2

నిద్రలేచేసరికి లత కుర్చీలో కూచుని ఏదో పుస్తకం తిరగేస్తుంది. ఆల్బం లాగుంది. వడివడిగా వెళ్ళి లత చేతిలోంచి తీసుకుని "చూడనియ్" అంటూ పుస్తకం పేజీలు తిరగేశాను. ఆశ్చర్యం!! లత అక్కయ్య ఆర్టిస్టా.... అవన్నీ బొమ్మలే!!
"మీ కవి అర్ధం కావులెండి" అంది లత కుర్చీ చేతి మీద కూర్చుంటూ. నా శరీరం అభిమానంతో దహించుకుపోయింది . కుర్చీలోంచి లేచి "నాకేం బొమ్మ లేయ్యడం రాదను కున్నావా? యిదిగో. ఈ పుస్తకం చూడు" అని పెయింటింగ్స్ వేసి, అల్బముగా కుట్టిన నా పుస్తకం తెచ్చి యిచ్చాను. లత మొదటి పేజీ తీసి "అమ్మో రంగుల బొమ్మలు . ఉండండి. మా అక్కకు చూపిస్తాను" అంటూ పరుగెత్తింది. నాక్కావలసింది అదే, ఆనందంతో ఆ ఆర్ట్ బుక్ చూడ నారంభించాను. ప్రతీ బొమ్మా క్రిందా "సి.ఎం" అని పొడిగా రెండక్షరాలు తప్ప ఏమీ లేదు.
సి.యం , అనగా సంధ్య -- అనగా సాయంత్రము అనగా సంధ్య... ఆమె పేరు సంధ్య... లేక సంధ్యా రాణి అయ్యుండచ్చు. అయి వుండమేమిటి అయి ఉండాలి. పేరు బాగుంది. సంద్యారాణి. నిజంగా అదే పేరయితే బాగుణ్ను అనుకున్నాను. లతని వాళ్ళక్క పేరేమిటో అడగాలనిపించినా ధైర్యం చాలక వూర్కున్నాను. ఏవిటో, ఆరో రకం పిరికితనం.
లతకి చక్కని ఫోటో తీయాలనిపించింది. పేట్లో కెమెరా తీసి టేబుల్ మీద పెట్టి నిరిక్షీస్తూ కూర్చున్నాను. కాస్సేపటికి లత వచ్చి "చాలా బాగున్నాయట. ఇంకా ఏమైనా ఉన్నాయేమో మా అక్క అడగమంది" అంది. నేను మరి కొన్ని బొమ్మలు యిచ్చి పంపాను. అవి పట్టుకుని వెళ్లి వో పావుగంటకు తిరిగి వచ్చి "చాలా బాగున్నాయట" అంది. అంటూనే టేబుల్ మీద కెమెరా చూసి "అది ఫోటో తీస్తుంది కదూ. నాకో ఫోటో తియ్యరూ. చాలా చక్కగా నించుంటాగా.
నేను కెమెరా తీసుకుని నిలబడి , "ఏదీ అయితే చక్కగా నించో" అన్నాను. లత కుర్చీకి అనుకుని నిలబడి , "నవ్వనా కొంచెం " అంది. "వూ" అన్నాను. ఫోటోలు తీసి, "రేపు వస్తే యిస్తాను' అని చెప్పాను.
లత రోజూ - రోజుస్తామానూ నా ఇంట్లోనే ఉండేది. లత అక్క మాత్రం రోజూనే ఆఫీసుకు వెళ్ళే వేళ వచ్చి వాళ్ళ గుమ్మం దగ్గర విధిగా నిలబడి ఉండేది.
ఆమె నన్ను ప్రేమిస్తుందేమో!
నా శరీరం ఝల్లుమంది.
నేనూ ఆమెను ప్రేమిస్తున్నట్లనిపించింది. ప్రేమ! ఏమిటో ఆ పద ప్రభావం. చూపులలోనే ఆ భావాలు కలుగుతాయి. ఆ పదం ఎంత పవిత్రమో-- అంత విచిత్రము. చిత్రం.
మంచం మీద వత్తిగిలి పడుకున్నాను. ఆ సాయంత్రం "ఫోటోలు చాలా బాగున్నాయని మా అక్క అంది' అని లత అన్నప్పుడు "మీ అక్కయ్యకు కూడా తీద్దామా " అనాలనిపించినా అనలేక పోయాను.
ఏమైనా సి.యం. ని నేను ప్రేమిస్తున్నాను.
ప్రేమించాను.... ప్రేమ.... నిద్రలోకి జారిపోయాను.
* * * *
భళ్ళున తెల్లవారింది.
"బాబూ" అన్నాడు రామయ్య, నేను కదలడం చూసి వెళ్ళిపోయాడు. రాత్రి ఆల్బం అలానే తెరిచి ఉంది. ఆల్బం దాచేసి, దైనందిక కార్యక్రమాల్లోకి జోరపడ్డాను. దినపత్రిక చూశాను. పేజీలు తిరగేసే.....లోపల ఒక శీర్షిక నన్నకర్షించింది.
'ఆబల మరణం. తనని బలాత్కరించబోయిన వ్యక్తిని చంపి, సింహాచలం అనే పడుచు తన్ను తాను పొడుచుకుని చచ్చిపోయింది.
గాడంగా విశ్వాసం వదిలాను. ఎవరో పాపం!
పేపరు పక్కకు విసిరేసి , కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాను. రాత్రి నా మనస్సు గతంలోకి ఎంతవరకూ వెళ్లి ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించాలని , ఆనాటి మధుర స్మృతుల నైనా కనీసం మననం చేసుకోవాలనిపించింది. గతం మనోఫలకం మీదికి వచ్చింది.
--మరో మూడ్రోజులయ్యేసరికి లత అక్కయ్యతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆవేళ రామనాధం గారితో పనుండి వాళ్ళింటికి వెళ్లాను. పనయ్యాక వచ్చేస్తుంటే 'అన్నట్లు నువ్వు పెద్ద ఆర్టిస్టువిట గదా, మా మేనగోడలు క్కూడా బొమ్మలు వెయ్యడమంటే తగని పిచ్చి. అదేసిన బొమ్మలు చూసి "కొంచెం సలహా యివ్వయ్యా" అని, "లతా.... మీ అక్కను రమ్మను" అన్నారు. నా గుండెలు దడదడలాడాయి. ఇంతలో లత వాళ్ళక్కయ్యను ఆమె వేసిన బొమ్మల పుస్తకాలతో సహా తీసుకువచ్చింది. రామనాధం గారు ఆ పుస్తకాలందుకొని, బల్ల మీద పెడుతూ, "చూడవయ్యా" అన్నారు. నేను పై పుస్తకాన్ని వోసారి తిరగేసి, "మీరు ఏవైనా చూసివేసారా లేక నికరంగా గళ్ళు కట్టి వేస్తారా" అన్నాను. పెద్ద పరీక్షాదికారిలాగ. ఆమె సమాధానం చెప్పడానికి సిగ్గు పడింది. తరువాత నేలచూపులు చూస్తూ "నా కవన్నీ తెలియవు. పత్రికలో పడిన బొమ్మలు చూసి వేసానంతే" అంది . రామనాధం గారు కలగజేసుకుని " ఆ గళ్ళు కట్టడం ఏవిటో నేర్చుకో" అని. ఈలోగా జానకమ్మగారు పిలవడం వల్ల "వచ్చే" అనుకుంటూ వెళ్ళి పోయారు. నేనామె కేసి చూడ్డానికి తల పైకెత్తాను. అంతవరకూ నాకేసి చూస్తున్న ఆమె కళ్ళు సిగ్గుతో నేలకు వాలాయి. నేను గొంతు సవరించుకున్నాను.
"గళ్ళు కట్టివేయ్యడం అనవసరం లెండి, చూసి వెయ్యడమే మంచిది. ముందు లతలు, డిజైన్లు వేసే చేయి బాగా తిరుగుతుంది." అన్నాను. ఆమె మవునంగా తలూపింది. నేను కుర్చీ లోంచి లేచి "మళ్ళీ కనుపిస్తాను. అన్నట్లు మీరేమిటి?" అన్నాను.
"ప్రేమ" అందామె.
నా వళ్ళు ఝల్లుమంది. అనక జివ్వుమంది. ప్రేమా!! ఇదేం పేరు? వళ్ళు ఝల్లుమనే పేరు అనుకున్నాను. పేరు చాలా బాగుంది. "ప్రేమ" అని సన్నగా ఉచ్చరించాను. ఆమె నవ్వును పెదిమల మీద అపుకుంది. ఇంతలో ఇంటాయన రామనాధం గారు వచ్చారు. వస్తూనే, "ఏం? ఆ గళ్ళు ఏమిటో తెలుసుకున్నావే నువ్వు..... అనక నా ప్రాణం తియ్యక" అన్నారు. ప్రేమ తల వూపింది.
* * * *
ఇలాగే వో వారం జరిగింది. మరో వారం జరిగి వో నెల దగ్గర దగ్గరగా అయిపోవచ్చింది. ప్రేమతో చాలా చనువుగా మాట్లాడడం, బొమ్మలు గీసినవి చూడడం, తప్పులు చెప్పటం, లెక్కలు యింగ్లీషు వంటివి చెప్పడం వంటివి ప్రారంభించాను. "వాసు గారూ యీ పాడు లేక్కేన్ని సార్లు చేసినా రావటం లేదు" అంటూ ప్రేమ వచ్చేసింది. నేను పాట పాదుకుంటుండగా గనుక వస్తే మాట్లాడకుండా పాట విని, తరువాత "డ్రాయింగులో మీరు గోప్పవారేమో గాని, పాటలో మాత్రం నేనే గొప్ప" అనేది. ఆఫీసుకు శలవు కూడా పెట్టి, ప్రేమతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలనిపించేది.
మరి కొన్నాళ్ళు జరిగి, నోనాటి దగ్గర ఆగిపోయింది . ప్రేమ ,లత -- వాళ్ళ ఊరెళ్ళిపోతున్నారట. ప్రేమ వచ్చి నాతొ చెప్పింది. నా కాళ్ళ క్రింద భూమి కదిలి నట్లు అయ్యింది.
"ఏవండీ వాసుగారూ మీకు మేము గుర్తుంటామా. పెద్ద గవర్నమేమెంటు ఉద్యోగులు కూడాను మీరు" అంది. ప్రేమ వెళ్ళే ముందు వచ్చ్ఘి , నాకేసి చూసి "ఏమిటలా అయిపోయారు?కోపం వచ్చిందేమిటి సరదా కన్నాను" అంది నా ముఖ భావాలు చూసి. నేను ఆ లోకం నుంచి యీ లోకం లోకి వచ్చి "కోపమా! ఎబ్బే లేదు. మీకు నేను గుర్తిండినా లేకపోయినా మీరు మాత్రం నా కెన్నడూ గుర్తుంటారు. మర్చిపోదామనుకున్నా మరచిపోయే పేరా మీది?" అన్నాను. ప్రేమ బుగ్గల మీద సిగ్గు దోబూచులాడింది. నేను పెట్టె తెరిచి కెమెరా తీసి , మీ కభ్యంతరం లేకపోతె ఫోటో తీస్తాను" ఆమె సిగ్గుపడుతూ నాకేసి చూసి "ఇక్కడనే నిలబడనా " అంది. "ఆహా" అంటూ ఆమెకు మూడు ఫోటోలు తీశాను.
ఆ సాయంత్రమే వాళ్ళు వెళ్ళిపోయారు.
* * * *
ప్రేమ నా హృదయంలో మరింత బలపడింది. ప్రేమను ప్రేమించిన విషయం నాన్నగారితో చెప్పి, పెళ్ళికి అంగీకరించేలా చెయ్యాలి. ప్రేమను పెళ్ళి చేసుకుని తీరాలి. ఏమైనా సరే. ప్రేమే నా సర్వస్వం. నా నిర్ణయాన్ని కర్తవ్యంగా మార్చుకుని బెజవాడ చేరాను. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చేలోగా ఏ పద్దతిలో మాటాడాలో ఆలోచిస్తూ కూర్చున్నాను. నాన్నగారి వద్ద నాకు చనువు లేనేలేదు. భక్తీ ఉందొ లేదో తెలియదు కానీ, భయం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది.
సాయంత్రం నాన్నగారు వచ్చారు. నన్ను చూసి, "ఏరా! ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు శలవు పెట్టావు?" అంటూ కుశల ప్రశ్నలు వేశారు. అన్నిటికీ సమాధానం చెప్పాను. కాని అసలు విషయం ఎలా ప్రస్తావించాలో తెలియక, గొంతు వద్దనే ఆగిపోయింది. ఆ మాటకొస్తే యిలాటి విషయాలు ఏ కొడుకయినా తండ్రితో చెప్పగలడా! ఏమో!!
రాత్రి భోజనాలయ్యాక "గోపాల్ పూర్ ఎలా ఉంది? నీళ్ళు గట్రా నీకు పడ్డాయా!' అంటూ మరి కొన్ని ప్రశ్నలు వేశారు. అనక, "మనదీ ప్రాంతమే! గంజాం జిల్లాలో అస్కాలో మీ అమ్మ పుట్టిందట " అన్నారు.
నాన్నగారిది చత్రపురమట! ఎక్కడి వాళ్ళు ఎక్కడికి వస్తారో! జీవనోపాధి మనిషి నలా తరుముతుందేమో! అసలు విషయం మాత్రం నేను కాదనలేక పోయాను.
మూడ్రోజులయ్యాయి.
