హెయిర్ స్టయిల్ నుంచి చెప్పుల వరకూ అన్నీ మారిపోయాయి. మార్పు అంటే మేకప్ కాదు. దట్టమైన పౌడరు పూతలూ, ఎర్రటి లిప్ స్టిక్ లూ కావు ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నాళ్ళో శ్రమించి, ఎన్నో రసాయనాల్ని ఇటూ అటూ మార్చి సమ్మేళనం జరిపినట్టు, ఒక్కొక్క సౌందర్య స్థానాన్ని పరిగణనలోకి తీసుకుని, జాగ్రత్తగా దాని అందాన్ని ఇనుమడింపజేసిన ఏకాగ్రత, నేర్పు, అవస్థ-ఆ అలంకరింపులో కనబడ్డాయి. అది కేవలం అభ్యాసం వల్ల రాదు, పూర్వజన్మ సుకృతం కూడా వుండాలి. తల్లి కూడా కూతుర్ని - మొదటిసారే చూసినట్టు విభ్రాంతి చెందిందంటే, దాన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు - ఎంత మార్పొచ్చిందో!
"గుడ్! వెరీగుడ్!!" అంది జడ్జిగావున్న డాక్టర్ గారి భార్య. ఆమెకిప్పుడా అమ్మాయిని చూస్తుంటే ప్రైజు వస్తుందని నమ్మకం కుదురుతోంది.
ఆ అమ్మాయి అతడివైపు చూసి నవ్వింది.
ఆ కుర్రవాడు ఆ అమ్మాయివైపే చూస్తున్నాడు - ఇంకా ఏదో సరిగ్గా కుదరనట్టు.
"పదమ్మా పద టైమైపోతోంది" అంటూ హడావుడి పెట్టింది తల్లి ఈ లోపులో డ్రైవరు కారుతీసి బయట పెట్టి రెడీగా నిల్చున్నాడు.
"ఇదిగోనయ్యా నీ డబ్బులు, మొత్తానికి చీరె మాకు అంటగట్టావ్" అంటూ నూటపాతికా అతడి చేతిలో పెట్టింది తల్లి.
"నీళ్ళలో పెడితే వుంటుందా?" డాక్టర్ గారి భార్య అడిగింది. ఆ కుర్రవాడు హర్ట్ అయినట్టు కనిపించాడు. నిజానికి ఆ అమ్మాయి వంటికి ఆ చీరె ఎంత బాగా నప్పిందంటే చెపితేగాని అది నేత చీరె అని తెలీదు. అసలా చీరె ఒక్కసారి కట్టుకున్నందుకే నూటపాతికా ఇవ్వొచ్చు అన్నంత బావుంది.
"ఇక పదండి" అంటూ వాళ్ళని బయల్దేరతీసి, "ఇదిగో రాములూ ఇతనెళ్ళాక తలుపేసుకో-" అని పనివాడికి చెప్పి ఆమె ముందుకు నడిచింది.
అప్పటికింకా ఈ కుర్రవాడు చీరెలమూట సర్దుకోలేదు. ఆఖరి నిముషంలో ఆ అమ్మాయి కదలబోతుంటే అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి మేకప్ లో ఆఖరిలోపం ఏమిటో. "అమ్మాయిగారూ!" అన్నాడు హఠాత్తుగా నిద్రలోంచి మేల్కొన్నట్టు. ఆ అమ్మాయి కళ్ళు తిప్పి అతనివైపు చూసింది.
ఆ కళ్ళనే అతను చూస్తున్నాడు. దాని గురించే ఆ అమ్మాయికి ఒక సలహా ఇచ్చాడు.
.... కళ్ళు చాలా రకాలు..... మీనలోచనాలు, తీక్షణమైనవి, డ్రూపింగ్ ఐస్, మత్తయిన కళ్ళు, రెప్పలు జారినవి, కోలకళ్ళు- ఇలా ఎన్నో! ప్రపంచంలో అన్నింటికన్నా అందమైన కళ్ళు 'ఆల్మండ్'షేపున్న కళ్ళు! విశాల నేత్రాలు ఎటువంటి అమ్మాయికయినా అందాన్నిస్తాయి.
ఆల్మండ్ కళ్ళున్న అదృష్టవంతురాలు ఆ అమ్మాయి!
సాధారణంగా పెద్ద కళ్ళున్న అమ్మాయిని చూడగానే బావుంది అనేస్తాం. మిగతా లోపాలన్నీ కళ్ళవల్ల కప్పబడిపోతాయి. పెద్ద కళ్ళున్న అమ్మాయిలు ఆ పొగడ్తలకి లొంగిపోయి, మిగతా విషయాలు పట్టించుకోరు. ఆ కళ్ళ అందానికి ఆ కుర్రవాడు కూడా సహజంగానే పడిపోయాడు. కానీ అతడి సునిశితమైన దృష్టికి లోపం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.
ఆ అమ్మాయి రెండు కళ్ళమధ్య దూరం స్వాభావికంకన్నా గోరంత ఎక్కువ వుంది. అందాన్ని ఆస్వాదించటం వేరు-ఆస్వాదించగలిగే అందాన్ని అంచెలంచెలుగా తయారుచేసుకోవటం వేరు! చాలామంది పురుషులు కేవలం ఆస్వాదిస్తారు. అనలిటికల్ గా చూడరు. కేవలం అందానికే వర్తించదు ఈ నీతి! జీవితంలో ప్రతీస్టేజీకి వర్తిస్తుంది. నారాయణ పేట లాటి చిన్న పల్లెలో నేతమగ్గం ముందు కూర్చునే ఒక కుర్రవాడిలో, మొగ్గ విచ్చుకుంటున్నట్టు ఆ అనలిటికల్ నాలెడ్జి విచ్చుకుంటున్నదని ఎవరికీ తెలీదు.
కూతురుకళ్ళు పెద్దవి కాబట్టి కాటుక నిండుగా పెట్టి, వాటిని మరింత పెద్దవిగా కనబడేట్టూ చేసి మురిసిపోవటం చిన్నప్పటినుంచి ఆ అమ్మాయి తల్లికి అలవాటు అయివుంటుంది. అదే అలవాటుని పెద్దయ్యాక కూడా ఆ అమ్మాయి కొనసాగించింది. పెద్ద కళ్ళున్నవాళ్ళు కంటినిండా కాటుక పెట్టుకుంటే నిండుగా వుంటుందన్నది సర్వజనీనమైన విషయమైతే అయి వుండవచ్చునేమో కానీ, అన్ని సందర్భాల్లోనూ కాదు. కళ్ళు దూరంగా వున్నప్పుడు ప్రారంభంలో దట్టంగా వున్న కాటుకరేఖ, కంటి చివర్లకు చేరుకునే కొద్దీ పలుచనైతే, కళ్ళు దగ్గిరగా వున్న భావం కలుగుతుంది. అలాగే కనుబొమ్మలు కోలగా కాకుండా అర్ధచంద్రాకారంగా వంపు తిరుగుతే కొత్త అందం వస్తుంది. కనురెప్పల పైభాగపు షేడ్ కి కూడా ఇది వర్తిస్తుంది. ఆ కుర్రవాడికి టెక్నికల్ టర్మ్స్ తెలీదు. హంపీ శిల్పాన్ని చెక్కిన శిల్పికి కూడా తెలిసి వుండదు. అందానికి సైన్సు పరిధిలేదు. తనకు తోచింది చెప్పాడంతే.
ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది మళ్ళీ.
"ఇక ఈ రోజు మనం పోటీకి వెళ్ళినట్టే" అంది తల్లి. "అబ్బాయ్, చేసినంతవరకూ చాలు ఇక వెళ్ళు" అంది. ఇంతలో బయట హారన్ నివిపించింది. అప్పటికీ కార్లో కూర్చున్న జడ్జీగారికి మరింత తొందరగా వుంది. మరోసారి హారన్ మ్రోగింది.
"వస్తున్నా వస్తున్నా" హడావుడిగా అని, "అమ్మాయ్! రా!!.....రాములూ- తలుపేసుకో" అంటూ కారు దగ్గిర కెళ్ళింది.
ఆ కుర్రవాడు బట్టలు సర్దేసి మూట కట్టేసేడు. ఈలోపులో లోపలి గుమ్మం దగ్గిర్నుంచి "ఎలా వున్నాను" అని వినిపించింది. తలెత్తి చూశాడు.
అపరంజిబొమ్మలా వుందా అమ్మాయి. ఎత్తు, ఎత్తుకి తగిన చీరె మొహానికి అందాన్నిచ్చే కళ్ళు.
తనలో వచ్చిన మార్పు తనకే తెలిసినట్టు ఆ అమ్మాయ్ మొహం వింత వెలుగులో ప్రకాశిస్తుంది.
"అమ్మ డబ్బులిచ్చేసింది కదూ."
"ఇచ్చారమ్మగారూ."
ఇంతలో బయట్నుంచి హారన్ వినిపించింది. ఆ అమ్మాయి గుమ్మం వరకూ వెళ్ళి, బయటకు నడవబోయి, తలతిప్పి ఆ అబ్బాయి వంక చూసి, వెనుక రాములు లేడని నిర్దారించుకుని, తూనీగలా పరుగెత్తుకొచ్చి అతడి మొహాన్ని రెండు చేతులు మధ్యా తీసుకుని పెదవులమీద గాఢంగా ముద్దు పెట్టుకుని "థాంక్యూ" అనేసి క్షణంలో అదృశ్యమైంది.
అంతా రెప్పపాటులో జరిగిపోయింది.
ఆ కుర్రవాడో క్షణంపాటు నిర్వీన్నుడయ్యాడు. ఊహించని సంఘటనకి బిత్తరపోయాడు. అతడి జీవితపు తొలిముద్దు అది. అతడికి ఆ అమ్మాయి పేరు కూడా తెలీదు.
అంత అందమైన అమ్మాయికి ఈపాటికే అసంఖ్యాకంగా ప్రేమలేఖలు వచ్చి వుండవచ్చు. ఎందర్నో తిరస్కరించి వుండవచ్చు. కానీ వేలూ, లక్షలూ ఇచ్చికూడా తెలుపుకోలేని కృతజ్ఞతని ఆ విధంగా తెలుపుకుంది. మనసులోంచి పెల్లుబికే ఆనందాన్ని ఆ విధంగా ప్రకటించి ఋణం తీర్చుకుంది.
నిబిడీకృతమైన తెలివితేటలకి నీరాజనం పట్టే ముద్దు అది! పొంగిపొరలే ఎగ్జయిట్ మెంట్ కి పరాకాష్ట అది!!
ఆ తరువాత పదిహేను సంవత్సరాలకి దేశంలో, ఆంద్రదేశంలో....దాదాపు ప్రతీ అమ్మాయి ఇటువంటి ఎగ్జయిట్ మెంట్ ఫీలయింది అతడిపట్ల కాదు. వస్త్ర ప్రపంచంలో మకుటంలేని మహారాజులా దూసుకొచ్చిన రవి తేజా టెక్స్ టైల్స్ వారి చీరెల ఫ్యాషన్ వెల్లువలో కొట్టుకుపోతూ.....
* * *
ఆ కుర్రవాడు తిరిగి మామ దగ్గిరకొచ్చేసరికి మూడు కావొస్తూంది, ఎండ కాస్త తగ్గింది. ఆ కుర్రవాడి మొహం ఒక వింత కాంతితో మెరిసిపోతోంది. అయితే ఆ కాంతి తొలిముద్దు వల్ల వచ్చింది కాదు.
"మావయ్యా, ఒక చీర అమ్మేను మావయ్యా! వంద రూపాయల చీర నూటపాతిక్కి అమ్మాను మావయ్యా!"
అనుకున్న దానికన్నా పాతిక ఎక్కువొచ్చిన ఉద్వేగం అది!
పట్నంలో రెండొందల చీర నాల్గొందలకి అమ్ముతారని తెలియని ఆ కుర్రవాడు అసలు ధరకన్నా పాతిక ఎక్కువ రావటమే ఆనందంగా ఫీలవుతున్నాడు. ఆ పాతికా అతడి నేర్పరితనానికి నిదర్శనం. ఆ క్షణం అతడు ఆ చీర ఖరీదు రెండొందలు అని చెప్పినా వాళ్ళు కొనేవారే! నిజాయితీకీ, నేర్పరితనానికీ వ్యాపార భాషలో చుక్కెదురు.
మధ్యవర్తికి చీరలిచ్చేస్తే లాభంలేదు. "కష్టమో నష్టమో మనమే స్వయంగా పట్నం వెళ్ళి అమ్ముకుంటే మంచిది" అన్న ఆలోచన వచ్చింది అతడికే! మామని బలవంతపెట్టి బయల్దేరతీసింది అతడే!! చీరలు - చీరలు అని రోడ్డువెంట తిరిగితె లాభం లేదని, మంచినీళ్ళు నెపంమీద ముందు ప్రవేశించి అక్కడ పరిస్థితిని అర్ధం చేసుకుని క్రమక్రమంగా అందులోకి చొచ్చుకుపోయేటంత తెలివితేటలు ప్రదర్శించింది అతడే!
మెట్టు తరువాత మెట్టులాంటి వ్యాపార లక్షణాలు ఇవి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. ఆయాసం రావటంలేదు. పైకి వెళ్ళేకొద్దీ క్రింద కనపడే దృశ్యం ఆనందాన్ని కలుగజేస్తూంది. ఆ విజయోత్సాహంతోనే ఈ విషయం మావయ్యకు చెప్పాడు. అయితే ఆ మాటలు ఆ వృద్దుడికి వినపడ్డాయో లేదో తెలీదు. బలహీనంగా కళ్ళు విప్పాడు.
దా....దా....దాహం అన్నట్టు సైగచేశాడు. అతడి వళ్ళు పెనంలా మాడిపోతోంది. కుర్రవాడు వణికిపోయాడు. అతడికి తను చేసినతప్పు అర్ధమైంది. వడదెబ్బ కొట్టిన మామని అరుగుమీద అజాగ్రత్తగా వదిలేసి, చీరల అమ్మకానికి బయల్దేరాడు. ఇక్కడ, ఈ ఎండలో తన మామ దాహంతో గొంతు ఆర్చుకుపోయి, అరవటానికి శక్తిలేక, రోడ్డుమీద నడిచే ఏ ఒక్కరినీ పిలిచే శక్తిరాక, పాపం ఎంతసేపటి నుంచి దాహంతో కొట్టుకుంటున్నాడో-ఆర్చుకుపోయిన గొంతుతో కొట్టుకుంటున్న ప్రాణం ఎంత అల్లల్లాడిందో.
