Previous Page Next Page 
అపస్వరం పేజి 40


    భార్యాభర్త లిద్ధరిమధ్యా ఎక్కువ మాటల్లేకుండానే భోజనం పూర్తయింది, వీణ మధ్యన ఉంటే ఎన్నో మాటలతో ఇద్దర్నీ నవ్విస్తూ ఉండేది. సరదాగా భోంచేసేవారు. వీణ కబుర్లు లేని భోజనం ఇద్దరికీ రుచించలేదు.
    కాస్సేపయ్యాక మీర పాలగ్లాసు తీసుకుని గది లోకి వచ్చింది. "వీణా" అంది మెల్లిగా. వీణకు మెలకువ రాలేదు.
    "పాలు తాగమ్మా" అంటూ వీణ నుదుటిమీద చెయ్యి వేసింది. వేసిన చెయ్యి కాస్సేపు స్తబ్ధంగా ఉండిపోయింది. కుడిచేతిలోని పాలగ్లాసు కిందబెట్టి శాము దగ్గరకొచ్చి,
    "వీణకు జ్వరం తగిలినట్ట్టుంది" అంది.
    శాము లేచివచ్చి మీర గొంతు, నుదురు ముట్టి చూశాడు.
    "రేపు పండితులవారికి కబురు చేస్తాను" అన్నాడు.
    మీరకు దుఃఖం ఆగలేదు.
    నాకు భయమేస్తోందండీ. ఈ నాటు వైద్యంలో నమ్మకం లేదు నాకు. మైసూరినుండి నుంచి డాక్టరుని తీసుకురండి. ఎంత డబ్బయినా ఫరవాలేదు" అంది.
    "చూద్దాం. తెల్లవారనీ" అన్నాడు శాము, ఏదో మామూలు జ్వరమేనన్న ధోరణిలో. మీర వీణను బలవంతంగా లేపింది. వీణ కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
    "పాలు తాగమ్మా."
    "..........."
    "కొంచెం తాగు తల్లీ."
    "ఉహుఁ ............"
    మీర చూపు నెక్లెస్ మీద పడింది.
    "ఏదమ్మా, గొలుసు తీస్తాను."
    "ఉహుఁ. తియ్యొద్దు."
    "వేసుకునే పడుకుంటే ముత్యాలు రాలి పోతాయి తల్లీ."
    వీణ తన నెక్లెస్ నోమారు చూసుకుని "ఉహుఁ గొలుసు నా మెళ్ళోనే ఉండనీ, తియ్యకమ్మా" అంది.    "ఉండనివ్వు" అన్నాడు శాము.
    తెల్లవారినా వీణ జ్వరం తగ్గలేదు. ఒక్క రోజుకే వీణ నిప్పులో పడ్డ పువ్వులా వాడి పోయింది. శాము పండితులవారిని పిలిపించి మందిప్పించాడు. రెండోరోజుక్కూడా జ్వరం తగ్గనేలేదు. మీర దిక్కుతోచక పక్క దగ్గరే కూర్చుండి పోయింది. శాము,
    "ఏం చేయను మీరా?" అనడిగాడు.
    "మైసూరికి వెళ్ళి మంచి డాక్టర్ని తీసుకురండి.
    "అలాగే చేస్తాను. ఏదో మామూలు జ్వరం తగ్గిపోతుందిలే అనుకున్నాను."
    "అమ్మా! నాన్నెక్కడికి వెడతారమ్మా." వీణ అడిగింది.
    "మైసూరికి వెళ్ళి మంచి డాక్టర్ని తీసుకువస్తారమ్మా."
    నాకు బొమ్మలు, పళ్ళూ కావాలమ్మా."
    "ఓ, అన్నీ తెస్తాను. నువ్వు మాత్రం పండులామందు తాగెయ్యాలి."
    శాము తొందర తొందరగా అన్నం తిని స్టేషన్ కి బయలుదేరాడు. మీర వీణ పక్కనుండి కదల్లేదు. వెంకమ్మగారు రెండు మూడు మార్లు మీరను భోజనానికి లేపే ప్రయత్నం చేశారు. కని మీరా మాత్రం వీణ పక్కనుండి కదల్లేదు. గడ్డానికి చెయ్యి ఆన్చి వాడిపోయిన వీణ మొహం వేపే చూస్తూ కూర్చుంది. వీణ మెడలోని నెక్లెస్ చూసి,
    "గొలుసు తీసేస్తానమ్మా, మెడకు గుచ్చుకుంటుంది." అంది.
    "ఉహుఁ. ఇదంటే నాకు మహా ఇష్టం. నా మెళ్ళోనే ఉండాలమ్మా."
    వెంకమ్మగారు కంచంలో అన్నం కలిపి తెచ్చి మీరను,
    "కాస్త ఎంగిలిపడు మీరా. బెంగెట్టుకోకు. అందర్నీ భగవంతుడు చల్లగా చూస్తాడు." అన్నారు.
    వీణ ఆశగా కంచంవైపు చూస్తూ,
    "అమ్మా, ఏమన్నం అదీ?" అనడిగింది.
    "బంగాళాదుంపల సాంబారు."
    "అమ్మా నాకూ ఆకలేస్తోందే. బంగాళా దుంపల సాంబారు తింటాను."
    "ఇప్పుడొద్ధమ్మా. బంగారువు కదూ, జ్వరం తగ్గాక నీకేం కావాలో అది చేయించి పెడతాగా" అంటూ కంచం తీసికెళ్ళి వంటింట్లో పడేసి వచ్చింది.
    శాము సాయంత్రానికల్లా డాక్టర్ని తీసుకొచ్చాడు టాక్సీలో. డాక్టర్ని చూడగానే ప్రాణం లేచివచ్చిన ట్టనిపించింది మీరకు. డాక్టర్ వీణను పరీక్షించి జ్వర లక్షణాలను అడిగి తెలుసుకుని మాట్లాడకుండా బయటికి వచ్చారు. శాము,
    "ఇదేం జ్వరం డాక్టర్" అనడిగాడు.    
    "టైఫాయిడ్ కేసేమోనని అనుమానంగా ఉంది. రక్తం తీసుకుని వెళ్ళి పరీక్షించాలి. పాలు త్రాగించకండి. పాలు విరచి ఆ నీరు త్రాగించండి. పళ్ళరసం ఇవ్వవచ్చు."
    శాము దీనంగా "డాక్టర్, మీరు దయచేసి పాపకు నయమయ్యేవరకూ ఇక్కడే ఉండండి. మీకు అన్నిసదుపాయాలు చూసుకుంటాను." అన్నాడు.
    శాము మాటలు విని ఆలోచనలో పడ్డారు డాక్టరుగారు.
    "నేను ఉండటానికి వీలుండదు. కానీ ఈరెండురోజులూ నేను చెప్పిన మందూ ఆహారం ఇవ్వండి. ఈరోజు రక్తం తీసుకునివెళ్ళి పరీక్షించి ఎల్లుండి వస్తాను. అప్పటికీ పాప పరిస్థితి ఇలాగే ఉంటే చూద్దాం".
    శాము ఇంకేం మాట్లాడలేక ఆయన్ను తీసుకొచ్చిన ట్యాక్సీలోనే వెనక్కి పంపేసి లోపలికొచ్చాడు.
    "నాన్నా, బొమ్మలూ, పళ్ళూ తెచ్చావా?"
    శాము తను తెచ్చిన బత్తాయిపళ్ళు, బొచ్చుకుక్కా, కోడిపుంజు బొమ్మలను వీణ పక్కమీద ఉంచాడు.
    "కుక్క, కోడి ఎంత బాగున్నాయో! అమ్మ ఆకలేస్తుంది. పళ్ళరసం ఇస్తావా?"
    "ఇస్తానమ్మా. ఇంకాస్సేపు ఆగి తాగుదువుగానీ" అని మీర శామువైపు చూసి.
    "డాక్టర్ని ఇక్కడే ఉంచుకుంటే బావుండేది." అంది.
    "ఎంతో చెప్పిచూశాను. ఎల్లుండి వస్తానని వెళ్ళిపోయాడు."
    సాయంత్రం కావస్తున్నట్టల్లా వీణకు జ్వరం ఎక్కువకాసాగింది. తాపానికి తట్టుకోలేక పడక మీది పొర్లసాగింది. తెలివిలేని మాటలు మాట్లాడటానికి మొదలెట్టింది. అది చూడలేక శాము, మీర విలవిలాడి పోయారు.  మీర మనస్సులో వెయ్యి ఆలోచనలు.
    ఆ డాక్టర్ జ్వరం తగ్గేదాకా ఇక్కడే ఉండిపోకూడదూ? తనే డాక్టరయి ఉంటే ఇంకొకరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండేదే కాదు. తనే తన వీణకు చికిత్స చేసే అవకాశం ఉండి ఉంటే డాక్టరుగా తనకున్న శ్రద్ధ తోబాటు, కూతురిమీది మమకారంకూడా చేరి బిడ్డపడుతున్న బాధను కొంతవరకైనా తగ్గించగలిగేది. వీణ పడుతున్న బాధనుచూసి ఆమె కడుపు తరుక్కు పోతోంది. కాని చేసేదేమీలేక శిలాప్రతిమలా కూర్చుండి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS