లో వస్తువులూ చూస్తారు కాని, డబ్బుంటే ఎవరు చూడొచ్చారు. అమ్మ ఏదైనా కొంటే నాన్న కూడా ఇలాగే అనేవారు. అసలు ఈ మొగాళ్ళ మనస్తత్వమే ఇంతేమో- ఏమో గదిలోకి వచ్చి చూసేసరికి గోపాలం జిప్ బేగ్ లో బట్టలు పెట్టుకుంటున్నాడు. రత్నం కంగారుగా అతనిని సమీపించి "జిప్ బేగ్ సర్దుతున్నారు. ఎక్కడికి ప్రయాణం?" అంది. గోపాలం సమాధానం చెప్పలేదు. "అన్ని జతలు పెట్టుకుంటున్నారు ఎన్నాళ్ళు ఉంటారేమిటి." గోపాలం ఈమాటూ మాట్లాడలేదు. "మిమ్మల్నే భుజం పట్టుకుని కుదుపుతూ అడిగింది. ఏదో ఆలోచనల్లోంచి తేరుకున్నట్లు అటు తిరిగి చూసి "మదనపల్లి వెళ్ళి వస్తా" అన్నాడు గోపాలం.
    అన్నగారి దగ్గరికి గోపాలం వెళుతున్నాడు అని తెలిశాక ఇంక అతన్ని ఆ ప్రయాణం అపడంతఃనవల కాదని తెలిసి హతాశమై నీరసంగా ఊరుకొంది రత్నం. అయినా ఆఖరి ప్రయత్నంగా అంది. "ఒక్కర్తెనో ఉండలేను" అని. "పక్కింటి వాళ్ళున్నారు భయం లేదు" అన్నాడు. ఆ అభ్యంతరాన్ని తేలిగ్గా తోసేస్తూ గోపాలం, "మరి ఆఫీసుకి సెలవు పెట్టారా?" అంద్. "తిరిగి ఎప్పుడు వస్తారు?" అని అడిగింది "వచ్చే నెలలో వెళ్ళకూడదా?" అంది. "మీ ప్రయాణం చూస్తే వారం రోజులదాకా వచ్చే లాగ లేరు" అంది. "ఎన్ని అడిగినా మాట్లాడరేం!" అంది. చివరకి ఉక్రోషం వచ్చి "మీరు ఎంతకేనా తగుదురు. చివరికి ఆ ఊరు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నా చేయించుకుంటారు అన్న గారిని వదిలి ఉండలేక" అంది.
    ఒక్క క్షణం ఆమెకేసి తేరిపార చూసి 'మంచి సలహా ఇచ్చావు రత్నం! అవును అలా చేస్తే నిజంగా అన్నయ్యకీ, వదినకీ సాయం చెయ్యడానికి వీలవుతుంది " అంటూ జిప్ బేగ్ తీసుకొని బయలుదేరాడు గోపాలం. "నిజంగా అంత పని చేస్తారా?" అని భయపడుతూ ఆ మట్టునే ఉండిపోయింది రత్నం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS