Previous Page Next Page 
చదువు పేజి 38

   

    ఆధునిక సాహిత్యంతో సుందరానికిది తొలి పరిచయం. కాని దాని ప్రభావం వాడిమీద దాదాపు ఏమీ లేక పోయింది. ఆ పుస్తకాలు చదివినట్టే కొన్ని  అపరాధ పరిశోధక నవలలూ, విదేశీ నవలల అనుకరణలూకూడా సుందరం చదివి ఆనంచేవాడు. ముఖ్యంగా డిటెక్టివు  నవలలు చదువుతుంటే ఎప్పటికీ విసుగేత్తేది కాదు.

    శేషగిరి చిక్కి శల్యమై గుర్తించటానికి లేకుండా మారిపోయి జైలునుంచి విడుదలై ఇంటికిపోతూ కనిపించి వెళ్ళిన తరువాత సుందరం మనస్సులోనుంచి రాజకీయాలు పూర్తిగా మాయమైజీవితం మళ్ళీ యదా ప్రకారమయింది. ఈ జీవితంలో ముఖ్యమైనవి స్కూలు విషయాలు, వినోదమైనవి సుందరం చదివేపుస్తకాలు, విడ్డూరాలు, సినిమాలూ, సర్కసులూనూ.

    ఎందుకంటే ఈ తరుణంలోనే సుందరం  మొట్టమొదటి సారిగా నిజమైన మృగాల సర్కసు చూశాడు. సర్కసుకు పోవటానికి డబ్బులిమ్మంటే సీతమ్మగారు ఎట్లాగూ ఇచ్చి వుండేదికాదు. కాని నాగేశ్వరరావు  ఇంటో అందరూ బయలుదేరుతూ సుందరాన్ని కూడా తీసుకువెళ్ళారు. మిగిలిన వాళ్ళంతా ఏనుగులూ, గుర్రాలూ, పులులూ, సింహాలూ చూసి సంతోషించారు గాని, సుందరానికి ఆ "ఫీట్స్" లో వుండే స్వారస్యం అర్ధంకాలేదు. ఆ ఫీట్స్  ను గురించి  ఎవరన్నా వర్ణిస్తే ఎంత తృప్తికలిగేదో చూస్తున్నా అంతే తృప్తికలిగింది. అన్ని ఫీట్సుకన్నా సర్కసు  బఫూనులు  వాడికి బాగా నచ్చారు. వాళ్ళను జ్ఞాపకం చేసుకుని వాడు చాలా రోజులపాటు నవ్వుకున్నాడు. అయినా, సర్కసు వెళ్ళిపోయిన తరువాత సుందరం ఇతర పిల్లలతోబాటు కర్రలకు పొడుగాటి తాళ్ళుకట్టి, సర్కసు లో గుర్రాలూ, ఏనుగులూ ఆడించేవాడల్లే తిరిగాడు.

    ఈసారి సుందరం చూసిన సినిమాకూడాడి నిజమైన సినిమాయే. ఎలక్ట్రిక్ దీపాలూ__ వాటంతట అవే వెలిగి ఆరేవి___ వాడు చూడటం ఇదే మొదలు. ఈ సినిమాలో కథలున్నాయి. శ్రీరామ జననం, శ్రీకృష్ణజననం, లంకాదహనం, మైరావణ, సతీతులసీ, కంసవధ మొదలైనవి. తల్లిని ఎట్లాగో ఒప్పించో, నాగేశ్వరరావుతో కలసో, తల్లి తనకెప్పుడన్నా కొనుక్కోవటానికి కిచ్చే కాన్లు దాచో సుందరం చాలా సినిమాలు చూశాడు. వాడికవి "అద్భుతం" గా ఉండేవి. హాలులోకి పోయి కూర్చోవటమే ఎంతో ఆనందంగా ఉండేది. రీలుకూ, రీలుకూ మధ్య లైట్లు వచ్చినప్పుడు ముళ్ళమీద వున్నట్టుండేది. కధచెప్పేవా డొకడుండేవాడు. వాడు కధ చెప్పటంలో ప్రత్యేకత ఏమీ లేకపోయినా వాడి గొంతు వినిపిస్తుంటే పరమానందంగా వుండేది. వాడు ఆప్తుడల్లే వుండేవాడు. ఇటువంటి భావాలు అచ్చగా సుందరానికి ఒక్కడికే కలగలేదు. ఒకరోజు సుందరం మధ్యాహ్నం పూట స్కూలుకు పోతూండగా వాడితో వస్తున్న స్నేహితులు కొందరు ఒకళ్ళనొకళ్ళు గిల్లుకుని "అదుగో, సినిమాలో కధచెప్పే శేషయ్య" అన్నారు. శేషయ్య కిళ్ళీకొట్టుదగ్గర నిలబడి బీడీలు కొంటున్నాడు.
   
                                        *    *    *    *   

    సెకండుఫారం పరీక్షలో సుందరం పాసయినాడు. మధ్య పరీక్షల్లో కొద్దిమార్కులే వచ్చినా ఈ ఆఖరు పరీక్షలో మామూలుప్రకారం యాభైలూ, అరవైలూ, వచ్చినై. లెక్కల్లో మటుకు ఎనభైకి పైగావచ్చాయి. తన క్లాసు మేష్టరు తొమ్మిది నెలలపాటు తనకు చేసిన అన్యాయాన్ని సుందరం పూర్తిగా గ్రహించనూ గ్రహించాడు, క్షమించనూ క్షమించాడు.

    సుందరానికి తన క్లాసుమేష్టర్లని ద్వేషించటం ఎన్నడూ అలవాటులేదు. కాని మూడోఫారం మేష్టర్ని ఆరాధించటం మొదలుపెట్టాడు. అంతకుపూర్వం ఏ మేష్టరూ వాణ్ణి అంతగా ఆకర్షించలేదు. ఆయన పాఠం చెబుతుంటే తన ఒక్కడికే చెబుతున్నట్టుగా ఉండేది. ఆయన అచ్చగా పాఠం చెప్పటమేకాదు, చదవటంలోనూ, ఇతరులతో సరిగా ప్రవర్తించటంలోనూ ఆసక్తి పుట్టించేవాడు. పుస్తకాలలో అర్ధం చేసుకునేదీ , అన్వయించుకునేదీ కూడా ఉంటాయని సుందరానికి తలకెక్కేటట్టు చేసినది ఈ మేష్టరే.

    అయితే ఈ మేష్టరు మూడునెల్లయినా ఉండకపూర్వమే ఆయనకు ఉద్వాసన చెప్పారు కమిటీవారు. ఈ కమిటీలో ఎక్కువమంది  బ్రాహ్మలే. కాని అంతా నియోగులుకారు. ఒకప్పుడు స్కూలును పైకి తీసుకొచ్చినవాళ్ళంతా పెద్ద స్థితిలో ఉండిన నియోగులే! అయితే రానురాను పెద్దలు దాటి పోయారు. స్కూలు వ్యవహారాలు నిర్వహించటానికి కొత్తకారు వచ్చింది. వీరిలో వైదీకులు ఎక్కువున్నారు. వైదీకి రాజకీయాలు తెచ్చి పెట్టాలని వీరికి కలిగింది. ఈ కక్షరాజకీయాలకు మొట్టమొదటగా బలిఅయింది సుందరం క్లాసుమేష్టరు.

    దీనితో ప్రారంభమైన మర్కటపరిపాలనలో కొత్త మేష్టర్లు రావటమూ, పోవటమూ, ఎంతో కాలంగా ఉన్న మేష్టర్లను పిచ్చి సాకుమీద పంపెయ్యటమూ ప్రారంభమయాయి. సుందరం క్లాసుకువచ్చిన కొత్త మేష్టరు సుందరం దృష్టిలో వఠ్ఠి చవట. అంతమంచి మేష్టరును తీసేసి ఈయనను పెట్టినందుకు హైస్కూలు అధికారులపైన సుందరానికి చాలా అసహ్యం పుట్టుకొచ్చింది.

    ఈ అసహ్యంకూడా సుందరానికి ఒక్కడికే కలగలేదు. అది పిల్లలమధ్య దానంతట అదే ఏర్పడింది. మేష్టర్లమీద పిల్లలకు కలిగే సదాభిప్రాయాలూ, దురభిప్రాయాలూ, కూడా ఇట్లాగే క్రమంగా ఒక స్వరూపానికి వస్తాయి. యీ అభిప్రాయాలు మొట్టమొదట ఒకడికే కలగవచ్చు. వాటికి ప్ర్తచారం కూడా జరగవచ్చు, కాని వాటికి అంతో ఇంతో ఆధారం లేకపోతే అవి పిల్లలను పట్టుకోవు.

    పిల్లలు చాలామంది మేష్టర్లకు మారుపేర్లు పెట్టారు___ డైమన్ రాణీ, సీమసున్నం, విసనకర్ర, పొడుంచిప్ప ఇత్యాది. సుందరం ఇటువంటి నామధేయాలను సాధారణంగా ఎన్నడూ తన నోటితో ఉచ్చరించేవాడువాడు. ఇతరులు ఉచ్చరిస్తే కాదనే వాడూకాడు. కాని తనకు మంచి మేష్టరని తోచినవాణ్ణి గురించి విసుగులేకుండా నలుగురిలోనూ ప్రచారం చేసేవాడు. ఇట్లా ప్రచారం చెయ్యటంలో ఒక్కొక్కప్పుడు సుందరానికి తన సదభిప్రాయం భ్రమ అనికూడా తెలిసేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS