తంబూరా మీటుతున్న సాధువొకడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు. "బాబూ, ఈ ప్రపంచం మిద్దె! ఓ పెద్ద మిద్దె. రత్తమాంసాలతోటి కళ్ళుగుంట ఆడది. ఎందుకు నీకు బ్రెమ! మాయలో పడిపోకే మనసా!ఓ మనసా!"
"ఈమె నా తల్లి! మరెవ్వరూ కాదూ!" అన్నాడొక మనిషి పరుగెత్తుకొని వచ్చి. అందరూ ఆశ్చర్యంగా చూశారు.
"అలాగా, పాపం విచిత్రం" అంటూ అందరూ అతని చుట్టూ మూగారు.
"ఈమె నా మాత! పరాయి స్త్రీ ఎవరేనా నాకు తల్లి! భాగవతం చదువు కావలిస్తే జీసస్, బుద్దుడు, గాంధీ - స్త్రీని మాతృ రూపంలోనే చూశారు. ఈమె మాతృదేవత, సత్యదేవత -అంత ఎందుకూ చరఖా దేవతా!" అన్నాడు ఆ మనిషి గాంధీటోపీ సవరిస్తూ.
"ఆ బల్లమీది వస్తువు ఏమిటో నేను చెపుతాను ఆగండి" అంటూ బైనాక్యులర్సు తగిలించిన ఒక సన్నని పెదవుల నడివయస్కుడు. అందరూ అతని చుట్టూ మూగారు ఆతృతతో. అతను ఆమెని నిదానంగా టెలిస్కోపుతో ఓ పావుగంట చూసి ఇలా అన్నాడు.
"ఈ వస్తువు అందమైనది అన్న అభిప్రాయం సబ్జక్టివ్ -అంటే మీ మనస్సులోనిది. ఈమెని ప్రేమిస్తున్నాననే కవిగారిది ఓ సెంటిమెంట్. మానసిక చాంచల్యానికి ఆయన మందు పుచ్చుకోవాలి. ఈ వస్తువు అసలు ఏమిటో తెలుసునా, జీవశాస్త్ర ప్రకారం ఈమెకి ఆడదాని లక్షణాలే కనబడుతున్నాయి. కావలిస్తే చదవండి డార్విన్ పుస్తకాలు. ఈమె సృష్టి ప్రయోజనానికి పనికివస్తుంది. సృష్టి ఎలా జరుగుతుందో తెలుసునా, మనలో గ్లాండ్స్....."
"ఓస్, ఏం సెప్పావయ్యా, అరగంట సేపు చూసి ఆడమనిషి అని. ఎవడవు బాబు నువ్వు" అన్నాడు కూలివాడు చుట్ట నముల్తూ.
"నేనా! నేను సైంటిస్టుని. బైయాలజీ ప్రకారం ఈమె ఆడది. అయినా యింతదూరం నుంచి నేను ఋజువు చెయ్యలేను. ఇంకా కొన్ని పరీక్షలు చెయ్యాలి." అంటు అతను అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
"హా నా ప్రేయసీ!" అంటున్నాడు కవి.
"ప్రేయసీలేదు గేయసీలేదు ఊరుకోవయ్యా! మన షాపులో యీమెని నిలబెడితే కావలసినంత లాభం! లాభాలకి లాభాలు! ఏమంటావ్ చెంచయ్యా?" అంటున్నాడు ఒక మార్వాడీ.
ఇంతలోనే -యింతవరకూ బల్ల దగ్గర కిందగా కూర్చున్న ఒక సన్నపాటి వ్యక్తి బల్లమీదకెక్కి నుంచున్నాడు. ఆమెమీద ఒక పల్చని బట్ట కప్పివేసి సులువుగా ఎత్తుకుని నెత్తిమీద పెట్టుకుని ఇలా గంభీరంగా అన్నాడు "సోదరులారా! ఈ బొమ్మని నేనే చేసాను. ఇది నా శిల్పం. మీలో ఒక్కరూ ఈ బొమ్మని కొనలేదు. ఇంతకీ నాకు ప్రాప్తిలేదు. నేను మరో వూరు వెళ్ళిపోతా" నంటూ ఆ బల్లదిగి అతను చకచక వెళ్ళిపోయాడు.
"ఆ కళకి ప్రయోజనం లేదు" అన్నాడొకడు.
"కళకోసం కళ! దానికి ప్రయోజనం ఏమిటి?" అన్నాడు మరొకడు.
"అసలు కళ లేదు సైన్సు తప్ప" అన్నాడు ఇంకొకడు.
"అసలు ఏమీలేదు బాబు! ప్రెపంచం ఒక మిద్దె! ఇదంతా బ్రెమ!" అన్నాడు సాధు.
"నాకు మూర్చవస్తోంది. నా ప్రేయసికి నేను కనపడక శిలగా, శిల్పంగా మారిపోయింది. ఇప్పుడేం చెయ్యను. ఏం చెయ్యను? అబ్బా బాధ, మిస్టర్! ఓ బెడవుంటే ఇయ్యి. కాఫీ తాగితే కాని...." అంటున్నాడు కవి.
ఇంతవరకూ చూస్తోన్న పోలీసు ఉద్యోగి విజిల్ వేశాడు. ట్రాఫిక్ ఆపుదలకి పోలీసుల్ని లాఠీ చెయ్యమని ఆజ్ఞాపించాడు. జనం చెల్లాచెదరై పోయారు.
తర్వాత రోజున న్యూయార్కు లో ఓ పేపర్లో ఇలా వుంది "నగరంలో ప్రజావిప్లవం పోలీసులు తుపాకీలు కాల్చారు - నగరంలో మతకలహాలు నూర్గురి మరణం."
(ఆనందవాణి దీపావళి సంచిక, 1948)
*****************
