సరస్వతి మొహం దీపావళి మతాబులా వెలిగిపోతూంది.
"ఏదమ్మా మళ్ళీ అను. మరొక్కసారి అను" ఉద్వేగంతో అంది సరస్వతి.
"బోర్నవిటా కలిపిస్తా" ఆమెవంక ఆందోళనగా చూస్తూ అంది మహాలక్ష్మమ్మ.
సరస్వతి పకపకా నవ్వింది.
"అది కాదమ్మా. అక్కాఅనో, నక్కాఅనో అన్నావే దానిగురించి నేను అడుగుతుంట?"
"ఏదమ్మా మళ్ళీ అను!" మహాలక్ష్మమ్మ మొహంలో ,మొహంపెట్టి అంది.
"అక్కా" పాలిపోయిన మోహంతో అంది మహాలక్ష్మమ్మ.
"ఏది మళ్ళీ అను. మళ్ళీ అనాలి! అనమ్మా. ఇంకోసారి అను!! అను. అక్కా అని అను" మహాలక్ష్మమ్మ భుజాలు పట్టి ఒకటే ఇదిగా ఊపేస్తూ అంది సరస్వతి.
ఆ దెబ్బకి మహాలక్ష్మమ్మ ఠారెత్తిపోయింది.
"ప్లీజ్ వదలండీ - వదలండ - మీరు ఇట్టా కుదిపేస్తుంటే నా కీళ్ళన్నీ లూజ్ అయిపోతున్నాయ్... మీరు వదలకపోతే నేను అరుస్తానంతే..." భయపడ్తూ, కీచుకీచున అరుస్తూ అంది మహాలక్ష్మమ్మ.
సరస్వతి మహాలక్ష్మమ్మ భుజాలు వదిలిపెట్టి మహాలక్ష్మమ్మ వంక అయోమయంగా చూసింది.
"నేను అక్కా అని పిలవడం మీక ఇష్టం లేకపోతే ఆ విషయం మామూలుగా చెప్పొచ్చుగా... నా కీళ్ళన్నీ ఊడగొట్టాలా?-" జబ్బులు పిసుక్కుంటూ అంది మహాలక్ష్మమ్మ.
సరస్వతి దెబ్బతిన్నట్టు చూసింది
"హెంత మాటన్నావమ్మా?- నువ్వు అక్కా అని పిలుస్తే నాకు ఇష్టం ఉండదా?...
నువ్వు అక్కా అని పిలుస్తుంటే తట్టుకోలేని ఆనందంతో అట్టా చేశావమ్మా..... అట్టా చేశాను.. అంతే! చిన్నప్పటినుండి నాకు ఎవరూ చెల్లెళ్ళులేరమ్మా... అందుకే నువ్వు నీ మధురమైన గొంతుతో అక్కాఅని పిలవగానే గుండెల్లో గంతులేసే ఆనందాన్ని పట్టుకోలేకా-"
దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాటరాక ఆగిపోయింది సరస్వతి. ఆమె కళ్ళనుండి అరడజను కన్నీటి చుక్కలు బొటబొటా రాలాయ్.
"అక్కా..." ఆమె మాటలకూ కరిగిపోతూ ఆర్ర్ధంగా అంది మహాలక్ష్మమ్మ.
"చెల్లీ..."
మహాలక్ష్మమ్మని లటుక్కున కౌగిలించుకుంది సరస్వతి.
"హక్కా..." సరస్వతి కౌగిలిలో కరిగిపోతూ మూలిగింది మహాలక్ష్మమ్మ. నాక్కూడా ఇప్పటిదాకా అక్కా అని పిల్చుకోడానికి ఎవరూ లేరక్కా... ఎందుకో నిన్ను చూడగానే ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడేమో అనిపించింది."
"చెల్లీ...." ఆనందంతో కౌగిలి బిగించుకుంది సరస్వతి. ఆ దెబ్బకి ఊపిరాడక గిలగిల్లాడి అంది మహాలక్ష్మమ్మ.
"ఇంక చాల్లే అక్కా... నన్ను వదిలిపెట్టు. మనల్ని ఇట్టా ఎవరయినా చూస్తే బాగుండదు..." సణిగింది.
సరస్వతి మహాలక్ష్మమ్మని వదిలిపెట్టింది.
"నువ్వు ఆ రాయుడుగారికి ఏమవుతావమ్మా?" అడిగింది.
"ఆయన మా వారే అక్కా" సిగ్గుపడ్తూ చెప్పింది మహాలక్ష్మమ్మ.
"నేను అనుకుంటూనే ఉన్నా చెల్లీ. నువ్వు ఆయన భార్యవేనని! ఆహా! నీ మొహంలో మహాలక్ష్మి కళ తాండవిస్తుంది చెల్లీ."
"నా పేరే అది అక్కా - మహాలక్ష్మి! - ఇంతకీ ఆయనతో పనేమిటక్కా చిటికెలో చేయించిపెడ్తా - చెప్పక్కా."
"మా తల్లే - మా తల్లే-" మహాలక్ష్మమ్మ బుగ్గలు చిదిమి తను వచ్చినపని చెప్పింది సరస్వతి.
"హోస్ - ఇంతేనా?.... మీ అమ్మాయికే భయం లేదక్కా -నీ కొడుకు నాకు మాత్రం కొడుకు కాడా? - ఉరిశిక్ష పడినా ఆయన తప్పించేస్తార్లే అక్కా - ఉండు నీకు క్షణంలో కాఫీ కాచి తెస్తా-" అంటూ లోపలికి వెళ్ళింది మహాలక్ష్మమ్మ.
సరిగ్గా అదేసమయంలో "ఏమేవ్" అని పిలుస్తూ గదిలోకి రాయుడు ప్రవేశించాడు.
సరస్వతి చటుక్కున లేచి నిలబడింది.
"నమస్కారం అండీ"
రాయుడికి నమస్కారం చేస్తూ ఆయనవంక చూసిన సరస్వతి అదిరిపడింది.
రాయుడుకూడా సరస్వతిని చూసి ఖంగుతిన్నాడు. కానీ అంతలోనే తమాయించుకుని ఓ వంకరనవ్వు నవ్వి "ఓ...నువ్వా? -ఏం - ముదురుపిట్ట ఇలా వచ్చింది?"అన్నాడు.
"ఛీ - నీచుడా? - దుర్మార్గుడా - నిన్ను ఏంచేసినా పాపంలేదురా" ఆవేశంతో ఊగిపోతూ అరిచింది సరస్వతి.
ఆ సమయంలో మహాలక్ష్మమ్మ చేతిలో కాఫీకప్పుతో గదిలోకి వచ్చింది.
"అక్కయ్యా - ఏంటీ ఆవేశం? ఆయన ఎవరనుకున్నావ్?" కప్పును టీపాయ్ మీద పెడ్తూ అడిగింది మహాలక్ష్మమ్మ.
"వీడు ఎవరో నీకు తెలియకపోయినా నాకు తెల్సు చెల్లీ - వీడు నీచుడు - దుర్మార్గుడు" మళ్ళీ ఆవేశంతో అరిచింది సరస్వతి.
"నువ్వు ఎవరిని ఎవరనుకుంటున్నావో? - ఆయన దేవుడు-" అంది మహాలక్ష్మమ్మ.
"కాదు - కాదు - కాదు"
గట్టిగా అరిచింది సరస్వతి "వీడు దేవుడుకాదు - రాక్షసుడు! -ఆడపిల్లల శీలాన్ని దోచుకునే పరమ కిరాతకుడు - ఇలాంటివాడు పురుగులు పడి ఛస్తాడు"
"ఛెళ్-"
సరస్వతి చెంపని పేలగొట్టింది మహాలక్ష్మమ్మ.
"ఆయన్ని - నా పతిని - నా దైవాన్ని ఇంకొక్క మాట అన్నావంటే నీ ప్రాణాలు తీస్తా" కళ్ళవెంట నిప్పులు కురిపిస్తూ అంది మహాలక్ష్మమ్మ.
సరస్వతి మొహం పాలిపోయింది.
"రాయుడంటే ఈయనా? - ఇతను నీ భర్తా?- " తనలో తను అనుకుంటున్నట్టుగా అంది సరస్వతి.
* * *
రాయుడి ఇంటినుండి వెనక్కి వచ్చిన సరస్వతి ఇంట్లో మంచంమీద బోర్లాపడి వెక్కి వెక్కి ఏడ్చింది.
"అత్తయ్యా - ఏమైంది అత్తయ్యా-" కంగారుగా అడిగింది రాధ.
"నా గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి తల్లీ-"
"అసలేం జరిగింది అత్తయ్యా?"
"నా మనసులో లావా ప్రవహిస్తుందమ్మా-"
"అదిసరే - అసలేం జరిగిందో చెప్పత్తయ్యా - ఆ రాయుడేం అన్నాడత్తయ్యా?" ఆతృతగా అడిగింది రాధ.
"ఆ రాయుడివల్ల మనపని కాదు రాధా - మనిపని కాదు... భోర్ ర్-"
"ఎందుకత్తయా - ఆ రాయుడు సహాయం చెయ్యనన్నాడా?"
"ఇంకేం వివరాలూ నన్ను అడక్కమ్మా - నన్ను అడక్కు! ఆ రాయుడు మన పనిచెయ్యడు - ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను - -ఘొల్లు"
సరస్వతిని కావలించుకుని రాధకూడా ఘొల్లుమని ఏడ్చింది.
"ఢాం-"
ఉన్నట్టుండి పెద్ద శబ్దం అయ్యింది.
ఆ శబ్దానికి ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరికొకరు దూరంగా జరిగారు.
"ఏంటమ్మా ఆ శబ్దం? - ఏదైనా లారీ టైరుగానీ పంక్చరయ్యిందా?-" గుండెలమీద చేతులూ వుంచుకుని అడిగింది సరస్వతి.
"ఇందాక మీ మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయని అన్నారే - దాని తాలూకుది కాదా అత్తయ్యా ఆ శబ్దం?-" అడిగింది రాధ.
"కాదమ్మా-" అయోమయంగా అంది సరస్వతి.
"ఆ- నాకు అర్ధం అయింది అత్తయ్యా - ఈవేళ దీపావళి కదా - ఎవరో బాంబు కాల్చివుంటారు. అదే ఆ శబ్దం"
"ఏంటీ?... ఈవేళ దీపావళా-? ఆ సంగతే మనకి గుర్తులేదు చూశావా?"
అమెమాట పూర్తికాగానే బయటనుండి ఢమఢమా - ఫటఫటా శబ్దం వచ్చింది టపాకాయలు కాలుస్తున్నట్టుగా.
ఇద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చారు.
వీధిలో అంతా చాలా కోలాహలంగా వుంది.
అన్ని ఇళ్ళముందూ వర్సగా దీపాలు వెలుగుతున్నాయి.
గూడెంలోని చిన్నాపెద్దా పిల్లాపీచూ అంతా ఆనందంగా టపాకాయలు కాల్చుకుంటున్నారు.
ఇంతలో ఏమైందో ఏమో... హఠాత్తుగా రాధ ఒక్కసారిగా ఘొల్లున ఏడ్చి ఆ తర్వాత పాటందుకుంది.
"కొందరి బతుకున దీపావళి
కొందరి బతుకున శాపావళి
ఇంటింటా దీపాలు
మాకేమో పాపాలు
ఆ...ఓ..."
