Previous Page Next Page 
వసంతం పేజి 3


    "ఆఁ.... ఉద్యోగం దొరకడం ఆలశ్యం ఐందని పది రోజులనించీ ముఖం చూపెట్టలేదు నువ్వు.... మళ్ళీ మానవనైజం తెలుసు కున్న మనిషివి - నేనేమైనా బాధలేకపోయింది!" అంది.
    "నిన్ను గురించి అనుకుంటూనే ఉన్నాను శశీ
    "అవును - లలిత జ్ఞాపకం చేశాక.....అలాగ నన్ను తప్పించుకోవడం అని - ఏం?"
    అతను నిర్లిప్తంగా ఆమెవేపు చూశాడు. తమ పరిచయంతో ఆమె ఎప్పుడూ అంత తీవ్రంగా మాట్లాడలేదు. ఆమెకు కలిగిన గాయం ఎంత బాధ పెడుతుందో అతనికి తెలుసును. కాని ఆ నిస్సహాయస్థితిలో అతను ఏ జవాబూ ఇవ్వలేక పోయాడు.
    "సారీ శశీ - క్షమించు."
    రెండు క్షణాలు ఆమె కోపంగా చూసి. ఒక్క సారి లేచివచ్చి అతని పక్కన కూర్చుంది కుర్చీ చేతిమీద నెమ్మదిగా అతని తల నిమురుతూ. 'ఇలాటి కష్టసమయంలోకాకపోతే ఎప్పుడు కావాలి గోపాలం. మనకి మనం? నువ్వేం తప్పు చెయ్యలేదు.....నీ మానసిక ఆవేదన నాకు తెలుసును. ఈ సమయంలోనే నువ్వు దూరంగా ఉంటే ఎలాగ చెప్పు!" అంది బాధగా.
    అతను ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. "అవును శశీ.....నిజమే. కాని ఈ రోజుల బాధలో ఎవరికే- నీకు కూడా భాగం ఇవ్వాలని అనిపించదు" అన్నాడు.
    "అలాగ అనుకోకూడదు గోపాలం. కనీ సము నాకూ అమ్మకీ ఎంత బాధగా వుంటుందో ఆలోచించుకో కష్టాలు ఉండిపోవు-సుఖాల్లాగే కాని. జ్ఞాపకాలు ఉండిపోతాయి"
    "అవును శ...."
    చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె తలలో వెయ్యి ఆలోచనలు పరిగెడుతున్నాయి. అతనికి ఏం సహాయం చెయ్యగలదు తాను? కనీసం తనకైనా ఉద్యోగం దొరికితే కాని.....అప్పటికి అతనికి ఏదో ఒకటి దొరక్క పోదు-కనీసం గుమాస్తాగిరీ ఐనా. అతనే ఎప్పుడో గుమాస్తాలమీద కథ రాశాడు. జాలి పడుతూ కొంచెం నవ్వుతూ ఆ రోజులో అతనూ యువకులందరిలాగే భవిష్యత్తు కనిపించని దూరంలో ఉన్న మనుష్యులందరిలాగే కలలు కనేవాడు. ఎంత వేషం యువకులు మనుష్యులైపోతారు!
    అతనూ తన పరిస్థితి ఆలోచించుకుంటున్నాడు. ఆమె సాన్నిహిత్యం- ఆమె వొళ్ళుతనవొళ్ళు తాకుతూ రక్తం పదింతలుగా ప్రవహింప జేస్తోంది తనలో. కాని తన నిష్పలత్వం తనని సిగ్గుపరచి చిన్నతనం కలిగించి చల్లారుస్తున్నది.
    తన భావాలు తెలిసినట్టు తనలో ప్రజ్వలిస్తోన్న వేడికి కరిగిపోయినట్టు ఆమె తన ఒళ్ళోకి జారిపోయింది. బలంగా దగ్గరగా తీసుకున్నాడు ఆమెని అతను. ఆమె చేతులు అతని మెడకి చుట్టుకున్నాయి-బలంగా.
    కొద్ది క్షణాల్లో, అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకేసరికి ఆమె జారిపోయి నిలబడింది. రెండు చేతులోనూ అతని ముఖాన్ని తీసుకొని నీకు తెల్సును గోపాలం.....నాకూ తెలుసును" అని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది.
    అతను లేచి నిలబడి చెంపలు తడుముకున్నాడు. ఆమె స్పర్శ ఇంకా పూర్తిగా పోలేనట్లుంది. కిటికీలోనించి బయటికి చూశాడు.
    అవును. ఆమె హద్దులు దాటదు. గోపాలం కోసమైనా సరే ఆమె తననీ హద్దులు దాటనివ్వదు - గోపాలం సుఖం కోసం.
    మిగిలిన సాయంత్రం బయటనే కూర్చున్నా రిద్దరూ. రాత్రి ఏడు దాటాక ఇంటికి చేరాడు గోపాలం.

                                                         4

    అతను గేటుదాటేసరికి అల్సేషియస్ పెద్ద నోటితో అరుస్తూ అతనివైపు పరిగెట్టుకొచ్చింది.
    అతనలాగే నిలబడిపోయాడు తత్తరపడుతూ. కుక్కవొచ్చి రెండుకాళ్ళూ తన పక్షంమీద పెట్టి తనని రుచిచూసే ప్రయత్నంలో ఉంది.        
    "శమ్మి - శమ్మీ! డౌన్ -
    లోపల్నించి పరిగెట్టుకొచ్చి వసంత త్వర త్వరగా కుక్కని రెండు కొట్టి అతన్ని విడిపించ డానికి గొలుసుపట్టుకుని లాక్కుని వెళ్ళి చెట్టుకి కట్టేసింది.
    "సారీ గోపాలం- దాన్ని ఎవరు విప్పేశారో తెలీదు. ఏం డామేజి లేదుకద?" అంది వసంత.
    అర నిమిషం ఆమెవేపు చూస్తూ ఉండిపోయాడు గోపాలం. ఆమె నిక్కరువేసుకుని బుష్ షర్టు తొడుక్కుంది. జూతు పోనీ టైల్ తో కట్టుకుంది.
    పాలలాటి వొళ్ళు ఆమెది. అతను ఏ అమ్మాయినీ అంత దగ్గరలో అలాగ చూడలేదు.
    ఆమె అతని బుష్ షర్టు దులుపుతూ. "ఉండీ ఉండీ పిచ్చిఎక్కుతుంది దానికి. ఇవాళ తంతాను" అంది. "పద-లోపలికిపోదాం..ఇక్కడ మరీ గాలిగా ఉంది" అంటూ లోపలికి దారి తీసింది. ఆమె వేపేచూస్తూ అతనూ లోపలికి నడిచేడు.
    ఆమె అతన్ని సోఫాలో కూర్చోబెట్టి తనూ ఎదురుగా కూర్చుంది. "శమ్మీ థర్మమా అని లాంఛనాలన్నీ పూర్తి అయాయి ఏం చెయ్యకుండానే ఎలాగ ఉన్నావు గోపాలం? అన్నయ్య చెప్పేడు ఇవేళ నువ్వు వస్తావని..." అంది.
    "శేఖర్ ఏడీ?"
    "స్టేషనుకి వెళ్ళేడు టిక్కెట్టు కాన్సిల్ చేసేందుకు. రేపు కలకత్తా వెళ్ళకుండా మద్రాసు వెళ్ళనున్నారు నాన్న. ఏదో గవర్నమెంటు కంట్రాక్టు గురించి."
    "మీనాన్నగారు............"
    "అశ్రమానికి వెళ్ళేరు. ఆయనకి ఈ మధ్య దైవభక్తి మరీ ఎక్కువైపోతోంది. అలాగ మాట్లాడకుండా కూర్చున్నావే, గోపాల్?- కొత్తగా కనిపిస్తున్నానా?"
    అతను చిరునవ్వు తో. ఆఁ. చాలా అన్నాడు.
    ఆమె నవ్వి, "గాడ్! నిన్ను చూసీ, నీతో దెబ్బలాడ ఎనిమిదేళ్ళయిపోయింది. నాన్నగారు కలకత్తా పంపేక నేను ఇక్కడికి రానేలేదు" అంది.
    ఎనిమిదేళ్ళకిందటి వసంత జ్ఞాపకం వొచ్చింది అతనికి. అప్పుడు ఆ సమానం తనతో పోట్లాడేది. అతనికి బాగా జ్ఞాపకం. ఒకనాడు అతనూ శేఖరం నాటకానికి వెడుతూంటే తనూ వొస్తానంది.
    "నాన్నగారు తంతారు" అన్నాడు శేఖర్.
    "తన్నరు" అంది శశి అంటూనే వరండాలో కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి "నేను నాటకానికి వెళ్తానంటే తంతారా?" అని అడిగింది.
    "నీకు తెల్సును?" అన్నాడాయన.
    మళ్ళీ తమ దగ్గిరకి వొచ్చి, "తన్నరు. నన్నూ తీసికెళ్ళు" అని అన్న ముఖంలో కోపం చూసి. "ఛీ నువ్వెప్పుడూ ఇంతే?- నువ్వుతీసి కెళ్ళు గోపాలం!" అంది.
    "రెండే టిక్కెట్లు ఉన్నాయి అన్నాడు గోపాలం.
    డబ్బు తెస్తాను. ఇంకోటి కొను" అంది వసంత లోపలికి వెళ్ళబోతూ.
    "రాత్రి పన్నెండైపోతుంది" అన్నాడు తను.
    "నిద్రపోను" అంది దృఢంగా.
    "నీకు బోధపడదు" అన్నాడు శేఖర్.
    ఆ మాటకి ఆమెకి బలే పౌరుషం వొచ్చి. "నీకు మహాఁబోధపడినట్టు! ఛీ గోపాలం నీలాగే పొండి" అని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
    ఆ రోజు తనకి నాటకం ఏమీ బాగుండలేదు. శేఖర్ ఆమె మాటే పూర్తిగా మరిచిపోయాడు. కాని నాటకం జరుగుతున్నంతసేపూ అతనికి ఆమె ఏడుపు జ్ఞాపకం వొచ్చి బాధకలుగుతూనే ఉంది. ఆ తరవాత నాలుగు రోజులు తనతో మాట్లాడలేదు వసంత.
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అని అడిగింది వసంత.
    "నిన్ను తీసికెళ్ళకుండా శేఖరం!" నేనూ ఓనాడు నాటకానికి వెళ్లేం జ్ఞాపకం ఉందా? అ మాట జ్ఞాపకం వొచ్చింది" అన్నాడు గోపాలం.
    జ్ఞాపకం లేకేం - ఈ మధ్యనే క్షమించాను నిన్ను ఆ వేళ ఏడు పెందుకు వొచ్చిందో తెలుసా?"
    "నీకు బోధపడదన్నామని-"
    "అదీ కాదు. దాని వెనకాల ఉన్న సుపీరియారిటీ చూసి పెద్దకోపం వొచ్చింది నాకు. అందులో కొంత నిజం. ఉందిదాన్ని ఏడుపు"
    "అంత జ్ఞాపకం ఉందా?"
    "ఆఁ... ఏమిటో గాని. నాకు ఏ విషయం మరుపురాదు. నువ్వు పరుగుపందెంలో ఓడిపోయి. రాజుని తన్నబోయావు.... జ్ఞాపకం ఉందా."
    అతనికి నవ్వువొచ్చింది. "ఆఁ... వాడు పరుగెడుతూ నన్నుతోశాడని... అతను ఇన్ కమ్ టాక్సులో ఉంటున్నాడు తెలుసా? నేనూ అతనూ నిరుడే డిగ్రీ తీసుకున్నాం"
    "నాకు తెలీదులే... గోపాలం! నిన్ను చూస్తే బలే ఉషారుగా ఉంది. శేఖర్ వొస్తే పిక్చర్ కి పోదాం ఇక్కడ బొత్తిగా ఏమీ తోచదు. ఏం?" అంది వసంత.
    "మరో రోజు..."    
    "ఏం- ఇవాళ?"
    రాత్రి శశిరేఖ పుట్టినరోజనీ. అక్కడికి డిన్నరుకి వెడతాననీ చెప్పడం ఇష్టంలేకపోయింది అతనికి.
    "ఇవాళ- వేరే పని ఉంది"
    "అబద్ధం చెప్తున్నావు"
    కొంచెం కోపంగా. "ఇంకా చిన్నతనం పోలేదు నీకు. వసంతా!" అన్నాడు గోపాలం,
    "ఆల్ రైట్. అపాలజీ. చెప్పు. కాఫీ తాగు తావా, టీ తేనా?"
    "నీ ఇష్టం."
    "కూల్ డ్రింక్?"
    "సరే!"
    ఆమె లోపల్నించి గ్లాసులు తెచ్చి ఫ్రిజడీర్ లో నించి ఆరంజ్ స్క్వాష్ తీసి కలిపి ఇచ్చింది. ఆమె తాగుతోంటే ఎంతో నాజూగ్గా. అందంగా కనిపించింది అతనికి. ఆమె చేతుల నునుపూ. తెల్లదనం తామరతూడుల్ని, మరేవో అందాలనీ జ్ఞాపకం చేస్తున్నాయి.
    "ఏం చేస్తున్నావు గోపాలం? అన్నయ్య ఏమీ చెప్పలేదు- నువ్వు కనిపించేపని తప్ప-"
    "ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను వసంతా! నీలాంటి అదృష్టవంతులకి తెలియని వెయ్యి కష్టాలు ఉంటాయి సామాన్యులకి" అన్నాడు సగం నవ్వుతో, సగం బాధతో, ఆమె ముందు ఏదో గొప్పతనం చూపాలన్న భావన తనలో కలగసాగిన విషయం గ్రహించి ఆభావన బలపడేలోపుగానే నిజం చెప్పడానికి నిశ్చయం చేసుకున్నాడు గోపాలం.
    ఆమె నవ్వుతూ, "ఓహ్!- నాకేం తెలీదనుకుంటున్నావ్! ఐనా, నువ్వెప్పుడూ అంతే గోపాలం. ఒక రోజు నువ్వు చాలా గొప్ప వాడివైపోతావు. ఏ పరిస్థితినీ ముఖ్యంగా చెడ్డ పరిస్థితిని భరించలేని శక్తి వుంది నీకు. ఆ చికాకులోనువ్వే మైనా చేయగలవ్" అన్నది.
    ఆ మాటకి అర్ధం ఆలోచిస్తూంటే బయట కారువొచ్చిన చప్పుడైంది, శేఖర్ లోపలికివొస్తూ "హలో గోపాల్! - స్టేషనుకి వెళ్ళాను. వసంత వాదిస్తోందా ?- దానికి అలవాటులే. అన్నట్టు, నీకు కొత్తలేదుగా!" అన్నాడు.
    "ఒరేయ్ బ్రదర్! నన్ను అనవసరంగా ఏం అనకు." అంది ఖాళీగ్లాసు ఎత్తిపట్టుకుని.
    "ఆ గ్లాసా? ఐతే ఫరవాలేదు" అన్నాడు నవ్వుతూ శేఖర్.
    ప్రశ్నిస్తూ చూసేడు గోపాలం.
    "అది వాళ్ళ ఫ్రెండు ప్రెజెంట్ చేసిన గొప్ప లెమన్ సెట్ లో - ఇంగ్లీష్ కట్ గ్లాస్ సెట్ - గ్లాసు" అని బోధపరిచేడు శేఖర్.
    మరుక్షణం వసంత గురిచూసి గ్లాసుకిటికీ ఊచల మీదికి విసిరింది. అది ముక్కలై పోయింది. శేఖర్ తెల్లబోయాడు. గోపాలం లెమన్ పూర్తిగా తాగకుండానే గ్లాసు నెమ్మదిగా టేబిల్ మీద పెట్టేడు.
    రెండు నిమిషాలు ఎవ్వరూ మాట్లాడలేదు. తేరుకుని శేఖర్. "వసంతా-కొంచెం మేనర్స్ ఉండాలి" అన్నాడు.
    "అవును-నాకొక్కరికే కాదు" అని ప్రజ్వలిస్తోన్న కోపంతో అని. ఆమె గదిలోనించి వెళ్ళి యింది.

                              *    *    *


    ఐదు నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేడు.
    "సారీ..." అన్నాడు శేఖర్.
    "ఆమెకి చాలా కోపం వచ్చింది...." అన్నాడు ప్రశ్నిస్తోన్నట్టు గోపాలం.
    "ఆఁ...నేను హాస్యంగా అన్నాను కాని, వసంత అంత సీరియస్ గా కోపం తెచ్చుకుంటుందనుకోలేదు"
    "సంగతేమిటి?- అడగొచ్చా?"
    బాధగా నవ్వేడు శేఖర్. "నువ్వు మాత్రం అడగవొచ్చును - ఎప్పుడో చెప్తానుకూడా నీకు. ఇప్పుడు కాదు-మరో రోజున" అన్నాడు.
    ఇంక అక్కడ ఉండడం చాలా కష్టం అయిపోయింది గోపాలానికి, జరిగిన ఈ చిన్న నాటకంలో చెయ్యగూడని పని ఏదో తాను చేసినట్టు ఫీలయ్యాడు...లేక చెయ్యవలసిన పని ఏదో చెయ్యలేనట్లా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS