Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 38


    "అలా ఎందుకు, మీరిచ్చే జీతం చాలు నాకు."
    "ఇదిగో చూడు. మరీ అంతలా మొహమాట పడకు. నీకూ తల్లి తండ్రులున్నారు. పెళ్ళి కావల్సిన చెల్లెళ్ళున్నారు. వాళ్ళకి పంపాలి. రేపొద్దున్న నీకు పిల్లాపాప పుట్టుకు వస్తారు. డబ్బు కాత్ష వెనకేసుకోవాలి ఇప్పటినించి అన్నింటికి అంత బిడియపడితే యీ ప్రపంచంలో ఎలా బ్రతుకుతావు" అంటూ మందలించి అన్నీ తనే నిర్ణయం చేసేసి, వాళ్ళిద్దరిని మరి మాట్లాడనీయలేదు.
    అంతేకాక సుజాత వంట అవీ చూసుకోడం - మరీ పని ఎక్కువైందని, క్రొత్తగా పెళ్ళయిన జంటని, సుజాత వద్దంటున్నా మళ్ళీ ఓ వంటవాడిని పెట్టింది కల్యాణి.
    రామకృష్ణ ప్రేమానురాగాలతో, కల్యాణి ఆదరంతో, పిల్లలమధ్య సుజాతకి రోజులు ఇదివరకటి కంటే ఆనందంగా గడిచిపోసాగాయి.
    సుజాత నో ఇంటిదాన్ని చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నానని కల్యాణికీ చాలా సంతోషం అనిపించింది.
    వాళ్ళిద్దరి మధ్య అనురాగం, అన్యోన్యత చూస్తూ తను జీవితంలో పొందలేని ఆనందాన్ని కళ్ళెదుట చూస్తుంటే, జీవితంలో తన ఎంత నష్టపోయిందో తెలిసి బాధపడేది కల్యాణి. తన జీవితం ఇలా వక్రించడానికి తను చేసిన పాపం ఏమిటి అన్పించేది. ఆ బాధ ఆనంద్ గుర్తు వచ్చినపుడల్లా మరింత ఎక్కువయ్యేది. సుజాత, రామకృష్ణల స్థానంలోతననీ ఆనంద్ ని ఊహించుకునేది. ఆ ఊహ పర్యవసానంగా భారమైన నిట్టూర్పే మిగిలేది!
    
                                           24
    
    పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం ఆరంభమైంది. కావాలని యుద్ధంలోకి దిగకపోయినా శత్రువుని ఎదుర్కోడానికి యుద్ధంచేయడం అనివార్యమైంది భారతదేశానికి.
    యుద్దవార్తలు వింటూ, రోజూ పేపరు తెరవడానికి, రేడియో వినడానికే భయం అన్పించేది కల్యాణికి. ప్రతిరోజు ఏం వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణా లుగ్గ పట్టుకునేది. ఏ టెలిగ్రాం వచ్చినా అందుకుంటూ వణికిపోయేది. యుద్ధం ఆరంభించిన వారానికి ఆనంద్ ఉత్తరం తను ఫ్రంట్ లో వున్నట్టు, 'క్షేమంగానే వున్నాను, కంగారు పడకు' అంటూ రాశాడు.
    రోజూ ఆమె పడుతున్న బాధ, ఆరాటం, ఆవేదన చూస్తూ, భోజనం సరిగా చెయ్యకపోవడం, నిద్రపోకపోవడం అన్నీ చూస్తూ సుజాత ఆమెకు ధైర్యం చెప్పాలనుకొనేది. చనువుగా 'అలా భయపడతారేమిటి?' అని మందలించా లనిపించేది. వారం రోజులలో కల్యాణి బొత్తిగా తగ్గిపోవడం చూసి ఆఖరికి సుజాత ఓ రోజు "ఆయన క్షేమం గానే వున్నారు గదా, మీరెందుకు అలా దిగులుపడతారు? అయినా యుద్ధంలోకి వెళ్ళిన అందరూ ప్రమాదంలో పడతారా, ముందు దిగులుతో మీరు మంచం యెక్కేటట్లున్నారు. ఇంతలా అధైర్యపడితే యెలా?" అంటూ కాస్త చనువుగా మందలించింది.
    "నీకు తెలీదు సుజాతా! క్రితం యుద్ధం రోజులు గుర్తు వస్తే యిప్పటికీ వణుకువస్తుంది. బావ అప్పుడు ఎన్నాళ్ళు మృత్యువుతో పోరాడి బ్రతికాడో నీకు తెలియదు?"
    "క్రితం యుద్దంలో ఆయన గాయపడ్డారా?" సుజాత ఆశ్చర్యంగా, కుతూహలంగా అడిగింది.
    "గాయపడ్డం ఏమిటి? మండే ప్లేనునించి, మంటల మధ్యనించి చావు బ్రతుకుల స్థితిలో బ్రతికి బయటపడ్డాడు మూడు నెలలకిగానీ మనిషి కాలేదు తెలుసా? సుజాతా, బావకేమైనా అయితే నే బ్రతకలేను. బావ లేకపోతే నాకు బ్రతుకు మీద ఆశ ఉండదు. కనీసం బావని యిలా యెప్పుడో కళ్ళతో చూసే అవకాశం, అదృష్టంకూడా కొరవడితే యింకనే బ్రతకలేను" గొంతునిండా పొంగిన దుఃఖం కన్నీళ్ళయి పారుతూంటే యేడుస్తూ బేలగా అంది కల్యాణి. సుజాత వింతగా, జాలిగా చూసింది, ఏమని ఓదార్చాలో కూడా తెలియని స్థితిలో అలా చూస్తూండిపోయింది. మనసులో కరడుకట్టిన బాధ, దిగులు కన్నీళ్ళుగా కరిగాక కాసేపటికి కల్యాణి దుఃఖం ఉపశమించింది.
    కళ్ళు తుడుచుకొని, సుజాతవంక చూస్తూ పేలవంగా నవ్వింది. "సుజా, నీకు తెలియదు నా బాధ! ఏం చెప్పను? ఎలా చెప్పను? ఎలా చెపితే నీ కర్ధం అవుతుంది?" ఆవేదనగా అంది.
    "మీరిలా బాధపడి మాత్రం యేం చెయ్యగలరు!"
    "అవును, ఏం చెయ్యగలను? ఏడవడం తప్ప నాలాంటి నిర్భాగ్యురాలు యింకేం చెయ్యగలదు? అప్పుడూ, ఇప్పుడూ యేడవడం మినహా ఏం చెయ్యలేని అశక్తురాలిని జీవితాంతం యిలా బావకోసం ఏడవడమే నాకు మిగిలేట్టుంది."
    ఆశ్చర్యంగా, కుతూహలంగా చూస్తున్న సుజాతని చూస్తూ "మా గురించి అంతా చెప్తానని ఒకరోజు అన్నాను. నేను, ఆనంద్ యింతలా ప్రేమించుకొని పెళ్ళెందుకు చేసుకోలేదో వినాలని వుంది కదూ! చెప్తాను.....విను...." అంది కల్యాణి కళ్ళు తుడుచుకుంటూ.
    
                                            25
    
    "మా యింటిలో మా అమ్మా, నాన్నకి నేను ఒక్కర్తినే సంతానం. నా తర్వాత ఒక మగపిల్లాడు పుట్టి రెండు నెలలు పెరిగి పోయాడుట. ఆ తర్వాత మరి సంతానం లేదు. అంటే, ఆ యింటిలో నేను యెంత అపురూపంగా, ముద్దుగా పెరిగానో వేరే చెప్పనక్కరలేదు. ఆస్థిపాస్తులకి లోటు లేదు యింట్లో, ఆడింది ఆటగా పెరిగాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS