అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి షేక్ హాండ్ ఇచ్చాడు. కత్తి పెడుతూంటే భయపడకుండా నిశ్చింతగా కూర్చున్నాడు.
ఈ ప్రోగ్రెస్ గమనించి మాలతి చాల సంతోషపడింది కాని నాగరికత మనిషి చాలా ముందుకు తీసుకుపోతుంది. ఆశ అనేది నోరు తెరచి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.
సులభంగా అందిచ్చే ఆనందాలమీద వ్యామోహం పెరిగిపోతుంది. అటువంటి పరిణామంలో చిక్కిన అర్ధమానవుడు మాలతికి గొప్ప చిక్కులు తెచ్చిపెట్టాడు.
అతడు బలశాలి. అచ్చమైన వచ్చి మాంసాన్ని కాక ఇప్పుడు ఒకరకమైన ఆహరం తీసుకుంటున్నాడు. జీవితం లో నాగరికమైన అనేక రుచుల్ని అందుకోవటం నేర్చుకున్నాడు తీర్చిన కొద్దీ పెరిగిపోవటమే కదా ఆశ అనేదాని కున్న అవలక్షణం. దానికి గురి అయాడు అర్ధమానవుడు.
మాలతికి అది ఒక అగ్ని పరీక్షలా ఎదురు అయింది.
15
కొన్ని లక్షల సంవత్సరాల పాటు హిమయుగాలలో భూ మాత నిశ్శబ్దంగా ఉండిపోయిందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆ తరువాత భూమిమీద ప్రాణులు పుట్టాయి.
అవి వికశిస్తూ అంతరిస్తూ మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాలు గతించినాయి. ఆ పైన ప్రాణుల పరిణామంలో మకుటధారి అయిన మానవుడు అవతరించాడు.
అది అతని అదృష్టమో దురదృష్టమో తెలియదుకాని మిగిలిన ప్రాణులకన్నా మేధస్సు అధికంగా అతనికి లభించింది. నాగరికతను నిర్మించుకున్నాడు.
అనాగరికంగా ప్రాచీన శిలాయుగంలో కొన్నివేల సంవత్సరాలు గతించాయి. ఆధునిక శిలాయుగంలో మరిన్ని వేలసంవత్సరాలు గతించాయి. లోహయుగంలో కొన్నివేలు సంవత్సరాలు గడిచాయి.
అన్నీ పూర్తి అయ్యాక ప్రకృతిని అర్ధంచేసుకోవటం, ప్రకృతి వనరుల్ని, సంపదల్ని తన స్వార్ధానికి సుఖానికి అనుగుణంగా మలుచుకోవటం ప్రారంభమయింది.
అది ప్ర్రారంభమయిన తరువాత పురోగతి శీఘ్రతరమయింది. అనేక వేల సంవత్సరాలు పరిమితమయిన జీవితాన్ని గడిపిన మానవుడు కొన్ని వందల సంవత్సరాలలో అమిత వేగంగా పురోగమించి అణుశక్తిని అందుకున్నాడు.
అయితే నిశ్శబ్దంగా అనాగరికంగా గడిచింది తొంభై తొమ్మిది శాతం సంవత్సరాలు. నాగరికతని అందుకుంటూ వేగంగా పయనించటం అయిదు శాతం.
కాని తొంభై అయిదు శాతం మానవజాతి చరిత్ర సాధించ లేని దానికన్నా కేవలం అయిదు శాతం కాల చరిత్రలో కొన్నివేల రెట్లు వేగంతో పురోగమించాడు.
అంటే పురోగమించటం ప్రారంభించాక మానవజాతి చరిత్ర అపరిమితమయిన అనూహ్యమయిన వేగంతో పురోగమించాడు. ఇది మానవ పరిణామ శాస్త్రం తెలిపిన పెద్దలు చెప్పిన నిర్వచనం.
ఇది అర్ధమానవుడి విషయంలో చాల సహజంగానే యదార్ధమయింది. అతడు అనేక సంవత్సరాలు ఒంటరిగా పాతరాతియుగం నాటి మనిషిలా జీవించాడు. అప్పుడు అతని ప్రవృత్తిలో చైతన్యం చాల పరిమితమయింది. కాని నాగరికత వైపుగా పురోగమించటం ప్రారంభించాక కొద్ది రోజులలో చాల సాధించాడు. అతని పురోగమనం గంటలు నిముషాలమీదుగా జరుగుతోంది. అమిత వేగం వచ్చేసింది.
అలా రావటమే అతని చైతన్యాన్ని, మేలుకొల్పిన మాలతి ఒక పెద్ద సమస్య అయింది. అతనికి సందేహాలు రావటం అధిక మయింది.
అవి తీర్చేందుకు మాలతికి అభ్యంతరంలేదు. ఆ విషయంలో అలసటాలేదు. కాని సందేహాలతో ఆగలేదు. స్వార్ధం, ఆనందం, వ్యక్తిగతమయిన సుఖాలమీద అతనికి ఆపేక్ష పెరిగి పోయింది.
అవికూడా వీలయిన పరిధుల్లో తీర్చుతూ వస్తోంది మాలతి కాని ఆమె తీర్చలేని కోరికలు కొన్ని అర్ధమానవునికి అమరించినాయి.
అది మాలతి పాలిట గొప్ప సమస్య అయికూర్చుంది.
ఓ సుప్రభాతాన ఆర్దమానవుడు గ్రామం వదలి సెలంకుటి తీరానికి పోయాడు. అతడు వేటాడి చాల రోజులు అయింది. చేతులు తీటగా అనిపించాయి. శరీరానికి కావలసి నంత వ్యాయామంకూడాలేదు. అందునించి ఒళ్ళు నొప్పులు గాకూడా అన్పించింది.
కొండలమీదినించి వచ్చే సెలంకుటి ఒడ్డున కొన్ని చెవుల పిల్లులు కన్పిస్తే వాటి వెంటపడ్డాడు. అవి చిక్కకుండా పరుగు తీస్తాయి. వాటిని వెన్నంటి పోవటం ప్ర్రారంభించాడతడు.
అవి పొదలలో నక్కుతూ, చిక్కినట్టే చిక్కుతూ దక్కకుండా పోతున్నాయి. అయినా అర్ధమానవుడు ఒదిలి పెట్టలేదు. వాటిని వేటాడటంలో అతనికి చాల ఉల్లాసం కలుగుతోంది.
చాల దూరం పోయాక వృక్ష సమూహాలు దట్టంగా ఉన్నట్టు అనిపించాయి. అది చిట్టడవి.
అక్కడ కోతులు అనేకం ఉన్నాయి. కొమ్మలమీద వ్రేలాడుతూ కిచకిచ మంటున్నాయి. అర్ధమానవుడిరాకతో వాటి స్వేచ్చకు రవంత భంగం వాటిల్లినట్లు అయింది.
అవి హడావిడిగా అవతలి వృక్షాలమీదికి పరుగులు తీసాయి. కాని రెండు కోతులు మాత్రం ఒక కొమ్మమీదినించి కదల లేదు. అని అర్ధమానవుడి రాక కాని. అది తెలిసి కోతులు పారిపోవడం కాని గమనించలేదు.
వాటి క్రీడలో అవి నిమగ్నమయివున్నాయి. మగకోతి ఆడకోతి చుట్టూ తిరిగి కిచకిచలాడుతోంది. దాని మూతికి దగ్గరగా మూతిని చేర్చి ఏదో గుసగుసలాడుతోంది.
ఆడకోతి పళ్ళు బయటపెట్టి కాస్సేపు బెదిరించినట్టూ. బెట్టుచేసినట్టూ నటించింది. ఆ తరువాత స్వచ్చందంగా తన మనో వికారానికి లొంగిపోయి మగజాతికి అనుకూల భావాలను ప్రకటించింది.
దాంతో మగకోతికి కలిగిన ఆనందానికి అవధులేలేవు. అది చెట్టు కొమ్మను వీలయినంత విసురుగా ఊపుతూ కిచకిచలాడింది.
ఆ తరువాత ఆడకోతిదగ్గరగా వచ్చింది. దాని వికారమంతా రెప్పవేయక చూస్తున్నాడు అర్ధమానవుడు. అతనిలో తాను వినని ఊహించని ఒక విచిత్ర సంచలనం ప్ర్రారంభమయింది. శరీరం నిగ్రహాన్ని కోల్పోతున్నట్లు కరిగిపోతున్నట్లుగా అనిపించింది.
