Previous Page Next Page 
అపస్వరం పేజి 3


    "అమ్మా, అమ్మా, ఆ వచ్చింది మీర కదమ్మా?" అన్నాడు ముద్దులు గుడుస్తూ.
    కమలమ్మగారు తాత్సారంగా, "అవును, వచ్చింది మీరేగాని, లేచిందేమో కాఫీకి పిలు. అలాగే మీ నాన్న గారు లేచారేమో చూడు." అన్నారు. శ్రీపాదు వచ్చి చూసేసరికి కృష్ణయ్యగారింకా లేవలేదు. శ్రీపాదు మీర కూర్చున్న చోటికి వచ్చి,
    "అమ్మ పిలుస్తోంది" అన్నాడు.
    "నువ్వు శ్రీపాదువా, శ్రీహరివా?"
    "నువ్వే చెప్పుకో చూద్దాం"    
    శ్రీపాదు కొంటెగా నవ్వాడు. శ్రీపాదు, మీరకన్నా మూడు నెల్లు పెద్ద. ఇంతకు మునుపు చూసినపుడు అతడు తనంత పొడుగే ఉండేవాడు. ఇప్పుడు తనకన్నా పొడుగ్గా ఉన్న అతన్ని చూసి శ్రీహరే అయుండాలి అనుకుంది మీర.
    "నువ్వు శ్రీహరివి కదూ?"    
    శ్రీపాదు పెద్దగా నవ్వేశాడు.
    "కాదు, నేను శ్రీపాదును. స్వాతక్క పెళ్ళిలో మనిద్దరం చెట్లెక్కి జాంకాయలు కోసుకుతిన్నాం. అప్పుడే మర్చి పోయావా?"
    "అవును మర్చిపోయాను." అని మీరు అంటూండగానే, శ్రీపాదు అన్నయ్యలు, శ్రీహరి, గోవిందు లోపలి కొచ్చారు. శ్రీపాదు శ్రీహరిని చూపించి "అదిగో, శ్రీహరి" అన్నాడు. మీర ఆశ్చర్యానికి అంతులేదు. స్వాతక్క పెళ్ళిలో తెల్లగా ముద్దుగా ఉన్న అతని మొహం ఇప్పుడు స్ఫోటకపు మచ్చలతో నిండి పోయింది. శ్రీపాదు తనవేపు చూపించగానే, శ్రీహరి సిగ్గుతో, పుస్తకాన్ని మొహానికి అడ్డుగా పెట్టుకొని లోపలికి వెళ్ళి పోయాడు. తన మొహం మీదున్న మచ్చలవల్ల శ్రీహరి కొత్తవాళ్ళెదుట పడటానికి సిగ్గుపడేవాడు. గోవిందం తల్లిలా పొడుగ్గా, తండ్రిలా నల్లగా ఉండేవాడు.
    మీర కాఫీ తాగుతూండగా, కృష్ణయ్య్గగారి పెద్ద కొడుకు గోపాలం లోపలికి వచ్చాడు. అతనికి పదహారేళ్ళుంటాయి. ఎస్సెల్సీ, చదువుతున్నాడు. అప్పుడే కృష్ణయ్యగారికన్నా ఎత్తుగా పెరిగిన గోపాలాన్ని చూసి, తను చాలా పొట్టి అనుకుంది మీర. నలుగురు అన్నదముల్లో గోపాలం అంటేనే ఎక్కువ ఇష్టం కలిగింది మీరకు. తల్లిలా ఎర్రగా నున్న ఛాయ, జాలి, కొంటెతనంతో నవ్వుతున్న కళ్ళు, నల్లటి జుత్తు, ప్రసన్నవదనం, స్నేహమయి మీర హృదయాన్ని చూరగొన్నాయి. అతడిని పలకరిద్దామనుకొన్నా, బదులు పలకకపోతే ఎలా, అన్న స్వాభిమానంతో మౌనం వహించింది.
    కాని గోపాలం నవ్వుతూ, చనువుగా, "అప్పుడే నన్ను మర్చిపోయావటే, మీరా?" అని మీర పొట్టిజడను లాగాడు. మీరకు నొప్పి కలిగినా, పైకి కనిపించనీయలేదు. కాని అప్పుడే లోపలికి వచ్చిన కృష్ణయ్యగారు, ఈ దృశ్యాన్ని చూసి-
    "ఒరే, అలా లాగకు, ఏడుస్తుంది" అని కసిరారు. గోపాలం చెప్పవచ్చుకున్నాడు. మీర దాన్ని చూసి.
    "నాకేమి నొప్పవలేదు, పెదనాన్నా" అంది.
    గోపాలం అర్ధమైనట్టుగా కృతజ్ఞతతో నవ్వాడు.
    మరుసటి రోజు కృష్ణయ్యగారు మీరని, ఇంటికి అరమైలు దూరంలో నున్న కాన్వెంటుకు తీసుక వెళ్ళారు. హెడ్మిస్ట్రెస్ గదిలోకి వెళ్ళేటపుడు మీరా మనసులో ఏదో దిగులుగా ఉంది.
    అద్దాలు పెట్టుకున్న, హెడ్మిస్ట్రెస్, కుర్చీలో కూర్చొని ఏవో కాగితాలు చూస్తున్నారు. కృష్ణయ్య గారు లోపలికి రాగానే, తలెత్తి, పశ్నార్ధకంగా, ఆయనవేపు చూశారు. చాకలెటు రంగులంగా తొడుక్కొని, తలమీద ముసుగు వేసుకున్న, ఆమెను చూసి, మీర భయపడింది.
    "కూర్చోండి. ఏమి కావాలి?"
    "మా అమ్మాయిని, అయిదవ తరగతిలో చేర్చాలి"
    "సర్టిఫికేటు తెచ్చ్రారా?"
    "ఊ."
    ఆమె లేచి బీరువాలో నుండి, అప్లికేషన్ ఫారం తీసి ఇచ్చారు. "దీనిని నింపి, ఫీజు కట్టేయండి" అన్నారు.
    కృష్ణయ్యగారు ఫారం నింపి. ఫీజు కట్టి, రసీదు తీసుకున్నారు.
    "మీరా సాయంత్రం క్లాసు వదలగానే, ఇంటికి వచ్చేయి. గోవిందున్ని పంపిస్తాను." అని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న బంట్రోతు ఐదవ తరగతిలో మీరని వదలి వెళ్ళిపోయాడు.
    మీరా లోపలికి రాగానే పాఠం చెబుతున్న సిస్టర్ తలెత్తి చూశారు.
    "ఇలా రా అమ్మాయ్"
    మీర వెళ్ళి టేబుల్ దగ్గర నుంచుంది.    
    "నీ పేరేమిటమ్మా?"
    "మీర"
    "ఏ.బి.సి.డి. రాయగలవా?"
    "ఊ"
    సిస్టర్ సుద్ధ ముక్క ఇచ్చి "ఏది బోర్డు మీద రాయి చూద్దాం" అన్నారు. మీర మునివేళ్ళ మీద నిలబడి బోర్డును అందుకొని వ్రాసింది.
    "గుడ్, ఈ పాఠం చదువు" అంటూ తన చేతిలోని ఇంగ్లీషు పుస్తకాన్ని ఇచ్చారు, సిస్టర్. మీర ధైర్యంగా తప్పులు లేకుండా చదివేసింది.
    "రాజేశ్వరీ, ఈ అమ్మాయికి నీ ప్రక్క చోటు ఇవ్వు"
    రెండు జడలు వేసుకొని, ఎర్రరిబ్బన్ను కట్టుకున్న పిల్ల పక్కకు జరిగి మీరకు చోటిచ్చింది. కొత్తమ్మాయిని పరిచయం చేసుకోవాలని, ఆత్రంగా ఉంది రాజేశ్వరికి. టీచరుకు వినబడకుండా మెల్లిగా.
    "నీ పేరేమిటి?" అంది.
    "మీరా"
    "మీ ఇల్లెక్కడుంది"
    "ఇక్కడే కొంచం దూరంలో"
    "రాజేశ్వరీ, మీరా, మాట్లాడకండి." టీచర్. హెచ్చరించారు.
    ఇంటిబెల్లు కొత్తగానే, అందరూ బయటికి వచ్చారు, రాజేశ్వరి ఇంటి నుండి నౌకరు, సైకిల్ తీసుకుని వచ్చాడు. రాజేశ్వరి సంచిని సైకిలు పిడికి తగిలించి, రాజేశ్వరిని సైకిలు సీటు మీద కూర్చోబెట్టుకుని, సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళాడు. "టా...టా" అంటూ చెయ్యూపింది రాజేశ్వరి.
    అరగంట దాటాక గోవిందు, కాళ్ళీడ్చుకొంటూ రావటం కనిపించి "హమ్మయ్యా" అనుకుంది మీర. ఇంటికి వెడుతూ అన్నాడు.
    "దారి బాగా గుర్తుంచుకో మీరా. రేపటి నుండి నువ్వక్కతివే రావాలి ఎవరైనా స్నేహితులు దొరికారా?"
    "ఊ, రాజేశ్వరి....."
    "ఓ- ఆ రెండు జళ్ళ అమ్మాయి కదూ? నౌకరుతో సైకల్ మీద వెడుతుంది...."
    "అవునవును నీకెలా తెలుసు?"
    "మన వీధిలోనే ఉందిలే వాళ్ళిల్లు. వాళ్ళ నాన్న లెక్చరరు. మేమంతా 'బొంబాయి బొండా అని పేరెట్టాము ఆ అమ్మాయికి"
    మీర ఇంటికి రాగానే కృష్ణయ్యగారు బడిలో జరిగిన పాఠాలు సంగతంతా అడిగి తెలుసుకున్నారు. మీర ఎంతో ఉత్సాహంగా అన్ని చెప్పింది. కృష్ణయ్య గారు గర్వంతో మీరా తెలివితేటలను, భార్యతో చెపుతూ, మెచ్చుకున్నారు. కమలమ్మగారు, మొహం నల్లగా చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు.
    "మీరా, అనుకుందాంరా" శ్రీపాదు మీర చయ్యి పట్టుకొని లాగాడు.
    "వెళ్ళమ్మా, ఆడుకో" అన్నారు కృష్ణయ్య గారు. వెంటనే, మీరా, శ్రీపాదు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS