మధ్యాహ్నం భోంచేసి పడుకున్నాడు శాము. వీణ అతని కడుపుమీద కూర్చుని, అతని జుత్తు లాగుతూ, "నాన్నా నాన్నా" అని పలకరిస్తోంది. మీర తమలపాకుల పళ్ళెంతో కాళ్ళవేపు కూర్చుంది. తమలపాకుల ఈనెల తీసి, సున్నంరాసి, చిలకలు చుట్టి, భర్త కందిస్తోంది. శాము వాటిని నోటిలో వేసుకుంటూ,
"మన జాని పుట్టిన వేళ మంచిది" అని మీర వేపు వోరగా చూశాడు.
మీరకు అర్ధంకాలేదు.
"ఏం?" అంది.
"పెళ్ళయినప్పటినుండి, ఒక్కరోజైనా, ఇలా చిలక చుట్టిచ్చి ఎరుగుదువా? జని పుణ్యమా అంటూ ఈ అదృష్టం పట్టింది, నాకు."
"మీ రెప్పుడైనా అడిగారా, పోని?"
"అదీ అడగాలా ఏమిటి?"
మీరకు పెళ్ళయినప్పటినుండి ఒక్కరోజైనా భర్తకు తమలపాకులకు సున్నంరాసి అందించా లని పించలేదు. పైగా, ఆవు గడ్డి నమిలినట్టు ఆకులు నమిలే అతని తీరు, జిగుప్స కలిగించిందామెలో.
కాని వీణ వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రవేశించినప్పటినుండి, తాంబూలం సేవించే సమయము, రసమయ సన్నివేశంగా మారిపాయింది. శాము భోజనమవగానే వచ్చి, మంచంమీద పడుకునేవాడు. వీణ తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి మంచాన్ని ఆనుకుని నించునేది. శాము వీణ నెత్తి మంచంపైన కూర్చోపెట్టుకునేవాడు. మంచం మీద కాళ్ళవేపున, మీర ఆకులకు సున్నం రాస్తూ "ఈఒజు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?" అంటూ వీణ గుణగణాల్ని ప్రారంబించేది.
"ఊహుఁ. అలాగా. ఏం చేసిందేమిటి? ఏం చేశావమ్మా చిట్టీ?" కూతురి బుగ్గ గిల్లి అడిగేవాడు శాము. ఈ సన్నివేశం భార్యాభర్తలకు అత్యంత ప్రియమైనది.
వీణ కృపాదృష్టి తండ్రి జుత్తుమీద పడి, దాన్ని లాగి తన చేతిలో పెట్టుకోవాలని ప్రయత్నించసాగింది. మీర "వద్దమ్మా, ఇలా రా తల్లీ" అంది.
వీణ మరింత తండ్రికి దగ్గరగా జరిగింది. మీర చుట్టిన తమలపాకును, శాముకు అందించబోతే, వీణ తన చేతితో దాన్ని లాక్కుని, శాము నోట్లో పెట్టింది. శాము వీణ చేతిని నొప్పవకుండా కొరికి "ఆకు కన్నా కమ్మగా ఉంది, మా అమ్మ చెయ్యి" అన్నాడు.
"చాల్లేండి నొప్పవదా, బిడ్డకు?"
వీణ తల్లి చేతినుండి, ఆకు లాక్కుని, ఈసారి తన నోట్లో వేసుకుంది. మీర, శాము, బిడ్డ విషం తిన్నట్టుగా భయపడిపోయి, బిడ్డ నోటిలో మంచి, ఆకు తీసి పారేశారు. వీణ మొండిగా ఏడ్వసాగింది. మీర మంచంకింద పక్కలా వెతికి, ఆడుకునే సామానులు తెచ్చి వీణ ముందు పడేసింది. వీణ ఏడుపు ఆపి, బొచ్చుకుక్క బొమ్మతో ఆడుకోసాగింది.
"వీణ పుట్టినరోజు దగ్గర పడుతోంది" మీర మళ్ళీ ప్రారంభించింది.
"అవును, ఇంకో నెల ఉంది ఆరోజు వూరందరికి భోజనాలు పెట్టాలి. నా పెళ్ళి భోజనం కూడా పెట్టలేదు వారికి."
"అంతమందికీ వంటెవరు చేస్తారు?"
"మైసూరి నుండి ఇద్దరు వంటవారిని పిలుపిద్దాం."
"పెదనాన్న వస్తారు కదూ?"
"ఆయన రాకుండా ఎలా? పెద్దవారు వచ్చి ఆశీర్వదిస్తే జానీకి శ్రేయస్సు."
"వీణకేమి చేయిస్తారు?" "రాణిగారు ఏమి చేయించమంటే అది."
"అదే నేనూ ఆలోచిస్తున్నా, లోలక్కులు, గాజులు, గొలుసు అన్నీ ఉన్నాయి. లేని దేమిటాని?"
"ఒక బుల్లి మొగుడు."
"అబ్బబ్బా! మీ రిప్పటినుండీ అలా అనకండీ. వీణని చదివించాలనుకుంటున్నాను, నేను."
కాస్సేపు ఆలోచించి, మీర "నేనొ విషయం చెపుదామనుకొంటున్నా. మీ రిష్టపడతారో లేదో?" అంది.
"ఏమిటో చెప్పు."
"వీణకు ముత్యాలు కెంపులు పొదిగిన నెక్లేసు చేయించాలని ఉంది, నాకు. కానీ ....."
"కానీ ఏమిటి?"
"నెక్లెసుకు బంగారం కావాలా? ఇప్పుడు బంగారు వెల మండిపోతూంది కదా ....."
"ఊఁ ...."
"ఎలాగూ మీ అమ్మగారి నగలు పెట్టె నిండా ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి చెరిపిస్తే, నెక్లెస్ సరిపోతుంది."
శాము మెదలకుండా వూరుకున్నాడు. చనిపోయిన తల్లిమీది భక్తికీ, బిడ్డమీద వ్యామోహానికీ ఒక నిముషం పోరాటం జరిగింది. వీణవేపు చూశాడు. వీణ కాళ్ళవేపు కూర్చుని, పెద్ద బంతిని నోటిలో కూరుకోవటానికి ప్రయత్నిస్తోంది. వీణ మెడలో నెక్లెస్ వేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాడు, శాము. బంతిని నోటిలో కూరుకోవటానికి వీణ పడుతున్న అవస్థను చూసి ముద్దొచ్చింది, శాముకు. గబుక్కున లేచి, అక్కరతో వీణ బుగ్గలను ముద్దెట్టుకున్నాడు.
"నా బంగారు తల్లికి ఏమైనా సరే ఇవ్వచ్చు. దానికి కాకపోతే ఎవరికివ్వాలి మనం? కావాలంటే అన్ని నగలూ చెరిపించి, కొత్త మాదరీల్లో చేయిద్దాం."
శాము ఇంత త్వరగా తన సలహాకు ఒప్పుకోవటం, ఆశ్చర్యాన్ని కలిగించింది మీరకు.
"ఇప్పటికి నెక్లెస్ ఒకటి చాలు. పెళ్ళప్పటికీ మిగతావి చేయించుకోవచ్చు. నెక్లెస్ చేయించటానికి మైసూరి కెళ్ళాలేమో?"
"ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేద్దాం."
"వీణను తీసుకెళ్ళాలి."
"జాని వద్దు మీరా. వూరికే అలసట బిడ్డకు. ఒకరోజు నేనే వెళ్ళి అర్డరిచ్చి వస్తాను."
"మీరు ఆర్డరిచ్చిన మాదిరి నాకు నచ్చొద్దూ?'
"అయితే నువ్వొ డిజైను గీసివ్వు. అదే మాదిరీలో చేయిద్దాం."
మీర కాయితం, పెన్సిల్ తీసుకుని, నెక్లెస్ డిజైన్ గీయసాగింది ద్రాక్షతీగ రెండువేపులూ అల్లుకుంటూ పైకి పోయింది. ద్రాక్ష గుత్తులు తీగనుండి వేలాడుతున్నాయి. రెండు చిలకలు తీగమీద కూర్చొని ద్రాక్షగుత్తిని ముక్కుతో పొడవబోతున్నాయి.
మీర గీసిన చిత్రాన్ని అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు శాము. కొన్నిచోట్ల తన సలహా లిచ్చాడు. మీర నెక్లెస్ లో ఎక్కడెక్కడ ముత్యాలూ పచ్చలూ, కెంపులు పొదగాలో వివరించి చెప్పింది. ఆఖరికి ఆ
కాయితాన్ని శాము చేతికిచ్చి,
"రేపే వెళ్ళిరండి. మళ్ళీ తయారవటం ఆలస్యమవ్వచ్చు. 'మైసూరు జ్యూయలరీ మార్ట్' లోనే చేయించండి." అని చెప్పింది.
"నీకేమి అక్కర్లేదా, మీరా?"
"నాకా? ఇంకా నాకేం కావాలి?"
"నీకో మైసూర్ జార్జెట్ తెస్తాను. ఏరంగు తెమ్మంటావ్?"
సూర్యుడు పశ్చిమాన ఉదయించినా అంత ఆశ్చర్యం కలిగేది కాదు మీరకు, మొదటినుండి జార్జెట్టు గుడ్డలంటే, బద్ధ ద్వేషం అతనికి, పట్టుచీరలలోని గాంభీర్యం నిండుతనం జార్జెట్ గుడ్డల్లో ఉండదని అతని వాదం. అలాటి మనిషి ఇప్పుడు తనంతట తానె, జార్జెట్ తెస్తాననగానే తెల్లబోయింది మీర. తన చెవులను తనే నమ్మలేక,
"ఇదేం కల కాదు కదా?" అంది.
"ఏం. అలా అడుగుతున్నావ్?"
"మరింకెలా అడగనూ? మీకూ జార్జెట్ కూ అసలు పడదుకదా?"
శాముకు రెండు నెలల క్రిందటి సంగతి గుర్తుకొచ్చింది. ఒక సాయంత్రం, వీణకు గుడ్డలు తొడిగి శాము చేతికిచ్చి తనూ చీర మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది మీర. వీణ హఠాత్తుగా మొండికెత్తి ఏడవసాగింది. ఎంత వోదార్చినా ఏడుపు ఆపలేదు. వెంకమ్మగారు దిష్టి తీశారు. వీణ గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. వీణను వోదార్చటానికి శాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
