Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 38

    "మీరేంటి సార్... అద్దంలో నా మొహం చూస్కుని నేనే కన్ ప్యూజ్ అయిపోయాను... ఏంట్రా నాయనా...అద్దంలో కోతి మొహం కనిపిస్తూంది అని"
    "సర్లె...సర్లె... కోతుల గురించీ కొండముచ్చుల గురించీ తర్వాత మాట్లాడుకుందాం... నువ్వు ఈ కుర్చీలో..."అన్నాడు దంతెశ్వర్రావ్.
    ఆంజనేయులు కుర్చీలో కూర్చున్నాడు.
    "ఊ.. ఇప్పుడు నోరు తెరు..."
    "ఆ..." నోరు తెరిచాడు ఆంజనేయులు.
    "ఏంటీ?... నువ్వు కృష్ణుడూ నేను యశోదా అని అనుకుంటున్నావా?... విశ్వాన్ని మొత్తం చూపిస్తున్నట్టుగా నోరు అంతిదిగా చాపావ్?... పుసుక్ పుసుక్ (నవ్వు)... నోటిని అంతెక్కువగా చాపనక్కర్లేదులే...ఇంతకీ ఏ పన్ను నొప్పెడుతుంది?" నోట్లోకి తొంగిచూస్తూ అడిగాడు దంతెశ్వర్రావ్.
    "కుడిపక్కన... పైవర్సలోని పన్నండీ..."
    వేలు నోట్లో పెట్టి పెదాన్ని కాస్త పైకెత్తి చూసి "హబ్బా...ఎంత లక్కీనో?... పుసుక్... పుసుక్..."అన్నాడు దంతెశ్వర్రావ్.
    "అంటే నా పంటికేం కాలేదా?... బాగానే ఉందా?..."సంతోషంగా అడిగాడు ఆంజనేయులు.
    "లక్కీ నీక్కదయ్యా...నాకు!" సంబరంగా అన్నాడు దంతేశ్వర్రావు.
    "ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగాడు ఆంజనేయులు.
    "ఎందుకేంటీ?... పన్ను నొప్పి అన్నావ్ గా... ఆ పన్నుమీది చిగురు రేక్కాయంత వాచింది... అందుకే నేను లక్కీ..."
    "అంటే ఆ పన్ను పనికిరాదా?"
    "అవును..."
    "అలాగయితే ఆ పన్నును పీకడానికి ఎంత తీస్కుంటారు డాక్టర్ గారూ?"
    "నేను పన్నుని పీకడానికి యాభై తీస్కుంటాగానీ నీ పన్నుని పీకకుండా ట్రీట్ మెంట్ చేస్తా..."
    "ఆ ట్రీట్ మెంటయితే ఎంత తీస్కుంటారు?" అడిగాడు ఆంజనేయులు.
    "మూడొందలు!!..."అది చెప్తూ సంతోషంగా పుసుక్ పుసుక్ అని నవ్వాడు దంతేశ్వర్రావు.
    "హమ్మో...అంతే!!" గుండెలమీద చెయ్యేస్కున్నాడు ఆంజనేయులు.
    "అందుకే కదా మరి లక్కీ అని అంది..." పుసుక్ అన్నాడు దంతశ్వర్రావ్.
    "అయినా అంతెక్కువ ఫీజు ఎందుకు డాక్టర్?"
    "ఎందుకంటే నీ పంటికి రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చెయ్యాలి గనుక!... నువ్వు ఆర్రోజులపాటు రోజూ నా దగ్గరకొచ్చి ట్రీట్ మెంట్ తీస్కోవాలి... రోజుకి యాభై రూపాయలు ఫీజు... కాబట్టి మొత్తం ట్రీట్ మెంట్ మూడొందలు!!... పుసుక్..."
    "హమ్మో!... ఆర్రోజులు రావాలా?... అంతేకాకుండా మూడొందలు క్షవరమా?... అలాగయితే నాకా ట్రీట్ మెంట్ వద్దు... యాభై రూపాయలిస్తా... నా పన్ను పీకెయ్యండి..."అన్నాడు ఆంజనేయులు.
    "హమ్మా!... అంతీజీగా పన్ను పీకించేస్కుని వెళ్లిపోతే నేను లక్కీ ఎట్టాగవుతాను?.... నువ్వు పన్ను పీకించుకోడానికి వీల్లేదు..." కొరకొర చూస్తూ అన్నాడు దంతేశ్వర్రావు.
    'అదేంటి సార్... నా పన్నును నేను పీకించేస్కుంటానంటే వద్దంటారేం?" బిక్క మొహంవేస్తూ అన్నాడు ఆంజనేయులు.
    "పన్ను పీకించేస్కుంటే నీకే నష్టం... నువ్వు కాస్త ఎక్కువగా నవ్వావనుకో... ఆ తొర్రిపన్ను కనిపిస్తుంది... అప్పుడు అందరూ తొర్రిపన్ను అంజనేలూ అని పిలుస్తారు... కొన్నాళ్ళకి నీ ఇంటిపేరు పర్మెనెంటుగా "తొర్రిపన్ను" క్రింది మారిపోతుంది. అంతేకాదు... అలా పన్ను పీకడంవల్ల సందు ఏర్పడుతుంది కదా... దానివల్ల పక్కపళ్ళు బలహీనమై అవికూడా కదిలి ఊడిపోయే ప్రమాదం ఏర్పడ్తుంది... అప్పుడు అందరూ తాతోయ్ అంజనేలూ అని పిలుస్తారు..."కొంటెగా చూస్తూ అన్నాడు దంతేశ్వర్రావు.
    "అంతేనంటారా?..." బిక్కమొహం వేస్తూ అన్నాడు ఆంజనేయులు.
    "అంతే... ముమ్మాటికీ అంతే.పళ్లు ఊడిపోతే నీమాటకూడా తొస్సిబోతుంది... పుసుక్..."
    "మరి మీ మాట తొస్సిపోలేదుకదా?.... లా పాయింట్ లాగి విజయగర్వంతో చూసాడు ఆంజనేయులు.
    "మొదట్లో నా మాట చాల తొప్పిపోయేది... కానీ రెండు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు చక్కబడింది...ఇప్పటికే నా నవ్వు తొస్సి పోతుంది. చూడు"అంటూ పుసుక్ పుసుక్ మని నవ్వాడు. అంజనేయులకి ఇంక తలవంచక తప్పలేదు.
    పంటినొప్పి,వాపు తగ్గడానికి డాక్టరు రాసిన ముందులువాడి, ఆర్రోజులు రోజూ వెళ్లి రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ తీస్కుని డాక్టర్ కి మూడొందలు సమర్పించుకున్నాడు.
    "రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకున్న పన్ను చాల డెలికేట్ అయిపోతుంది. దానికి గోల్డు క్యాప్ తొడగాలి... లేకపోతే పన్ను విరిగిపోతుంది... గోల్డు క్యాప్ కి రెండొందలు అవుతుంది..." సంబరంగా అన్నాడు డాక్టర్ దంతేశ్వర్రావు.
    అలాగే రెండొందలు పోసి పంటికి గోల్డు క్యాప్ తొడించుకున్నాడు.ఆంజనేయులు. ఒక నెలరోజుల తర్వాత ఆజంనేయులు మూతి మళ్లీ వాచింది. అతను దంతెశ్వర్రావ్ దగ్గరికి పరుగుతీసాడు. ఆంజనేయుల్ని పరీక్షించి "కొంప మునిగిందయ్యా బాబూ...అప్పుడు నీకు ఒక పంటికి చెయ్యల్సింది పోయి ఇంకో పంటికి ట్రీట్ మెంటిచ్చాను"అన్నాడు దంతేశ్వర్రావ్ పుసుక్ మని నవ్వుతూ.
    ఆంజనేయులు గోల్డుపన్ను కనిపించేలా నోరు తెరిచి "బేర్ ర్..."అన్నాడు
                                                    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS