Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 39

 

                                                     17
    ఇంతకే అతనెవరో తెల్సుకున్నారా' ఆదుర్దాగా అడిగేడు మురళి.
    'లేదు. అడిగితె చెప్తాడేమో తెలియదు. అయినా, మళ్లీ ఏం ప్రమాదం వస్తుందో నన్న భయంతో అతన్నే మీ అడగడం లేదు సరి కదా, అక్కడేవరమన్నా వుంటే ఆలోచన్లు సాగిస్తాడేమోనని తప్పించుకు తిరగడమే గాక , అతన్ని కొంచెం మగతగా కూడా వుంచుతున్నాం.'
    'అయినా ఇన్ని యాతన్లూ పడి ఇంతింత ఖర్చుల్చేసి అతన్ని దినదిన గండంగా కాపాడుకు రావడం లో అర్ధం?' రామం అడిగాడు.
    'ఒక మనిషిని ఎంతెంత ప్రమాదాల్నుండి కాపాడగలమో, ప్రమాదవస్థలో వున్న ఒక ప్రాణాన్ని మనుష్య ప్రయాత్నాల్తో ఎంతకాలం నిలబెట్ట గలమో ఎంతకాలం నిలబెట్టడానికి అసలు వీలౌతుందో-- అన్న ఊహాతీతమైన కొన్ని సమస్యల్ని ప్రత్యక్ష పరిశోధన్ల తో నిశ్చయ పరచడం. ఇటువంటి పరిశోధన్లు జరపగల్గెందుకు అది చాలదూ?'  అన్నాడు రఘు.
    'లేకపోయినా ఇదొక లక్కీ చాన్స్ ని కూడా చెప్పొచ్చు. లేకపోతె ఇలా ఇంత ఎముకలు పాడై చర్మం చీరిక లై కూడా వో ప్రాణం ఇలా రెండు పుష్కరాల పాటు ఈడ్చు కోస్తుందీ-- అంటే-- ఇది మన రఘు వంటి వారి అపార పరిశోధనాభిలాష కోసరం వారి శ్రద్ధ కి మెచ్చి ఆ దైవం ప్రసాదించిన వో సదవకాశం అనే నిశ్చయించాలి....' అన్నాడు గొప్పగా మొహం పెట్టి రఘు వీప్పీద తడుతూ మురళి.
    'నిజం. లేకపోతె ఎక్కడో అమెరికా లో వున్న ఈ కేసుకు, అనుకోకుండా ఆ దొర సహకారం తో మన రఘు కవకాశం కల్గిందంటే -- నిజంగా మనదేశం లోనే అయితే అంతంత వ్యయంతో కూడిన పరిశోధన్లకి అవకాశం చిక్కుండేదికాదేమో కదూ' అంది నళిని.
    ఇలా చాలాసేపు ఆ అపూర్వ వ్యక్తిని గురించే వ్యాఖ్యానాల్చేసుకుని....ఒక్కొక్కరే వెళ్ళిపోయారు మళ్లీ.
    రఘు వున్నా ఆ వారం రోజులూ, సుధ కీ మిగతా వారికీ కూడా ఏడు రోజులూ ఏడు ఘంటల్లా సుఖంగా సరదాగా గడిచిపోయాయి. ఈసారి రఘు వెళ్ళేటప్పుడు సుధని వదిలి వెళ్లడానికి చాలా బాధపడ్డాడు.
    'ఏవిటి బావా, ఈ పరీక్ష లై పోగానే నేనూ రెక్కలు కట్టుకువొచ్చి నీ పక్కని వాల్ను! ఇంకెంత? లేఖగా ఆరు నెలలే!' అంటూ సుధే రఘుని సమాధాన పెట్టి 'ప్లేన్' ఎక్కించింది.
    'ఏయి చెల్లెమ్మా, ఇన్ని ఆటసామాన్లూ మీ అయన తెచ్చాడు గానీ మా బాబొక్కడూ ఇన్నింట్లతోటీ అడుకోలేడు సుమా' అంటూ మళ్లీ హాస్యాలు ప్రారంభించింది శాంత. అయితే ఈసారి సుధ శాంత మాటలకేమీ అనుకోలేదు సరి కదా, ఈసారి తనక్కల్గిన వికారాన్నీ కాంతుల్నీ చూసి హేళన చేసిన శాంతని పిచ్చిదాన్నిగా లెక్క గట్టలేదు సుధ.
    ఇక శర్మ గారి ఆనందానికి పార్వతమ్మ గారి ఆనందానికీ మేరె లేదు. ప్రతి వారం నళిని వచ్చి సుధ శరీర స్థితిని స్వయంగా పరిశీలించి వెళ్తుండేది. సుధ తనూ డాక్టరే అవడం వల్ల ఆరోగ్య పద్ధతుల్ని శ్రద్దగా పాటిస్తుండడం వల్ల సాధారణంగా గర్బవతులకు కల్గే చిల్లర సుస్తీ లేవీ లేకుండా హాయిగా వుంటూ శ్రద్దగా చడువి పరీక్ష లకి హాజరయింది.
    'అమ్మయ్య ఇక మీ అయన పెట్టిన నిబంధనలన్నింట్లలోనూ జయించినట్టేనా తల్లీ?' అంది ఆ ప్రయాసంతా తనే పడి పోతున్నట్టుగా మొహం పెడుతూ శాంత.
    'ఉండక్కా, ఇంకా పరీక్షా ఫలితాలు తెలియద్దూ.'
    'ఆ, అందులో నీకు డౌటెం వుంటుంది లే గానీ, అన్న మాటని అక్షరాలా నిలబెట్టుకుందుకు మీ ఆయనకి మీ ఆయనే సాటి చెల్లమ్మా. ఇంత ఇన్ని విధాలా నిగ్రహం గల మనిషి నితనినే చూశాం చెప్పొద్దూ' అంటూ శాంత రఘుని మెచ్చుకుంటుంటే సుధ కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి. సుధ అంత చదువు కున్నదయినా పెద్దవాళ్ళు సాంప్రదాయంగా చేస్తుండే గాజులు పెట్టడం, పూల ముడుపూ మొదలైన ముద్దు ముచ్చట్లు వారు జరిపించు కుందుకు కేవిధమైన అభ్యంతరమూ తను చెప్పలేదు.
    'ఇదుగో వచ్చేస్తున్నా, ఇదుగో వచ్చేస్తున్నా' అని రాస్తూనే సుధని ఆరోగ్య విషయాన్ని గురించి హెచ్చరిస్తూ ప్రతివారం రఘు ఉత్తరాల్రాస్తూనే వున్నాడు గాని రానే లేదు.
    ఈలోగా సుధ చక్కని కొడుకుని కనేసింది. పాప పుట్టిన పది హేన్రోజులకి రఘు వచ్చాడు. వస్తున్నా వస్తున్నా అంటూ రాసినప్పుడల్లా రాని రఘు ఏముందు కబురూ లేకుండా అలా అధాత్తు గావొచ్చి దిగడం చూసి అంతా ఆశ్చర్యం లోనూ ఆనందం లోనూ మునిగి తేలిపోయారు.
    కారు దిగడం తోనే తను మాత్రం ముందు గబగబా లోపలి కొచ్చిన రఘు ఎదుట పడ్డ సుధని చూసి ' సుధా ముందు వెళ్లి అత్తయ్య కు కుంకుమ బొట్టు పెట్టు త్వరగా' అని సుధని హెచ్చరిం చేసి, ఆ కొత్తగా వొచ్చిన నడి వయస్కుడ్ని కార్లోంచి దింపడం లో తండ్రికి సాయపడ్డం కోసరం ఒక కుర్చీ తీసుకుని పోర్టికో లోకి పరుగెత్తాడు.
    సుదకి భయఆశ్చర్యాలోక్కమాటే మనసు నలుముకున్నందున ఏం చేస్తున్నదీ తనకే తోచక కాస్సేపలాగే నిలబడి పోయి ఆ తరవాత లోపలికి పరుగెత్తింది విషయాన్ని ఊహించు కుంటూ.
    'ఆమ్మా, నీ నుదుటి తిలకాన్ని దైవం చెరప లేదమ్మా, ఇదంతా ఒక పీడకల ' అంటూ భగవద్గీత పారాయణ చేసుకుంటున్న తన తల్లి నుదుట దేవీ ప్రసాద కుంకాన్ని బొట్టుంచి గబగబా అవిడ్నీ లేవదీసుకుని ముందరి హాల్లోకి పరుగెత్తింది సుధ.
    సుధ చర్య తనకేదో అయోమయం గానే వున్నా చైతన్యం లేనిదన్లా సుధ తీసుకెళ్ళి నట్టూ వెంట వెళ్ళింది జానకి.
    'జానకీ?' కుర్చీలో కూర్చుని తన అక్కగారి గుండెలకి తల అనుకుని చేరపడున్న పళాన్నే చేతులు మాత్రం ముందుకు చాచాడు , నిస్త్రాణ'గా కూర్చునున్న సుధ తండ్రి శ్రీధర్. సగం సగం తలపండు నడి వయసునిని సూచిస్తున్న జానకిలోని మార్పుకి ఆశ్చర్యపోతూ , కొన్ని క్షణాల పాటు అతన్నే చూస్తూ నిలబడ్డ మ జానకి ఆనందం దుఖం కలిసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే తడబడుతున్న పాదాల్తో అతని ముందు మోకరిల్లి, అతని వళ్ళో మొహం దాచుకుంది జానకి.
    'తల్లీ, నిన్ను గురించి నేకన్న కలలు- నా బంగారు తల్లీ' సుధని బలవంతంగా తన ఒళ్లో కూర్చో పెట్టుకుని గుండెలకి హత్తుకుంటూ కన్నీరు కార్చారు ఆ పునర్జేన్మెత్తి తిరిగొచ్చిన సుధ కన్న తండ్రి.
    'బావా? నువ్వూ అక్కయ్యా చేసిన ఈ '
    'బాబూ వచ్చిందగ్గర్నుంచీ నువ్వు ఇదే మాటంటుండడం మాకేమీ బాగుండలేదు.  ఏదో ఒకసారి అన్నావు బాగుంది.' అని మందలించారు శర్మగారు.
    'అలాగనకు బావా , రఘు వాడెంత మహోపకారం నాకు చేసినా చిన్నవాడు వాణ్ణి నే పొగడ కూడదని నోరు మూసుకున్నాను--'
    'ఇలా చూడు తమ్ముడూ, ఇందులో ఎవ్వరం పరాయి వాళ్ళం కాదు నువ్వంతగా ఇదవడానికి.' అంటూ అతని తల నిమిరి అతనిలో వచ్చిన రూపు మార్పుని చూసి మనసులో నొచ్చుకుంటూ కాస్సేపు బాధపడి 'చూడమ్మా జానకీ, కాస్త వాడికి పక్క అదీ సరిగ్గా వేసిరా, కొంచెం విశ్రాంతి గా పడుక్కుంటేనే గాని-- ' అంటూ జానకీని మెల్లగా చేయి పట్టి లేవదీశారు.

                                        
    'ఈవిడ నుదుటి తిలకం దైవం తుదవలేదని.' ఎప్పుడో అనుకున్నాం. అంతే జరిగింది.' అని ఆనందిస్తూ రఘూ , పార్వతమ్మగారూ ఏక కాలాన్న అనుకున్నారు జానకి నుదిటి కుంకుమ తిలకాన్ని పవిత్ర భావంతో చూస్తూ.
    రఘు మేనమామని మెల్లగా లేవతీసి కొంచెం దూరం నడిపించే సరికి అతని కోసరం పక్క పరిచి వచ్చింది జానకి. జాగ్రత్తగా తీసుకెళ్ళి పడుక్కో బెట్టి వెచ్చగా కాస్తే ధన్నా ఇయ్యత్తయ్యా?' అంటూ ఆయన్ని జానకి కప్పగించాడు రఘు.
    'ఇదుగో, నా ప్రతిభంతా చూపి యముడి చేతుల్లోంచి ఎలాగో నీ భర్తని విడిపించుకు వొచ్చాను. ఇటుపైన అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం పూచీ నీదే' అని రఘు జానకి కతన్ని అప్పగిస్తే.
    'నా తండ్రి , ఇన్ని శ్రమలకి వోర్చి, నా మంగల్యాన్ని మళ్లీ నాకు ప్రసాదించాక వెయ్యి జన్మలకి దైవం నాకు మేలు చేస్తాడు.' అని అతన్ని ప్రశంసించి ఆశీర్వదిస్తూ , అయన బాధ్యత ని జానకి తను అందుకుంటూన్నట్టు గానూ అనిపించింది ఆ దృశ్యం చూసిన అక్కడి వాళ్ళందరికీని.
    ఇంతలో 'కువ్వా! కువ్వా?" అంటూ ఆ లేత పాప ఏడ్పు వినడం తో, తెచ్చిన చేతిలోని పాల గ్లాసు దబ్బున తండ్రికిచ్చేసి సుధ లోపలికి పరుగెత్తితే సుధ వెంటే రఘూ పరుగెత్తాడు.
    'ఏరా బాబూ, ఈ నాన్నాతో మాట్లాడకూ? ఇంతసేపటికా నిన్ను చూడ్డానికి రావడం?' అంది పొత్తిళ్ళలో పొదివి పట్టుకున్న పాప గులాబీ బుగ్గల మీద మృదువుగా తన బుగ్గ రాస్తూ శాంత    
    'శాంత మాటలకి చిరునవ్వు నవ్వుతూ పాపని తన చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా  చూడసాగాడు రఘు, ఆనందంతో.
    'ఎవరి పోలిక?' నును సిగ్గుతో అడిగింది సుధ    
    'అంతా తమరే అనుకుంటా' అన్నాడు ఏదో కొత్త ఆనందాన్ని అనుభవిస్తూ రఘు.
    'ఏవిటంత దిష్టి కొట్టేలా చూస్తున్నారు వాణ్ణి, పాపం మరో కొన్ని సంవత్సరాల పాటు మీ పరిశోధన్లు జరిపేందుకు అనువుగా , పుట్టలేదేమో?' అనా మందలించే' ధోరణి తో అడిగేసింది శాంత.
      'ఆ నా మనసులో అనుకున్నదాన్ని ఫోటో తీసినట్టుగా చెప్పారు. గాని అలాంటి అవకాశం కల్గలేదు ఏం చేస్తాం' అన్నాడు తమాషా కి రఘు.
    ఇక తను అక్కడుండడం అంత బుద్ది తక్కువతనం మరొకటుండదని చల్లగా, పిల్లిలా అవతలకి తప్పుకుంది శాంత.
    'నాన్న నడవలేరా, ఇంకానూ.'
    'అబ్బే అలా ఏవీ లేదు. ఈ అధార్తుగా గల్గిన ఆనందాని కి తట్టుకోలేక పోతాడేమో నని నేనే ముందు జాగ్రత్త పడుతూ స్టేషన్నుంచే కారు పంపవలసింది గా నాన్నకి ఫోన్ చేశా. అప్పుడే ఈ సంగతీ చెప్పి అతణ్ణి గాభరా పెట్టి మీరూ గాభరా పడకండి.' అని హెచ్చరిద్దాం అనుకుంటే, ఈ ఊర్లో వున్నదేగా, ఆ టెలిఫోన్ కనక్షన్ కట్ అయి వూర్కుంది. అయినా నాన్న సమయోచితం గానే మసులు కున్నారు గాని అమ్మ మాత్రం గాభరా పడి పోయింది నిజంగా. ఆవిడేకేమన్నా అవుతుందేమోనని భయపడ్డా కూడా నేను. ఇంతకీ అదృష్టమంటే అత్తయ్యది' అన్నాడు, రఘు ఆ తరవాత వారిద్దరూ వారి సొంత విషయాల్ని గురించి చర్చించారు.
    'నా పరీక్ష ప్యాసయినట్టు విని రాసిన ఉత్తరానికి తరవాతా మళ్ళీ నీ వద్ద నుంచీ ఉత్తరమే లేదు.' అంది గునుస్తూ సుధ    'నిజమే సుధా, మావయ్య కి తెలివోచ్చిన కొన్ని రోజుల తరవాత. అతనూ హిందువు అన్నది తెలిసింది. అయినా అతణ్ణి మాట్లాడించ కూడదన్న దృష్టి లో ఊర్కున్నాను. అయితే ఈ విధంగా వుంటుందేమో నన్నది మాత్రం కల్లో కూడా, నేననుకోలేదు సుమా.'
    'అసలెలా తెలిసింది?'
    'ఒకరోజు అతనికి నైట్ టెంపరేచర్ వున్నందున జాగ్రత్తగా చూస్తున్నాం.' రాత్రి నేనతన్ని చూడ్డాని కెళ్ళేసరికి 'జానకీ' నువ్వేమై పోయావ్?' అంటూ పైకే అనుకుంటూ కన్నీరు కారుస్తున్నాడతను. అంటేనే బయల్దేరెందుకు ముందు రోజన్న మాట. సరి, ఇందులో ఏదో వుంది కధ అనుకుని పెద్ద డాక్టరు తో ఈ వివరాల్ని చెప్పాను ఆయనా నా ప్రయాణం త్వరలో వున్నందునా, అతని ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నందునా , అడిగి తెల్సు కుంటేనే మంచిదని అన్నారు. ఆ తరవాత స్థిమితంగా పక్కన కూర్చుని ఆయన్ని మాటల్లో కి దింపాను.
    అయితే ఒక పట్టాన్న అయన ఏదీ చెప్పలేదు. తరవాత మీ ఇద్దరి క్షేమం నాకు మీతో బండుత్వం చెప్పాక నన్నలాగే కౌగలించేసుకుని ఏడ్చేశారు. ఇక ఆయన్ని నాతొ తీసుకు తావడం ఎలాగా అనుకుంటుంటే పాపం ఆ దొర అప్పటికప్పుడు తన పలుకుబడి వల్ల ఆ ఏర్పాట్లన్నీ చేసేసి, నన్నూ, వదల్లేక వదల్లేక వదిలారు. ఇక మావయ్య విషయం లో అయన బాధ సరేసరి.
    ఇరవై అయిదేళ్ళ నుండి శ్రమపడి తయారించుకున్న ఈ బొమ్మకి నిజంగా నాప్రాణంలోనూ, నా శక్తి లోనూ చేరి సగం ధారపోసేశాను. అంత బాంధవ్యం గల ఈ విగ్రహాన్ని వదిలి పెట్టడం అంటేనే నాకెంతో కష్టంగా వుంది. అయినా, అయన భార్యా పిల్లలక్కడ బాధపడుతూన్నా రన్నప్పుడు నా కాదన్లేక పంపుతున్నాను. అదీగాక మీ దేశపు స్త్రీలకూ ఒక భర్త తోడిదే లోకం కూడా గదూ' అని ఆయన కల్లోత్తుకుంటే నాకే ఎంతో కష్టం అనిపించింది సుధా' అన్నాడు ఆ దృశ్యాన్ని మళ్లీ గుర్తుకి తెచ్చుకుంటూ రఘు.
    అంతలో శర్మ గారెందుకో పిలవడం తో రఘు అవతలికి కెళ్ళి పోయాడు.
     సుధ తండ్రి వద్ద కెళ్లి అయన మంచం మీద కూర్చుని ఒళ్ళంతా నిమురుతూ, కాస్సేపు మాట్లాడి వంటింటి వేపుకి వెళ్ళింది.
    'తల్లీ, జానకి, ఈ అదృష్ట మంతా నీ తాళి బలిమెనమ్మా' అంటూ, దేవీ పూజా మందిరం లో వుంచిన రెండు మంగల్యాల్ని తీసి జానకి మెళ్ళో పార్వతమ్మ గారు కట్టడం చూసి ఆనంద పరవశ అయిపొయింది సుధ. కొన్ని మంగల్యాల్నీ, మట్టేల్నీ, ఉత్తర జంధ్యాల్నీ చేయించి ఆ పూజ మందిరం లోని దేవీ పీఠం లో వుంచి, తనని ఆశ్రయించి అడిగే వారందరికీ ఇస్తుండడం మొదట్నుంచే పార్వతమ్మ గారికి అలవాటు. అతి పవిత్రమైన ఈ ఆచారాన్ని ఆవిడ అత్త గారి వద్ద చూసి అలవరచుకున్నారావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS