Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 3

  

    "మరి?"
   
    "మీ అమ్మాయి కట్టుకున్న చీర ఆ ఒంటికి నప్పలేదమ్మగారు."
   
    ఆవిడ మొహంలో ఆశ్చర్యం కనిపించింది. "అంటే.....? నీ చీర కట్టుకుంటే బావుంటుందంటావా?" ఎగతాళిగా అంది.
   
    "కాదమ్మగారు బరువైన చీరెలు చూడటానికీ కొనటానికీ బావుంటాయి తప్ప, కట్టుకుంటే లావుగా కనిపించేట్టు చేస్తాయి."
   
    ఆ మాటలకి వెళ్ళబోతున్న అమ్మాయి ఆగింది. అంతదూరం నుంచే తన చీర బరువు గురించి అతడు ఎలా కనుక్కున్నాడా అని ఆమె ఆశ్చర్యం చెందింది. అందులోనూ అంత చిన్న కుర్రవాడు.....
   
    "గులాబీరంగు చీర.....ఇది బావుంది కదా" అంది అప్రయత్నంగా, సాధారణంగా గులాబీరంగు ఏ ఛాయకైనా నప్పుతుంది.
   
    ఆ కుర్రవాడు చిరునవ్వుతో, "లేదమ్మాయిగారు" అన్నాడు. "మీ శరీరచ్చాయకి గులాబీ కంటే ఆకుపచ్చ బావుంటుంది. అందులోనూ మీ అంత ఎత్తున్న, లావున్న అమ్మాయికి అంత చిన్న బోర్డరు సరిపోదు. బోర్డరు మీదనుంచి పువ్వులు పైపైకి వెళ్ళి క్రమంగా మాయమవుతే బావుంటుంది. అసలే పోటీ అంటున్నారాయె. ఏమాత్రం కాస్త తేడావున్నా అది ఎంతో లెక్కకి వస్తుంది."
   
    "ఒహో నీ దగ్గిరున్న యిలాంటి చీరొకటి మా కంటగట్టే ప్రయత్నమా ఇది?" ఎగతాళిగా అంది తల్లి.
   
    కుర్రవాడు నవ్వేడు.
   
    "నా దగ్గిర అలాంటి చీరలేదమ్మా అమ్మాయిగారు అలాంటి చీరలేదమ్మా. అమ్మాయిగారు ఎలాంటి చీరకడితే బావుంటుందో చెప్పానంతే..."
   
    ఆ అమ్మాయి అతడివైపే విస్మయంతో చూస్తోంది. తన కన్నా అయిదారేళ్ళు చిన్న వయసుంటుంది అతడికి. కానీ చీరల మీద కమాండ్ వున్నవాడిలా మాట్లాడుతున్నాడు.
   
    "మీరేమీ అనుకోకపోతే ఒక్కమాట అమ్మగారు! చాలా మంది షాపుకెళ్ళి ఏ చీర బావుందా అని ఎన్నుకుంటారు. ఏ చీర 'తమకి' బావుంటుందా అని ఎన్నుకోరు" అన్నాడు. "....అలాగే, మీ అమ్మాయిగారి గెడ్డం మీదున్న పెట్టుడుమచ్చ మరికాస్త పక్కకి జరుపుతే బావుంటుంది కుడివైపుకి-"
   
    సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం అక్కడ వ్యాపించింది ఇప్పుడు ఆ తల్లికి కూడా అతడిమీద నమ్మకం కుదిరినట్టుంది. ఏదో మానవాతీత శక్తి లాంటిది లేకపోతే తప్ప ఆ మచ్చ "పెట్టుడుదని" తెలీదు. నాలుగు సంవత్సరాల్నుంచీ ఆ మచ్చని అక్కడే చూసిన వారికి కూడా అది ఇంకాస్త పక్కన వుంటే బావుండేది అన్న అభిప్రాయం కలగలేదు.
   
    ఇంతలో ఆ అమ్మాయి అడుగు ముందుకువేసి కుతూహలంగా "ఇంకా ఏం చెయ్యాలి?" అని అడిగింది. ఆ కుర్రవాడు ఇప్పుడు కాసింత ధీమాగా, మరింత పరిశీలనగా ఆ అమ్మాయివైపు చూశాడు. ఆ అమ్మాయి శరీరఛాయ గులాబీ రంగుతో పోటీపడుతూంది. దానికి ఆ రంగులో వున్నవాళ్ళకి ఏ రంగు చీరైన బానే వుంటుంది. చామనఛాయ గలవారైతే పసుపు, నారింజ గులాబి రంగులు ఎలాగో తప్పవు బాగానే వుంటుందికదా అని తెల్లగా వున్నవాళ్ళు కూడా అవే వేస్తే వాళ్ళకీ మిగతావాళ్ళకీ తేడా వుండదు. దేవుడిచ్చిన తెలుపుదనపు వరానికీ, మరింత కొట్టొచ్చినట్టు కనబడే ఆకుపచ్చ నీలపు అలంకారాలు అద్దవచ్చు.
   
    ఆ అమ్మాయిలో వున్న చిన్న లోపం... ఆమె పొడుగు మామూలు కన్నా ఎత్తు రెండు అంగుళాలు ఎక్కువ. దాన్నే ఆమె 'హుందాగా' మార్చుకోవచ్చు. కానీ ఆ చీరకట్టులో అటువంటి ప్రయత్నమేమీ ఆమె చేసినట్టు కనిపించలేదు. ఒకదానికి ఒకటి పొసగని వస్త్రము (కాంట్రాస్ట్) ధరించి వుంటే ఆమెలో ఆ 'హుందా' కనిపించి వుండేది. కానీ ఆమెకూడా ఫేషన్ పేరిట 'మ్యాచింగ్' వరదలో కొట్టుకుపోయింది. కనీసం ఆమె కట్టిన పసుపు రంగు చీరమీద వేరే రంగు జాకెట్టు ధరించినా బావుండేది.
   
    "......ఆ లోలకులు మార్చండమ్మాయ్ గారు. పొడుగ్గా వున్న వాళ్ళు లోలకులు వేసుకుంటే బావోదు. అలాగే క్రిందికి వేలాడే నగలకన్నా, మెడచుట్టూతా వుండే నగయితే బావుంటుంది....." అతడు నవ్వేడు. "మీ చెప్పులు కూడా మారాలి."
   
    "ఇవి హైహిల్స్ కావు".
   
    "ఎత్తు సంగతికాదు నేను చెప్పేది. పొడుగ్గా వున్నవాళ్ళు సాదా చెప్పులు వేసుకోకపోతే, భూమికీ శరీరానికీ మధ్య ఆ డిజైను కళ్ళకి కొట్టొచ్చినట్టు కనపడి, మరింత ఎత్తుగా కనపడతారు."
   
    ఆ అమ్మాయి చప్పున తన చెప్పుల వంక చూసుకుంది. ఇంతకాలం అసలా కోణంలో ఆలోచన రానందుకు సిగ్గుపడ్డట్టు మరింకేమీ ఆలోచించకుండా, అతడి శక్తి సామర్ధ్యాల మీద నమ్మకాన్ని వెలిబుచ్చుతూ "నాకేం చీర బావుంటుందో కాస్త చూసి చెప్పు" అంది.
   
    ఇప్పటివరకు అతడి మాటల్ని వప్పుకొంటున్న తల్లి. కూతురి ఈ చివరి మాటలకి ఉలిక్కిపడి చూసింది. ఆ అమ్మాయి ఎగ్జయిట్ మెంటు చూస్తుంటే ఆ కుర్రవాడిని తిన్నగా పడగ్గదిలోకి తీసుకుపోయి, బీరువాలో చీరలన్నీ చూపించేట్టూ కనపడింది.
   
    "ఏమిటమ్మాయ్, వాడు చూసి చెప్పటమేమిటి? నీకేమైనా మతిపోయిందా?" అని అడ్డుకుంది. ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా "ఫర్లేదులే అమ్మా" అని లోపలికి దారితీసింది. తల్లి కుర్రవాడివైపు తిరిగి, "అబ్బాయ్ నీ దగ్గరేమన్నా చీరలుంటే చూపించు." అంది, అతడిని లోపలి వెళ్ళకుండా ఆపుచేసే ఉద్దేశ్యంతో.
   
    ఆ అమ్మాయితోపాటు లోపలికి వెళ్ళాలా వద్దా అని తటపటాయిస్తున్న ఆ అబ్బాయి ఈ మాటలకు తెరిపిన పడ్డట్టు తేరుకుని, "నేనొక చీర ఇస్తానమ్మగారూ, దీనికి మీరేమీ డబ్బు ముందు ఇవ్వనవసరం లేదు. కట్టుకుని, బావుంటేనే అమ్మాయిగార్ని డబ్బు ఇవ్వమనండి" అన్నాడు.
   
    ఆ అమ్మాయి వెనక్కు వచ్చి, "ఏదీ చీర చూపించు-డబ్బులదే ముందిలే" అంది.
   
    అప్పుడా అబ్బాయి మూట విప్పి అందులోని చీరలని అటూ ఇటూ జరిపి, మధ్య నుంచి ఒక చీరను బయటకు తీశాడు.
   
    నల్లంచు తెల్ల చీర!!
   
    ఆ అమ్మాయి చీర తీసుకుని లోపలికి వెళ్తూ "దీనికి మ్యాచింగ్ బ్లౌజు వుందో లేదో" అనుకుంది స్వాగతంగా.
   
    "మాచింగ్ వద్దమ్మగారూ. బోర్డరు కొట్టొచ్చినట్టు కనపడే బ్లౌజ్ వుంటే వేసుకోండి" అని వెనుకనుంచి అన్నాడు. పొడుగ్గా వున్నవాళ్ళు పాటించవలసిన మరో నియయం.
   
    చీర తీసుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది.
   
    "ఎంతబ్బాయ్ ఆ చీర?" కూతురు వెళ్ళేక తల్లి అడిగింది.
   
    "నూటపాతిక అమ్మగారూ-"
   
    "నూ.....ట.....పా.....తి.....కా?" మరీ అంత చౌక చీర నా కూతురుతో కట్టిస్తావా అన్నట్టు అందావిడ.
   
    ఆ అబ్బాయి మాట్లాడలేదు.
   
    ఓ ఆడవాళ్ళలారా! మీరెప్పుడు తెలుసుకుంటారు. వెయ్యి రూపాయల చీరని ఎనిమిది సంవత్సరాలు దాచి దాచి కట్టుకోవడం కంటే, ఎనిమిది వేర్వేరు చీరెలు, నూటపాతికవి కొని కట్టుకుంటే మీరు మరింత ఆకర్షణీయంగా కనపడతారనీ? పైగా-మీరు ఆకర్షణీయంగా కనపడాల్సింది పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్ లలోనూ మాత్రమే కాదు..... ఇంట్లో భర్తకి కూడా అనీ!! అందరూ వెయ్యి రూపాయల చీరెలు కట్టుకొని వచ్చిన పెళ్ళిలో మీరు ప్రత్యేకంగా కనపడాలంటే, అందుకు మొదటి మార్గం మీరు పదివేల రూపాయల చీర కట్టటమనీ, లేదా రెండోమార్గం నూటపాతిక రూపాయల్దికట్టటమనీ!!! ఖరీదు కాదు ముఖ్యం- కొట్టొచ్చేటట్టు కనపడటం అనీ, అలా కనబడటానికి తమ తమ శరీరతత్వాన్ని అర్ధం చేసుకోవటం అన్నిటికన్నా ముఖ్యం అనీ, అలా చేయని పక్షంలో అందరిలో మీరూ ఒకరిగా కలిసిపోతారనీ!! అన్నిటికన్నా చివరగా, చీర అందంగా కట్టుకోవటం ఎంత గొప్ప కళో, అందమైన చీరని ఎన్నిక చేసుకుని దాన్ని సరైన కాలంలో (వేసవికాలం పగలులో లేతరంగు, వర్షాకాలం మబ్బుల్లో ముదురురంగు), సరైన సమయంలో (లైటు వెలుగుల రాత్రిళ్ళైతే ఒక రంగు, సూరీడు వెలిగే పగలైతే ఒక రంగు) ధరించటం కూడా అంత గొప్ప కళే అనీ - చీర అనేది వంటిని కప్పే సాధనం కాదనీ, వంటికి అందం తెచ్చే ఆయుధమనీ...... ఓ ఆడవాళ్ళలారా, మీరెప్పుడు తెలుసుకుంటారు?
   
    "ఏమిటబ్బాయ్ ఆలోచిస్తున్నావ్?"
   
    అతడు ఉలిక్కిపడి "ఏమీ లేదమ్మగారూ" అన్నాడు. ఈ లోపులో ఆ అమ్మాయి గదిలోంచి కిటికీ దగ్గిరకొచ్చి, "ఇదిగో, చుక్క ఇక్కడ పెట్టుకోనా?" అని అడిగింది.
   
    తల్లికి వళ్ళు మండిపోతోంది. పక్కన డాక్టరుగారి భార్య లేకపోతే సంస్కారం గింస్కారం మర్చిపోయి కూతుర్ని నాలుగుతిట్టి ఆ కుర్రాడ్ని తన్ని తగలేసేదే! మింగలేకా కక్కలేకా చూస్తోంది. ఈ లోపులో ఆ కుర్రవాడు ఇవ్వవలసిన మిగతా నాలుగు సూచన్లూ యిచ్చేసేడు.
   
    సరిగ్గా పదినిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటికొచ్చింది.
   
    ఒక్కక్షణం అక్కడున్న ఆడవాళ్లిద్దరికీ మతిపోయింది. తల్లికైతే తను చూస్తున్నది స్వంత కూతుర్నేనా అని అనుమానం కలిగింది.
   
    సరైన చీరెతో, కొద్ది కొద్ది మార్పుల్తో, ఆ అమ్మాయి పూర్తిగా మారిపోయింది. పొడుగుస్థానే హుందాతనం వచ్చింది. లోలకులు తీసేసి దుద్దులు పెట్టి, మెళ్ళో హారం బదులు నెక్లెస్ మార్చేసరికి అందం ద్విగుణీకృతం అయింది. గెడ్డంమీద పుట్టుమచ్చ కాస్తా స్థానం మారేసరికి ఆ వదనం, కేవలం చిత్రకారుడు మాత్రమే గుర్తించగల సౌందర్యాన్ని సంతరించుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS