అరుణ్ సంధ్యతో గుడికి వెళ్ళాక ప్రతిమ వచ్చింది ఇంటికి, అరుణ్ కోసం, "ఆంటీ, అరుణ్ వున్నాడా!"
సంధ్యని తీసుకొని గుడికి వెళ్ళాడని చెప్పాలా వద్దా అని ఒక్క క్షణం తటపటాయించింది జానకమ్మ. తనిప్పుడు సంగతిదాచి అబద్ధం చెబితే నిజం తెలిసినప్పుడు ప్రతిమ తనని ఏమనుకొంటుంది? ఆంటీ ఈ వయసుకి అబద్దాలు నేర్చిందీ అనుకొంటే? ప్రతిమ ఏమైనా అనుకోనీ నిజం చెప్పడమే మంచిదనుకొంది. "సంధ్యని తీసుకొని గుడికి వెళ్ళాడమ్మా."
"అరుణ్ వ్యవహారం నాకేం నచ్చడంలేదు, ఆంటీ! అరుణ్ కి నేను కావాలో, సంధ్య కావాలో ఇవాళ తేల్చేస్తాను." ప్రతిమ చిరాకుగా అంది. అరుణ్ కోసం నిరీక్షిస్తూ ఆవరణలో అసహనంగా పచార్లు చేయసాగింది.
కారొచ్చి ఆగింది. అరుణ్, సంధ్య దిగారు.
"నిన్న మొన్నటిదాకా నాతో షికార్లు. ఇప్పుడు ఈమెతో షికార్లు. ఏమిటి సంగతి?" అరుణ్ నడుంచుట్టూ చెయ్యివేసి అతడిని హత్తుకున్నట్టుగా నడుస్తూ అడిగింది, మెల్లగా.
"ఈర్ష్య పుట్టాక ఆడది పుట్టిందంటారు. ఇదేనేమో! సంధ్యని కాస్త గుడికి తీసికెడితే ఏం పోయిందీ?"
"ఇవాళ ఇది అన్నావు. రేపు సంధ్యని కాస్త ప్రేమిస్తే ఏం పోయిందీ అంటావు. సంధ్యని కాస్త పెళ్ళి చేసుకొంటే ఏం పోయిందీ అంటావు ఎల్లుండి."
"నాకు లేని ఆలోచనలు నేర్పిస్తున్నావంటాను."
"పాపం! పసిబాలుడివి!" వెక్కిరించింది.
* * *
అరుణ్ టూర్ వెళ్ళాడు. వారం రోజులవరకూ రాననిచెప్పాడు. అరుణ్ లేని ఈ సమయంలో ఒక సంఘటన జరిగింది. చక్రపాణిగారని జానకమ్మకి తమ్ముడి వరుసైన ఒకాయనకి భార్య మూడో కాన్పులో పోయినట్టుగా, రేపటి నుండి కర్మకాండ మొదలవుతూందని జానకమ్మకి ఫోన్ చేసి చెప్పాడు, జానకమ్మకి దగ్గరి బంధువొకాయన.
మరునాడు పరామర్శించి రావడానికని బయల్దేరింది జానకమ్మ.
ఇల్లంతా బంధువులతో కిటకిటలాడిపోతూంది.
ఓవైపు కర్మకాండ జరుగుతూంది.
ఒక గదిలో చక్రపాణి ఇద్దరు పిల్లల్నీ చెరోప్రక్క కూర్చోబెట్టుకొని కూర్చొంది చక్రపాణిచెల్లెలు కమల. జానకమ్మని చూసి, "రా, అక్కయ్యా!" అని ఆహ్వానించింది.
"వాడికి అయిదు, దీనికి మూడేళ్ళు అనుకొంటాను. పాపం చిన్నపిల్లలు. ఇంత చిన్న పిల్లలకి మాతృవియోగం. చక్రపాణి ఎలా పెంచుతాడో ఏమో!" అంది సానుభూతిగా.
"వదిన ఉన్నప్పుడే అన్నయ్య ఒక్క నిమిషం తీరికగా ఇంటి పట్టునుండేవాడు కాదు. బిజినెస్ బిజినెస్ అంటూ దేశాలు పట్టుకు తిరిగేవాడు. నౌకర్లు, చాకర్లు ఎంతమంది ఉంటేనేం? వాళ్లు తల్లిలాగా, తండ్రిలాగా చూస్తారా? ఈ పదిరోజులు నేను చూశాను. ఆంటీ ఆంటీ అంటూ హత్తుకుపోయినట్టుగా తిరిగారు. ఇప్పుడు విడిచి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది. కాని, తప్పదు కదా? అక్కడ నేను ఒక్కరోజు లేకపోతే కొంపలంటుకుపోయినట్టుగా చేస్తారు ఆయనా, పిల్లలూ! మంచి ఆయా దొరికితే ఈ సమస్య కొంత పరిష్కారమౌతుంది."
జానకమ్మకు మనసులో మెరుపులా ఆలోచన మెరిసింది. సంధ్యని ఈ పిల్లల్ని చూడడానికి ఆయాగా కుదిరిస్తే? తన సమస్య తీరుతుంది. ఇక్కడ ఈ పిల్లలకి మంచి ఆయా దొరికినట్టవుతుంది. సంధ్యకి ఒక ఆధారము చూపి పంపించినట్టవుతుంది. అరుణ్ ఊళ్ళోలేని ఈ సమయమే మంచిది.
"అవును మరి! నీకూ సంసారం ఉందిగా?" అంది సానుభూతిగా. "నాకు తెలిసిన ఒకమ్మాయి ఉంది. తల్లీ తండ్రి ఇద్దరూ పోయారు. ప్రస్తుతం నాదగ్గరే ఉంది మంచి నమ్మకస్తురాలు. పంపించమంటే పంపిస్తాను. అన్నయ్యని అడిగి చెప్పుమరి."
"నమ్మకస్తురాలైతే సరి! అన్నయ్యని ఏం అడగాలి? నీకు తెలియదా, అక్కయ్యా? రేపు తీసుకువస్తావా?"
"ఈ దినాలు అయిపోనీ. నువ్వు ఊరికి వెళ్ళిపోయేముందు ఆ అమ్మాయిని తీసుకువస్తాను. ఆమె చేయాల్సిన పనులు తెలియజెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు."
జానకమ్మ ఇంటికి వచ్చి సంధ్యతో చెప్పింది, "పాపం, ఇద్దరు చిన్నపిల్లలు. చక్రపాణికి భార్య వున్నప్పుడే ఇల్లు పట్టేదికాదు. ఈ పిల్లల గతి ఏమిటాని ఆ పిల్లల మేనత్త బెంగపెట్టుకొంది. తనకీ మరో ఊళ్ళో పిల్లలూ, సంసారం. అక్కడ వదిలి ఇక్కడ ఎన్నాళ్ళుంటుంది? ఇక్కడుంటే అక్కడి చింత, అక్కడుంటే ఇక్కడి చింత అన్నట్టుగా అయింది. మంచి ఆయా దొరికేవరకు పిల్లల్ని చూడడానికి నిన్ను పంపిస్తానని చెప్పాను. నామాట కాదనవన్న నమ్మకంతో నిన్నడక్కుండానే మాటిచ్చాను."
"వాళ్ళెవరో ఏమిటో? ఎలా వెళ్ళనత్తా?" సంధ్య ముఖం పాలిపోయింది.
