"అంటే - నువ్వు పెళ్లిచూపులక్కూడా వెళ్లలేదన్నమాట."
"ఉహూఁ! అమ్మానాయన చూడడమే. పెద్దవాళ్లకి తెలియదా అనుకుని సరేనంటూ తలాడించాను"
"పెళ్ళిపీటల మీదనేనా ఆమెను చూడడం" అని అడిగాడు సురేష్ వర్మ.
"ఆఁ! నుదుటున బాసికం, పెద్ద అంచుతో గాడీరంగులో వున్న పట్టుచీర, మెడనిండా నగలు - ముఖమే సరిగా కనిపించలేదు. బావుందిలే అనుకున్నాను."
"ఈ ఎనిమిదేళ్ళ సంసారం......?"
బాబు అతని మాటలకు మధ్యలో అడ్డు తగిలాడు. " బావుందా అని అడుగుతున్నారా? బావుందోలేదో కూడా నాకు తెలియదు. అంతమాట ఎప్పుడూ ఆలోచించలేదు కూడా" అన్నాడు.
అందుకే వాడు హ్యాపీగా వుంటాడనిపించింది సురేష్ వర్మకి. వాడు దేన్నీ సీరియస్ గా తీసుకోడు. శరీరం ఎలా చెబితే అది చేస్తాడు. జీవితం జీవించడానికే. వాడే ఒక విధంగా కరెక్ట్! ఇలా సంఘర్షించుకోవడాలూ, సందేహించుకోడాలూ వుండవు.
"బాబుగారూ! నా మాట వినండి" బాబు కాసేపు మౌనం తరువాత అన్నాడు.
"ఏమిట్రా?"
"మానసమ్మకు మీరంటే పడి చచ్చిపోతుంది. ఆమె మీమీద చూపించే ఇంట్రెస్ట్ చూసే బహుశా ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాను.
మీరంటే ఆయమ్మకి ఎంత ఇష్టమో చెప్పలేను. ఆమెను పెళ్లిచేసుకోండి. అమ్మగారు కూడా ఎంతో సంతోషిస్తారు."
"నాకామెను చూస్తే ఏ భావనా కలగడంలేదురా" అన్నాడు సురేష్.
"మాకంతా కలిగిందా? పెళ్లి చేసుకుంటే అదే కలుగుతుంది" వాడు మధ్యలోనే దూరి అతను చెప్పేదాన్ని ఖండించాడు.
వాడు చెప్పింది నిజమేననిపించింది సురేష్ వర్మకి. అయినా తనమీద ప్రేమ కలగకుండా, తనతో గడపాలన్న గాఢమైన కోరిక లేకుండా ఎలా పెళ్లి చేసుకోవడం? సాయంకాలం ఓ పూట సరదాగా గడపడానికే మనం మనకు నచ్చిన స్నేహితుడి దగ్గరకు వెళతాం తప్ప, ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళతామా?
"సరేలేరా! ఇది ఇప్పుడు ఈ క్షణాన మనిద్దరిమధ్యా తెగే విషయంకాదు గానీ వెళ్లిరా. రేపు నేరుగా మావిడితోటకే వెళ్లిపో. నేను నిదానంగా వస్తాను."
