ఆ తరువాత ఒక్కొక్కరు ఎన్ని జతల బట్టలు తీసుకు వెళ్ళాలి అన్న ప్రశ్న ఎదురయింది. 'నా మటుకు నేను మూడు పాంట్లు, మూడు షర్టులతో సరిపెట్టుకోగలను.' అన్నాడు కాంతారావు- అదేదో గొప్ప సుగుణం అన్నట్లు ఫోజు పెట్టి.
"మీ మగవాళ్ళ సంగతి వేరు. మీరు వేసుకునేవి టెర్లిన్ వీ, టెరీ కాటన్ వీ కాబట్టి ఒక్కో జతను నాలుగు రోజుల వరకు కడ్తారు. ఆడవాళ్ళ కదేలా కుదురుతుంది? మా చీరలు ఊరికే నలిగిపోతాయ్. అందులో చంటి పిల్లలతో పోతుంటిమి. ఊరికే మాసిపోతాయ్ కూడా.'
'అందుకే మరో మూడు జతలు ఎక్కువ తెచ్చుకో.
'అయ్యో ఏం మనుషులండి మీరు! పదిహేను రోజులు చేసే ప్రయాణానికి ఏ ఆడదైనా నా ఆరు చీరలతో సరిపెట్టుకోకలదాండీ . ఎంత నాసిగా చూసినా రోజుకో చీరన్నా మార్చాలా? ఆ లెక్కన చూస్తె పన్నెండు జతలు తప్పనిసరిగా కావలసి వస్తుంది-'
'అయ్యా బాబోయ్.... నేను ఒప్పుకోవాలే గానీ చూస్తుంటే యిల్లంతా మూట గట్టుకుని ప్రయాణ మయ్యేట్లున్నావ్ నువ్వు....'
'అనండి, అనండి . అనేకేం జేస్తారు మీరు. మగవాళ్ళ కి మీకు మా ఆడవాళ్ళ బాధలెం తెలిస్తాయ్? టింగు రంగా అనుకుంటూ రెండు జతల బట్టలతో ఊళ్ళు తిరిగి రావటం మీ మగవాళ్ళ కే చెల్లింది. మాకేలా కుదురుతుంది ? హు!' అంది కొరకొర అతని వంక చూస్తూ.
'ఆ తీక్షణ వీక్షణాలను కట్టి పెట్టి నీ యిష్ట మోచ్చినన్ని చీరలు పెట్టుకో. మధ్య నాకెందుకు?' అంటూ అక్కడ నుండి వెళ్ళబోయేడు కాంతారావు.
'చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఎడుస్తాడుట ....ఎక్కడికి పోతున్నారు? ఇటు రండి-- ఏమేం చీరలు తెచ్చుకో మంటారో యిప్పుడే చెప్పండి. ఆ పైన అన్నీ సర్దినాక వంకలు పెట్టేరంటే నేనూరుకునేది లేదు.' అంది అతని చెయ్యి పట్టుకుని యివతలకు లాగుతూ.
'నేను చెప్పినా ఏం లాభం? నువ్వు నా మాట ఎప్పుడైనా వింటావా, ఏమన్నానా? చివరకు అంతా నీ యిష్ట ప్రకారమే జరుపు కుంటావు.' అన్నాడు బుంగమూతి పెట్టి కాంతారావు.
భర్త అలా తన ఆధిక్యతను అంగీకరించి అమాయకంగా ముఖం పెడ్తే కళ్యాణి కి చెప్పలేని ఆనందం కలుగుతుంది.
అతని కోపం చూసి ముసి ముసిగా నవ్వుకుంటూ.
'మా రావు చాలా మంచి వాడమ్మా . అతనేం చెప్తే అది చేస్తాను నేను. సరేనా? ఇంక చెప్పు....నీ యిష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యను....' అంది ముద్దుగా కళ్యాణి.
భర్త మీద ప్రేమ అధికమైనప్పుడల్లా కళ్యాణి అతనిని 'కాంతం ' అనో 'రావు' అనో పేరు పెట్టి ఏకవచనం లో మాట్లాడుతుంది. కళ్యాణి కనుక అలాంటి మూడ్ లోకి వస్తే తప్పకుండా తను చెప్పినట్లు వింటుందని అనుభవం మీద గ్రహించిన కాంతారావు - మళ్ళీ ఆమె మూడ్ ఎక్కడ మారిపోతుందో నని త్వరితంగా తనకు నచ్చిన చీరలన్నీ బయట పెట్టించేడు.
ఒకటి, రెండు చీరల విషయంలో కళ్యాణి కొంచెం గొణిగినా. అంతకు ముందే అతనికిచ్చిన వాగ్ధనానికి కట్టుబడి ఉండవలసి నందువల్ల ఒప్పుకోక తప్పలేదు.
అప్పటికి భోజనాల వేళ అవటంతో బట్టలన్నీ ఎక్కడివక్కడ వదిలేసి భోజనం చెయ్యటానికి వెళ్ళేరు. బాబిగాడు, పాప బయట వరండా లో ఆడుకుంటున్నారు.
కళ్యాణి కాంతారావు భోజనం చేస్తున్నారన్న మాటేగాని వాళ్ళ ధ్యాసంతా ప్రయాణం మీదే ఉంది. వో పక్క సామాన్లు సర్దుకోవటం తో హడావుడి పడుతూ చికాకుగా ఉన్నప్పటికీ మనసులో మాత్రం యిద్దరికీ ఏదో అవ్యక్తమైన ఆనందం, భావావేశం కలుగుతున్నాయ్. అంత తొందర పాటులోనూ మధ్య మధ్య ఒకరి ముఖంలోకి ఒకరు దీర్ఘంగా , భావ గర్భితంగా చూస్తుకుంటూ ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని, రహస్యమైన మాధుర్యాన్ని అనుభవించ సాగేరు.
ఆ రోజంతా యిద్దరికీ కూడా తాము ప్రణయ విలాసాలలో తెలియాడిన తోలి దినాలు గుర్తుకు వచ్చి శరీరం గగుర్పొడిచింది. పీడకలలో నుండి హటాత్తుగా మేల్కొన్న వాడికి తన చుట్టూ ఉన్న సహజామైన , సుఖ వంతమైన పరిసరాలను చూస్తే ఎలాంటి సంతోషం కలుగుతుందో ఆ దంపతులకు కూడా అదే రకమైన అనుభూతి కలుగుతోంది.
పెళ్ళయిన వెంటనే సంసారంలోకి మెడ లోతు వరకు దిగిపోయిన ఆ యువ దంపతులకు యిప్పుడు తమ అస్తిత్వాన్ని గూర్చిన ఆలోచన రావటం తో ఒక విచిత్రమైన ఉద్రేకం ఆవరించింది యిద్దరినీ.
ఇన్నాళ్ళూ మానసికంగా తామిద్దరూ ఎంతో దూరమై పోయారనుకుని దిగులు పడుతున్న వారికి తామిద్దరూ యీ ప్రేమ యాత్రలో మరింత సన్నిహితులు కావచ్చు నన్న ఆశ కలిగింది.
ఆ రకమైన ఆలోచనల్లో ఉన్నవారికి పనుల హడావుడి లో ఒకరి కొకరు దూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు రెండూ క్రమంగా పెనవేసుకు పోతున్నట్లు అనుభూతి కలగ సాగింది.
అన్నం తింటున్నంత సేపు కూడా కల్యాణి కాంతారావు లలో ఒక రకమైన తొట్రుపాటు ఆవేశం కలగ సాగినాయ్. ఐతే ఆ తొట్రుపాటు లో ప్రయాణాన్ని గూర్చిన ఆందోళన కన్న ఎక్కువగా , ఒకరికొకరు సన్నిహితంగా రాబోతున్నామన్న ఆనందాతిశయమే ఉంది.
అన్నం తింటున్న వాడల్లా యిక ఉండబట్ట లేక చటుక్కున తినటం ఆపేసి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు కాంతారావు.
తమ యిద్దరిని గూర్చిన మధుర భావాలతో నిండిపోయిన ఆమె శరీరం లోని అణువులు సున్నితమైన అతని స్పర్శ తో తీవ్రంగా స్పందించినాయ్. బిగపట్టి ఉంచిన వీణ తీగలు నిపుణుడైన నైపుణిడి చేతి వేళ్ళు తగిలినంతనే ఝల్లు మన్నట్లు ఆమె నరాలన్నీ మధురంగా కంపించినాయ్.
ఆ భావా వేశానికి తట్టుకోలేని తన పక్కనే తనని అనుకుని కూర్చున్న భర్త భుజం మీద తల నానించి కళ్ళు మూసుకుంది కళ్యాణి.
ఎడమ చేత్తో శరీరాన్ని పొదివి పట్టుకుని ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ కళ్యాణి !' అంటూ మత్తుగా పిలిచేడు కాంతారావు.
నిజానికి రోజులో కనీసం ఒక్కసారన్నా భర్త తనని ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించు కుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. పెళ్ళయిన కొత్తలో. అతని ముద్దు కోసం తహతహలాడి పోయేది కళ్యాణి. క్రమంగా అలవాటు పడిపోయినందు వల్ల దానిని సహజంగా తీసుకో సాగింది. అలాగని ఆ చర్య వలన ఆమెకు ఎలాటి ఆనందం కలగటం లేదను కొనటానికి వీల్లేదు. తోలి దినాలలోని ఉద్రేకం కలిగేది కాదు, మేఘాల చాటున దాగి వుండే చందమామ లా. నివురు కప్పిన నిప్పులా, సంసారిక తాపత్రయంలో పడిపోయిన ఆమె మనసు అట్టడుగున కలిగే ఆ ఆనందాను భూతిని పైకి వ్యక్త పరిచేది కాదు: అంతే! అదీకాక పొరపాటున ఏ రోజన్నా అతడు ముద్దు పెట్టుకోవటం మరిచి పోయేడో యింక వారం రోజుల వరకు అతనిని సాధిస్తుండేది. 'ఔన్లె! కొత్తొక వింత పాతొక రోత అని ఊరికే అన్నారా! అప్పుడంటే ప్రేయసిని కాబట్టి ప్రాణాలర్పించటానికి కూడా సిద్దపడే వారు. ఇప్పుడేమో పెళ్ళాన్నయ్యే! ప్రేమ రమ్మంటే ఎక్కడ్నించి వస్తుంది? నా పిచ్చి గాని...' అంటూ ఏకబిగిన గొణుక్కుంటూ ఉండేది.
ఆమెను శాంత పరిచే సరికి తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యేది కాంతారావు కి. అతను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అంతకు పదిరెట్లు ప్రేమ చూపితే గాని సమాధాన పడేది కాదు కళ్యాణి మనసు.
అలాటి కళ్యాణి కి యిప్పుడతని స్పర్శ మధురమైన ఆ పిలుపు ఎంతో ఉత్తేజాన్ని కలిగించినాయ్. మళ్ళీ తను మాములు కళ్యాణి గా, ప్రేమ మూర్తిగా మారిపోతునట్లనిపించిందామెకు.
అలా పరస్పర స్పర్శా నుభవంతో పరవశించి పోయిన ఆ దంపతులు కాసేపటికి తేరుకుని మళ్ళీ అన్నం తిన సాగేరు.
తమకు కలిగిన ఉద్రేకాని కి లోలోన సిగ్గుపడుతూ దానిని అణచి వేసుకునే ప్రయత్నం లో మామూలు ధోరణి లో తమ ప్రయాణాన్ని గురించి మాట్లాడు కున్నారు.
అన్నం తినటం పూర్తయిన తరువాత బట్టలు సర్దుకున్దామని గదిలోకి వెళ్ళింది కళ్యాణి. అక్కడ కనపడిన దృశ్యాన్ని చూస్తూనే కొయ్యబారి నిల్చుండి పోయింది.
చివరకు తేరుకుని 'ఏమండోయ్ . ఒక్కసారిలా రండి ఏం జరిగిందో చూడండి.' అంది గావు కేకలు పెడ్తూ.
"ఏమయింది?ఏమయింది?' అంటూ పరిగెత్తుకు వచ్చేడు కాంతారావు.
వచ్చిన వాడు వచ్చినట్టు గానే ఆగిపోయేడు టక్కున ఎలక్ట్రిక్ షాక్ తిన్నట్టు.
పాప హోల్లాలు పాడు చేసింది.
బాబిగాడు ఎక్కడ సంపాదించేడో -- ఒక సిరాబుడ్డి తీసుకుని అందులోని సిరాని అక్కడ కుప్పలుగా పడి ఉన్న చీరెల మీద , కొంచెం, తన వంటి మీద కొంచెం వలక బోసుకుని మిగిలిన దానిని పాప నెత్తి మీద పోస్తున్నాడు.
ఆ దృశ్యాన్ని చూస్తుంటే దుఃఖాతి శయంతో ఆ దంపతులిద్దరికీ నోటమాట రాలేదు. నిశ్చేష్టురాలై కొద్ది క్షణాల పాటు నిల్చున్న తరువాత వారిలోని దుఃఖం కోపంగా మారిపోయింది.
'అయ్యో! అదేం పనిరా! వెధవా?' అంటూ ఒక్క అంగలో వెళ్ళి బాబిగాడి వీపు మీద రెండంటించింది కళ్యాణి .
'రాక్షసి పిల్లా అదేం పనే' నీకింకా యింత కంటే మంచి చోటు దొరక లేదూ?" అంటూ పాప చెవి పట్టుకుని యివతలకు ఈడ్చు కొచ్చాడు కాంతారావు.
దాంతో పిల్లలిద్దరూ యింటి కప్పు ఎగిరి పోయేలా ఏడవటం మొదలెట్టేరు. వాళ్ళ ఏడుపుతో చెవులు హోరెత్తిపోతున్న కళ్యాణి ఆ ధ్వనిని భరించలేక యిద్దరికీ చెరో రెండు అంటించింది.
ఉన్నట్లుండి వాతావరణ మంతా భీభత్సంగా తయారయిపోయింది. వో పక్క పిల్లల ఏడుపుని భరించలేని అసహనం, మరో వంక ఏమీ తెలియని పసివాళ్ళ ను కొట్టేమన్న బాధ వో పక్క, బట్టలు పాడయిపోయాన్న దుఃఖం మరో వంక, వాటిని బాగు చేసుకునే బాధ్యత నెత్తిన పడిందన్న భయం అన్నీ కలిసి వాళ్ళను పిచ్చేత్తించినాయ్.'
వాళ్ళిద్దరి వళ్ళూ బాగా కడిగి తల స్నానం చేయించి నిద్ర పుచ్చేసరికి పన్నెండు దాటింది.
ఈలోపల హోల్డాలును కడిగి ఎండలో అరవేశాడు కాంతారావు.
పిల్లలు లేచేసరికి సామానంతా ఏ ఆటంకము లేకుండా సర్ది వేసుకుందామని కూర్చున్నారు.
'ఆదిలోనే హంస పాదన్నట్లు యింకా ప్రయాణానికి బయలు దేరక ముందే యీ పిల్లలు యింత రభస చేసేరు. అక్కడకు వెళ్ళేక యింకా ఎంత చేస్తారో,' అంది కళ్యాణి సిరా మరకలతో నిండిన బెనారసు పట్టు చీర వంక ఉసూరుమని చూస్తూ.
