బొమ్మ
ఆ పెద్ద నగరంలో మార్కెటులో ఒకచోట బల్లమీద ఓ ఆడది కూర్చునివుంది. ఆమె చాలా అందమైనది. లావణ్యమైనది. ఆమె ఉత్తర ధృవంలో అరోరా బోరియాలిస్ లా ఉంది. ఊర్వశిలా, హెలెన్ లా ఉంది. స్వప్నమల్లే అంత నిజమూ అంత అబద్దమూలాగ ఉంది. ఊర్వశిలా, హెలెన్ లా ఉంది. స్వప్నమల్లే అంత నిజమూ అంత అబద్దమూలాగ ఉంది. ఆమె అర్ధనిమీలిత నేత్రాలు మరోలోకం చివర తెరుచుకుంటున్నట్టు వున్నాయి. ఆమె కళ్ళల్లో ఓ విషాదం, ఓ అలౌకికత్వం జాలిగా మెరుపుగా వుంది. ఆమె చాలా సన్నని, విలువైన, సూర్యకిరణాల్లాటి జరీ మెరిసే దుస్తులు ధరించివుంది. ఆమె ఎందుకు అక్కడ అలావుందో, ఆమె ఎవరో ఎవరికీ తెలియదు.
జనం గుంపులుగుంపులుగా వచ్చి చూస్తున్నారు. ట్రాఫిక్ ఆగిపోయింది జనసమ్మర్ధం తొలగించడానికి వచ్చిన పోలీసు ఉద్యోగులుకూడా ఆ ఆడదానికేసి చూస్తూ ఉండిపోయారు. నగరంలో వుండే విద్యాధికులూ, కవులూ , రాజకీయవేత్తలూ, శాస్త్రజ్ఞులూ అందరూ ఆ మనిషిని తనివితీరని ఒక చూపుతో, ఆశతో, తృప్తితో చూస్తున్నారు. ఆమె చాలా ఎత్తుమీద వుంది. అంత ఎత్తుమీద ఆమె కదలికలు ఏమీ స్పష్టంగా యెవరికీ గోచరించడంలేదు.
"ఈమెని చూసినకొలదీ నా భార్య నాకు చేసిన ద్రోహం స్పురిస్తోంది. అతి ఘోరంగా, అన్యాయంగా, ఆమెనీ, ఆ వొంటి వొంపుల్నీ చూస్తో ఇలాగ ఎన్నాళ్ళైనా వుండిపోగలను. నేను ఇంటికే రాను" అన్నాడు శర్మ.
"చూసి ఏంచేస్తావ్! ఏం చెయ్యగలవ్! ఆమె యౌవనం ఒక భ్రాంతి., మన పెళ్ళాల్లాగే రెండు కాన్పులతో ముసల్ది అయిపోతుంది"
"ఏం చేస్తానా, పెళ్ళిచేసుకుంటాను. లేదా ఉంచుకుంటాను" అన్నాడు శర్మ.
"నీది అవినీతి" అన్నాడు శాస్త్రి
"నీతి అంటే" అన్నాడు శర్మ.
"నీతి, అవినీతి అందంముందు మంచులా కరిగిపోతాయి. అందమొక్కటే నిజం, తక్కినవన్నీ అబద్ధం. ఆ అందాన్ని ఆరాధించండి ఆమె దేవత" అన్నాడొక గిరజాల మనిషి.
"ఆమె దేవత కాదు. ఆమె నా ప్రేయసి" అన్నాడు కవి. ఓరగా సిగ్గుపడుతూ ఆమె వైపు చూస్తూ "నా ప్రేయసీ నాకు ఊహగా లీలగా తోచి ఇదివరకు మాయమైపోయింది. అప్పట్నుంచీ ఈ వియోగం భరించలేక పోతున్నాను. నా ప్రేయసి యెవరో అని తీవ్రగవేషణ సలిపాను. ఇంటింటా, బీచి దగ్గరా, ఆడవాళ్ళ కాలేజీలలో వెతికాను. నిరాశ అంచుమీద నిలబడి మృత్యువనే సముద్రంలోకి దూకబోయే నాకు ఈమె కనబడింది. ఆమె యెవరు? అచ్చంగా, నేనూహించి వియోగం పొందుతున్న నా ప్రేయసీ, నా తపఃఫలం"
ఇంతలో ఒక పెద్ద కేక వినబడింది. ఒక వ్యక్తి చేతులు వూపుకుంటూ కంఠం చించుకుంటూ అలా వచ్చాడు. "మేరీ యేంటియోనటీ! ఫ్రెంచి విప్లవంలో ఉరితీయబడిన మేరీ తిరిగి ఇండియాలో రూపందాల్చింది. ప్రజాస్వామ్య శక్తులు ఆమె ఆకర్షణకు లోబడకూడదు. ఆమెని ఉరిదీయాలి."
"మా బలేగావుంది ఓరాత్రి దీంతో పడుకుంటే మాంచి మజాగా ఉంటుంది. ఏమయ్యోయ్ పంతులూ, రేటు ఎంత?" అన్నాడొక కోమటి.
"ఈమె బూర్జువా! మరేం కాదు. ప్రపంచపీడిత ప్రజానీకపు ప్రధమ శత్రువు!" అన్నాడొక యువకుడు, రేగిపోయిన జుట్టుతో, నిక్కర్లతో వచ్చి.
"అంటే" అని ఒకరు.
"ఈమె పాలబుగ్గలూ, మిసమిసలాడే వొళ్ళూ, కళ్ళూ -ఇవన్నీ ధనిక చిహ్నాలు. ఎంతమంది శ్రామికుల రక్తం తాగితే ఈ బుగ్గలకి ఎరుపు వచ్చింది? ఎంతమంది బట్ట లేకుండావుంటే ఈమెకీ జరీచీర వచ్చింది. ఒక అన్యాయపు ఆర్ధిక విధానపు సృష్టి ఈమె. ఈమె రియేక్షన్, ఫాసిజం, ఘోరం , అపాయం"
"కాని మా బలేగావుందిలే! ఆ సూపూ, సన్నూ....... ఒలబ్బో కైపెక్కి పోతున్నాది" అన్నాడొక కూలివాడు.
"అదిగో! అదే బానిసత్వం, సంప్రదాయం! కామ్రేడ్ నువ్వీస్థితికి రావడానికి ఈమె కారణం అని గుర్తించు. కూలీల సంఘంలో చేరిపో! ప్రపంచాన్ని ఆర్ధిక దృక్పధంతోనే చూడాలి. ఈమె ఒక ఆర్ధిక ఘోరం. ఈమెమీద మనం విప్లవం చెయ్యాలి. చూడు నా నినాదం. ఇదిగో, ఈ బల్లమీద ఆడది నశించాలి!" అంటూ ఆ నిక్కరు యువకుడు గట్టిగా అరచి ఆ కూలీని కౌగిలించుకున్నాడు.
