"ఏమిటాలోచిస్తున్నారు?" శ్రీధర్ గొంతు వినబడేసరికి.
"అబ్బే! ఏం లేదు! పదండి" అంది ఏదో నిర్ణయించుకున్నదానిలా ఇందిర.
"దిగండి మరి" అన్నాడు శ్రీధర్ తను ముందు దిగకుండా.
స్టీరింగు ముందు నుంచి ఇందిర దిగింది. శ్రీధర్ స్టీరింగు దగ్గరకు జరిగి ఇందిర వేనకాలే దిగాడు. వెచ్చటి గాలి ముఖాలకు ఈడ్చి కొడుతున్నది. శ్రీధర్ ముందు, వెనకాల ఒకరి వెనకగా ఒకరు తోట వైపు నడుస్తున్నారు. నెమ్మదిగా నాలుగడుగులు వెనక్కి వేసింది ఇందిర. అది గమనించిన వాడిలా గబుక్కున ఇందిర చెయ్యి పట్టుకుని--
(1).jpg)
"బుద్ది మంతురాలిలా వస్తే సరేసరి. లేకపోతె ఎత్తుకు పోవలసి వస్తుంది?' అన్నాడు.
"మీరు నన్నేం చేయ్యదల్చుకున్నారు?" అతని చేతిలో బిగుసుకుపోతున్న తన చేతిని లాక్కోటానికి ప్రయత్నిస్తూ అంది ఇందిర "నేనేం చేస్తాను! మీ నోటితో నిజం చెప్పించి వదిలేస్తాను. నాకు కొన్ని ప్రశ్నలకు మీ నుంచి సమాధానాలు కావాలి" వస్తున్నా కోపాన్ని దిగమింగుతూ అన్నాడు శ్రీధర్.
ఆ తోట అతనికి చిర పరిచితమైనదే! శ్రీధర్ ఇంటికి రెండిళ్ళవతలగా ఉన్న కామేశ్వరరావు గారిదే ఆ తోట . కామేశ్వరరావుగారమ్మాయి కి తన చెల్లెలు భార్గవి కి మంచి స్నేహం. తనేన్నో సార్లు వాళ్ళతో వాళ్ళ కారులో ఆ తోటకు వచ్చాడు. ముందంతా కొబ్బరి చెట్లు -- వెనకాల మామిడి తోట -- ఆ తోట కాపలాదారు సుబ్బన్న ఎదురు పడ్డాడు.
"సుబ్బన్నా! నా స్నేహితురాలు -- తోట చూపిద్దామని తీసుకొచ్చాను" అన్నాడు శ్రీధర్ సుబ్బన్న ను చూస్తూ.
"దాందేముంది బాబయ్యా! చూడండి -- నే కొబ్బరి బొండాలు కొట్టుకోస్తా అని వెళ్ళిపోయాడు.
ఇందిరకు కాస్త ధైర్యమోచ్చింది . సుబ్బన్న కొబ్బరి బొండాలు తెచ్చాడు. ఇద్దరూ తాగారు. కొబ్బరి తోట దాటి మామిడి తోట వైపు దారి తీశాడు శ్రీధర్.
బాగా నీడగా వున్న చెట్టు చూసి దాని కింద కూర్చుని -- ఇందిరను కూడా కూర్చోమన్నాడు.
"త్వరగా చెప్పండి. అయినా మీరు కాస్త మర్యాదగా మసలుకోవటం నేర్చుకోండి. అంత అహంభావం పనికి రాదు" అంది కోపంగా ఇందిర. అతను చిరునవ్వు నవ్వాడు. తనకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటా నిర్లక్ష్యం?
"ఇప్పుడు చెప్పండి -- నేను మీకు ప్రేమలేఖ వ్రాశానా!....మీ అందం చూసి మిమ్మల్ని పెళ్ళి చేసుకోమని వెంట బడ్డానా!
ఇందిర ముఖం ఎర్రగా కందిపోయింది.
"చెప్పండి! నాకు నిజం కావాలి! కనీసం చాటుగా నైనా మీ చేత నిజం చెప్పిస్తే కొంత ఆత్మ సంతృప్తి."
"హు! నిజం చెప్పాలట నిజం! మీ స్నేహితుడితో నా గురించి నిర్లక్ష్యంగా మాట్లాడటం నా చెవుల్తో నేను విన్నాను. నా గురించి మీ కంత చులకన భావం ఎందుకు? ఆ రోజు చెంప మీద కొట్టారు. మిమ్మల్ని దయతలచి వదిలి పెట్టాను. ఈరోజు వంటరిగా నిర్భందిస్తున్నారు. ఈ నేరాలు చాలు. మిమ్మల్ని - పోలీసు రిపోర్తిచ్చి అరెస్టు చేయించకపోతే నా పేరు ఇందిరే కాదు..." సహించరాని ఆవేశంతో ఆమె శరీరం ఊగిపోసాగింది.
"ఇందిరా....!" పెద్దగా అరిచాడు శ్రీధర్.
"నీలో ఇంకా ఏమూలన్నా మానవత్వం ఉందేమో -- చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతున్నావేమో అని భ్రమ పడ్డాను. పొరపాటు ఒప్పుకుంటావేమో -- పోనీలే ఈ విషయం మర్చిపోదామనుకున్నాను. కాని నువ్వు -- నువ్వు -- మానవ రూపంలో ఉన్న రాక్షసివి -- నీకే శిక్ష విధించినా తక్కువే అవుతుంది.."
ఇందిర ముఖంలో రక్తం కెరటం లా విరుచుకు పడింది.
"చెప్పు! మాట్లాడవేం?' ఇందిర భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నాడు శ్రీధర్.
"ఛీ! వదులు! వదలమంటుంటే!" విసురుగా అతని చేతులు తీసేసింది.
"వదలను! మగవాడంటే నీ దృష్టిలో ఏమనుకుంటున్నావ్?" కసురుతున్నట్టుగా అన్నాడు శ్రీధర్.
"మగవాడంటే నా దృష్టి లో వట్టి దద్దమ్మ! తెలిసిందా " రోషంగా అంది ఇందిర.
"ఆహా! అలాగేం!" అమాంతం ఇందిరను తన మీదకు లాక్కున్నాడు. ఊహించని సంఘటనతోతూలి మీద పడ్డది ఇందిర బలమైన బాహువుల్లో ఊపిరి సలపటానికి కూడా వీలులేనంత బలంగా హత్తుకున్నాడు శ్రీధర్. ఆమె భుజాల చుట్టూ అతని చేతులు పెనవేసుకు పోయినయి. ఏదో మాట్లాడబోయిన ఇందిర పెదవులను తన పెదవులతో నొక్కి పట్టాడు. క్షణకాలం ప్రకృతి స్తంభించి పోయింది. ఇందిర బలంగా అతన్ని తోసేసింది. శ్రీధర్ లో కోపం, ఆవేశం పెరిగి పోసాగినాయి. ఇంత పొగరు పనికి రాదు -- ఈ పొగరు అణచాలి అనే కోరిక బలంగా నాటుకుని క్షణంలో మహా వృక్షమయింది. ఇందిర చేతుల్ని నిర్లక్ష్యంగా తోసేసి ఒక్క ఊపులో తన బాహువుల్లో బంధించేశాడు. అతని బలం ముందు ఆమె ఓడి పోయింది." కొన్ని నిముషాల కాలంలో ఇద్దరూ అనుకోని సంఘటన జరిగిపోయింది. నిర్దాక్షిణ్యంగా ఆమె దోపిడీ అయిపొయింది. ఓడిపోయి సత్తువ లేకుండా తన చేతుల్లో తోటకూర కాడ లాగ వేళ్ళాడి పోతున్న సుకుమారమైన ఇందిరను చూడం గానే శ్రీధర్ కి తను చేసిన ఘోరం ఏమిటో తెలిసింది.
ఇందిరను వదిలి దూరంగా నిలబడ్డాడు శ్రీధర్. చెదిరిపోయిన జుట్టుతో ఇందిర నిస్సత్తువగా పడి ఉంది. ఒక్కసారిగా శ్రీధర్ లోని మానవత్వం బయటికొచ్చింది. ఇందిరా మీద అంతులేని జాలి కలిగింది. ఎంతపని చేశాడు తను? అయ్యో! ఆమె జీవితాన్ని నాశనం చేశాడే! ఈ పొరపాటు క్షమించరానిది! తనేం చేస్తే ఈ పాపం నుంచి బయట పాడగలడు?" ఈ విధంగా సాగిపోతున్నాయి అతని ఆలోచనలు.
ఒక పక్కగా ఒరిగి పడుకున్న ఇందిర ఆలోచించసాగింది.
తను-- మహారాజ భోగాలు అనుభవిస్తూ కల వారింట్లో పుట్టి అపురూపంగా పెరిగింది. తల్లి లేని తనను తండ్రి ఎంతో ప్రేమగా పెంచాడు. ఎండ కన్నెరగకుండా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ శరీరం ఈనాడేమైంది? ఒక పురుషుడి అహంకారానికి బలయింది? దీనికి తనెంత వరకు బాధ్యురాలు! అవును -- తనే-- తన అహంకారమే తన పతనానికి కారణం -- అనవసరంగా అతన్ని రెచ్చగొట్టింది. అతని సహనం హద్దుల వరకు లాక్కుపోయింది. తన అహంకారం, అహంభావం -- ఏవీ తనను ఆదుకోలేక పోయినాయి. తనకు కాని పనికి పోయి రోట్లో తలదూర్చింది. ఫలితం అనుభవించింది. ఈరకంగా ఆలోచిస్తున్న ఇందిర మనసులోపలి గవాక్షాలు తెరుచుకున్నాయి. పాశ్చాత్య నగరితను జీర్ణించుకున్నాననేభ్రమ వీడిపోయింది. ఆమె మనసులో భారతీయ సంప్రదాయం -- ఆచార వ్యవహారాలు పవిత్రమైన ఆశయాలు ఒక్కసారిగా మెరుపులా మెరిసినయి. ఇంతలో ఆమె ఆలోచనల కాంతరాయంగా చల్లని చేతులు ఆమె భుజం మీద పడ్డాయి. ఆమె లేచి కూర్చున్నది. తరువాత కొంగు భుజం చుట్టూ కప్పుకుని నిలబడ్డది.
"ఇందిరా! నన్ను క్షమించు! నీకు తీరని ద్రోహం చేశాను" శ్రీధర్ గొంతు జీరబోయింది.
కళ్ళెత్తి అతని కళ్ళలోకి క్షణ కాలం చూసింది ఇందిర ఆమె చూపులు తట్టుకోలేని వాడిలా కళ్ళు దించుకున్నాడు. ఇందిర పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది.
"మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికినయ్యా" అంది నెమ్మదిగా.
"ఇందిరా" బాధగా అన్నాడు శ్రీధర్.
మరింకేమీ మాట్లాడకుండా అతని ముందు నుంచి వెళ్ళిపోయింది ఇందిర. చలనం లేనట్టు అలాగే నిలబడి పోయాడు శ్రీధర్. అతని మనసు క్షోభతో మెలికలు తిరగసాగింది. తన వ్యక్తిత్వం -- తన హృదయ వైశాల్యం అవే తనకు పెట్టని ఆభరణాలని గర్వ పడేవాడు తను. కాని ఒక్క క్షణంలో అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. ఇంతలో అతని మనసులో ఇంకో ఆలోచన వచ్చింది. ఒకవేళ ఈ అవమానం భరించలేక ఇందిర ఆత్మహత్య చేసుకుంటే? అమ్మో! చివరకు తను స్త్రీ హత్యా పాపం కూడా చేసిన వాడవుతాడు...ఇక ఆలోచించే శక్తి లేని వాడిలా శ్రీధర్ గబగబా అంగ లేసుకుంటూ వెళ్ళిపోయాడు.
* * * *
