2
ఆ యింట్లో మళ్ళీ క్రమంగా ఒక దాని వెంట ఒకటి మార్పులు కలగ సాగినాయ్. మల్లెలు ఆ యింటి గడప తొక్కటం మానివేసినాయ్. మూల పడ్డ రెండవ మంచం మళ్ళీ పడక గదిలోకి ప్రవేశించింది. అలమారల నిండా ఐరిన్ టానిక్క్ లు , విటమిన్ టాబ్లెట్లు , చోటు చేసుకున్నాయ్. అగరబత్తుల పాకెట్లు పెట్టె అడుగుకి పోయినాయ్. సెంటు సీసాను వోసారి కోపం పట్టలేక కాంతారావే కిటికీ లో నుండి బయటకు విసిరి వేసేడు. కక్కులు, చికాకులు, సాధింపులు , చంటి పిల్లాడి ఏడ్పులు, మూలుగులు, ముక్కుళ్ళు, నీరసాలు, మందులు, డాక్టర్లు, నర్సు లు ఆస్పత్రులు ఆ తంతంతా యధావిధిగా మరో సంవత్సరం పాటు జరిగింది.
ఈసారి ఆ నరకం నుండి పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే అయింది. ఇంట్లోని జనాభా సంఖ్య రెట్టింపు అయేసరికి బాధ్యతలు అంతటా పది రెట్ట్లయినాయ్- అప్పటికి బాబిగాడి కి ఏడాది వెళ్ళింది. నెలలు పెరుగుతున్న కొద్ది పిల్లవాడికి జలుబు చేసిందనో, విరోచనాలవుతున్నయనో, పాలు సరిగ్గా తాగటం లేదనో, అన్నం తినటం అలవాటు చేసుకోలేక పోతున్నాడనో ఏదో ఒక విషయాన్ని గురించి బాధపడే వాళ్ళు. రెండవసారి వెంటనే కాన్పు రావటం వల్ల కళ్యాణి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే వుంది. ఇక చంటి పిల్ల సంగతి సరేసరి. ఏదో ఒక బాధ ఉండక తప్పదు. ఇలాటి దిగుళ్ళ తో మానసికంగా ఎంతో వృద్దులై పోయిన ఆ దంపతులు శారీరక సుఖాల గూర్చి ఆలోచించటమే మానివేసేరు. జీవితం యాంత్రికంగా జరిగిపోతోంది. వేగంగా పరుగెత్తి పోతోంది. ఆ వేగం లో పడి కొట్టుకు పోవటం తప్ప మరో మార్గం కనుచూపు మేర దూరంలో కూడా ఉన్నట్టు తోచలేదు వాళ్ళిద్దరికీ.
అలాటి సమయంలో హటాత్తుగా ఊడి పడ్డ ఆ రెండు వేల రూపాయలు ఎడారి లో ఒయాసిస్సు లా గాడాంధకారం లో చిన్న దీపం లా తరుణోపాయాన్ని చూపించినాయ్ కాంతారావు కి.
ఇప్పుడా గడచిన జీవితమంతా తన కళ్ళ ముందు కదులుతుంటే చిత్రంగా ఉంది కళ్యాణి కి తను మూడేళ్ళ క్రితం నాటి కళ్యాణేనా అని ఆశ్చర్య పోతోంది. 'ప్రేమ' అన్న ఆ పదాన్ని మళ్ళీ యీ జన్మలో వింటానని కూడా ఆమె అనుకోలేదు.
ఈరోజు తన భర్త నోటి వెంబడి వెలువడిన ఆ దివ్యమైన పదం ఆమె మనశ్శరీరాలను రెంటి నీ ఒక మధుర కంపనం తో ఊపిపారవేసింది.
ఔను. కళ్యాణి లో మళ్ళీ జీవం వచ్చింది. ఆమె ఆలోచనలకు యౌవనం వచ్చింది. ఆమె హృదయం లోని వెచ్చదనం హెచ్చింది. మధుర భావాలతో ముడుచు పోయే ముగ్ధలా , మధు పర్కాలతో మైమరచి పోయిన నూతన వదువు లా మారిపోయింది. ఆ క్షణం లో కళ్యాణి.
తన మనసునే ప్రేమకు మారు పేరుగా చేసి, తన కళ్ళనే కలువ పూవులుగా మార్చి, భర్త వంక చూసింది కళ్యాణి. అంతకు ముందు అతనిని ఎన్నడూ చూడనట్లు, అప్పుడే అతని మొదటి సారిగా చూస్తున్నట్లు, మరెన్నడూ ఆ మధుర క్షణాలు తిరిగి రానన్నట్లు అతని వంక చూసింది కళ్యాణి.
కాంతారావు కి కూడా సరీగ్గా అదే రకమైన అనుభూతి కలుగుతోంది. అలసి పోయిన శరీరంతో, విసుగు డలను సూచించే ముఖంతో మాసిన చీరతో, చెదరిన ముంగురు లతో సర్వ సాధారణంగా అనిపించే యీ నాటి కళ్యాణి లో ఒకనాటి తన ప్రణయ రాణి ని మధుర దేవతను సందర్శించగలిగెడు ఆ క్షణం లో కాంతారావు.
అలా పరస్పరావలోకం తో పరవశించి పోతున్న ఆ భార్యాభర్త లిద్దరూ మాడిపోతున్న వంకాయ కూర తాలుకూ ఘాటైన వాసన ముక్కు పుటాలను అదర గొట్టటంతో యీ లోకంలోకి వచ్చి పడ్డారు.
"హయ్యో రామ! కూర కాస్తా తగలబడి పోయిందండీ!' అంది కళ్యాణి కంగారుగా.
ఖంగుతిన్న ఆమె కంఠధ్వని లో ఆ యింట్లో కి మళ్ళీ మాములు జీవితం ప్రవేశించింది.
'పోన్లే కూర మాడితే మాడింది లే. మన పాలిట కల్ప తరువుల్లా ఊరగాయలుండనే ఉన్నాయిగా. అది సరే కాని మన ప్రయాణం సంగతి ఏమంటావ్? మాట్లాడవేం?' అన్నాడు కాంతారావు.
"ఈ నరకం లో నుండి కనీసం నాలుగు రోజుల పాటైనా బయటపడాలని నాకూ అనిపోస్తోంది కాని డబ్బెక్కడిది?' అంది.
"మొన్న వచ్చిన ఎరియర్స్ ఉన్నాయిగా.'
'ఏమిటి? ' కళ్ళు పెద్దవి చేసి కంఠస్వరం హెచ్చించి అన్నది కళ్యాణి. 'ఆరెండు వేలు చూస్తూ చూస్తూ మన తిరుగుళ్ళ కు ఖర్చు చెయ్యమంటారా? నా ముత్యాల హారం సంగతి , మీ టెర్లిన్ సూటు సంగతి అప్పుడే మర్చి పోయారా?' అంది.
"చూడు కళ్యాణి! బ్రతికి బాగుంటే నీ ముత్యాల హారాన్ని , నా టెర్లిన్ సూట్ నీ ఎప్పుడో ఒకప్పుడు కొనుక్కోక మానము మనం. ఈ రెంటి కన్న ఎక్కువగా ప్రస్తుతం మనకి కావలసినది మానసికమైన విశ్రాంతి . ఆ రకమైన విశ్రాంతి మనకు యీ హనీమూన్ వల్లనే లభ్యమవగలదు. మనకి ఈ సమయంలో కొంత చేంజ్' అత్యవసరమనిపిస్తోంది. తప్పదు కళ్యాణీ తప్పదు. మనం వెళ్ళి తీరాలిసిందే! యిలా ఈ యింట్లో మనిద్దరం యీ పిల్ల వాళ్ళతో మరికొన్ని నెలలు యిలాగే ఉన్నామంటే నాకు పిచ్చి ఎక్కటం ఖాయం అన్నాడు కాంతారావు. కొద్ది నెలలుగా తన మనసులో మెదులుతున్న భారాన్ని అతనిలా మాటల రూపంలో పెట్టేసరికి కళ్యాణి యింకా కాదన లేకపోయింది.
'సరే, మీ యిష్టం' అంది.
'మన మాటలో పడి పిల్లల విషయమే మర్చిపోయేం . ఏరీ వాళ్ళు?" ఎక్కడున్నారు?' అన్నాడు కుర్చీలో నుండి లేస్తూ కాంతారావు.
'నిజమే సుమండీ! నా మతి మండ. వాళ్ళ సంగతే గుర్తులేదు నాకు. అసలే ఆ బాబిగాడు అసాధ్యుడు. ఎక్కడ యేమి చక్క బెడుతున్నాడో అంటూ ఖంగారు పడింది కళ్యాణి.
అలుగమలిద్దరూ యిల్లంతా గాలించగా చివరికి ఆ పిల్ల వాళ్ళను బాత్ రూములో బొగ్గుల బస్తా దగ్గర చూడ గలిగేరు. అది కూడా వెంటనే గుర్తు పట్టగలిగే స్థితిలో లేరు అ పిల్లలు. బస్తా పక్కనే చిందర వందరగా పడి వున్న బొగ్గుల మధ్య ఏవో మెల్లగా కదుల్తున్న రెండు ఆకారాలు లీలగా కనిపించేసరికి పిల్లలేనేమో నన్న అనుమానం వచ్చి కళ్ళు చిట్లించి మరోసారి చూసింది కళ్యాణి.
వాళ్ళను చూస్తూనే బాబిగాడు 'అమ్మా యిక్కలున్నాం మేము!' అన్నాడు నవ్వుతూ.
తెల్లగా మెరుస్తున్న వాడి పళ్ళను బట్టి వాళ్ళున్న చోటును గుర్తు పట్టి అక్కడకు పరుగెత్తుకు వెళ్ళింది కళ్యాణి.
బొగ్గుల మధ్య పారాడుతున్న పాప తల్లి అలికిడి విని 'క్యార్ మంటూ ఏడిచింది.
.jpg)
'అయ్యో! ఏమిటర్రా యీ అవతారం! మీ నాన్న నుండి తెచ్చుకున్న నలుపు చాలక యీ బొగ్గుల మసి కూడా వంటికి పూసుకుంటూన్నారెందుకురా? ఖర్మ!' అంటూ యిద్దరినీ రెక్క పట్టుకుని వెళ్ళి నీళ్ళ పంపు కింద పడేసింది కళ్యాణి.
* * * *
అనుకున్న బుధవారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి కళ్యాణి కి, కాంతారావు కి భూమ్మీద కాలు నిలవలేదంటే అతిశయోక్తి కాదు.
తిరుపతి వెళ్ళే ట్రైన్ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో బయలుదేరుతుంది. అప్పటి ప్రయాణం కోసం ఉదయం ఐదు గంటల నుండీ హడావుడి పడసాగేరు. ఆ దంపతులు. ముందు యెంత సామాను, ఏ విధంగా అమర్చుకుని తీసుకు వెళ్ళాలి అన్నది వో సమస్య అయి కూర్చుంది. 'తక్కువ సామాను- ఎక్కువ సుఖము ' అన్న సూక్తి ఆలుమగలిద్దరికీ తెలిసినదే. ఐతే చివరికి వారు తాము సూచించిన సామాను తోనే సుఖ ప్రయాణం సాధ్యమని గట్టిగా నమ్మి, ఎదుటి వ్యక్తిని కూడా అంత గట్టిగానూ నమ్మేట్టు చేయా లనుకోవటం తోనే వచ్చింది చిక్కు.
బట్టలను సూటు కేసు లో సర్ది, రెండు దుప్పట్లు, రెండు దిండ్లు కలిపి పాక్ చేసి, ఫ్లాస్కు , వాటర్ బాటిల్ , కెమెరా మొదలైన పరికరాలను పెట్టుకునేందుకు ఒక ఫేము బుట్ట తీసుకు వెళ్దా మంటుంది కళ్యాణి. వీటిలో బరువైన వస్తువేదీ లేదని ఆమె వాదన.
ఐతే ఆమె సూచించిన దానికీ ఏమాత్రం ఒప్పుకోలేదు కాంతారావు.
'ఛ! దుప్పట్లు మూట కట్టుకుని పొవట మేమిటి? మీ నాయనమ్మ ప్రయాణం లా ఉంటుంది" అన్నాడు.
దాంతో చర్రుమంటూ లేచింది కళ్యాణి 'మా నాయనమ్మ ను మీరేమి హేళన చెయ్యనక్కరలేదు. మీ నాయనమ్మ కంటే వెయ్యి రెట్లు ఫార్ వర్డ్ మా నాయనమ్మ ఏమనుకున్నారో! అంది.
"ఆ ఆ మీ నాయనమ్మ ఎంత ఫార్వార్దో నాకు తెలుసులే. అందాకా ఎందుకు? నువ్వు మాత్రం మీ నాయనమ్మ కంటే ఏ మాత్రం మెరుగో నాకర్ధం కావటం లేదు. ఏదో బయటకు వచ్చేటప్పుడు కాస్త హైర్ స్టైల్, నాజూకు చీరా ఉండటం వల్ల ఫరవాలేదు. కాని యింట్లో ఉండగా నిన్ను చూస్తె పద్దెనిమిదో శతాబ్దం నాటి భారత స్త్రీల ఉంటావు.'
'ఐతే ఏ షోకు లాడినో పెళ్ళి చేసుకో పోయెరా? నాలాటి అమ్మమ్మని, నాయనమ్మ ని చేసుకోవటమెందుకు, ఆపైన సాధించడమెందుకు?' అంటూ ముక్కు చీదేసింది కళ్యాణి.
'దాసుడి తప్పులు దండాలతో సరి. ఇంక ఆరున్నొక రాగాన్ని ఆపి అసలు రంగంలోకి రా తల్లీ! మీ నాయనమ్మ చాలా ఫార్వార్డ్ మనిషి.... నువ్వు ముప్పయో శతాబ్దపు నాటి మగువవు... సరేనా? అంటూ ఆమె కళ్ళ నీళ్ళు తుడిచేడు కాంతారావు.
అతనలా చేసేసరికి కొంచెం మెత్తపడ్డా యింకా పూర్తిగా బింకం వదలలేదు కల్యాణి కి. 'పొండి నన్ను ముట్టుకోకండి.' అంటూ దూరం జరిగింది. దాని అర్ధమేమిటో తెలిసిన కాంతారావు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె రెండు బుగ్గలకో చెరో నాలుగు ముద్దు లిచ్చెడు. అప్పటికి పూర్తిగా కోపం తగ్గిపోయింది కళ్యాణి కి . 'చాల్లెండి సరసాలు. ఇక ఇంతటితో అపుచేయ్యండి మరి. దుప్పట్లూ అవీ ఎలా తీసుకు పోదామో చెప్పండి.' అంది రాజీ కి వస్తున్నా దొరణి లో.
'నా మాట విని ఆ సూట్ కేసు బదులు బెడ్డింగు తీసుకుని అందులోనే మన బట్టలు సర్దేయ్. తెలిసిందా? ' అన్నాడు కాంతారావు.
"ఎక్కడన్నా మనకి కూలీ దొరక్క పొతే ఆ బెడ్డింగు ను మీరే పట్టుకోవలసి వస్తుంది. అంత బరువు మీరు మోయ్యగలరా?' అంది కళ్యాణి సవాల్ చేస్తున్నట్టు.
మోయ్యలేకేం? నేను మగాణ్ణి కాదూ? మీ అన్నయ్య లా నాజూగ్గా, ఆడపిల్ల లా ఉంటె, భయపడాలి కానీ! నాకేం సిసలైన మగదీరుణ్ణి . కసరత్తు చేసిన కందలివ్వి' అన్నాడు నగ్నంగా ఉన్న చాతీని చూసుకుంటూ.
'అదో మా వాళ్ళ మాట ఎత్త వద్దంటే మీ కెన్ని సార్లు చెప్పాలి? మాటామాట నిడివి తేలిగ్గా వాళ్లోకరు దొరుకుతారు మీకు-
వాళ్ళకేం? అందరూ లక్షణమైన వాళ్ళే! ఆకారాల్లో గాని, గుణాల్లో గాని వాళ్ళ నెవరిని వంక పెట్టటానికి వీల్లేదు. తెలుసా?' అంది కల్యాణి.
ఔను. సుమా! ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలందరూ మీ వాళ్ళ మాటే చెప్పుకుంటారు రాత్రింబవళ్ళు నూ. ఏం గొప్ప వాళ్ళని! ఎంత అందగాళ్ళని.....'
ఆపండింక సోది. మీరిలా ప్రతి మాటనీ సాగదీస్తూ కూర్చున్నా రంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. మీరు అరిచి గీ పెట్టినా యీ ప్రయాణానికి నేనింక ఒప్పుకునేది లేదు.' ఆఖరి అస్త్రం ఉపయోగించింది కళ్యాణి యింక చేసేది లేక.
'సర్లే! దేవీ! నీ మాటే నిక్కంబు ఆ సూటు కేసూ, దుప్పట్లు, మూట ....వో గాడ్! వాటే హరిబుల్ కాంబినేషన్!"
"మూటామూటా అంటూ దెప్పి పొడుస్తారు. మనం వాటిని మూట కడ్తున్నామటండీ! బెడ్డింగు ఆకారం లోనే చుట్టేసేది....'
సరే, ఇకపోతే ఆ వెదరు బుట్ట మాని 'ఎయిర్ బాగ్ తీసుకు వెళ్దాం. కనీసం దాని కైనా ఒప్పుకుంటావా?"
'అంత మనసు పడి పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కున్న బాస్కెట్ ని పట్టుకుని మేదరి బుట్ట అంటూ అంత తేలిగ్గా తీసేస్తారేమండి? దానిని కొన్నదేందుకు? ఇలాటి ప్రయాణాల ప్పుడు పనికి వస్తుందనేగా!' అన్నది నిష్టూరంగా కళ్యాణి . 'ఐతే ఆ ఎయిర్ బెగ్లో ఫాస్కు వాటర్ బాటిల్ ఎలా పెడ్తారో చూద్దాం!' అంది చాలెంజ్ చేస్తున్నట్లు."
'నువ్వోక్కటి, నేనొకటి భుజాన తగిలించుకుంటే సరి!'
'సరిసరి . యీ పిల్లల బరువు చాలక ఆ బరువు కూడానా! నేను చస్తే తగిలించుకొను గాక తగిలించుకొను.' మొండిగా అంది కళ్యాణి.
ఇలాగే తర్జనభర్జన లు జరిగిన తరువాత యిద్ద్రికీంగీకార యోగ్యమైన ఒక నిర్ణయానికి వచ్చేరు. సూటు కేసు, ఒక బెడ్డింగు, ఫేము బుట్ట....ఈ మూడింటి లోనూ సామాను సర్దేయాలని నిశ్చయించు కున్నారు.
