Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 38

    "మరి చెప్పండి...ఇరవై లక్షలిస్తానన్న మీ కోరికను బాబీగాడ్ని బలిచేసేంతటి మూర్ఖున్ని మాత్రం కాదు. శరత్ ని కొంచెం రెచ్చగొట్టయినా అతడి కోర్కెని నిస్సంకోచంగా బయట పెట్టించాలన్న నెపంతో అన్నాడు భార్గవ.

    ఆ మాటకి శరత్ మనసు చివుక్కుమంది.

    "పిల్లల్ని కొనుక్కోవడానికి డబ్బు అక్కర్లేదు భార్గవా! పెళ్ళికాని తల్లులు చెత్తకుప్పల్ని కేరింతల పొత్తిళ్ళుగా మారుస్తున్నారు చూశావా....అలాంటి అజ్ఞానపు అనాధ బిడ్డ కావాలనుకుంటే క్షణాల్లో సుగాత్రి ఒడిలో వుండగలదు.

    ఆస్పత్రులనించి అపహరించబడ్డ ఏ బిడ్డనయినా తెచ్చుకుంటే నా నట్టింట్లో బుడిబుడి అడుగులతో నర్తించకలదు. కానీ మాతృత్వపు తీపి సుగాత్రి చూడాలి" చివరి వాక్యం బలంగా అన్నాడు శరత్.

    భార్గవ భ్రుకుటి ముడిపడింది.

    "అంటే?" అన్నాడు అసంకల్పితంగా.

    క్షణాలు దౌర్భాగ్యంగా చచ్చిపోతూ నిస్సబ్ధపు గంభీర్యాన్ని సంతరించుకుంటున్న ఆ గదిలో భార్గవ ఎదురుగా వున్న టేబుల్ పైన చేతులానించి అతడి కళ్ళలోకి దీనంగా చూస్తూ ఒక్కో అక్షరాన్ని ఒత్తిపలుకుతూ చెప్పాడు శరత్.

    "ఐ వాంట్ యువర్....సెమన్__"

    బరువైన మబ్బుతునకలు బయట ఢీకొని ఉద్భవించిన తటిల్లత విద్యుత్తును మధిస్తూ నేలలోకి సర్రున చొచ్చుకుపోయింది. ఆ వెంటనే గగుర్పాటు పొడిచే పిడుగులాంటి ఉరుము__

    భార్గవ నిశ్చేష్టుడయ్యాడు ఆ మాట విని.

    మూసిన తలుపుల దగ్గర ఆగిపోయిన పాదాలు సన్నగా ప్రకంపించాయి ఆ క్షణాన.

    భార్గవకు జరగబోయే పరిణామం లీలగా అర్ధమవుతోంది.

    శరత్ గదిలో భారంగా తిరుగుతున్నాడు.

    "మిస్టర్ భార్గవా! ఐ వాంట్ యువర్ సెమన్ ఓన్లీ__యస్__ఐవాంట్ యువర్ స్పెర్స్య__

    ఇప్పుడు చెప్పండి భార్గవా! మిమ్మల్ని ఈ కోరిక కోరడానికి నేనెన్ని రాత్రులు మధనపడ్డానో....

    ఇప్పుడు చెప్పండి. ఈ కోరిక ఏ భక్తుడయినా భగవంతున్ని సైతం కోరగలడా?

    ఇప్పుడు చెప్పండి....ఈ కోరిక ఇప్పటివరకూ ఏ మగడూ మరే మగాన్నయినా కోరాడా?

    శరత్ లో ఊపిర్లను కుదిపేస్తున్న ఉద్వేగం...నరాల్లో పోటేత్తుతున్న నెత్తుటిపాతలు, చిరునగవుల కోసం కరడుగట్టిన వేదన కరిగిపోతుంటే చల్లబడుతున్న స్వేదం....

    "ఆప్టరాల్ సెమన్ కోసం....ఇరవై లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?" భార్గవ ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ నసిగాడు. "అయితే మీరు__"

    "అవును. మేం టెస్ట్ ట్యూబ్ బేబీని కనాలనుకుంటున్నాం....ఒక మనిషిలోని ఒక స్పూన్ సెమన్ లో దాదాపు ఇరవై లక్షల పురుష బీజకణాలుంటాయి. ఆ కంటికి కన్పించని ఒక్కో పురుషబీజకణానికి ఒక్కో రూపాయి చొప్పున ఇవ్వాలన్న నా నిర్ణయం నీకు పిచ్చిగా అన్పించవచ్చు. కాకపోతే బిజినెస్ మైండ్ తో సృష్టికార్యంలోని అణుమాత్రపు జీవుల్ని డబ్బుతో కొలుస్తున్నట్టు కన్పించొచ్చు. కానీ___ఇక్కడో రహస్యం దాగాలి. అది నీలోను, నాలోను మాత్రమే దాగిపోవాలి. అందుకని ఇరవై లక్షలు...." ఆగాడు శరత్.

    టేబిల్ మీదున్న నీళ్ళగ్లాసు పైకెత్తి గటగటా త్రాగాడు. భావ ప్రకంపనలతో అతడి మొహం ఎర్రదనంతో జేవురించింది.

    ఎంత డబ్బున్నా ఒక ఇంట్లో కేరింతల శ్లోకాలు వినిపించడం ఆగిపోతే...ఎలాంటి శోకాలు గూడుకట్టుకుంటాయో భార్గవకు అవగతమవుతున్నకొద్దీ మనసు క్షోభపెడుతోంటే....

    "దాచాల్సిన రహస్యమేముంటుంది?" అన్నాడు.

    "మా వంశాంకురాన్ని నిలుపుకోవడానికి మేమిప్పుడు 'టెస్ట్ ట్యూబ్ బేబీ' ని కనాలనుకుంటున్నాం. పరీక్షల్లో లోపం నాదేనని నా వల్లే పిల్లలు కలుగరని డాక్టర్లు చాలాసార్లు చెప్పారు. ఆ విషయం సుగాత్రికీ తెలుసు. అందుకని బయటి వాతావరణంలో పరీక్ష నాళికలన్నీ సుగాత్రి అండాలతో నీ పురుషబీజకణాలు పొదిగించ బడతాయి. అయితే ఆ పురుష బీజకణాలు నీవని బయటి ప్రపంచానికి తెలీకూడదు. అంతేకాదు....ఈ ప్రయోగం సుగాత్రికి కూడా తెలీనంత రహస్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఏ ఆడదయినా కట్టుకున్న భర్త ప్రతిరూపాన్ని కడుపులో చూసుకోవాలను కుంటుందిగాని మరో మగాడి అంకురాన్ని ఆహ్వానించదు.

    జలపాతపు గాంభీర్యతని సంతరించుకొని శరత్ చెప్పుకొంటూ పోతున్నాడు. అప్పటి వరకూ వాళ్ళమాటలు విన్పించి ఆగిపోయిన తలుపు దగ్దరి పాదాలు గిరుక్కున వెనుదిరిగి వడివడిగా సాగిపోయాయి.

    వాళ్ళది గమనించలేదు.

    "ప్రాపంచిక నిందల దృష్ట్యా ఈ బయటి సమాజానికి తెలీకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగం జరుగుతుంది. కేవలం మా వంశ పరువు ప్రతిష్టలను దృష్టిలో వుంచుకొని...." మృత్యువుకు అతిచేరువలో నున్న మా నాన్నగారుకూడా సుగాత్రి పురుడు పోసుకుంటే సంతోషిస్తాడు కారణం సైన్సు ఎంతగా డెవలప్ అయిందో వెనుకటి మనిషికి తెలీదు కాబట్టి.

    ఈ ప్రయోగాల గురించిన వివరాలు డాక్టర్ లక్ష్మితో మాట్లాడాను. సుగాత్రికి తరచూ వచ్చే కడుపునొప్పితో ఎలాంటి అనుమానాలు రాకుండా ఆస్పత్రిలో జాయిన్ చేయబడుతుంది ఆ తర్వాత సుగాత్రికి తెలీకుండానే ఆమె అండాశయంలోంచి అండాలు బయటికి తీయబడతాయి.

    అప్పుడు మీ శుక్రకణాలు ప్రయోగశాలల్లోని పరీక్షనాళికలో అండాలతో కలుస్తాయి. అండం ఫలదీకరణ చెందిన కొన్ని రోజుల తర్వాత కడుపునొప్పి ఆపరేషన్ పేర పొదిగించబడిన అండం సుగాత్రి గర్భాశయంలో ప్రవేశపెడుతుంది డాక్టర్ లక్ష్మి. దేవుడి దయవల్ల ఆమె నిండు చూలాలై ప్రసవిస్తే ఆ ఇల్లు కేరింతలతో విలసిల్లుతుంది..." చెప్పటం ఆపాడు శరత్.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS