కవుల రైలు
తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టెలాగ కిక్కిరిసిపోయింది. 'ఇంక జాగలేదు' అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కుని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్ బోర్డులమీద నిలబడీ, కొందరు కమ్మీలు పట్టుకొని వేలాడుతున్నారు.
ఒకావిడ మేలిముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా అందంగా ఉంది. కళ్ళల్లో ఉపూర్వమైన వెలుగు, ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు వొంపులు, వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాల్నీ కలబోసి మనమీద జల్లినట్టు అనిపిస్తుంది ఆవిడని చూస్తే....... అక్కడ దగ్గరలో నిలుచుంటే...
ఆవిడ నిస్పృహగా చూసింది రైలు పెట్టెకేసి, లోపలి బొగ్గుపులుసు గాలీ, చుట్టపొగా, వాగుడూ కలసి పెట్టెలోంచి బయటికి దుర్భరంగా వ్యాపిస్తున్నాయి.
"ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా. నువ్వుకూడానా మాఖర్మ" వగలొలుకబోసుకుంటూ అన్నాడొక చుట్ట ఆసామీ కాండ్రించి ఉమ్మివేస్తూ. ఆయన కవి శార్దూల బిరుదాంకితుడు. అప్పకవీయం అడ్డంగా బట్టీ వేశాడు.
"నోప్లేస్ మేడమ్ వెరీసారీ" అంటూ కన్ను గీటాడొక నవయువకుడు గాగుల్సు తీసి, సెకండ్ హాండ్ బిడి నోట్లో ఉంచుకునే.
కొందరు వెకిలిగా నవ్వారు. కొందరు దగ్గారు. మరికొందరు ఈలలు వేశారు. పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది రైలు కదిలిపోయింది. స్టేషన్ మేష్టర్ వచ్చి ఆమెను చూచి "పాపం తోటు లేదా అమ్మా నీ పేరు?" అని అడిగాడు.
"కవిత" అందా సుందరి.
కవుల రైలు వడివడిగా గమ్యం తెలీకుండా వెళ్ళిపోతోంది.
**********
