Previous Page Next Page 
అపస్వరం పేజి 39


                                  15

    వీణ ఏడుపు విని గదిలో నుండి గబగబా బయటికి వచ్చింది మీర. మీర దగ్గరికి రాగానే, వీణ పెద్దగా కళ్ళు తెరచి, తల్లి కట్టుకున్న ఎర్రటి జార్జెట్ చీరవేపు చూడసాగింది, చీర ఎరుపు రంగు, నదురుగా కనిపించిందేమో, వీణ ఏడ్పు ఆపి, చీరవేపే చూస్తోంది. క్రమంగా ఏడ్పుమాని, తల్లి చీర కుచ్చెళ్లను పట్టుకుని లాగుతూ నవ్వసాగింది. అప్పటినుండి శాముకు జార్జెట్ అంటే అభిమానం కలిగింది. ఈ సంఘటన నెమరు వేస్తూ, శాము.
    "నీ కూతురికి జార్జెట్ అంటే ఇష్టం కదూ? అందుకని ....."
    "అంటే పెళ్ళాంమీద ప్రేమకోసం కాదన్నమాట, చీర తేవటం? కూతురిని మెప్పించటానికి కదూ?"
    "ఎందుకైతే నీ కొచ్చిన నష్టమేమిటీ? చీర నీకేగదా?" అని ముగించాడు శాము.
    వీణ సంవత్సరపు పుట్టినరోజు పండుగ అతి వైభవంగా జరిగింది. శాము రైతాంగమంతా తృప్తిగా చిరోటీ లడ్డూలతో భోజనంచేసి,
    "జానకమ్మ ఇల్లాటి నూరు పండుగలు సేసుకొని పిల్లల్ని కని, సల్లంగా బతకాల" అని దీవించారు.
    ముసలి సంజవ్వ, "పుట్టినరోజే ఇంత గొప్పగా సేశారే, ఇక పెళ్ళంటే ఎట్టా సేస్తారో?" అంది.
    "వారికేటి తక్కువ? భగవంతు డిచ్చాడు, సేస్తారు" అంది మాదవ్వ.
    చిన్నారి వీణ చమికీ కుట్టిన నల్ల సిల్కు ఫ్రాకు, తెల్ల సిల్కు పైజమా వేసుకుని, ముద్దులు మూటగడుతూ, అందరి కళ్ళకూ పండుగ చేసింది. నల్ల సిల్కుమీద వేసుకొన్న ముత్యాలు కెంపులూ పొదిగిన నెక్లెసు, కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చెవుల్లోని కమలాల లోలక్కులు, అప్పుడే వికసించిన కమలాల్లా ఊగుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తున్న వీణకు, ఎంత దృష్టి తీసినా తనివి తీరలేదు, తల్లిదండ్రులకు, కూతురి అందాన్ని చూసి, తల్లి హృదయం పొంగిపోయింది.
    
                                *    *    *

    మీర అప్పుడప్పుడూ వీణకు పాఠాలు నేర్పేది. వీణ నెత్తి టేబిల్ మీద కూర్చోబెట్టి "చేతులు కట్టమ్మా రాణి" అనగానే, వీణ రెండు చేతులూ కట్టుకుని ఠీవిగా తల్లివేపు చూసేది.
    "ఒక్కట్లు చెప్పూ."
    వీణ వచ్చి రాణి ముద్దుమాటల్లో "ఒకటి ..... రెండూ ..... ఐదు..." అంది.
    "ఊహుఁ, రెండయ్యాక మూడు, తరువాత?"
    "నాలుగు."
    "మీ కూతురెంత చక్కగా చెబుతూందో విందురుగాని రండి." శామూను పిలచింది, మీర. ఏదో పనిలో ఉన్న శాము వచ్చి,
    "ఏమిట్రా జాని? ఏం చేస్తున్నావ్?" అన్నాడు.    
    "వీణ ఒక్కట్లు చెపుతుంది, వినండి."
    "నేను వినాలంటే జాని నాకు లంచమివ్వాలి."
    మీర అక్కరతో వీణవేపు చూస్తూ "వీణా, నాన్నకు ఓ ముద్దిస్తే ఒక్కట్లు వింటారుట ఏం?" అంది.
    వీణ తన రెండు చేతులనూ శాము మెడ చుట్టూ వేసి, ముద్దు పెట్టుకుంది.
    "ఈ ముద్దు కారంగా ఉందే" అన్నాడు శాము.
    వీణ ఇంకోసారి ముద్దెట్టుకుంది.
    "ఇది పుల్లగా ఉందమ్మా, మరోటి....."
    ".........."
    "ఇది చప్పగా ఉందే ? నాకు తియ్యటి ముద్దు కావాలి." వాళ్ళిద్దరి సరసాన్ని చూస్తూన్న మీర "ఎంత వేధిస్తారు బిడ్డనూ? ఇక చాలించండి" అంది.
    వీణ, శాము అడిగినన్ని ముద్దులు గురిపించి, ఒక్కట్లు చెప్పింది.
    రెండేళ్ళు గాలిలో ఎగిరిపోయే ఈకలాగా తేలిగ్గా వెళ్ళిపోయాయ్. తల్లి తండ్రుల ప్రేమ వాత్సల్యాలలో, వీణకు రోజూ పండుగలాగే గడిచిపోతోంది.
    ఒకరోజు మీర బాలబోధిని, వీణ ముందు పెట్టి "చదవమ్మా" అంది.    
    "ఉహూఁ. నేను చదవనూ, ఆలుకోవాలి."
    "ముందు చదువుకొని, తరువాత ఆడుకుందూ ఏం?"
    "ఊహూఁ."
    "నాన్నారితో చెపుతా నుండు."
    వీణ బుగ్గలు సొట్టలుపడేలా నవ్వి "నాన్నాలు మంచివాలు. నన్ను తిత్తలుగా" అంది.
    "నేనే కొడతాను."
    "కొత్తూ చూద్దాం" వీణ ప్రవాహాని కెదురుగా నించిన, రాతిలా కూర్చుంది.
    "ఏం చేయవమ్మా ఈ మొండిపిల్లనూ" అని ముద్దులు గురిపించింది, మీర.
    "సరే ఆడుకో అయితే"
    "నువ్వూ దా"
    "నీకో కొత్త లంగా కుడతానుగా! నువ్వాడుకో పో."
    "నువ్వత్తేగాని ఆలను."
    మీర వీణతో ఆడుకోసాగింది. వీణ మంచం పక్కలో కూర్చొని "జూత్" అంది. మీర అటూ ఇటూ వెతికినట్టు నటించి,
    "నేను వోడిపోయాను, చిట్టీ" అంది.
    వీణ బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ నవ్వింది.
    తలకు నూనె రాచుకుంటూ గదిలో కొచ్చారు శాము. అద్దంముందు నుంచుని క్రాపు దువ్వుకొని ఈలవేస్తూ.
    "జానీ, ఏం చేస్తున్నావ్?" అన్నాడు.
    "ఆలుకుంతున్నా."
    "నేనూ రానా?"
    "దా"
    వీణ దాక్కుంది. శాము, మీర వెతికినట్టుగా నటించి, "వోడిపోయాం" అన్నారు, వీణ బయటికి వచ్చి గెంతుతూ "నేనే గెల్చా" అంది.
    "గెలిచినవారు వోడిపోయినవారి కేదైనా ఇవ్వాలట."
    శాము వీణ మొహం దగ్గరగా తన తల వంచి, చెంప అందించారు. వీణ అతనికో ముద్దిచ్చి "అమ్మా, నీకో" అంది.
    "నువ్వు నా కిచ్చింది, నే నమ్మకిస్తాలే" అంటూ మీరను దగ్గరకు లాక్కున్నాడు శాము.
    వీణ పరికిణీలు, ఫ్రాకులూ మోకాళ్ళ పైకి పోయాయి. దాని కాళ్ళను మేము మరుగునపరచలేమంటూ నవ్వాయ్. వీణ సిల్కు పైజమా, బనీన్లు రోజురోజుకూ పొట్టవసాగాయ్.
    అయిదేళ్ళ వీణ, తల్లి శిక్షణలో, ఇంగ్లీషు, కన్నడం, అక్షరాలను చిన్నచిన్న పద్యాలనూ, తేలికరకం లెక్కలనూ నేర్చుకుంది. అయిదేళ్ళూ శామూ మీరలకూ, అయిదు చిర వసంత మాసాలు.
    "వీణా, వీణా, పాలు తాగుదువుగాని, రామ్మా"
    మీర పాల గ్లాసు చేతిలో పట్టుకుని, వీణకోసం వెతకసాగింది, వీణ బుంగమూతి పెట్టుకుని, పాత సామానులు పెట్టిన గదిలో తల్లికి కనిపించకుండా ముడుచుకొని పడుకుంది. మీర ఎంత పిలుస్తున్నా పలుకలేదు.
    "వెంకమ్మగారూ, వీణను చూశారా?"
    "లేదే! వంటింటివేపే రాలేదసలు."    
    "బోరా ..... బోరా ..... పాపాయి ఏదిరా."
    సోఫా కుర్చీలు దుమ్ము దులుపుతున్న బోరడు, "నే చూడలేదండమ్మగోరూ" అన్నాడు.
    మీర కోపంతోనూ, కంగారుతోనూ, "మెల్లిగా లేదంటావేం? అవధానిగా రింటికీ వెళ్ళిందేమో చూసిరా."
    బోరడు అయిదు నిమిషాల్లోనే తిరిగి వచ్చి, "అక్కడ లేదండమ్మగోరూ" అన్నాడు.
    మీరకు దిక్కు తోచలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. వణుకుతున్న కంఠంతో,
    "ఎక్కడికీ వెడుతుంది? ఒక్కరోజు నాతో చెప్పందే ఇల్లు కదల్లేదే! వెళ్ళు. తొందరగా వెళ్ళి అయ్యగారిని తీసుకుని, ఇక్కడున్నట్టుగా రా." అంది.
    "గాబరాతో రొప్పుతూ ఇంట్లోకి ప్రవేశించిన శామూ, మీరను వోదారుస్తూ "ఎక్కడికీ వెళ్లుండదు. ఇంట్లోనే ఉంటుంది, బహుశః" ఇల్లంతా వెతకసాగాడు. సామాన్లు పడేసిన గదిలో చేతి బండిలో కళ్ళు మూసుకుని పడుకున్న కూతురిని చూసి, కడుపు తరుక్కుపోయింది, శాముకు.
    "జానీ" అన్నాడు మృదువుగా. వీణ మాట్లాడలేదు.
    "ఎవరేం చేశారమ్మా, మా బుడ్డీని?" అంటూ కూతురిని ఎత్తుకొని, పరికిణీ దుమ్ము దులిపి బయటికి తీసుకొచ్చాడు. మీర కళ్ళల్లోని నీరు ఆనందభాష్పాల్లా మారిపోయాయ్. ప్రేమతో వీణను ముద్దెట్టుకుంటూ.
    "చిట్టి తల్లీ. క్షణంలో గుండె బ్రద్దలయ్యేలా చేశావే. దామ్మా, పాలు తాగుదువుగానీ" అంది.
    వీణ శాము భుజంమీద తల పెట్టుకుని, - "ఊహూ. నాకు పాలొద్దు" అంది.
    "మరింకేం కావాలి?"
    "నాకు కాఫీనే కావాలి. అమ్మ ఇవ్వదు."
    శాము వీణ తల నిమురుతూ "కాఫీ వద్దమ్మా, జబ్బుచేస్తుంది" అన్నాడు.
    "ఉహుఁ. మరేమో, అమ్మా, నువ్వూ కాఫీనే తాగుతారుగా!"
    "మాకు చిన్నప్పటినుండి అలవాటుకదా. అందుకని తాగుతాం."
    "ఉహుఁ. అమ్మా, నువ్వూ ఏది తాగితే నా కదే కావాలి. పాలొద్దు."
    శాము నిస్సహాయుడై మీరవేపు చూశాడు.
    మీర, "సరే ఈరోజు నుండి నేనూ, నాన్నారు కూడా పాలే తాగుతాం" అంది.
    దంపతులు కూతురికోసం పాలు అలవాటు చేసుకోక తప్పలేదు.
    సాయంత్రం షికారు వెళ్ళటానికి వీణను ముస్తాబు చెయ్యసాగింది మీర. ఉంగరాల జుత్తును బ్రష్ తో కొద్దిగా సర్ది బాబ్ లా మెడమీదికి వదిలేసింది. నీలం పసుపు కలిసిన జరీ అంచు పట్టుపరికిణీ తొడిగి, అదేరంగు పట్టు బనీను తొడిగింది. చెవుల్లోని కమలాలూ, మెడలోని ద్రాక్షగుత్తుల నెక్లెసూ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నట్టున్నాయి. చిన్ని పాదాలను తన తొడమీద పెట్టుకుని నల్లటి బూట్లు తొడిగి, బుగ్గమీద ముద్దెట్టుకుని,
    "నాన్నారికి చూపించిరా చిట్టీ" అంది. మీర కూడా ముస్తాబయ్యాక ముగ్గురూ షికారుకు బయలుదేరారు. పల్లెటూరి ఆడవారు రోజుకో అలంకరణతో చిన్ని ఉమలా అలంకరించుకుని బయలుదేరే వీణను అబ్బురంతో చూసేవారు. వీణ తల్లిదండ్రులిద్దరి చేతిని తన చిన్న చేతులతో పట్టుకుని ఇద్దరిమధ్యా నడచి వచ్చేది. కాస్త దూరం అలా నడిచి చెరువు దగ్గరి రాతిబండ మీద కూర్చున్నారు ముగ్గురూ. మీర, శాము ఏదో మాట్లాడుకుంటున్నారు. రోజూ వంద ప్రశ్నలతో వేధించే వీణ ఈరోజు మౌనంగా ఉంది. కస్త చీకటి పడగానే మీర లేచి.
    "ఇంటికి వెడదాం రండి. వీణకు స్వెటర్ కూడా వెయ్యాలా. చలిగాలి వీస్తోంది" అంది.
    "నాన్నా"
    వీణ గొంతు నీరసంగా ఉంది.
    "ఏమిటి జానీ?"
    "కాళ్ళు నొప్పిగా ఉన్నాయి."
    శాము రాతిబందమీద కూర్చున్న వీణను ఎత్తి భుజంమీద పడుకోబెట్టుకుని టవల్ కప్పాడు.
    ఇంటికి వెళ్ళేసరికి వీణ నిద్రపోయింది. మీర వీణ పక్క దులిపి వేసింది. వీణని పడుకోబెట్టి వెచ్చగా కప్పింది. వెంకమ్మగారు ముగ్గురికీ కంచాలు పెట్టారు.
    మీర్ అవి చూసి,
    "వీణ కంచం తీసెయ్యండి. నిద్రపోయింది. పాలు పొయ్యిమీదే ఉంచండి. తరువాత పాలు ఇస్తాను" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS