ఆ సాయింత్రం తమ్ముణ్ణి మరదల్నీ కొడుకుల్నీ కోడళ్ళనీ, అందర్నీ తీసుకుని తాము దంపతులిద్దరూ తమ ప్రత్యక్ష దైవం ఆ లలితాంబ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు ఆవిడ. ఒక వారం రోజులిలా కులాసాగా జరిగిపోయాక తమ ప్రయాణాన్ని గురించి ప్రస్తావించాడు . ఒకరోజు రాత్రి సావకాశంగా అందరూ కూర్చునున్న ప్పుడు రఘు.
'సుధని కూడా తీసుకు వెళ్తావా' పార్వతమ్మ గారడిగారు.
'ఆ దానికి హౌస్ సర్జనింగ్ అక్కడే చేసుకుంటే మంచిదని.'
'బాగానే వుంది గాని మరి బాబుని పెంచడమో.'
'బాగుందత్తయ్యా మీరడగడం , అమ్మా నాన్నా డాక్టర్లయినప్పుడు బాబు పెంపకాని కిక బెంగేవిటి మీకూ' అంది శాంత.
'పోనీ మా దగ్గరోదిలి వెళ్ళండి.' శ్రీధర్ అన్నాడు.
'అబ్బే, వో నర్సు ని పెట్టేస్తాం' సరదాగా చెప్పాడు రఘు.
'అన్నట్టు ఇక ఈ గొడవలన్నీ నువ్వు అనుకున్నావంటే, నాకు విశ్రాంతి' అన్నారు ఆఫీసు గది వేపు చూపిస్తూ శర్మ గారు.
'ఆ మాటెలా వున్నా ప్రస్తుతం ఇద్దరం సంపూర్ణ యాత్రలకు బయల్దేరాలని అనుకుంటున్నాం ఇల్లు మీ కప్పగించి ' అన్నారు పార్వతమ్మ గారు.
'మహారాజు లాగ, దానికేం?' అన్నాడు శ్రీధర్.
'మరి మొన్న చిన్న మరిది కొచ్చిన సమ్మంధం మాటేం చెప్పారూ.'
'మీరంతా వున్నారుగా , మాటలూ, చూపులూ కరిపించండి ఈలోగా వస్తాం' అన్నారు శర్మ గారు.
అనుకున్న ప్రకారం వారి యాత్రలకి కావలసిన ఏర్పాట్లన్నీ జరిపించబడ్డాయి. రఘు కుటుంబ సహితంగా బొంబాయి వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వారి క్కావలసిన వస్తు సామాగ్రులన్నీ కొని సిద్దపరిచారు. వారితో జానకీ, శ్రేదరూ కూడా వెళ్లి, అతన్ని ఏర్పాట్లూ చేసి తిరిగి వచ్చాక శర్మ దంపతులు యాత్రలకి బయల్దేరడం అని స్థిర పరిచారు.
రఘు అక్కడున్న ఆ నెల రోజులూ విందుల్తోటే వినోదాల్తోటే ఎంతో కులాసాగా కాలక్షేపం అయిపొయింది.
ఆరోజు వారి ప్రయాణాన్నుద్దేశించి ఒకటే హడావిడి వుంది ఇల్లంతాను వేణు తను చేసుకోబోయే పిల్లని సుధా,రఘు ముందుగా చూసి అభిప్రాయం చెపితేనే గాని వీల్లేదన్నందున వారు రైల్లో నే హైదరాబాద్ వెళ్లి ఆ పిల్లని చూసేసి అక్కడ్నుంచి బొంబాయి వెళ్ళడం అని ఏర్పటయింది.
రఘూ దంపతుల్ని సాగనంపేందుకు అ వూరంతా తరలి వచ్చారేమో అన్నంత మంది జనం వున్నారు ఆరోజు రైల్వే స్టేషన్ లో.
రఘు సుధా మొదలైన వారంతా వారి కింతటి అదృష్టాన్ని అనుగ్రహించిన ఆ లలితాంబని దర్శించుకుని స్టేషన్కి రావడంతో కొంత ఆలశ్యమయి పోవడం వల్ల బాబు నెత్తుకుని గబగబా వచ్చి రైలెక్కిన జానకి కిటికీ వద్ద సోఫాకి చేరబడున్న తన భర్త చేతికి బాబు నిచ్చి తనూ అయన పక్కన కూర్చుంది.
అసలే అలశ్యమయి పోయినందు వల్ల దబదబా కర స్పర్శలు గావించేసి రైలెక్కి పోయారు మోయ్యలేనన్ని పూలమాలల్ని మోసుకుంటూ రఘూ సుధాను. రయిలు కదిలింది. అందరూ ఆనందంవల్లా, ఎడబాటు వల్లా కల్గిన కన్నీర్నీ తుడుచుకుంటూ టాటా బైబై చెపుతూ రుమాల్లెగ చేస్తున్నారు.
అందరి మధ్యా నిలబడి యంత్రం లా తనూ ఎగరేస్తున్న రాధకి కదిలి వెళ్లి పోతూన్న రైలు పెట్టె వాకిట్లో నిలబడి నవ్వుతూ అందరికీ నమస్కరిస్తున్న రఘునీ, సుధనీ చూసేసరికి ఆరోజు తను బొంబాయి వెళుతూన్నప్పుడు ఇలాగే నిలబడి దీనంగా ఒకవార నిలబడున్న సుధని చూసి ' నీ బతుకిక ఇంతేలే?' అన్నట్టు నిరసనగా చూసిన సంగతి గుర్తుకొచ్చి బాధగా తలొంచుకుంది.
దాంతో పాటు బొంబాయి లో రఘు తనకి లొంగలేదన్న అహంకారం కొద్దీ అతన్ని అవమానపరచాలన్న అసూయతో చంద్ర మౌళి స్నేహాన్ని ఆసరా చేసుకుని తను చేసిన అసంభవపు ప్రయత్నాలూ అందుగ్గాను 'తనకి భగవంతుడే బుద్ది చెప్పినట్టు తటస్థమైన ఆ ఇబ్బందులూ అన్నీ గుర్తు కొచ్చి అవమానం తో కుమిలింది మనసు.
అయితే తను అందలం మీద ఉంచి న్నాడూ అధఃపాతాళం లోకి తోసిన్నాడూ కూడా తన ప్రవర్తనని ఏపాటీ లక్ష్యం చెయ్యకుండా విశాల దృక్పధం తో తన విధాయకాల్ని తను చూసుకుంటూ తన లక్ష్యాన్ని తను కాపాడుకున్నాడు రఘు.
మనుష్య జన్మంటూ ఎత్తాక కార్యదీక్షా మనో నిగ్రహం గుండె నిబ్బరం వీట్లని ఆధారం చేసుకుని ప్రవర్తించిన వారే ప్రపంచం లో ఆదర్శ నీయులవుతారనే నీతికి నిదర్శనం రఘు. గీటు రాయి వంటిది రఘు కార్యదీక్షా . అయితే తనో? అతని పవిత్ర చరిత్రని తల్చుకుందుక్కూడా అర్హత లేదేమో తనకి.
హు. ఎన్నెన్నో హృదయ చాచంల్యాలు కల్గాల్సిన సందర్భాలోనూ ఎంతెంతో మనో నిగ్రహం తో , భీష్మించుక్కూర్చుంటూ , ఎందరెందరో గొప్ప గొప్ప విద్యావంతులూ, మంచి మంచి అందగత్తెలూ, తనని వలచి చుట్టూ తిరుగుతున్నా వారందర్నీ తృణీకరీం చేస్తూ నిశ్చలంగా కాలక్షేపం చేసు కోస్తుండే ఈ రఘుని చూసినప్పుడల్లా.
'ఇంత రసికత్వం ఎరగని మనిషేమిటా అతడూ, అని చిరాకు పడేతను.
అయితే ఈ అవిటి పిల్లని అందరి కంటే రూప వంతురాల్ని గానూ, విద్యా వంతురాల్ని కానూ, తయారించుకుని , ఈవిడ్నే పెళ్లి చేసుకుని ఇటువంటి దైవీకమైన స్వతంత్రమైన తృప్తి కరమైన ఇటువంటి ఆనందాన్ని ఆవిడతో పాలు పంచుకోవాలన్న ఇదా? ఇతని యొక్క ఏకైక లక్ష్యం?....' అని అనుకుని పరామానందం పొందుతూ వారి ఆనందాన్నలాగే తన హృదయం లో చిత్రించుకుంటూ తనని మరిచి, స్థలాన్ని మరిచి స్వరాన్నీ మరిచి నిలబడ్డచోటనే అలాగే నిలబడి వుండి పోయింది రాధ...
(అయిపొయింది.)
