రాత్రి తొమ్మిది కావస్తూంది. గీత ఇంకా ఇంటికి రాలేదు. సుధ, రవి నిద్రపోతున్నారు. నాయర్ ఎనిమిది గంటలవరకే తన డ్యూటీ అని చెప్పి, కారియర్ లో భోజనం సర్ది వెళ్ళిపోయాడు. నైట్ వాచర్ ముందు అరుగుమీద మరొక ఫ్యూన్ తో కబుర్లు చెబుతున్నాడు నెమ్మదిగా, వాతావరణం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. అసలే ఊరు చివర. అందులో దూర దూరంగా ఉన్న బంగళాలు. అతి పెద్దదైన ఆ బంగళాలో ఒంటరిగా కూర్చొని చదువుకొంటున్న లతకు అకస్మాత్తుగా తన భర్త రమాకాంత్ గుర్తు వచ్చాడు. 'ఆయన ఈ వేళప్పుడు ఇల్లు చేరుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారు. లేకపోతే తనను తలుచుకొంటూ నిద్రను దూరం చేసుకొంటున్నారేమో?' కారు గేట్లో ఆగడంతో లేచి గుమ్మం దగ్గరకు వచ్చింది లత. కార్లోనుండి దిగుతున్న రాజాను చూసి, "అన్నయ్యా!" అంది ఆనందంగా.
"వచ్చావా అమ్మా!" ఆప్యాయంగా భుజంతట్టాడు.
కొంచెం ఆగి, "ఎన్నాళ్ళకో వస్తున్నావు గదా, ఎలా గైనా ఈ కాంపు ఆపుకొని ఉందామని ఎంతో ప్రయత్నించాను. కాని వీలుపడలేదమ్మా. అందుకే గీతను స్టేషనుకి వెళ్ళమని చెప్పాను. నిన్ను జాగ్రత్తగా రిసీవ్ చేసుకోకపోతే రేపు రమాకాంత్ నన్నేమంటాడు!" అన్నాడు నవ్వుతూ.
మాట్లాడుకుపోతున్న రాజాను నమ్మబడిన ముఖంతో చూస్తున్నలత తానూ బలవంతంగా నవ్వు తెచ్చుకొంది.
"పిల్లలేరీ?"
"నిద్రపోతున్నారు. నువ్వు ముందు స్నానం చేసి రా, అన్నయ్యా" అంది ఆదుర్దాగా లత.
"అబ్బే, ముందు వాళ్ళను చూడాలి. రవిగాడు పుట్టాకనే చూడనే లేదు" అంటూ లత వెనకే గది లోకి వెళ్ళాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళిద్దరి చెంపలమీద అలవోకగా ముద్దు పెట్టుకొన్నాడు.
"నీకు పడుకోవటానికి భలే గది దొరికిందే! ఇక్కడ బొత్తిగా గాలి రాదమ్మా. పక్కలు ఆ పెద్ద గదిలో వేయిస్తా నుండు" అంటూండగానే, "ఫర్వాలేదులే. ఇప్పుడు నిద్రపోయే పిల్లలను లేపటం ఎందుకు? ఈ రోజుకు పడుకోనిద్దూ. రేపు చూసుకొందాం" అంటూ తోసివేసింది.
"సరే. లా అయితే ఉండు" అంటూ గబగబా టేబుల్ ఫాన్ తెచ్చి అక్కడ గాలి వచ్చేటట్లుగా పెట్టి వెళ్ళాడు. అన్నయ్య ఆప్యాయతకు లత కళ్ళు చెమ్మగిల్లినాయి.
రాజా స్నానం చేసి బట్టలు వేసుకు వచ్చి భోజనానికి కూర్చున్నాడు.
కారియర్ విప్పుకోబోతున్న రాజాను వారిస్తూ, "భలేవాడివే! నేను లేనూ! నీవే వడ్డించుకు తింటావా ఏం?" అంటూ అన్నీ వడ్డించటం మొదలుపెట్టింది.
"ఈ రోజు నా కేం కొత్తగాదుగా!" ఒక్కసారి విషాదచ్చాయలు అలుముకొన్న రాజా ముఖంలోకి నిశితంగా చూసింది లత. మూడేళ్ళ క్రిందట తాను చూసిన రాజా ఇంకా అందంగా, హుందాగా ఉండేవాడు. ఈ రాజా కొంచెం చిక్కినట్లు, కళ్ళలో ఏదో దైన్యం కూడగట్టుకొన్నట్లు అనిపించింది లతకు.
"నీ కీ ఊరు సరిపడలేదా, అన్నయ్యా?"
"నా లాటి వాడికి ఊరు సరిపడక పోవటం, నీళ్ళు సరిపడక పోవటం లేదమ్మా, ఉన్న చిక్కల్లా మనసుతోటే."
"అంటే?" అడుగుతూ చారు వడ్డించింది.
"చూడు, లతా, నీ పెళ్ళైన కొత్తలోనే వొకసారి వచ్చాను. అప్పుడు నాకు రమాకాంత్ కు భోజనం వడ్డించి, నువ్వు మారు వడ్డించడానికి పక్కనే కూర్చున్నావు. అప్పుడు రమాకాంత్ నిన్నుకూడా మాతోపాటు తినమని బలవంతం చేశాడు. నీ వేమో మాకు వడ్డించి కాని తిననన్నావు. రమాకాంత్ కు కొంచెం కోపంకూడా వచ్చింది-మాతో తినన్నందుకు మీ ఇద్దరికీ రాజీచేసి నీకు కూడా నేను వడ్డించాను. ఆ రోజు నా కెప్పుడూ జ్ఞాపకం వస్తుంది, లతా. నువ్వు మా ఇద్దరికీ ఏది అవసరమో చూస్తూ కొసరికొసరి తినిపిస్తూ నీ భోజనం కూడా సరిగ్గా చేయలేదు."
"అంతా అబద్ధం. నేను బాగానే తిన్నాను." నిండుగా నవ్వుతూ అంది. రాజా ఒక్కసారి చెల్లి ముఖంలోకి చూసి, "నీలా అలానిండుగా ఎందరు స్త్రీలు నవ్వగలరు? ఎందరు తను భర్తలకు కబుర్లు చెపుతూ తినిపించగలరు?" అన్నాడు.
"ఇది మరీ బాగుంది. భర్తకు అన్నం పెట్టటం, ఆనందంగా నవ్వటంకూడా చిత్రమేనా?"
"కాదా మరి! చిత్రాలలో కెల్లా చిత్రమైంది." లత అనుమానంగా రాజా ముఖంలోకి చూసింది.
రాజా అదేమీ గమనించకుండా భోజనం పూర్తి చేసి లేచాడు. లత మళ్ళీ అన్నీ సర్దుతూ, 'వదిన ఇంకా రాలేదే' అనుకొంది స్వగతంలాగ.
"ఆమె కెన్ని రాచకార్యాలు! ఎక్కడో భోజనం చేసే ఉంటుంది. ఇంత ఆలస్యమైంది కదా-కనీసం రైలు వేళకు కారు పంపాలని కూడా తోచలేదు మహారాణికి."
"తన కేమైనా పని ఉందేమో-" అనుమానంగా అంది.
"పనేముందమ్మా? పదివరకు క్లబ్బులోనే కూర్చుంటారు. అయినా, లతా, నాకు తెలీక అడుగుతున్నాను- రమాకాంత్ నాలాగ అయిదు రోజుల తరవాత కాంపునుండి ఇంటికి వచ్చాడనుకో అతడు వచ్చేవేళకు నీవైతే ఇంట్లో ఉండకుండా వెళ్ళగలవా? ... అయిదు రోజుల తరవాత భర్త ఇంటికి వస్తున్నాడన్న ఆనందంతో హృదయపూర్వకంగా స్వాగతం చెపుతావు."
"ఏమిటన్నయ్యా నువ్వు అనేది?" అర్ధం కానట్లు అడిగింది.
"అది అంతేరే. సరేకాని, ఇంకేమైనా కబుర్లు చెప్పమ్మా."
"చాలా పొద్దుపోయిందన్నయ్యా. పడుకోరాదూ? అలిసిపోయి ఉంటావు."
"లేదు, లతా నీతో కబుర్లు చెపుతూంటే, నీవు చెప్పేవి వింటూంటే మళ్ళీ నాకు చిన్నతనం, అమ్మ అనురాగం, రాగద్వేషా లెరగని ఆ అమాయిక ఆనందం గుర్తు వస్తున్నాయి. ఎంతో మధురమైన ఆ రోజులు-ఆ జ్ఞాపకాలు గుర్తుచేసే నీ మాటలు- నా కిప్పుడు నిజంగా ఆనందంగా ఉందమ్మా." ఆలోచనగా, ఆవేశంగా చెపుతున్న అన్నయ్య దగ్గరకు వచ్చి పక్కగా కూర్చుంది సోఫాలో. తరవాత నెమ్మదిగా అన్న చేతిని తన చేతిలోకి తీసుకొంటూ, "నీ మనస్సేమీ బాగున్నట్లు లేదు" అంది జాలిగా.
"అది ఎప్పుడూ బాగుండదమ్మా." రాజా కంఠం భారంగా పలికింది. లత కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
"అన్నయ్యా, నే నొక్కటి అడగనా?"
"అడుగు" అన్నట్లు చూశాడు.
"నువ్వెంతో తెలివిగలవాడివి. నీ దగ్గిర పెరిగిన నేను వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని గౌరవించటం నేర్చుకున్నాను. నీ స్నేహంతో చల్లని పన్నీటి జల్లులు ఉన్నాయి. నీ ఆప్యాయతలో అమరత్వమే ఉంది. అలాటి నువ్వు ఇలా మనస్సు బాగుండదని కబుర్లు చెప్పడం నాకు నచ్చలేదు. నీవు నీ ప్రయత్నం చేసి ఆనందంగా ఉండాలని ఎందుకు ప్రయత్నించవు?"
"ఆనందంగా ఉండగలగటమనేది ఒక వరం, తల్లీ. భగవంతుడు దానిని అందరికీ అందివ్వడు. నా దృష్టిలో నీవు దేవతవు. నీకు నేను దేవుడి లాటి వాడిని. కాని ఇతరు లకు కూడా మనం అలా కనిపించగలగాలి కదా!"
"అబ్బో! దేవుడు, దేవతల కబుర్లు చెప్పుకుంటున్నా రేమిటి? ఇంకా నిద్రలు రావటం లేదా ఏం?" అనుకొంటూ వచ్చింది గీత, లతా, రాజా మాటల్లో కారు శబ్దం కూడా వినలేదు.
"నీకు రాని నిద్ర మాకుమాత్రం ఎలా వస్తుంది?"
రాజా సమాధానం బట్టలు మార్చుకొని బెడ్ రూం లోకి వెళుతున్న గీతతో, "భోజనం చేయవా, వదినా" అంది లత. "అయింది నా భోజనం సంగతి నువ్వు గుర్తు చెయ్యాలా ఏమిటి?" అనుకొంటూ గదిలోకి వెళ్ళింది.
"అవును ఇతరుల సంగతి నీవు పట్టించుకోనట్టు అందరూ ఉండలేరుగా" అన్నాడు కటువుగా రాజా.
"నేను నిద్రపోతాను" అంటూ లేచింది లత.
లత వెళ్ళిపోయిన తరవాత కూడా రాజా కూర్చున్న హాల్లో చాలాసేపు లైట్లు వెలుగుతూనే ఉంది. రాజా ఆలోచిస్తూ కూర్చునే ఉన్నాడు. పడుకొన్న లతకూడా వెంటనే నిద్రపోలేదు. వదిన ప్రవర్తన మనస్సును కలవరపెడుతూంది. తన నేమన్నా ఫర్వాలేదు. నాలుగు రోజులుండి వెళ్ళిపోతుంది కాని, అన్నయ్య? అయిదు రోజుల తరవాత ఇంటికి వస్తున్న భర్తకు స్వాగతం ఇవ్వకపోగా, రాత్రి పది గంటలకు వచ్చి, అనునయంగా ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఈ నాలుగు రోజులూ ఎలా ఉన్నారని కూడా అడగలేదు. కనీసం ప్రేమపూర్వకమైన ఒక చల్లని చూపు కూడా చూడని వదినకి అన్నయ్యపై ప్రేమ లేదా? భర్త అన్న తరవాత భార్యకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? మరి ఆమె ఎందుకలా ప్రవర్తిస్తూంది? మనస్సంతా వికలమై పోయింది. ఎలా నిద్రపోయిందో, ఎప్పుడు నిద్ర పోయిందో ఆమెకే తెలియదు. ఆ తరవాత చాలాసేపటికి రాజా లైటు ఆర్పి, గదిలోకి వెళ్ళాడు.
* * *
