తన రాకపోకల్ని అంతగా గమనిస్తున్నాడా అనుకుంది మనసులో. "ఔనండి వచ్చి చాలా రోజులైంది. ఈమధ్య ఏమిటో పరీక్షలు వాటితో తీరిక లేకుండా ఉంది."
"ఏం చదువుతున్నారు?"
"బి.ఎల్."
"లాయర్ అవబోతున్నారన్నమాట!" చిరునవ్వు నవ్వాడు.
"ఆ! ఆ! లాయరే లయ్యరు. మా నాన్న అంటూ ఉంటారు లాయర్సు అంతా లయ్యర్సు అని" అంది నవ్వుతూ.
"అయితే కోరికోరి లయ్యర్ని తయారుచేస్తున్నారల్లే ఉందే మీ నాన్న గారు."
"మీరేం చదివారు?"
"ఊఁ" అంటూ తలఎత్తి చూచి కొద్దిక్షణాలు ఆలోచించి, "ఎమ్. ఎ." అన్నాడు.
ఆశ్చర్యంగా చూచింది. "ఎమ్. ఎ. చదివి లైబ్రరీలో పని చేస్తున్నారా!" అంది ఆశ్చర్యాన్నంతా ఇనుమడింపచేస్తూ.
"ఊఁ.....ఏం?" అన్నాడు సామాన్యంగా.
దానికి జవాబు దొరకలేదు. కొద్దిక్షణాలు ఊరుకుని, "ఎక్కడ చదివారు? ఇక్కడేనా?" అంది.
"కాదు. హైదరాబాదులో."
"మీ స్వంత ఊరు అదేనా?" అంది తెలిసికూడా.
"ఉహూఁ. గుంటూరు."
"అంత దూరంనుండి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారేం?" అంది ఈ మాత్రం ఉద్యోగానికి ఇంతదూరం రావాలా అన్నట్లు.
"ఈ ఊరు బావుంటుందని. అదీకాక మీలాంటివారి పరిచయభాగ్యం కలుగుతుందని" అన్నాడు ఆమె ముఖంలోకి చూచి నవ్వుతూ.
అతని చూపులు తప్పించుకుంటూ, "బావుంది" అని ఊరుకుంది.
"మీరు ఫైనలియరా?"
"ఊఁ" అంది పరధ్యానంగా.
"ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా?"
"ఏమో? ఇంకా ఏం అనుకోలేదు. అయినా ఏదో సరదాకి చదువుతున్నాను కాని..." అంది సముద్రంవంక నిశ్చలంగా చూస్తూ కళ్ళు ఒకవైపు చూస్తున్నా మనసు ఎక్కడో ప్రయాణం చేస్తున్నట్లు ముఖమే చెపుతూంది.
ఏదో మాట్లాడుతూ, మాట్లాడుతూ ఉన్నట్టుండి చేతివాచి చూసుకుంటూ, "ఇంక, వెడదాం" అని లేచి నుంచుంది. పాంటు దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు. ఒళ్లోంచి జారి పుస్తకం కింద పడ్డది. చదువుదామని అలవాటుప్రకారం తీసుకువచ్చాడుగాని, ఆరోజు అనూరాధ కబుర్లతో పుస్తకం తెరవలసిన అవసరం కలగలేదు. వంగి పుస్తకాన్ని అందుకుని ఆమెపక్కే నడవసాగాడు.
"ఒకసారి మా ఇంటికి రండి తప్పకుండా."
"అలాగే!"
"అలాగే అంటారుకాని ఇంతమటుకు ఎప్పుడూ రాలేదు."
"మీ పరీక్షలు అయిపోనీయండి. వస్తాను."
ఒకరి దగ్గర ఒకరు వీడ్కోలు తీసుకుని ఇద్దరూ విడిపోయారు.
మర్నాడు మధ్యాహ్నం దాదాపు ఇదే విషయాన్ని అంతా చెపుతూంది అనూరాధ. ఉత్సాహంగా వింటూంది లలిత. వారిద్దరిమధ్య ఎటువంటి అరమరికలు లేని వారి స్నేహలత అల్లుకుపోవడానికి కారణం దాని వయసు వారి వయసులో సగం పైగానే!
"కాని, నాకు ఆశ్చర్యం - హైదరాబాదులో ఎమ్. ఎ. చదివి ఇక్కడికొచ్చి లైబ్రరీలో పనిచెయ్యడం!"
"ఎక్కడా జాబ్ దొరకలేదేమో?"
"అని నే ననుకోను. ఏదో ఉంది మొత్తానికి" అంది అనూరాధ సాలోచనగా.
"ఇకనేం? చదువుతున్నావుగదా? డిటెక్షన్ మొదలుపెట్టు ఏ పెర్రీమేసన్ లాగానో" అంది లలిత.
"పోనే! నీ కన్నీ వేళాకోళాలే!"
"అతని గోల సరేగాని, బాగాక్ చదువుతున్నావా?"
"ఆ! ఏదో."
"ఇంక ఎలా చదివితే ఏంలే!" అంది లలిత నవ్వుతూ.
"అంటే?" అంది అనూరాధ చురకుగా.
"ఇక తప్పినా, పాసయినా ఫరవాలేదు." పైకి నవ్వేసింది.
"ఓ. షటప్! ఏదో లైబ్రరీలో పనిచేస్తున్నట్లు తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నువ్వు ఊరికే వాగకు."
"చిత్తం. మా ఇంటిపక్కేగా ఉండేది? యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాలే."
దాని నోరు మూయించటం ఎలాగా అన్నట్లు అసహనంగా చూచింది లలితవంక అనూరాధ.
అనూరాధ చూపులో చూపు కలుపుతూ, "దిగులుపడకు. నీకు పోటీకి నేను రానులే" అంది లలిత.
"నోరు మూద్దూ! నువ్వు నాకు పోటీకి వస్తే, మీ బావ నామీద దండయాత్రకు వస్తాడు."
"ఆ భయం లేదులే. మా బావకు వచ్చే పోటీలోకూడా నేను నిలబడవనుకుంటా!" అంది లలిత గంభీరంగా.
అంతవరకు నవ్వుతూన్న ముఖం గంభీరంగా మారేటప్పటికి ఆశ్చర్యంగా చూస్తూ, "అంటే?" అంది అనూరాధ.
"ఏం లేదు."
"ఏం లేకపోవడమేమిటి? చెప్పు. మీ బావ నిన్ను పెళ్ళి చేసుకోనన్నారా?"
"ఊఁ."
"కారణం?"
"ఏమో?"
"చాలిద్దూ. పెద్ద ఏమీ తెలియనట్లు! చెప్పు."
"ఊఁ. ఏముంది చెప్పడానికి? అతని హోదాలో ఉన్నవాళ్ళకు నాలాంటి వాళ్ళు కనిపిస్తారా హోదా, డబ్బు ఏమీ లేనప్పుడు" అంది నెమ్మదిగా.
"అదేమిటి! చిన్నప్పటినుండి అనుకున్నారుగా?"
"అనుకున్నది చిన్నప్పటినుండే అయినా, పెళ్ళి చేసుకునేది పెరిగాకేగా?" అంది లలిత తేలిగ్గా.
"అయితేమాత్రం? నువ్వింత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు?" అంది అనూరాధ ఆశ్చర్యంగా.
"నా కిలా జరుగుతుందని ఎప్పటినుంచో అనుమానంగా ఉంది. అయినా ఏమీ తెలియకపోవడానికి మనమేం పదేళ్ళ పిల్లలం కాదుగా? కాని మా అమ్మే ఏదో ఇంత ఆశపెట్టుకు కూర్చుంది. అందుకే ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నా, అమ్మతో వాదించాల్సినవచ్చినా బలవంతంమీద అనర్సులో చేరింది" అంది నిశ్చలంగా.
"అయితే ముందు ఏం చేద్దామని?"
"ఏముంది చేయడానికి? ఆనర్సు అవగానే ఏదైనా ఉద్యోగంలో చేరతాను."
"పైకి చదవవా?"
"ఉహూ! ఇంక ఉద్యోగం లేకుండా ముందుముందు కష్టంకూడా. మిగిలిన విషయాలు తరవాత.
మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది అనూరాధ. ఎందుకో లలితను తనతో పోల్చుకోవాలనిపించింది ఆమెకు. నిజంగా తెలివైంది లలిత. డబ్బు, ప్రోత్సాహం ఉంటే ఎంతో పైకివచ్చేది చదువులో. మనుష్యులు బొత్తిగా ఇంత హీనంగా తయారవుతున్నారేం? డబ్బు, హోదాకంటే విలువైనవేమీ కనిపించవేం? అనిపించింది. మనిషికి కావలసిన సంస్కారం, ఆదర్శాలు బొత్తిగా హీనమయి పోతున్నాయి. లేకుంటే చదువు, మర్యాద, ఆకర్షణ అన్నీ ఉన్న లలితను, అందులోనూ స్వంతమరదల్ని కాదని .... ఈ కట్నాలు పోవు. మనుష్యులు మారరు. ఎంతసేపూ కాగితాల మీద తప్ప. హృదయాలలో రాదు మార్పు అనుకుంది బరువుగా.
* * *

5
సంధ్యాకాంతులు సంబరంతో అంబరాన్ని ఆక్రమించాయి. ఇసుక దిబ్బల హెచ్చుతగ్గులమీద నడుస్తూ సముద్రపు ఒడ్డున ఏరుకున్న ఆలిచిప్పల్ని, నత్తగుల్లల్ని గలగలలాడిస్తూంది అనూరాధ దోసిలిలో, పక్కనే నడుస్తున్న లలితతో కబుర్లు చెబుతూ, సముద్రపుఒడ్డుకు షికారు వచ్చి, చీకటి పడకుండా ఇంటిముఖం పట్టారు.
దోసిలివంక చూస్తూ, పరిసరాలు అంతగా పట్టించుకోని అనూరాధను మోచేతితో కొట్టింది లలిత, దూరంగా వస్తూన్న అతన్ని చూస్తూ.
"ఏమిటీ?" అంది తలఎత్తి చూచి అనూరాధ.
కళ్ళతో ఎదురుగా చూపుతూ, "నీ క్లయింట్" అంది లలిత నవ్వుతూ.
అటువైపుకు దృష్టి సారించి, జేబులో చేతుల్ని పెట్టుకుని, మల్లెపువ్వు లాంటి తెల్లని పాంటుతో గళ్ళగళ్ళ శ్లాక్ తో నడిచివస్తున్న శ్రీనివాస్ ను చూచింది.
"నా క్లయింట్ ఏమిటి?" అంది చిరుకోపంతో లలితవైపు చూస్తూ.
"పరిశోధన మొదలుపెట్టావుగా. ఎమ్. ఎ. చదివి లైబ్రరీలో ఎందుకు పనిచేస్తున్నాడో, అక్కడనుండి ఇక్కడికి ఎందుకు రావలిసివచ్చిందో వగైరా...వగైరాలు....ఎంతవరకు వచ్చింది పరిశోధన?"
"చాలిద్దూ. పరిశోధన లేదు, ఏం లేదు. ఏదైనా అంటే అదే పట్టుకుంటావు" అంది.
ఏదో అనబోతూండగానే అతనికి దగ్గిరగా వచ్చారు. "నీ క్లయింట్ ను పలకరిస్తావా?"
"ఇదిగో, ఆపుతావా లేదా? నేను ఇంకా లాయర్ని కాదు. అతను నా క్లయింట్ కాడు."
"నిజమే! నువ్వు లయరూ అనవు, అతను నీ క్లయింటూ అవడు" అంది వ్యంగ్యంగా.
లలితవైపు చురచురా చూస్తూ అతనివైపు నడిచింది అనూరాధ. "హలో....నమస్తే."
"ఏమిటిలా వచ్చారు? ఒంటరిగానేనా?"
"లలితకూడా వచ్చింది."
లలితవైపు చూచి, విష్ చేసి "మీ అమ్మగారు కులాసా?" అని అడిగాడు.
"ఆఁ, కులాసాయే నండి" అంది.
"పరీక్షలు పూర్తి అయ్యాయా?" అడిగాడు కొద్ది నిముషాలు పోయాక.
"ఆఁ ఈమధ్య పరీక్షలతో అలిసిపోయాం. మీ సలహా పాటించి ఆరోగ్య సాధనకు ఇలా వచ్చాము" అంది అనూరాధ నవ్వుతూ.
ఆమె మాటలకు తక్కిన ఇద్దరూ కూడా నవ్వారు.
"ఇవాళ మీ ఇంటికి వద్దామనుకున్నాను. ఎందుకో మీ రింట్లో ఉండరేమో అనిపించింది. అందుకనే ఇటు బయలుదేరా."
"ఇన్ ట్యూషన్ అన్నమాట. ఇప్పుడైతేనేం, రండి. నేను ఇంటికే వెడుతున్నాను. మా నాన్నగారు కూడా ఇంట్లోనే ఉంటారు" అంది దారి తీస్తూ.
లలితకు గుడ్ బై చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికి రాజశేఖరంగారు ఇంట్లోనే ఉన్నారు. తలుపు చప్పుడయ్యేటప్పటికి పేపరులోంచి తల బయట పెట్టారు. అపరిచిత వ్యక్తిని చూడగానే పేపరు మడిచి లేచి ఇవతలికి వచ్చారు.
"ఈయన శ్రీనివాస్ గారు. లైబ్రరీలో పనిచేస్తూ ఉంటారు. మా నాన్నగారు" అని పరిచయం చేసింది అనూరాధ.
కరచాలనంకోసం చెయ్యి జాపుతూ, "రావోయ్, రా!" అంటూ ఆహ్వానించారు రాజశేఖరం గారు, పలచని గ్లాస్కోపంచ, పైన లాల్చీ మధ్య వయస్సు చూపుతున్న ఉత్సాహవంతమయిన ముఖం. గౌరవనీయంగా కనపడ్డారు రాజశేఖరంగారు. సరదాగా, కలుపుగోలుతనంగా, చిన్నవాడిలా మాట్లాడేస్తుంటే స్నేహభావం గోచరిస్తూంది. కాఫీ తీసుకువస్తానంటూ లోపలికి నడిచింది అనూరాధ.
"ఏ ఊరు మీది?" అడిగారు అందరిలాగానే.
చెప్పాడు.
"మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు?"
"మా నాన్నగారు లేరు. డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయ్యారు" అన్నాడు మ్లానవదనంతో.
అతని ముఖం చూచి నొచ్చుకుంటూ సంభాషణ మార్చారు. కాఫీతో వచ్చిన అనూరాధ వెనకనే శ్రీలక్ష్మికూడా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది. పరిచయం అయ్యాక అతని వంక ఒకసారి నిశితంగా చూసి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.
"ఏమిటంత ఆలోచిస్తున్నావు?" అన్నారు రాజశేఖరంగారు.
"ఏం లేదు. ఇతన్ని ఎక్కడో చూసినట్లనిపిస్తే, ఎక్కడా అని ఆలోచిస్తున్నాను."
"నాకూ అలాగే అనిపించింది చూడగానే. ఏమయ్యా, మమ్మల్ని ఎక్కడైనా చూచావా?"
చిరునవ్వుతో తల ఊగించాడు లేదన్నట్లు. మరో కొద్ది నిముషాలు గడిపి శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది.
"చదరంగం ఆడటం వచ్చా?" అడిగారు.
"ఏదో కొద్దిగా. అదైనా ఆడి చాలాకాలం అయింది."
"అయితే ఒక ఆట ఆడదాం ఉండు. పార్టనర్ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ లోపలికి వెళ్ళారు పావులు, బోర్డు తీసుకురావడానికి.
అనూరాధ వంక చిరునవ్వుతో చూసి గది చుట్టూ ఒకసారి కలయ జూచాడు. ఆధునికంగా అలంకరించి ఉన్న డ్రాయింగ్ రూమ్. గ్రీన్ సోఫా సెట్. టేబిల్ లైట్లు. ఒకపక్కగా మాగజైన్స్ కోసం అమర్చిన చిన్న రాక్. వీటన్నిటితోపాటు గోడమీద పెద్ద వెంకటేశ్వరుని పటం నిండుదనం ఇస్తూంది.
"సూపర్ స్టిషన్ అంటావేమోగాని, నల్లపావులతో ఎప్పుడు ఆడినా ఓడిపోతానయ్యా నేను" అని నవ్వుతూ బోర్డుమీద పావులు సర్ధసాగారు.
"ఇవాళ నల్లవాటితో ఆడండి. నాకు ఎలాగూ ఆట ఎక్కువ రాదు. ఎలా ఓడిపోతారో చూద్దాం" అన్నాడు శ్రీనివాస్.
"వద్దులే! మొదటిసారే నీ చేతిలో ఓడటం దేనికి" అంటూ తనే ముందు కదిలించారు.
శ్రీనివాస్ ప్రతి ఒక్కటి శ్రద్దగా ఆలోచించి ఎత్తులు వేస్తున్నాడు. మెల్లిగా సాగుతూన్న ఆట చూస్తూ కూర్చుంది అనూరాధ. వాళ్ళతోపాటు సమంగా సంభాషణలో పాల్గొంటూ.
ఆట పూర్తి అయ్యేసరికి తొమ్మిదిగంటలు అయింది. "రాదు, రాదు అంటూ బాగా ఆడావయ్యా" అన్నారు పావులు పెట్టెలో పోస్తూ.
"ఓడిపోయాను కదండీ" అన్నాడు నవ్వుతూ లేచి నిలబడి.
"ఆట ఆడేటప్పుడు గెలవటమే ముఖ్యమా? ఒక్కొక్కసారి ఎంత చెత్తగా ఆడినా గెలుస్తాం. పట్టుతో ఆట నడవాలిగాని, ఎవరు గెలిస్తే ఏం? ఒకరు గెలవాలంటే, ఒకరు ఓడితీరాలి" అన్నారు ఏదో పెద్ద రహస్యం చెప్పినట్లు.
ఆయన మాటలకు నవ్వుతూ, "వస్తానండీ ఇక" అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ.
"వస్తూ ఉండవోయ్. నేను శని, ఆదివారాలు సాయంత్రం తప్ప మిగతా రోజులు ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు వస్తూ ఉండు. ఆడదాం" అన్నారు ఉత్సాహంగా.
"అలాగే నండీ" అన్నాడు.
ఇంతలో శ్రీలక్ష్మి లోపలినుండి వస్తూ, "ఎలాగూ ఆలస్యమయింది. భోజనంచేసి వెళ్ళకూడదూ?" అంది.
"అబ్బే, వద్దండి... మరోసారి, ఇప్పుడు ఒక స్నేహితుణ్ణి కలవాలి" అన్నాడు వాళ్ళకు మరోసారి అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా.
తలుపు దగ్గిరికి వచ్చేసరికి అప్పుడే లోపలికి వచ్చిన కృష్ణమోహన్ ఎదురయ్యాడు. పరిచయం చేసుకుని షేక్ హేండ్స్ కు చేయి జాపుతూ "అరే, మిమ్మల్ని ఎక్కడో చూచానండీ" అన్నాడు గబుక్కున.
ఆశ్చర్యంగా తల ఎత్తాడు, అదేమిటి అందరూ అలాగే అంటారన్నట్లుగా.
