Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 4


    
    "ఇంతకీ ఎవరామె?" రహస్యంగా అర్దిస్తున్నట్లడిగాడు.


    "పేరు మాత్రమే చెప్పగలను. ప్రస్తుతానికింతే" అని ఓ క్షణం ఆగి "పేరు శశిరేఖ" అంది.


    వెన్నెలంతా తన గుండెల్లో పరుచుకున్నట్లు అతను అనుభూతికి లోనయ్యాడు 'శశిరేఖ' - ఆ అక్షరాలను మనసులో రాసుకుంటున్నట్లు పెదవులను ఆడించాడు.


    ఇదంతా దొంగచాటుగా గమనిస్తున్న మరో వ్యక్తి కూడా అటువేపు కదిలింది.


    శశిరేఖను రక్షించుకోవడం కోసం ఆ వ్యక్తి ఆమె దగ్గరికి త్వర త్వరగా అడుగులేసింది.


                                                               *    *    *    *

    
    సురేష్ వర్మకు నిద్రరావడం లేదు. మామూలుగా అయితే ఓ పుస్తకం చదువుతూ అలా నిద్రలోకి జారిపోయేవాడు. కానీ ఎందుకనో ఆరోజు పుస్తకం మీదకి దృష్టిపోవడంలేదు.


    కళ్ల ముందునుంచి శశిరేఖ రూపం చెదిరిపోవడంలేదు.


    శ్రీశ్రీ గేయం గుర్తుకొస్తోంది.


    వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలలో, దారికాని దారులలో, కానరాని కాంక్షలలో దేనికొరకు, దేనికొరకు దేవులాడుతావ్? ఏం కావాలి తనకు?


    ఆమె నుంచి ఏం కోరుకుంటున్నాడతను? కానీ విషాదమేమిటంటే, మనం ఎదుటివ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నామో తెలియకపోవడమే.  తనకూ అంతే. ఏమిటో దానికి తన దగ్గరా జవాబులేదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడాలని వుంది. తనతో గడపాలని వుంది. ఎండ, వానా, పగలూ, రాత్రీ, చలీ, ఇలా ప్రకృతి మార్పులన్నీ తనతో పంచుకోవాలనుంది.

 
    గ్రీష్మం నుంచి వసంతం వరకు ప్రతి రుతువునూ తనతో అనుభవించాలనుంది. తనతో నవ్వాలనుంది.  తనతో కలిసి ఏడ్వాలనుంది. తనతో  కవిత్వం చెప్పించుకోవాలనుంది. కవిత్వం చెప్పాలనుంది. తనతో ప్రపంచమంతా రివ్వుమని చుట్టి రావాలనుంది.


     అదేసమయంలో తనతో ఏ అడవిలోనో చిన్న కుటీరంలో జీవితాంతం ఉండిపోవాలనుంది.


    ఇలా అనిపించడాన్ని ఏమంటారు?


    ప్రేమా? ఆకర్షణా, మోహమా, శృంగారమా?


    ఏమని పిలవాలీ దీన్ని.


    మొత్తానికి తనకి ఆమె ధ్యాస తప్ప మరొకటి లేకుండా బతకాలనుంది. కానీ అదెలాసాధ్యం?


     ఆమెకు పెళ్లయింది. మరి పిల్లలున్నారో లేదో తెలియడంలేదు. ఆమెమీద తన అధికారం ఏమిటి?


     అతనికా సమయంలో ఏమీ తెలియడం లేదు. తనమీద తనకే జాలి లాంటిది కలుగుతోంది.


    అతనికి ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ గుర్తొచ్చింది. నాలుగో తరగతి, అయిదో తరగతి చదివేరోజుల్లో ఎవరైనా కథలు చెబుతుంటే అవి నిజంగా జరుగుతున్నయని భావించి వాటికి కలిగిన కష్టం గురించి ఏడ్చేసేశాడు. పులీ ఆవు కథ విన్నప్పుడైతే అతని బాధ వర్ణనాతీతం. ... ఎలాగైనా ఆవుతోపాటు అడవికివెళ్ళి ఆవును వదిలెయ్యమని, దానికో చిన్నదూడ వుందని చెప్పాలని తెగ తాపత్రయపడిపోయేవాడు.


     అది కథ అని, అలాంటి ఆవుకానీ, పులీకానీ లేవనీ తల్లి ఎంత చెప్పినా వినలేదు. కొంచెం పెద్దయ్యాక అంత అమాయకత్వంలేదు గానీ, ఆ పాత్రలు నిజమని నమ్మినంత గాఢంగా ఫీలయ్యేవాడు. కథ విన్న చాలా రోజులవరకు ఆ పాత్రలే కళ్లముంది మెదిలేవి. ఇప్పుడు తన స్థితిలాంటిదే గతంలో ఓ తిప్పడు ఎదుర్కొన్నాడు. ఆ కథ ఇప్పుడు గుర్తొస్తోంది.


    ఓ రాజ్యాన్ని రాజు పాలిస్తుంటాడు. ఆయనకి పద్దెనిమిదిమంది భార్యలు. చిన్న భార్య చాలా సౌందర్యరాశి.


    రాజు అంతఃపురంలో బట్టలు ఉతికేందుకు తిప్పడు అనే వాడొకడుంటాడు.  వాడు  అనుకోకుండా ఓరోజు చిన్నరాణీని చూస్తాడు. ఆమె అందానికి దాసుడయి పోతాడు. అయినా ఇద్దరికీ ఎంత భేదం?


    మొహానికి అదంతా ఏం తెలుసు?


    ఇత తిప్పడు ఆమెమీది కోరికతో సన్నగా అయిపోతాడు. ఆ తరువాత కథ చాలానే వుంది. ప్రస్తుతం తను కూడా వాడిలాగా అయిపోయాడు. లేకుంటే ఇంతమంది అమ్మాయిలుండగా, తనకు ఆమెమీద కోరిక కలగడమేమిటి? పాపం మానస - తనకోసమే యవ్వనాన్నంతా అలా దాచి పెట్టుకుని కూర్చుంది.


    కానీ అదేమిటో ఈ మనసు? ఆమెమీదకి పోవడంలేదు. తను ఇప్పుడంటే ఇప్పుడు శ్రీనివాసరావు, మానసతో ఘనంగా పెళ్లి జరిపించేస్తాడు. కానీ మానసను చూస్తే తనకెందుకో ఏ ఫీలింగూ కలగదు. పోనీ  మానసకు ఏం తక్కువంటే తన దగ్గర సమాధానమేమీలేదు.


    ఈ రేఖను చూస్తూనే  స్పందించినంత హృదయం మానస దగ్గర అలా ముడుచుకుపోతుందేమిటి? యాడ్లర్ గానీ, యూంగ్ గానీ ఎవరూ జవాబు చెప్పలేదు. తన మనస్సు గురించి తనకే తెలియనప్పుడు వాళ్లకెలా  తెలుస్తుంది?


    శశిరేఖ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికన్నట్లు డాబామీద కొచ్చాడు.


     పిండారబోసినట్లు వెన్నెల. నూర్పిళ్లు అయిపోవడంతో పొలాలన్నీ బీడుగా వెన్నెల్లో ముగ్గుపిండి గాలికి రేగుతున్నట్లు కన్పిస్తున్నాయి. ఈ వెన్నెల్లో దూరంగా పొలాలమధ్య శశిరేఖతో వెన్నెల కుప్పలాట  లాడితే ఎలా వుంటుంది?


    మళ్లీ శశిరేఖ కిందనుంచి పైకొచ్చినా వీడని తలుపులు. ఎలా భరించడం?

    
    బాబు కిందనుంచి  పరుపుతెచ్చి వేశాడు. మళ్లీవెళ్ళి ఈసారి దిళ్ళూ దుప్పట్లూ తెచ్చి పరిచాడు!


    ఇక మిగిలింది బాబుతో మాట్లాడటం. అలా అయినా శశిరేఖ ఆలోచనలనుంచి తప్పించుకోవచ్చని బాబుని పిలిచాడు.


    "ఇలా కూర్చోరా కాసేపూ"


    "అలాగే" నంటూ వాడు కూర్చున్నాడు.


    "ఏరా! నువ్వో నిజం చెప్పాల్రా" పరుపుమీద కూర్చుంటూ అడిగాడు.

 
    "ఏమిటండీ?"


    "నువ్వెవరినైనా ప్రేమించావురా?"


    వాడు ఓ మారు ఉలిక్కిపడ్డాడు. అలాంటి  ప్రశ్నలడుగుతాడని వూహించలేదు. " ఎందుకలా అడిగారు. కారణమేమైనా వుందా......?" అన్నాడు.


    "అదంతా నీకెందుకురా - ముందు జవాబు చెప్పు" అన్నాడు సురేష్ వర్మ.


    "లేదు. ప్రేమంటే ఎలా వుంటుందో కూడా తెలియదు. పోనీ ప్రేమంటే అందరికంటే  ఎక్కువ ఇష్టమనుకుంటే అలాంటి యిష్టం ఎవరి మీదా కలగలేదయ్యా."


    'మరి నీ భార్యంటే?'


    "అలాంటివేమీ లేవు. కలిసి  కాపురం చేస్తున్నాం. అంతే - అసలు మాకా ఆలోచనే రాకుండా పెళ్లి అయిపోయింది. నాకిప్పుడు ముప్పైదాకా వుంటాయనుకుంటాను. ఎనిమిది సంవత్సరాలక్రితం అంటే నాకు ఇరవై రెండున్నప్పుడు మా నాయన ఓరోజు పిలిచి 'ఒరేయ్ నీకు పెళ్లిరా' అన్నాడు. పక్కనున్న మా అమ్మ పెళ్లికూతురి వివరాలు  చెప్పింది."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS