Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 38


                            ఇంకా ఏం చెప్పాలి?

    కోర్టుకు వెళ్ళబోతున్న నాన్నగారికి ముందుకొచ్చి నిలబడ్డాను.
    "అయితే ఈరోజే ప్రయాణం అన్నమాట?" కోటు జేబులో నుంచి డబ్బు తీస్తూ అన్నారు నాన్నాగారు.
    "సాయంకాలం ఎక్స్ ప్రెస్ లో బయలుదేరుతున్నానని టెలిగ్రాం కూడా ఇచ్చాను. సంతానం బాబాయి స్టేషన్ క్కూడా వస్తారు?"
    "అలాగే వెళ్ళిరా. నాలుగురోజుల్లో వచ్చేయ్!" అంటూ రెండు వందలు తీసి ఇచ్చారు. ఓ క్షణం ఆగి మరో వంద రూపాయలనోటు అందిస్తూ , "చూడమ్మా! యీ వంద తీసుకెళ్ళి సంతానం పిల్లలకు ఏమన్నా పట్టుకెళ్లు !" అన్నారు.
    నా సంతోషానికి అంతులేదు. నాన్నగారు వెళ్ళగానే షాపింగ్ చేయటానికి బయలుదేరాను బజారుకు.
    ఇంతకీ సంతానం బాబాయి పిల్లలకు ఏం తీసుకెళితే బాగుంటుంది ? అవును! ఆయనకు ఎంతమంది పిల్లలు? ఇద్దరూ కదూ! ముగ్గురేమో! సంతానం బాబాయిని కానీ అయన కుటుంబాన్ని కానీ చూసి పదేళ్ళకు పైగా అయింది. విశాఖపట్నంలో వున్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా వుండేవాళ్ళం. మా నాన్నగారూ , సంతానం గారూ కలిసి చదువుకున్నారట. అంతేకాకుండా అన్నదమ్ముల్లా మెలిగేవారట. నేను ఆ స్నేహాన్ని పురస్కరించుకొనే ఆయన్ను 'బాబాయ్' అని పిలుస్తూ వుండేదాన్ని. అయన భార్య పేరు తులశమ్మ. ఆమెను 'పిన్నీ' అనేదాన్ని. మా నాన్నగారికి ట్రాన్స్ ఫర్ అయినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో వుండే చదువుకున్నాను.
    ఇంతకీ సంతానం గారికీ ఆ ఇద్దరు పిల్లలేనా ? పెద్దమ్మాయి శారద. దానికిప్పుడు పందొమ్మిది, ఇరవై ఏళ్ళు ఉండొచ్చు. ఏం చదువుతుందో! తర్వాత వాడి పేరు వెంకు......అదే వెంకట్రావు అనుకుంటాను. మేము విశాఖ నుంచి వచ్చేటప్పటికి తులశమ్మ పిన్ని కడుపుతో వున్నట్టు గుర్తు. కనుక ఇద్దరూ లేక ముగ్గురూ పిల్లలు ఖచ్చితంగా వుండే వుంటారు.
    శారదకు చీరా బ్లౌజు పీస్ తీశాను. వెంకుగాడికి టెర్లిన్ షర్ట్ తీశాను. పుల్లారెడ్డి షాపులో రెండు కేజీలు మిఠాయి కొన్నాను.
    మొత్తం మీద నాన్నగారిచ్చిన వందరూపాయలు ఖర్చు పెట్టాను.
    సాయంకాలం గోలుకొండ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాను. రాత్రి పదిగంటలకు ఎక్స్ ప్రెస్ బెజవాడకు చేరుతుండగా నాకు అదురు పుట్టుకొచ్చింది. నా టెలిగ్రాం అందిందో లేదో ! సంతానం గారూ ఒకవేళ స్టేషన్ కు రాకపోతే! అంత వచ్చినా అయన నన్ను గుర్తుపట్టగలరా? నన్నేప్పుడో పదేళ్ళ క్రితం చూశారు. అప్పుడు నాకు పదిహేనేళ్ళు . చాలా మారిపోయి వుంటాను. ఏమైనా సంతానంగార్ని నేను గుర్తుపట్టగలననే ధైర్యంతో బండి దిగాను.
    ఆయనలో కూడా కొంత మార్పు వచ్చే వుంటుంది. నేను వైజాగ్ లో వున్నప్పుడు అయన ఆఫీసులో గుమస్తా మాత్రమే. మొన్న నాన్నగారు చెప్పారు సంతానం ఇప్పుడు హెడ్ క్యాషియర్ అయాడని. సంతానం గారికి ఆ గుమస్తాగిరి నుంచి ప్రమోషన్ వచ్చేదానికి ఐదు సంవత్సరాలు ముందే నాన్నగారు మాజిస్ట్రేట్ అయ్యారు. అది కూడా నాన్నగారు అదృష్టం కిందే జమ కట్టేశారు.
    ఏమైనా సంతానం ఉన్నదాంట్లో సంతృప్తి చెందే మనిషనీ, దైవభక్తుడని , దేవుడిచ్చిన దాన్ని , ఇచ్చినట్టు స్వికరించాలనే మనస్తత్వం కలవాదనీ, నాన్నగారు ఆయన్ని తెగ మెచ్చుకుంటూ వుంటారు.
    "ఎమ్మా ప్రయాణం సౌకర్యంగా సాగిందా?"
    ఆ మాట వింటూనే తలెత్తి చూశాను. ఎదురుగా సంతానంగారూ. ఆయనలో పెద్ద మార్పేమీ లేదు. ఎప్పుడూ మెరిసే కళ్ళలో కొంత మందగొండితనం మాత్రం కన్పించింది.
    "నాన్నగారు కులాసాగా వున్నారా?"
    "ఆఁ! కులసాగానే వున్నారు. ముందు ఇద్దరం కలిసే రావాలనుకున్నాం కాని ......." నా మాట పూర్తీ కాకముందే "ఆఁ అంటాడే కాని ఆయనకెక్కడ తీరుబడి వుంటుందమ్మా! నేను బెజవాడ వచ్చిందగ్గర్నుంచీ ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూనే కాలం గడిపేశాడు. పోనియ్ లేమ్మా! నిన్నయినా పంపించాడు! తులసి నిన్నెప్పుడూ కలవరిస్తూంటుంది." అన్నాడు. అంత ఆప్యాయతతో మాట్లాడుతున్న బాబాయిని చూస్తె అతనిలోని మంచితనం ఇంకా అలాగే వున్నట్టనిపించింది.
    "అవును బాబాయ్! పిన్ని ఆరోగ్యం ఎలా వుంది ?" అడిగాను.
    "బాగానే వుందమ్మా!" అని సామాను పోర్టర్ కు అందించి స్టేషన్ బయటకు దారి తీశాడు.
    ఓ అరగంట ప్రయాణం చేసి, ఓ అయిదారు సందులు గొందులు తిరిగాక సంతానం గారి ఇల్లు వచ్చింది. బయట రిక్షాల చప్పుడు విని తలుపు తీసుకొని తులశమ్మ బయటకొచ్చింది. ఒకప్పుడు భర్త కంటే పదేళ్ళు చిన్నదిగా కన్పించే పిన్ని ఇప్పుడు పదేళ్ళు పెద్దదిగా కన్పించింది. అయితే ఆమె మాటల తీరులో పెద్ద మార్పేమీ లేదు. సంతానంగారు నా లెదర్ సూట్ కేస్ భద్రంగా దింపించి , వరండా పక్కగా వున్న గదిలో పెట్టించారు. ఆ గది గుమ్మం ముందే కాళ్ళూ చేతులు కడిగించి ఆ గదిలోనే అన్నం పెట్టి కబుర్లు చెప్పుతూ కూర్చొంది.
    "శారదా , వెంకూ ఎక్కడా?" అన్నాను పిల్లలను చూడాలనే కుతూహలంతో.
    తులశమ్మ పిన్ని నిండుగా నవ్వింది.
    "నిద్దర్లకు పడ్డారు. రేపు ప్రొద్దున్నే చూద్దువుగాని లేమ్మా? దూరా భారం ప్రయాణం చేశావు , ఇక పడుకో !" అని పిన్ని ఎంగిలి పళ్ళెం గిన్నెలు తీసుకొని వెళ్ళిపోయింది.
    సంతానంగారూ వరండా తలుపు బిగించి ఓ చాప చుట్ట దులిపి వరండాలోనే నడుం వాల్చారు.
    నేను పడుకున్న గది చాలా చిన్నది. నామంచం పక్కనే పిన్ని చాప వేసుకొని పడుకొన్నది. నడుం వాలుస్తూనే నిద్రపోయింది. నాకు ఎంత సేపటికి నిద్రపట్టలేదు. ఆ గదిలో ఊపిరాడనట్టు అంతా కొత్త కొత్తగా అనిపించింది. పైగా నాకు వేసిన పరుపు పక్క దుప్పట్లూ పసిపిల్లల వాసన వస్తున్నాయి. పిన్నిగారింట్లో పసిపిల్లలు ఎవరై వుంటారో ఊహించలేక పోయాను. వారి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ పడుకొన్నాను. మగత నిద్రలో నుంచి గాడ నిద్రలోకి జారిపోయాను.
    తెల్లావారి నిద్రలేచి చూసేసరికి చాలా ఎండేక్కి నట్టనిపించింది. గడియారం చూస్తే 8-30 అయివుంది.
    త్రుళ్ళి పడి లేచి కూర్చున్నాను. గదిలో నా లెదర్ సూట్ కేస్ కన్పించలేదు. గాబరాపడి బయటకొచ్చి పిన్నీ పిన్నీ అంటూ వరండా దాటి హాల్లోకి వచ్చాను. తలుపు పక్కగా నిలబడి వున్న పిల్ల -- అదే శారద అయివుంటుంది. సిగ్గుపడుతూ "గోలుకొండలో వచ్చావా అక్కయ్యా!" అని పలుకరించింది.
    "అవును! చాలా పెద్దదానివాయిపోయావ్!" అన్నాను. ఆ పిల్ల సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ కిసకిసా నవ్వింది.
    "అమ్మ ఎక్కడా?" అంటూ నాలుగడుగులు ముందుకు వేశాను. కరెంట్ షాక్ తగిలినట్టు నిలబడిపోయాను.
    నా కొత్త సూట్ కేస్ అతి దీనంగా పిల్లల కాళ్ళ సందుల నుంచి తొంగి తొంగి నాకేసి చూస్తున్నట్టనిపించింది. నలుగురు పిల్లలు -- సైజులు వారిగా ఉన్న ఆ నలుగురు నా పెట్టె గట్టితనాన్ని పరీక్షిస్తున్నారు. మూడేళ్ళది ఒహతి దాని మీద కూర్చొని వున్నది. ఐదేళ్ళ వాడు ఒకడు దానిమీద నిల్చొని డ్రైవర్ మాదిరిగా చేతులు తిప్పుతున్నాడు. అంత కంటే పెద్దవాళ్ళు ఇద్దరు దాన్ని బరబరా గుంజుతున్నారు. ఒక్క దూకులో నా పెట్టె దగ్గరకు వచ్చి పడ్డాను. అప్పటికే అది సగం వంగిపోయింది. దాని హాండిల్ ఒక వైపున ఊడి పోయింది. నన్ను చూసిన పిల్లలు ఒక్కక్షణం ఆగి, ఆ పెట్టెను చూసినట్టే నన్ను వింతగా చూసి మళ్ళీ గుంజటం మొదలుపెట్టారు. ఎవరు వీళ్ళంతా? ఒక్కొక్కళ్ళనె చితక గొట్టి పారేద్దామన్నంత కోపం వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS