Previous Page Next Page 
ఎండమావులు పేజి 38


    వంటావిడ లడ్డూలు పట్టుకొచ్చింది మారు వడ్డించటానికి. అంతా వద్దంటున్నారు. తినలేమని చేతులు అడ్డం పెడుతున్నారు.
    "జ్యోతీ నీ పుట్టినరోజుకదా మీ బావగారికి ఒక్క లడ్డూ చెప్పి వేయించకూడదా" అన్నది స్వాతి నవ్వుతూ.
    ఈ మాటకు తాసిల్దారుగారు కూడా నవ్వి "నిజమేనండీ వెయ్యవలసిందే" అంటూ వంటావిడ  వైపు చూశారు. మురహరి వద్దంటున్నా ఆవిడ విస్తట్లో ఒక లడ్డూ వేసింది. మురహరి చెయ్యి అడ్డం పెట్టటంనుంచి ఆ లడ్డు చేతికి తగిలి దొర్లుకుంటూ వెళ్ళి జయలక్ష్మి విస్తట్లోకి వెళ్ళింది. వంటావిడ ఖిన్నురాలైంది. అందరి మనస్సు బాధతో నిండిపోయింది. జ్యోతి మనస్సులో చెప్పలేని ఆవేదన చెలరేగింది. తనవల్ల కదా ఇటువంటి అవాంఛనీయ మన సంఘటన జరిగిందని నొచ్చుకుంది స్వాతి. జ్యోతి సరదా పటాపంచలై పోయింది. తాసిల్దారుగారు మాట్లాడలేక పోయారు. వంటావిడ తప్పేమీ లేనందువల్ల ఆవిడనేమీ అనలేక పోయింది జ్యోతి తల్లి, లేకపోతే విరుచుకు పడేది.
    అందరి మనస్సులూ అట్లా ఉన్నా మురహరి, జయ లక్ష్మిల మనస్సులు ఉప్పొంగి నయ్యి, హృదయాలు పరస్పరం మాట్లాడుకున్నయ్యి. ఆ మాటలు ఎవరికీ అర్ధం కాలేదు. "చూడమ్మా ఆ విస్తరి అట్లా వదిలెయ్యి. వేరే విస్తరి వేస్తాను" అన్నది వంటావిడ. కళ్ళు తుడ్చుకుంటూ. మర్యాదకోసం మురహరికూడా అదేమాట అన్నాడు. జ్యోతి తల్లికూడా అట్లాగే అన్నది. ఆ లడ్డూనే తినాలని జయలక్ష్మికి అనిపించినా అది ఆ సమయంలో తీరని కోరిక. ఆ లడ్డూ తీసి పక్కన బెట్టింది.
    "పొరబాట్లనేవి జరక్కుండా ఉండవు. ఎవ్వరూ కావాలని ఇట్లా చెయ్యరు కదా. మరేం ఫరవాలేదు. ఎంగిలి కాలేదు. ఈ మాత్రం విషయానికి మీరంతగా బాధ పడనక్కర్లేదు. ఈ విస్తట్లోనే తింటాను" అన్నది జయలక్ష్మి. ఆమె సహృదయతకు అంతా సంతోషించారు. అందరికీ బరువు తీరినట్లు అయింది. వారిరువురి హృదయాలు దోబూచు లాడినయ్యి. బావకు ఇంకా దూరమౌతున్నట్లుగా భావించింది జ్యోతి. నీరు వల్ల మెరుగు, నిజము దేవుడెరుగు అనుకుంది స్వాతి తన మనస్సులో.
    ఈ వాతావరణంలో భోజనాలు పూర్తయినయ్యి. తాసిల్దారుగారు వెళ్ళిపోయారు. మిగిలిన వారంతా ముందు హాల్లో కూర్చున్నారు తాంబూలం వేసుకుంటూ. మురహరి కూడా బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు.
    "ఏం జ్యోతీ ఆ లడ్డూ నీ విస్తట్లోకి దొర్లి వస్తే ఎంతో బావుండేది గదూ" అన్నది స్వాతి.
    జ్యోతి నవ్వుతూ జయలక్ష్మి వైపు చూసింది.
    "ఏం అట్లా అనుకోపోతే వాళ్ళిద్దరూ కాలేజీలో ఒకే వూళ్ళో చదువుకున్నారు గనక ఆ విధంగా జరిగిందనుకో కూడదూ" అన్నది జ్యోతి.
    జయలక్ష్మి గుండెలు దడదడలాడినయ్యి. దెబ్బ తిన్న దానిలా చూసింది జ్యోతి వైపు.
    "అవేం మాటలు జ్యోతీ చదువుకూ ఈ సంఘటనకూ ఏమయినా సంబంధం ఉందా?" అన్నది జయలక్ష్మి.
    "కోపమొచ్చిందా జయా, ఎగతాళికి అన్నాను" అన్నది జ్యోతి.
    వీళ్లిట్లా మాట్లాడుకుంటున్న సమయంలోనే వంట ఇంట్లో జ్యోతి తల్లితో వంటావిడ మెల్లిగా సంభాషణ కు దిగింది.
    "అమ్మగారూ"
    "ఏం వెంకాయమ్మగారూ ఏమన్నా వంట సామాను కావాలా ఇంకా"
    "కాదుగాని నాకొక్క అనుమానం తట్టింది"
    "ఏమిటండీ ఆ అనుమానం"    
    "ఆ లడ్డూ జయలక్ష్మమ్మ విస్తట్లోకి వెళ్ళింది గద. మీరెవ్వరూ చూడని సమయంలో వెంటనే వారిద్దరి వైపు చూశాను. మీరెవ్వరూ చూడకుండా మెల్లిగా నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ. దాని అంత రార్ధం అర్ధమైందా" రెట్టించి అడిగింది వంటావిడ.
    జ్యోతి తల్లి నిర్ఘాంతపోయింది.
    "అయితే......................"
    "అయితే లేదు కాకపోతే లేదు. ఆ అమ్మాయి, మీ మేనల్లుడూ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళే నన్నారుగా, ఇంకేం, పాత కాపులే." అన్నదావిడ అంతా తెలిసినట్టుగా ముఖ కవళికలు, మారుస్తూ.
    జ్యోతి తల్లి ఆలోచనలో పడింది. ఆవిడ ఆలోచనకు ఈ కబుర్లు ఒక రకంగా తెలీని సంతోషాన్నే కలిగించినయ్యి. ఇంక మేనల్లుడి మీద ఈ వాతావరణాన్ని ప్రయోగించి ఆ సంబంధం కాకుండా భర్త మనస్సు మార్చాలని ఆవిడ అంచనా. ఆవిడ ఉద్దేశ్యం లో మురహరి జయలక్ష్మిని చేసుకున్నా, మరొకర్ని చేసుకున్నా ఇష్టమే, తనకు అల్లుడు కాకుండా ఉంటే చాలు.
    "అర్ధం చేసుకున్నాను వెంకాయమ్మగారూ పోనీండి వాల్లెట్లా తగలబడితే నాకేం. నాపిల్లనేం అతనికివ్వబోవటం లేదు" అన్నదావిడ.
    వంటావిడ నిర్ఘాంతపోయింది. ఆవిడ అంచనాకు ఈ మాటలు వ్యతిరేకంగా ఉన్నయ్యి. జ్యోతిని అతని కివ్వటానికి ఆవిడకు ఇష్టం లేదని ఇప్పుడే తెల్సు కుందావిడ. ఇదో కొత్త పంధాగానే ఉందావిడ మనసుకు ఇక ఈ విషయంలో తన మాటలు చెల్లవు. అయినా నాకెందుకని ఆవిడాఊరుకుంది.
    నవ్వుతూ వాళ్ళంతా కూర్చున్న చోటికి వెళ్ళింది జ్యోతి తల్లి. అప్పటికి వాళ్ళు ముగ్గురూ అక్కడే ఉన్నారు.
    "ఏమర్రా తాంబూలాలు వేసుకున్నారా. ఏమిటి కబుర్లు వంటావిడ ఏమిటో చెప్పుతుంటేను అటు వెళ్ళొచ్చాను. ఏమ్మా జయలక్ష్మీ అంతా కలిసి నిన్ను కష్టపెట్టాం. మా మనసును కష్టపెట్టాలోస్తుందని నువ్వూ సరిపెట్టుకున్నావు. అయినా హాస్టళ్ళలో, కాలేజీల్లో చదువుకునే వాళ్ళకు ఇదొక పెద్ద లెక్కలోనిది కాదు. ఇంకన్నా ఎక్కువైన విషయాల్లోనే వాళ్ళు సరిపెట్టుకు పోతారు." అన్నది.
    జయలక్ష్మి మనస్సు చిన్నబుచ్చుకుంది. స్వాతికి ఈ మాటలు కష్టంగా తోచినయ్యి. ఏదో ఉపద్రవం అమ్మ తెచ్చి పెడుతున్నది, అనుకుంది జ్యోతి.
    "మా మురహరి నీకు బాగా తెల్సునా జయలక్ష్మీ నువ్వూ అదే క్లాసు కామాలు" అన్నది ఆవిడ మళ్ళీ.
    జయలక్ష్మి మనస్సు కృంగిపోతున్నది. ఇదేదో చిలికి చిలికి గాలివానలా తయారవుతుందేమో ననుకుంది జ్యోతి.
    "తెలుసునండీ మూడేళ్ళుగా ఒకే కాలేజీ, యూనివర్శిటీ కాలేజీలోనే చదువుతున్నాం" అన్నది జయలక్ష్మి ధైర్యంగానే.
    "అట్లా చెప్పమ్మా. అందుకనే మేమంతా గుబ్బసలాడి చచ్చినా నువ్వు మాత్రం కుక్కిన పేనులా ఉండి పోయావు. ఆ లడ్డూ అనేక తెలియని విషయాల్ని తెలియ జేసిందన్న మాటలు. ఏమంటారు స్వాతీ."
    ఈ సంభాషణ స్వాతికి నచ్చలేదు. ఆవిడ మనస్తత్వం ఎటువంటిదో స్వాతికి అనుభవమే. ఈ విందు భోజనం ఎందుకొచ్చిందోనని స్వాతి కూడా ఆదుర్దా పడసాగింది.
    "ఏదో అయిందేదో అయిపోయింది. ఇక తర్కించి లాభం లేదు. వెళదామా జయా" అన్నది స్వాతి.
    జయలక్ష్మి తలవూపింది.
    "వెళ్ళొస్తామని" జ్యోతి తోను, తల్లితోనూ చెప్పి వచ్చేశారు. వాళ్ళు వెళుతుంటే ఏమీ మాట్లాడలేక పోయింది జ్యోతి. మనస్సు కెలికినట్లయింది. తన పుట్టిం రోజు పండగ ఇన్ని సంఘటనలకు దారి తీసినందుకు ఆమె మనసు పరిపరి విధాలుగా పోయింది. దిగాలుపడి కూర్చున్న జ్యోతిని చూసి తల్లి అన్నది.
    "బావ బావంటూ మీ తండ్రీ కూతుళ్ళు మురిసి పోవటమే తప్ప అతనికి నీమీద ఇష్టత లేనట్లే తేలిపోయింది ఇవాళతో. మూడేళ్ళనుంచి పరిచయ మున్న వాళ్ళు ఎంత దూరం వెళ్లుంటారో నీకేం తెల్సు. మనందరి ముందూ మాత్రం నంగనాచుల్లా ఉంటున్నారు. ఎంత కాలమని అందరి కళ్ళూ కప్పుతారు. ఇంకనయినా ఆ మురహరిని తలవకు. ఈ సంగతి మీ నాన్నగారిక్కూడా చెప్పేస్తాను. ఇంకా నయం ఇప్పటికయినా కళ్ళు తెరిచాం. ఇష్టంలేని వాడికిచ్చి నీ గొంతుకొయ్యకుండా" అన్నది తన మనసులోని ఈర్ష్యనూ, అయిష్టతనూ వెళ్ళగక్కుతూ.
    జ్యోతి తల గిరగిర తిరిగిపోతున్నది.
    "అమ్మా, నీకు పుణ్యముంటుంది నువ్వీ రకంగా బయటపడుతుంటే ఇంక పరాయి వాళ్ళు అదుగో పులి అంటే, ఇదుగో తోక అంటారు. యదార్ధ విషయాలు తెల్సుకోకుండా మనమే అల్లరి చేసుకోవటం మంచిది కాదు" అన్నది జ్యోతి తల్లిని అర్ధిస్తూ.
    ఆమె మూతి విరిచి వెళ్ళింది.

                                *    *    *  

    జ్యోతి ఆలోచనలో పడ్డది. తల్లి మనోకాంక్షకు ఈ సంఘటన అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది. ఈ సంఘటనని సంపూర్తిగా వినియోగించుకుని ఆమె భర్తతో చెప్పి ఇంక మేనల్లుడి విషయంలో  అభిప్రాయం మార్చుకోమని చెపుతుంది. జ్యోతి ఆలోచన ఇంకా ముందుకు పోయింది. ఇద్దరూ మూడేళ్ళనుంచీ కలిసి చదువుకోటం చేత తప్పక బావ జయలక్ష్మిని ప్రేమించే ఉంటాడు. అందుకనే ఇన్ని నెల్లనుంచీ కూడా తనంటే ముభావకంగానే ఉంటూ వచ్చాడు. అందుకనే మురహరిని చూడా లనే వంకతోనే జయలక్ష్మి పదేపదే వస్తున్న దేమో, ఈ రాక అతనికోసమే కాని తనతో స్నేహం కోసం కాదు.
    ఎవరూ ఊహించనటువంటి ఈ సందర్భాలన్నీ తన మనస్సులో చిలవలు పలవలుగా ఊహించుకుంది జ్యోతి. జయలక్ష్మి మీద ఆమెహృదయంలో క్రోధం పొడచూపింది. అసలీ జయలక్ష్మి ఎవరు. ఆమె పుట్టు పూర్వోత్తరాలేమిటి? మానవుని జీవితంలో తనకు అత్యంత ప్రేమగల వస్తువు ప్రాప్తించటంలో ఏదైనా ప్రతిష్టంభన వస్తే సందేహాలకు అంతు ఉండదు. అనే జీవిత గమ్యాన్ని మార్చి వేసే సంఘటననలయితే ఇంక ఆ వ్యక్తి పడే ఆత్మ క్షోభకు అంతు ఉండదు.
    మళ్ళా మళ్ళా ఆలోచించింది జ్యోతి. సంగతి సందర్భాలు తెలుసుకోకుండా తల్లి మాదిరే తనుకూడా అనుమానాల ఆధారంతోనే మనస్సుని కలుషితం చేసుకుంటే ప్రతి చిన్న సంఘటనా కాలుష్యంగానే కళ్ళకు కనిపిస్తుందనుకుంది. ఆ లడ్డూనే తన విస్తట్లోకి దొర్లిస్తే బావ తనను నిజంగా ప్రేమిస్తున్నట్లేనా? స్వాతి విస్తట్లోకి దొర్లితే ఆమెను వాంఛిస్తున్నట్లేనా? లడ్డూ దొర్లినంత మాత్రంచేత మానవ హృదయాలూ, మనస్తత్వాలూ తెలిస్తే ఇంక జీవితంలో తెల్సికోలేని సంఘటన అంటూ ఏదీ ఉండదు. ఒక సంఘటనకు అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలు, అనేక వ్యాఖ్యానాలు.
    తనలో తను నవ్వుకుంది. నిరాశ ఎక్కువైన పుడు, మానవుడు వంటరిగా ఆలోచిస్తూ ఉన్నపుడు పేలవంగా నవ్వుకుంటాడు. ఆ నవ్వు మబ్బుల మీద మెరపుల్లా కనిపించినా అందులో విషాద, విచారాలే పొడచూపుతయ్యిగాని సంతోషాతిశయాలు కాదు.
    మధ్యాహ్నపు టెండ మండి పోతున్నది. రోహిణీ కార్తి ఆ రోజే ప్రవేశించింది. ఈ చెవులో గాళువు ఆ చెవిలోకి కొడుతున్నది. ఆ వైశాఘ మానపు రోహిణీ కార్తి ఎండలో ఎక్కడికో వెళ్ళిన మురహరి చెమటలు కారుకుంటూ వచ్చాడు.
    వంటరిగా కూర్చున్న జ్యోతిని చూసి క్షణం ఆగి తన గదిలోకి వెళ్ళబోయాడు.
    "బావా"
    తలెత్తి చూసి జ్యోతి వద్దకు వచ్చాడు.
    "నీతో మాట్లాడాలి. అట్లా కూర్చో"
    ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు మురహరి. ఇటీవల ఎన్నడూ జ్యోతికి అంత దగ్గరగా, వంటరిగా కూర్చోలేదు మురహరి.
    "ఏమిటి జ్యోతీ"
    నిరాశగా, నిర్జీవంగా అతని వైపు చూస్తూ "నా ప్రశ్నలకు సరయిన సమాధానం చెపుతావా బావా" అన్నది.
    విచారితుడయ్యాడు మురహరి.
    "చెపుతాను జ్యోతి, అడుగు"
    "నేనంటే నీకు ఇష్టం లేదా"
    "అని నేనన్నానా జ్యోతీ"
    "నన్ను చూడంగానే ముభావకంగా వెళ్ళిపోతావ్ గాని ఒక్కసారయినా నీ అంతట నువ్వు నన్ను పలకరించి మాట్లాడవేం"
    "ఏమున్నయ్యి కబుర్లు మాట్లాట్టానికి. ఒక వేళ మాట్లాడుదామన్నా అత్తయ్య వూరుకోరుగా"
    జ్యోతి మనస్సులో ఏదో ఒక ఆశ పొడ చూపింది.
    "అమ్మ వూరుకోదని నన్ను దూరం చేసుకుందామనుకున్నావా"
    "ఆ ఉద్దేశ్యం నా కెప్పుడూ లేదే"
    "జయలక్ష్మి అంటే నీకు బాగా ఎరిక కదూ"
    "మూడేళ్ళుగా చదువుకుంటున్నాం గనక ఒకరి కొకరం బాగా పరిచయమే."        సూటిగా చెప్పాడు సమాధానం. ఆమె హృదయంలో వేడి రక్తం పొంగులెత్తుతున్నది. అతని ఒక్కొక్క మాట మంచు గడ్డలా పడి రక్తాన్ని విరిచేసినట్లుగా ఆమె హృదయం బలహీనపడసాగింది. హతాశమైన ఆమె మనస్సులో ఇంక రెండు ప్రశ్నలు మాత్రమే మిగిలి ఉన్నయ్యి. ఆ రెండు ప్రశ్నలూ వేసి వాటి సమాధానాలు వింటే ఇంక ఏ ప్రశ్నకూ, ఏ ఆశకూ త్రావుండదు. ఆ రెండు ప్రశ్నలూ వేసి బయట పడాలా లేక కాలానుగతంగా వాటికి సమాధానాలు ఆచరణలో చూసి తెల్సుకోవాలా అని ఆలోచించి ఒక్క ప్రశ్న మాత్రమే వెయ్యాలనుకుంది.
    "మీ ఇద్దరి మనస్సులూ కలిసినయ్యనుకుంటాను"
    వీపు మీద చెళ్ళున చరిచినట్లయింది మురహరికి. "అవును" అంటూనే తన గదిలోకి వెళ్ళి పోయాడు మురహరి.
    హృదయాంతరాలలో పరవళ్ళు తొక్కుతున్న దుగ్ధ ఒక్కసారి వెల్లువలా బైటికొచ్చింది. ఇంత కాలంనుండి నిద్ర మత్తులో ఉండి, ఏవో కలలు గన్నా ననుకుంది జ్యోతి.
    ఆ కలల ఫలితాలు ఇప్పుడు తెల్సుకుంది. ఇన్నాళ్ళూ నా మనస్సులో, హృదయంలో నిండి ఉన్న ఆకాంక్షలన్నీ పొరపాట్లేనా? నా కోరికలన్నీ మిథ్యా ప్రపంచంలో కలిసి పోయినవా? వాస్తవ జగత్తులో నా జీవితంలో ఆశించిన ఈ ఒక్క కోరికా గగన కుసుమమే అయిందా? నా ఈ హృదయ కుసుమం వాడి, నలిగి, నశించి పోవలసిందేనా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS