Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 5

 

       ఆ కుర్రవాడు పరుగెత్తుకెళ్ళి పంపులో నీళ్ళు తెచ్చి మొహం మీద జల్లాడు. అతడి తల వళ్ళోకి తీసుకుని నోటిలో పోశాడు. నిముషం తరువాత అతడి మొహంలోకి కాస్త కళ తిరగి వచ్చింది. అయితే అది చాలా తాత్కాలికమైంది.....చావుకళ! ఆ విషయం ఆ వృద్దుడికి తెలిసినట్టుంది. కళ్ళువిప్పి మేనల్లుడివైపు చూశాడు. 'అయిపోయిందిరా- నా పని అయిపోయింది' అన్నట్టుంది ఆ చూపు. ఇల్లు గుర్తొచ్చింది. భౌతిక బంధాలు తెగిపోయినా భవబంధాలు తెగిపోవు. పోతున్న ప్రాణం తెగని బంధాలకోసం చివరివరకూ ప్రాకులాడుతుంది.
   
    "మావయ్యా..... మావయ్యా ...." అన్నాడు ఆ కుర్రవాడు రుద్దకంఠంతో. అతడికి భయంవేసింది. ఏడుపొచ్చింది. ఊరుకాని వూళ్ళో ఇంత విపత్తుని వూహించలేదు. ఇదంతా తనవల్లనే. వడదెబ్బ కొట్టిన మనిషిని అజాగ్రత్తగా వదిలెయ్యటం వల్ల.
   
    "అయిపోయిందిరా.....అ...యి....పోయింది" మావయ్య కంఠం నూతిలోంచి వచ్చినట్టు వుంది. వణికే చేతుల్తో ఆ కుర్రవాడి చేతిని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. 'నాకు.....నాకో వాగ్దానం చెయ్యాల్రా'.
   
    గాలి స్థంభించింది. మబ్బు వెనుకనుంచి సూర్యుడు బయటికి రావటంతో ఎండ ఒక్కసారిగా ఫెళ్ళున కొట్టింది.
   
    "చెప్పు మావయ్యా నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను చెప్పు."
   
    "మాధవిని చేసుకోవాల్రా నువ్వు....."
   
    స్థంభించిన గాలి ఒక్కసారి పెనుగాలిలా మారి మొహం మీదకొట్టినట్టయింది ఆ కుర్రవాడికి.
   
    వెన్నెల్లో కూర్చుని భావాన్ని నేస్తే
    పాట చీర తయారైంది
    జరీ పల్లవికి - చరణం అంచు.
   
    -అని తను వ్రాసుకున్న పాటని నవ్వుతూ 'ఇదేం పాట బావా-తలా తోకాలేని పాట-' అని ఎగతాళి చేసే మాధవి!
   
    నెత్తిమీద చీరెల మూట పెట్టుకొని రోడ్డు రోడ్డు తిరిగి బట్టలు అమ్ముతావా అని హేళన చేసే మాధవి!
   
    ప్రత్యూషకాదుల్నీ సంధ్యాదీపపు వెలుగుల్నీ ఆస్వాదించలేని మాధవి!
   
    ముగ్గేయటం తెలియని మాధవి - పదమూడేళ్ళొచ్చినా గోళీలాడే మాధవి......
   
    "ఇప్పుడు కాదురా కానీ ఎప్పటికైనా నువ్వే చేసుకోవాలి. అది అమాయకప్పిల్ల. ఇంకో ఇంట్లో కోడలిగా బ్రతకలేదు. దాన్ని, దాని తల్లిని నువ్వే పోషించాలి. నా కొడుకుని కూడా నువ్వే పైకి తీసుకురావాలి. మాధవి మంచిదిరా! చాలా మంచిదిరా! మాటివ్వరా....మా....ట.....ఇ....వ్వ....రా."
   
    సందిగ్ధం మనసుని వూపేస్తుంది.
   
    ఎదుటి మనిషి ప్రాణం కూడా కొద్దికొద్దిగా పోతోంది.
   
    "ఒరే! నువ్వు కాదంటే నా కుటుంబం చెట్టుకొక పిట్ట అయిపోతుంది. ఇన్నాళ్ళు పెంచినదానికి బదులుగా అడగటం లేదురా, మావయ్యగా అర్దిస్తున్నాను. మాధవి.... మా...ధ.....వి.....ని..."
   
    ఆ కుర్రవాడు అప్రయత్నంగా అతని చేతిలో చెయ్యివేసి "చేసుకుంటాను మావయ్యా" అన్నాడు. "మాధవిని చేసుకుంటాను" వృద్దుడి మొహం ఆఖరిసారి ఆనందంతో వెలిగింది. సంతృప్తితో నిండింది.
   
    "చాల్రా..... చా....." మాట పూర్తవకుండా ప్రాణం పోయింది. తల వాలిపోయింది.
   
    ఆ కుర్రవాడికి దుఃఖం రాలేదు. దానికన్నా పెద్దభావం- స్థబ్దంగా చూశాడు.
   
    తనకి నేతని నేర్పిన వేళ్ళు..... అచేతనంగా....
   
    తన నేతని పరీక్షించిన కళ్ళు....నిస్తేజంగా.....
   
    తన పనిని అభినందించిన స్పర్శ.... నిర్జీవంగా.....
   
    ఆఖరి కోర్కె తీరిన ఆనందంతో ఆత్మ సంతృప్తిగా వెళ్ళి పోయింది. దాన్ని సంతృప్తిపర్చటానికి ఇచ్చిన మాట.....
   
    ఒరే!! మాధవి మంచిదిరా. అమాయకప్పిల్ల.
   
    మంచితనం-అమాయకత్వం-ఈ రెండేనా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది.
   
    నడిరోడ్డులో మరణించిన మనిషి కోసం అతడేడుస్తున్నాడు. ఇచ్చిన వాగ్దానం గురించి ఆలోచించటంలేదు.
   
    మనిషి ఏదో ఒక బలహీనమైన క్షణం ఒక తప్పు చేస్తాడు. దాని పరిణామంతో జీవితాంతం రోదిస్తాడు.
   
    అతడప్పుడు చేసిన తప్పు అలాటిదే!
   
                               2
   
    1986 జూన్ నెల,
   
    సాయంత్రం 5-30.
   
    హైద్రాబాద్, అబిడ్స్.

   
    రవితేజా టెక్స్ టైల్స్ మానేజింగ్ డైరెక్టర్ టయోటా కారు ఆవరణలోకి ప్రవేశించగానే ఆ ఆవరణలో చైతఃన్యం మొదలైంది.
   
    నిండైన, అందమైన విగ్రహం కార్లోంచి దిగింది.
   
    అతడంటే ఆ మిల్స్ లో కూలీ నుంచి మానేజర్ వరకూ అందరికీ ఇష్టమే. తన స్థాయికూడా చూసుకోకుండా అతడు అందరితో కలిసిపోతాడు. నవ్వుతూ నవ్విస్తూ వుంటాడు. అసలు పని చేసినట్టే కనిపించదు.
   
    అయినా రోజుకి పదహారు గంటలు పనిచేస్తాడు.
   
     అందుకే ఈ రోజు ఆంద్రదేశాన్ని తన చీరల్తో ఒక ఊపు వూపుతున్నాడు.
   
    రవితేజ చీరలు కట్టుకోవడమే ఒక ఫ్యాషన్ గా భావించే స్థాయికి ఆంద్రదేశంలో ప్రతీ ఆడపిల్లనీ తీసుకెళ్ళాడు.
   
    అతని కంపెనీ చీరల్ని కట్టనిది అతని భార్య ఒక్కతే.
   
    ఆవిడ పేరు మాధవి.
   
    ఆమెదో చిత్రమైన మనస్తత్వం.
   
    ఒకరోజామె ఏదో ఫంక్షన్ కి నిండుగా అలంకరించుకుని వెళ్ళింది. ఫంక్షన్ కి వచ్చిన ఒకావిడ మాధవి మొహంమీదే "నీకీ చీర నప్పలేదమ్మా" అనేసింది. పక్కనున్న మరొకావిడ ఆ మాట అందుకుని, "ఆమె కేమిటమ్మా.... మొగుడు చీరాల కంపెనీ ప్రొప్రైటరు. చీరలు ఫ్రీగా వస్తాయి-" అంది. "ఫ్రీగా వచ్చిన చీరలు అంతకన్నా ఏం బావుంటాయిలే" అన్న ఉద్దేశ్యం ధ్వనించేట్టు.
   
    అంతే!
   
    ఆ రోజునుంచీ మాధవి - రవితేజ టెక్స్ టైల్స్ చీరలు కట్టటం మానేసింది.
   
    రవికి మొదట్లో అర్ధంకాలేదు. దేశమంతా అంత క్రేజ్ తో ఉంటే, ఇంట్లో భార్యకి తమ చీరలు నచ్చకపోవటం....
   
    "మీ చీరలు నాకు నప్పవు-" అందామె ఒక్కమాటగా.
   
    అతడికి షాక్ తగిలినట్టయింది. న....ప్ప....వు!
   
    అతడి కంపెనీలో రీసెర్చి డిపార్ట్ మెంట్ ఖర్చు, సంవత్సరానికి పాతిక లక్షలుంటుంది. ఒక కొత్త రకం డిజైను మార్కెట్ లోకి వచ్చి ఫెయిల్ అయిందంటే నష్టం లక్షల్లో వుంటుంది. అందువల్ల నిరంతర శోధన జరుగుతూనే వుంటుంది. డిపార్ట్ మెంట్ లో కొందరి పని ఎప్పుడూ సినిమాలు చూసి శ్రీదేవి చీరలు, హేమమాలిని చీరలు లాటి కొత్త ఫాషన్లు కనిపెట్టటమే.
   
    ప్రేమనగర్ లో వాణిశ్రీ కట్టుకున్న ఛాందినీ చీర* ఆ తరువాత ఎంతో పాపులర్ అయింది. మరికొందరు అజంతా ఎల్లోరాలకి వెళ్ళి ఆ శిల్పాల డిజైన్లు కూడా చూస్తూ వుంటారు. ఆడవాళ్ళ ఫాషన్లు రోజురోజుకీ మారిపోతూ వుంటాయి. వాళ్ళ మారబోయే కోర్కెలని ఆరు నెలల ముందుగా పట్టుకోగలిగినవాడే నిజమైన బట్టల వ్యాపారి! అందుకే రీసెర్చి డిపార్ట్ మెంట్ మీద అంత ఖర్చు! కాబట్టి.......
   
    'నప్పవు' అన్న ప్రశ్న లేదు. భారతదేశంలో ప్రతి స్త్రీకి నప్పే చీర కనీసం ఒకటన్నా వుండాలి. లేకపోతే ఇన్ని లక్షల ఖర్చు రీసెర్చి మీద అనవసరం. రవితేజ అహం దెబ్బతిన్నది.
   
    *ఛాందినీ చీరలు ఇవి రాజస్థాన్ కి సంబంధించిన చీరలు. ఒక రాష్ట్రానికి సంబంధించిన చీరలు మరో రాష్ట్రంలో కట్టటం సాధారణమే అయినా - ఎక్కువ పాపులర్ అవటం అరుదు. బెంగాల్ కాటన్స్, కలకత్తా నేత చీరలు, బెంగుళూరు సిల్క్ మాత్రం ఇలా పాపులర్ అయ్యాయి.
   
    ఎక్కువ ప్రత్యేకత లేకుండానే ఛాందినీ చీరలు పాపులర్ అవటానికి కారణం ఒక తెలుగు సినిమా 'ప్రేమనగర్'! చక్కటి పెర్సనాలిటీతో హీరోయిన్ అందులో చీర కట్టుకున్న విధానం ఆ రోజుల్లో ఒక క్రేజ్ కెరటాన్ని సృష్టించింది. జనం కేవలం ఆ చీరల్ని చూడటానికే ఆ చిత్రానికి వెళ్ళారన్నా అతిశయోక్తి కాదు.
   
    వీటిని TIE & DIE చీరలని కూడా అంటారు.
   
    బట్టలో రాయిపెట్టి కట్టేసి, రంగు అవసరం లేనిచోట రాయి మీద పాలితిన్ కవర్ పెట్టి రంగులో ముంచటం వల్ల వీటికి టై అండ్ డై చీరలని పేరొచ్చింది.
   
    ఒక మోస్తరు షిఫాను మీద ప్రారంభమైన యీ చీరలు, వాణిశ్రీ పుణ్యమా అని పాపులర్ అయ్యి, ఇతరములైన కాటన్, సిల్క్ ల మీద కూడా ప్రింట్ చేయబడ్డాయి.
   
    చివరికి అన్ని ఫాషన్ లలాగే కాలగర్భంలో కలిసిపోయాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS