Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 3


    
    "టైమ్ తొమ్మిదయింది. మరి గుగ్గుళ్ళు పందారం ప్రారంభించమంటారా?"బాబు తన అయ్యవారి ముందు వినయంగా వంగి అన్నాడు.


    "అప్పుడేనా.. భజన చేయనివ్వండి" సుబ్బారావు అక్కడికి వస్తూ అన్నాడు. ఆయనవైపు చూస్తూ  పలకరింపుగా నవ్వి "భజనచేసే ఆ అయిదుమందీ అలిసిపోయినట్టున్నారు" అన్నాడు సురేష్ వర్మ.


     "మీ ఉభయం కాబట్టి ఆ అయిదుమందయినా భజన చేస్తున్నారు. రేపట్నుంచీ చూడండి గుగ్గుళ్ళను తప్ప ఒక్కరు  రారు" అని ఆపి  ఆ తరువాత తను గడిపిన పాత రోజుల్ని  గుర్తుకుతెచ్చుకుంటూ "మా కాలంలో  అయితే శ్రీరామనవమి ఉత్సవాలంటే  పండగస్థాయిలో జరిగేవి. భజన  ఏ అర్దరాత్రో ముగిసేది. ఇప్పుడు చూస్తున్నారు కదా భజనకన్నా ముఖ్యం చాలా విషయాలయిపోయాయి" అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు.


    "పెట్టమను - అంతా ప్రారంభమయ్యేసరికి ఎలా లేదన్నా మరో  అరగంట పడుతుంది."


    అయ్యగారి ఆజ్ఞ కావటంతో ఆ ముక్కను గుడి ఆలనాపాలనా చూసే కాంతమ్మతో చెప్పాడు బాబు.


    "అప్పుడేనా! సరేలే - ఈ ఊరు ఈ జన్మకు బాగుపడదు" అని శపించి, మరోసారి గుడిని ఊడ్చడంలో నిమగ్నమైంది. ఆమెది వింత మనస్తత్వం. ఎప్పుడూ మడిగట్టుకుని వున్నట్టు మనుషుల్ని,  ముఖ్యంగా మగవాళ్లని చూస్తే దూరం దూరంగా జరుగుతుంటుంది.


    ఆమెది ఏవూరో ఏవాడో తెలియదు. ఏభై యేళ్లుంటాయి. సరయిన తిండి లేకపోవడంవల్ల కాబోలు ఆ వయసుకే ముసల్దానిలా కనిపిస్తుంది.


    గుగ్గుళ్లు పందారం పెట్టడానికి అనువైనవాళ్లు ఎవరున్నారా అని చూస్తున్నాడు బాబు. గుగ్గుళ్ళు పందారం పెట్టాలంటే కూడా దానికీ స్పెషలిస్టులు కావాలి. ప్రతిఏటా  ప్రతిఒక్కరి ఉభయానికి ప్రసాదం పంచే పరంధామయ్య ఈమధ్యే కాలం చేశాడు. దాంతో కొత్తవాళ్లని వెతుక్కోవావల్సి వస్తోంది. నారయుడ్ని పందారం పెట్టడానికి పిలుద్దామని అటు వెళ్లాడు బాబు.


    పూజ అయిపోవడంతో అయ్యవారు సురేష్ దగ్గరికి వచ్చాడు. ఆయనకు ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చి పంపించేశాడు. ఇంకా ఎందుకు గుగ్గుళ్లు పందారం ప్రారంభించలేదో కనుక్కోవడానికి కుర్చీలోంచి లేచి గుడి మెట్ల దగ్గరికి వచ్చాడు. నారాయుడు ఓ పళ్లెం ఎత్తుకుని పందారం ప్రారంభించాడు.


    ఇక మనం ఉండక్కర్లేదనుకుని  ఇంటికి బయల్దేరబోతూ పందిట్లో గందరగోళంగా వుంటే చూపు  అటువేపు తిప్పాడు సురేష్ వర్మ.


    పిల్లలు నారాయుడి మీద పడిపోతున్నారు. జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. రద్దీ ఎక్కువైంది. నారాయుడు తట్టుకోలేకపోతున్నాడు.  అప్పటికీ తన శక్తిమేర ఎవరు పెట్టించుకున్నారో లేదో చూస్తూ   పెడుతున్నాడు. జనాన్నంతా  పరిశీలిస్తున్న సురేష్ వర్మ ఓ దగ్గర ఠక్కున ఆగిపోయాడు.  విస్మయం లాంటిది ఒంటినంతా  జిలకొట్టినట్లయిపోయాడు. అటు నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు.


    బావిగట్టును ఆనుకుని వున్న ఓ స్త్రీ అతన్ని అలాగేకట్టిపడేసింది. ఆమెను ఇంతకు ముందెన్నడూ చూళ్ళేదు.

 
     వెన్నెల్లో ఆమె అచ్చు  కాళిదాసు శకుంతలలా  లేదు. మను చరిత్ర వరూధిని అంతకంటే కాదు. పోనీ వసు చరిత్ర గిరిక, విజయ విలాసంలోని ఉలూచి అంతకన్నా కాదు. వీళ్లందర్నీ కలిపి ఓ స్త్రీని చేస్తే ఎలా వుంటుందో అలా వుంది ఆమె. అందం,  అంత హుందాతనం,  అంత విలాసం  ఒక్కరిలో వుండడం  అసంభవం.


     ఆమె ప్రసదానికి కాకుండా ఏదో పంజరంలోంచి తప్పించుకుని  జనం మధ్యలోకి  వచ్చినట్టు ఆ పరిసరాల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.  తల తిప్పుకోలేక పోతున్నాడు సురేష్ వర్మ. ఆమెకి  పాతికేళ్ల పైమాటే. సువాసన బరువుకి విచ్చుకున్న మొగలిపువ్వులా వుంది. చామనఛాయ ఆమె అందానికి మరింత ఆకర్షణ ఇచ్చిందేతప్ప రంగు తక్కువున్న భావనను కలగనివ్వడంలేదు.


    చాలా దూరానికైనా విశాలంగా కన్పిస్తున్న కళ్లు, అంత పెద్దముఖం లోనూ కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్న ముక్కు, మసకవెన్నెల్లో కూడా ఎర్రషేడ్ ను ప్రతిఫలిస్తున్న పెదవులు, మనిషి భారీగా వున్నా తమ ఉనికిని తెలియజేయటానికే మరింత బరువుగా, బలంగా ఎదిగిన పొంగులు, బావిగట్టు నీడలో అదృశ్యమైపోయిన నడుము -


    అతను కళ్లార్పకుండా మరిచిపోయాడు.


    నీలంపూవులున్న తెల్లటి కాటన్ చీరలో దృశ్యాదృశ్యంగా కన్పిస్తున్న బొడ్డుకూడా అదోరకం కొత్తపువ్వులా వుంది. ఆమెది ఈ లోకంకాదు. "ఆమె నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుషమా సుధాగానమంజు వాటి" అనిపించింది అతనికి. ఆమెమీదే మొహం పెంచుకుని ఆమె కోసమే బ్రతుకై కృష్ణశాస్త్రి అన్నట్లు  'సగము వాడి విరహతోరణమ్మునై' కృశించిపోవాలనిపించింది.


     ఆమెను మరింత దగ్గరగా చూడాలనిపించి అతను అటువేపు కదిలాడు. జనమంతా గుగ్గుళ్ల మీద పడ్డారు తప్ప అతన్ని ఎవరూ గమనించడం లేదు.


    అతను గుడి ముందు వేసున్న పందిట్లోంచి నడిచి, ఎర్రగన్నేరు చెట్లకు  చుట్టుకుని  మాధవయ్య ఇంటి పెరట్లో వున్న సన్నజాజుల చెట్టుకింద కెళ్లి నిలుచున్నాడు.  గాలి తన సహస్ర చేతుల్తో సన్నజాజుల్ని  చెరబట్టినట్టు గుప్పున వాసనలు చుట్టుముట్టాయి.


    ఇప్పుడామె మరింత స్పష్టంగా కనిపిస్తోంది.


    ఆమె దగ్గరగావెళ్లి 'ఆరిపేయవే వెన్నెల దీపాన్ని' అని చెప్పాలన్న గాఢమైన కోరిక అతనికి కలిగింది. ఆమె అందం, ఆకర్షణ అతనిలో మోహావేశాన్ని కలిగించాయి. ఆ క్షణంలో అందరూ ఠక్కున అదృశ్యమైపోయి తను మాత్రమే ఆమెలో లీనమైపోవాలన్నంత బలంగా కౌగిలించుకోవాలనిపించింది.


    "ఏమిటయ్యా సురేషూ -  అలా చూస్తున్నావ్ - ఎవర్ని?" అతను తల తిప్పి పక్కకి చూశాడు. తన తత్తరపాటునంతా కప్పి పుచ్చుకోవడానికి నవ్వును ముఖమంతా పూసుకున్నాడు. దొంగను పట్టుకున్నట్లు నవ్వుతోంది చింతామణి.


    ఆమె అతని పక్కగా వచ్చి "ఆ జామచెట్టు దగ్గర నిలుచున్న ఆమెనా చూస్తోంది. అంతగా ఆకర్షించిందా నిన్ను" అంది బావిగట్టువైపే చూస్తూ.


    చింతామణితో అబద్దం చెప్పడం కష్టం. అరవయ్యేళ్ల వయసులో జీవితాన్ని కాచివడబోసిన ఆమె అంటే ఊరికంతకీ భయమే.


    ఎటువంటి వ్యక్తినయినా క్షణకాలంలో అంచనావేసే తెలివితేటలూ, అవతల వ్యక్తిని తన బుట్టలో వేసుకునే వాక్చాతుర్యం , ఎక్కడా చిక్కుకు పోని లౌక్యం. ఎవరికైనా  సహాయం చేసే ఆమె గుణాలు. అందుకే అందరికీ ఆమె అంటే భయమూ భక్తీ వున్నాయి.


    సురేష్ వర్మను సైతం ఏకవచనంతో సంబోధించి అంత క్లోజ్ గా మాట్లాడే ధైర్యం ఆమెకు తప్ప,  ఆ ఊర్లో  మరెవ్వరికీ లేదు తను చూస్తున్నది ఎవర్నే అంత కరెక్టుగా కనిపెట్టేసేటప్పటికి అతను ఖంగుతిన్నాడు. ఆ సమయంలో ఏం చెప్పాలో నోట మాట రాలేదు.


    "వాలుచూపుకో, వలపు మాటకో ఒళ్లోవచ్చి వాలిపోవడానికి ఆమె కన్నెపిల్లేంకాదు. వివాహిత - మరొకరి భార్య" అంది నవ్వుతూనే హెచ్చరిస్తున్న ధోరణిలో.


    "పెళ్లయిందా?" నమ్మశక్యంగాలేక మరోసారి అడిగాడు సురేష్ వర్మ.


    "ఆ. మూడేళ్ళయింది పెళ్లి జరిగి - మనూరికి కొత్త."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS